ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలో చదివి డాక్టర్లు కాబోతున్న 84 మంది నిరుపేద విద్యార్ధులు

ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలో చదివి డాక్టర్లు కాబోతున్న 84 మంది నిరుపేద విద్యార్ధులు

Monday July 03, 2017,

2 min Read

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించిన 84 మంది నిరుపేద విద్యార్థులు డాక్టర్లు కాబోతున్నారు. ఇటీవల ప్రకటించిన నీట్ -2017 ఫలితాల్లో వీరు మంచి ర్యాంకులు సాధించారు. అందులో 55 మంది ఎస్సీ విద్యార్థులు, 9 మంది ఎస్టీ విద్యార్థులు ఎంబీబీఎస్ లో సీట్లు దక్కించుకున్నారు. మిగతా వారిలో 15 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ విద్యార్థులు బీడీఎస్ లో సీట్లు సంపాదించారు. గురుకుల విద్యాలయాల చరిత్రలో ఒకే యేడు ఇంత మంది డాక్టర్లయిన సందర్భంలో చరిత్రలో లేదు.

image


కేజీ టు పీజీ విద్యావిధానంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపిస్తున్నారు. మంచి ప్రతిభ కనబరిచి, డాక్టర్లు కావాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం 2015 జూన్ నుంచి ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు. దీని ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రత్యేక శిక్షణ ప్రారంభమయిన నాటి నుంచి ఇప్పటి దాకా 140 మంది విద్యార్థులు డాక్టర్ కోర్సుకు ఎంపికయ్యారు.

కేవలం నీట్ ర్యాంకులే కాకుండా, దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కూడా గురుకుల విద్యా సంస్థల విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. రెసిడెన్సియల్ స్కూల్స్ కు చెందిన 12 మంది విద్యార్థులు ఈ ఏడాది ఢిల్లీ యూనివర్సిటీలో, ఆరుగురు టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో ప్రవేశం పొందారు. మొదటిసారిగా ఇంతమంది విద్యార్థులు తెలంగాణ గురుకులాల్లో చదివి ఉన్నత విద్య అభ్యసించడం ఆనందంగా ఉందని TS WREIS కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు.

తెలంగాణ గురుకులాల్లో చదివిన విద్యార్థులు పెద్ద ఎత్తున డాక్టర్లు కాబోతుండటం తనకెంతో గర్వంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఎంతో వ్యయం చేసి, వందలాది రెసిడెన్షియల్స్ స్థాపిస్తున్నామని, పేద విద్యార్దులు కార్పొరేట్ స్థాయి విద్యనభ్యసించి సమాజంలో ఎదగాలన్నదే తమ కోరిక అని సీఎం చెప్పారు. ఈఏడు విద్యార్థులు సాధించిన విజయాలు మరిన్ని గురుకులాలు స్థాపించేందుకు ప్రేరణ ఇస్తుందన్నారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు కృషి చేసిన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ను సీఎం అభినందించారు.

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి