జూన్ 30 అర్ధరాత్రి నుంచే జీఎస్టీ అమలు

0

ఎలాంటి అలస్యం లేకుండా జులై 1 నుంచే జీఎస్టీని అమలు చేస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మీటింగ్ లో పలు రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చించారు. జీఎస్టీ వల్ల తెలంగాణలో ప్రాజెక్టులపై అదనపు భారం పడుతుందని కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్. బీడీలు, గ్రానైట్, వస్త్ర పరిశ్రమ, బీడీ పరిశ్రమలపై పడే అదనపు భారాన్ని ఆయన అరుణ్ జైట్లీకి వివరించారు.

జీఎస్టీ అమలు వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందన్నారు. జూన్ 30న అర్ధ్రరాత్రి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని జైట్లీ చెప్పారు. జీఎస్టీ రేట్లపై పలు రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాలను జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో పరిశీలించారు. లాటరీలపై రెండు రకాల పన్నులను ఖరారు చేశారు. రాష్ట్రాలు నిర్వహించే లాటరీలకు 12 శాతం, ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే లాటరీలపై 28 శాతం పన్ను వసూలు చేయనున్నారు.

ఇక హోటల్ చార్జీలపై గోవా, రాజస్థాన్ ల అభ్యంతరాలను పరిశీలనలోకి తీసుకొని స్వల్ప మార్పులు చేశారు. 2,500 నుంచి 7,500 మధ్య ఉండే హోటల్ చార్జీలపై 18శాతం, 7500 కంటే ఎక్కువ రేటు ఉన్న హోటళ్లకు 28 శాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, 81 శాతానికి పైగా పూర్తయ్యాయని అరుణ్ జైట్లీ తెలిపారు.

తెలంగాణ నుంచి ఐటీ మంత్రి కేటీఆర్, ఏపీ నుంచి యనమల రామకృష్ణుడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర ప్రాజెక్టులపై జీఎస్టీ కారణంగా రూ. 11 వేల కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మిషన్ భగీరథపై రూ. 2 వేల కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్లపై రూ. 800 కోట్ల భారం పడనుందని చెప్పారు. అందువల్ల జీఎస్టీని సవరించాలని సూచించామన్నారు. గ్రానైట్, వస్త్ర పరిశ్రమ, బీడీ పరిశ్రమలపై పడనున్న భారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ దృష్టికి తీసుకెళ్లినట్టు కేటీఆర్ చెప్పారు. దీనిపై జైట్లీ సానుకూలంగా స్పందించారని... దానిపై సవివరమైన నివేదిక సమర్పించాల్సిందిగా సూచించారని తెలిపారు. నాలుగైదు రోజుల్లో ఆర్థిక మంత్రికి, కార్యదర్శికి నివేదిక అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

జీఎస్టీ కోసం ఇంకా సిద్ధం కాని వారికోసం రెండు నెలల వెసులుబాటు కల్పించనున్నారు. ఐటీ రిటర్న్‌ ఫైల్ చేయడం కోసం మినహాయింపు ఇవ్వనున్నట్లు చెప్పారు జైట్లీ.