ఈ ఫ్యాన్లకు ఉరి వేసుకుంటే చచ్చిపోం.. బ్రహ్మాండమైన ఉపాయం కనిపెట్టిన రిటైర్డ్ ఎంప్లాయ్

1

హాస్టల్ రూంలో ఫ్యాన్ కి ఉరేసుకుని విద్యార్ధి ఆత్మహత్య!

ఈ వార్త చదివినప్పుడల్లా.. చూసినప్పుడల్లా గుండెలో కలుక్కుమంటుంది. ఎంత కష్టమొస్తే చదువుకునే విద్యార్ధి మెడకు ఉరితాడు బిగించుకుని చావాలి? ఎంత మథనపడితే తన ఉసురు తానే తీసుకోవాలి? హాస్టల్లో పిల్లలకు చల్లటి గాలిని పంచాల్సిన పంకాలు.. మూడు రెక్కల ఉరికంబాలై పోయాయంటే ఎంత దయనీయ పరిస్థితి. అద్భుతమైన భవిష్యత్ ముందు పెట్టుకుని విద్యార్ధులు అర్ధాంతరంగా తనువు చాలిస్తుంటే.. ఏ తల్లిదండ్రయినా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోగలడా?

మీకు తెలుసా? కోటా లోని హాస్టళ్లలో గత ఆరేళ్లలో అరవైమందికి పైగా ఉరి వేసుకుని చనిపోయారు. అంటే నెలకో విద్యార్ధి హాస్టల్ రూంలో తనువు చాలిస్తున్నాడన్నమాట. అందులో అందరూ ఫ్యాన్ కు ఉరివేసుకునే చనిపోయినవారే.

అందుకే దీనికో విరుగుడు కనిపట్టాలని కోటా హాస్టళ్ల యాజమాన్యాలు భావించాయి. ఈ క్రమంలోనే ముందుకొచ్చాడు మహారాష్ట్రకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి శరద్ ఆశానీ. క్రాంప్టన్ అండ్ గ్రీవ్స్ లో జనరల్ మేనేజర్ గా పనిచేసిన శరద్.. పిల్లల ఆత్మహత్యలకు నివారణోపాయం కనిపెట్టాడు. దానిపేరే యాంటీ సూసైడ్ ఫ్యాన్ రాడ్స్.

దీంట్లో పెద్దగా టెక్నాలజీ మహిమ, మెకానిజం లేవు. చాలా సింపుల్. ఫ్యాన్ తో పాటు వచ్చిన ఒరిజినల్ రాడ్ ని తీసేసి.. స్ప్రింగులతో కూడిన రాడ్ ని అటాచ్ చేస్తారు. దానికి 20 కిలోల కంటే ఎక్కువ బరువు వేలాడితే ఆటోమేటిగ్గా దాంట్లో ఉన్న స్ప్రింగులు యాక్టివేట్ అవుతాయి. రాడ్ కిందికి జారుతుంది. ఉరేసుకున్న మనిషి క్షణాల్లో భూమ్మీద వాలిపోతాడు.

ఈ రాడ్ ఖరీదు ఎంతో కాదు. జస్ట్ రూ. 250 మాత్రమే. కొత్తఫ్యాన్లతోపాటు పాత పంకాలకు కూడా దీన్ని అమర్చవచ్చు. ఈ ప్రయోగం అద్భుతంగా ఉంటడంతో కోటా హాస్టల్ అసోసియేషన్ ఉన్నపళంగా 5వేల రాడ్లకు ఆర్డరిచ్చింది.

Related Stories

Stories by team ys telugu