ట్రాఫిక్ జామ్ వద్దంటే 'బ్యాక్‌సీట్ బడ్డీ' కావాల్సిందే

0

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించిన ఎర్త్ డే నెట్‌వ‌ర్క్‌.

బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ పేరుతో ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించే ప్ర‌య‌త్నం.

ట్రాఫిక్ జామ్‌ల న‌గ‌రం కోల్‌క‌తాలో వినూత్న ప్ర‌చారం.

మ‌హోన్న‌త ఉద్య‌మంలో పాల్గొన్న విద్యార్థులు, స్కూల్స్‌.

రెండో ద‌శ ప్ర‌చారం అక్టోబ‌ర్ నుంచి ప్రారంభం.

కోల్‌క‌తాను కాలుష్యర‌హిత న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌న్న ల‌క్ష్యంతో బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ త‌ర్వాత ఎర్త్ డే నెట్‌వ‌ర్క్ మ‌రో ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నుంది. దీన్ని అక్టోబ‌ర్‌లో ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ తొలి ద‌శ ప్ర‌చారాన్ని 2012లో మొద‌లుపెట్టారు. విద్యార్థులు కేంద్రంగా ట్రాఫిక్ స‌మ‌స్య‌ను నియంత్రించేందుకు కార్ షేరింగ్ ప్ర‌చారాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేసింది ఎర్త్ డే నెట్‌వ‌ర్క్‌. తాము ప్ర‌యాణించే కార్ల‌లో త‌మ ప్రాంతంలోనే నివ‌సించే ఇత‌ర విద్యార్థుల‌ను కూడా తీసుకెళ్లేలా విద్యార్థుల‌ను మోటివేట్ చేయ‌డ‌మే ఈ ప్ర‌చారం ముఖ్య ఉద్దేశం. త‌మ ప్రాంతంలో నివ‌సించే స్నేహితుల‌ను కూడా త‌మ కార్ల‌లో తీసుకెళ్లేందుకు త‌ల్లిదండ్రుల‌ను విద్యార్థులు ఒప్పించ‌డంలో ఈ ప్ర‌చారం విజ‌య‌వంత‌మైంది.


తాము త‌యారు చేసిన బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ ప్ర‌చార బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న విద్యార్థులు
తాము త‌యారు చేసిన బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ ప్ర‌చార బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న విద్యార్థులు

అన్ని మెట్రో సిటీస్ మాదిరిగానే కోల్‌క‌తాలో కూడా ట్రాఫిక్‌జామ్‌ల స‌మ‌స్య అధికంగా ఉంది. ఇంజ‌న్ల శ‌బ్దాలు, విషవాయువులు, నిరంత‌రంగా వినిపించే హార‌న్ శ‌బ్దాలు ప్ర‌యాణికుల‌ను చికాకు ప‌రుస్తున్నాయి. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌య‌త్నిస్తున్నారు. కోల్‌క‌తాలో 65% రోడ్లు చాలా అధ్వ‌న్న‌స్థితిలో ఇరుకు ఇరుకుగా ఉంటాయి. ఈ రోడ్ల‌పై ఎప్పుడూ ట్రాఫిక్ జామ్‌ల‌వుతుండ‌టంతో వాహ‌న‌దారులు గంట‌కు 20 కిలోమీట‌ర్ల వేగంతో కూడా ప్ర‌యాణించ‌లేని ప‌రిస్థితి ఉంటుంది. ఈ ట్రాఫిక్ జామ్ స‌మ‌యంలో వాహ‌నాల నుంచి వెలువ‌డే ఉద్గారాల వ‌ల్ల కోల్‌క‌తాలో గాలి మొత్తం కాలుష్య కాసారంగా మారుతున్న‌ది. ఈ స్కూల్స్ బ‌య‌ట ట్రాఫిక్ జామ్‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. త‌మ పిల్ల‌ల‌ను డ్రాప్ చేసేందుకు త‌ల్లిదండ్రులు ఒకే స‌మ‌యంలో వంద‌లాది వాహ‌నాల్లో రావ‌డంతో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు తలెత్తున్నాయి. త‌త్ఫ‌లితంగా స్కూల్‌కు స‌రైన స‌మ‌యానికి వెళ్లాల‌నుకున్న విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోన‌వుతున్నారు.

బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ ఫ‌స్ట్ ఫేజ్ 2014తో ముగిసింది. ఈ ప్ర‌చారం కోల్‌క‌తాలో సంచ‌ల‌నాలు సృష్టించింది. చాలా స్కూల్స్ ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందించాయి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత యాడ్ ఏజెన్సీ ఓగిల్వీ & మాథ‌ర్ సంస్థ ఈ ప్ర‌చారానికి ఉచితంగా యాడ్స్ చేసిపెట్టింది. ఈ సంస్థ క్రియేటివ్ టీమ్ బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ ప‌బ్లిక్ స‌ర్వీస్ అనౌన్స్‌మెంట్ ఫిల్మ్‌, లోగో, స్టిక్క‌ర్స్‌, బ్యాడ్జెస్‌, పోస్ట‌ర్స్‌ను త‌యారుచేసి ఇచ్చింది. పిల్ల‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన క్యారెక్ట‌ర్ల‌తో వినూత్నంగా ప్ర‌చార సామ‌గ్రిని రెడీ చేసింది. హెర్మొయిన్‌, ప్రొఫెస‌ర్ డ‌మ్‌బ్లెడోర్‌తో క‌లిసి చీపురుక‌ట్ట‌పై హారీపోట‌ర్ కూర్చుని ఉన్న‌, స్పైడ‌ర్‌మెన్‌, సూప‌ర్‌మెన్‌ల‌ను త‌న బ్యాట్ మొబైల్‌ను షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్న బ్యాట్‌మ‌న్ వంటి చిత్రాల‌తో కూడిన పోస్ట‌ర్ల‌ను ఓగిల్వీ రూపొందించింది.

బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ మేక్ ఈ గ్రీన‌ర్ టౌన్ అంటూ సాగే ఓ పెప్పీ నంబ‌ర్‌ను ప్ర‌ఖ్యాత సింగ‌ర్‌, కంపోజ‌ర్ నీల్ అధికారి క్రియేట్ చేశారు. ఇలాంటి వినోదాత్మ‌క సామ‌గ్రితో ఎర్త్ డే నెట్‌వ‌ర్క్ టీమ్ న‌గ‌రంలోని ప‌లు స్కూల్స్‌ను సంద‌ర్శించింది. ప‌లు స్కూళ్ల ప్రిన్సిప‌ల్స్ ఈ ప్ర‌య‌త్నాన్ని సాద‌రంగా ఆహ్వానించారు. బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ క్యాంపైన్‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు.

విద్యార్థులు రూపొందించిన ప్ర‌చార చిత్రం
విద్యార్థులు రూపొందించిన ప్ర‌చార చిత్రం

విద్యార్థులు సైతం ఈ ప్ర‌చారంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహం ప్ర‌ద‌ర్శించారు. అలాగే "బ్యాక్‌సీట్ బ‌డ్డీస్‌"ను ఏ స్కూల్ చ‌క్క‌గా ఉప‌యోగిస్తుందో తెలుసుకునేందుకు పోటీలు కూడా నిర్వ‌హించారు. ఒక్కో స్కూల్ నుంచి ఐదుగురు విద్యార్థులు బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌చారం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆ థీమ్ సాంగ్‌ను నేర్చుకున్నారు. ఇక ఈ క్యాంపైన్‌లో పాల్గొనేందుకు అంగీక‌రించిన వాహ‌నాల‌కు స్టిక్క‌ర్ల‌ను అతికించారు. ఈ ప్ర‌చార అంబాసిడ‌ర్లు న‌గ‌ర వ్యాప్తంగా మంచి సందేశాన్ని అందించారు. క‌ల‌ర్‌ఫుల్ పోస్ట‌ర్లు, స్కిట్స్‌, సాంగ్స్‌, పోయెమ్స్ ఇలా ఎన్నో ర‌కాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 12 స్కూల్స్ పైన‌ల్స్‌లో ప్ర‌వేశించ‌గా, ఓరియంట‌ల్ సెమిన‌రీ స్కూల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐతే పోటీలో పాల్గొన్న ప్ర‌తి స్కూల్స్‌కు బెస్ట్ చీర్ లీడ‌ర్స్‌, బెస్ట్ పోస్ట‌ర్స్‌, బెస్ట్ సాంగ్ ఇలా ఏదో ఓ అంశంలో బ‌హుమ‌తిని అంద‌జేశారు. ఈ 12 స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు ఇప్ప‌టికీ ఈ బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నారు. కార్ పూల్ విధానంలో స‌హ‌చ‌రుల‌తో క‌లిసి స్కూల్స్‌కు వెళ్తున్నారు.

"తొలి ద‌శ బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ ప్ర‌చారంలో 70 వేల మంది విద్యార్థులు, 33 స్కూల్స్ పాల్గొన్నాయి. బ్యాక్‌సీట్ బ‌డ్డీస్‌ను అమ‌లు చేయ‌డంలో ఏడువేల మంది క్రియాశీల‌క పాత్ర పోషించారు. ఈ ప్ర‌చారాన్ని ఇత‌ర న‌గ‌రాల‌కు కూడా విస్త‌రించాల‌ని ఎర్త్ డే నెట్‌వ‌ర్క్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. ఈ అక్టోబ‌ర్‌లో కోల్‌క‌తాలోనే రెండో ద‌శ ప్ర‌చారాన్ని కూడా ప్రారంభించ‌నున్నాం. తొలి ద‌శ‌లో పాల్గొన్న స్కూల్స్‌తో పాటు ఇత‌ర స్కూల్స్‌ను కూడా ఈసారి ప్ర‌చారంలో భాగం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. మ‌రింత మంది బ్యాక్‌సీట్ బ‌డ్డీస్ ప్రచారంలో పాల్గొంటే న‌గ‌రంలో కాలుష్య‌మ‌నేదే లేకుండా పోతుంది" అని ఎర్త్ డే నెట్‌వ‌ర్క్ సంస్థ ఇండియా హెడ్ క‌రుణా సింగ్ తెలిపారు. పర్యావ‌ర‌ణాన్ని కాపాడేందుకు, ట్రాఫిక్ జామ్‌ల‌ను నివారించేందుకు ఉద్య‌మం చేప‌ట్టిన ఎర్త్ డే నెట్‌వ‌ర్క్ ప్ర‌య‌త్నం స‌క్సెస్ కావాల‌ని కోరుకుందాం..

వెబ్‌సైట్ఃhttp://www.earthday.org