చిన్న వీడియోలతో... భారీ ప్రచారం పొందడమెలా ?

మొబైల్ వీడియోల‌తో వ్యాపారం వృద్ధి..యూట్యూబ్‌, వినేల‌ను ప్ర‌చారానికి ఉప‌యోగించుకుంటున్న వ్యాపారులుమొబైల్ వీడియోస్‌తో నేరుగా క‌స్ట‌మ‌ర్ల ఇళ్ల‌లోనే ప్ర‌చారం..త‌క్కువ స‌మ‌యంలోనే త‌మ ఉత్ప‌త్తి గురించి ప్ర‌భావ‌వంతంమైన ప్ర‌చారం

చిన్న వీడియోలతో... భారీ ప్రచారం పొందడమెలా ?

Monday May 18, 2015,

3 min Read

ఒక ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న మిత్ర బృందం కొత్తగా ఆలోచించి ఒక సరికొత్త పరికరాన్ని తయారు చేసింది. వాళ్లు దాన్ని అందరికీ చూపాలనుకొన్నారు. ఒక ఔత్సాహికుడు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాడు. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు సరికొత్తగా ప్రచారం చేయాలని భావించాడు. సినిమాలంటే పడిచచ్చే ఓ యువకుడు తన మేధస్సును మధించి అందమైన దృశ్యకావ్యంలాంటి షార్ట్ ఫిలిం తీశాడు. దాన్ని పదిమందికీ చూపించాలని తహతహలాడుతున్నాడు. ఇలాంటి ఔత్సాహికులు, చిన్న వ్యాపారస్తులు తమ ఆలోచనలను ప్రచారం చేసుకొనేందుకు ఒకప్పుడు చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ఎంతో ప్రభావవంతంగా ప్రచారం చేసుకొనేందుకు వారికి మంచి మార్గం దొరికింది. అదే మొబైల్ వీడియో..

ఉచితంగా ప్రచారం

అతి తక్కువ సమయంలో ఖర్చులేకుండా ఒక విషయాన్ని అత్యంత ఎఫెక్టివ్‌గా చెప్పటానికి అందుబాటులోకి వచ్చిన అద్భుత మార్గం మొబైల్ వీడియో. సృజనాత్మకంగా ఆలోచించేవారెవరికైనా తమ ఆలోచనలను పదిమందితో పంచుకోవటానికి కేరాఫ్ మొబైల్ వీడియో. సమాచార విప్లవం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వీడియోలకు ఏర్పడిన ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. యూట్యూబ్, వినె ఇంకా ఎన్నెన్నో.. పేర్లు వేరు. సౌకర్యాలు కూడా కొంతవరకు వేరే. కానీ వాటి ఉద్దేశం మాత్రం ఒకటే. ప్రచారం.. మనసుకు హత్తుకొనేలా ప్రచారం. అదీ ఉచితంగానే. కంటెంట్ మార్కెటింగ్‌లో అతిత్వరలో ఈ మొబైల్ వీడియోలే ప్రధాన భూమిక పోషించనున్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఆన్‌లైన్ వీడియోల వాడకం కొద్దికాలంలోనే 55 శాతం పెరుగనుందని పేర్కొంటున్నాయి. చిరు వ్యాపారుల మార్కెటింగ్‌కు ఈ మొబైల్ వీడియోలు కల్పతరువుగా మారుతున్నాయి. వ్యాపారమేదైనా కాస్త సృజనాత్మకంగా ఆలోచిస్తే చాలు. చిన్నచిన్న వీడియోలతో లక్షలమంది వినియోగదారులను ఆకర్షించవచ్చని ఇప్పటికే చాలామంది నిరూపించారు. 

image


యూట్యూబ్.. ఒక వీడియో ప్రపంచం

ఇంటర్నెట్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ అన్న పదాలు తెలిసినవారికి కొత్తగా పరిచయం చేయనవసరంలేదని మరో పదం యూట్యూబ్. మొబైల్ వీడియోలంటే ముందుగా గుర్తొచ్చేది యూట్యూబ్. మహా మేధావుల నుంచి యువత వరకు తమ ఆలోచనలు, ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకొనేందుకు అత్యంత తేలికైనా మార్గం యూట్యూబ్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ వీడియో వేదిక ఇది. ఉచితంగా ఖాతా తెరువటమొక్కటే దీని ప్రత్యేకత కాదు. దీనిని వాడటం, చిరు వ్యాపారాలకు తప్పనిసరి అయిన మార్కెటింగ్ వీడియోలను రూపొందించి ఇందులో ఉంచటం కూడా చాలా తేలికగా ఉండటంతోనే అన్నివర్గాల నుంచి అమితాదరణ పొందింది.. పొందుతున్నది. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సంస్థ కొనుగోలు చేసిన తర్వాత యూట్యూబ్ దశే మారిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికమంది సందర్శిస్తున్న మొబైల్ వీడియో వేదిక యూట్యూబే. దీనితో అధిక ప్రయోజనం పొందాలనుకొనేవారు వాళ్ల వ్యాపారానికి సంబంధించి పేరు, వివరాలు, ట్యాగ్, వ్యాపార కేటగిరీ తదితర వివరాలను యూట్యూబ్‌లో ఎంటర్‌చేయాలి. యూట్యూబ్‌లో పెట్టిన వీడియో చివరన ఆ వ్యాపార సంస్థకు చెందిన వెబ్‌సైట్‌ను డిస్క్రిప్షన్ బాక్స్‌కు అనుసంధానిస్తే సరి. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వెబ్‌సైట్‌ను సందర్శించే అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల వ్యాపారం పెంచుకొనే సువర్ణావకాశం లభిస్తుంది.

స్వల్పకాల వీడియోల వేదిక వినె

మొబైల్ వీడియోలకు మరో ప్రముఖ వేదిక వినె. యూట్యూబ్‌లా కాకుండా ఇది స్వల్పకాల వీడియోలకు ప్రత్యేకమైనది. ఇందులో ఆరు సెకండ్ల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేయొచ్చు. చిరు వ్యాపారులకు ఇదికూడా ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఇందులోని వీడియోలను సోషల్‌మీడియాలో తేలికగా షేర్‌చేసుకొనే అవకాశం ఉండటంతో అత్యధిక మంది వీక్షకులను సంపాదించుకొనే అవకాశం ఉంది. డిజైన్, నిర్మాణరంగ వ్యాపారాలకు సంబంధించిన వీడియోలను నిర్మాణానికి ముందు, తర్వాత అని రెండు విధాలుగా ఆకర్షణీయంగా చూపవచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు ఒక ఇంటిలోని ప్రత్యేక గదుల సౌకర్యాలను, చిల్లర వ్యాపారాలు తమ ఉత్పత్తులను షోకేసుల్లో చూపటానికి వినె మంచి మార్గం. అంతేకాకుండా ఒక వ్యాపారి తన ఉత్పత్తిపై వీక్షకుల నుంచి వెంటనే అభిప్రాయాలు కూడా కోరటానికి వీలుండటం దీని ప్రత్యేకత.

వ్యాపారంపై అవగాహన ఉంటే ప్రచారం తేలికే

మొబైల్ వీడియోలు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు కూడా చూపుతున్నాయి. ఎవరైనా సరే వారి పరిసరాల్లోని వ్యాపారాలపై మంచి అవగాహన ఉంటేచాలు కస్టమర్లగురించి భయపడాల్సిన అవసరంలేకుండా ఈ మొబైల్ వీడియోలు భరోసా ఇస్తున్నాయి. మొబైల్ వీడియోల ప్రయోజనాలు తెలిసిన తర్వాత చిరువ్యాపారులతోపాటు పెద్దపెద్ద సంస్థలు కూడా వీటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఆర్గానిక్ గార్డెనింగ్ వ్యాపారం చేసే జాన్ కోహ్లెర్ తన వ్యాపారం కోసం యూట్యూబ్‌లో ఖాతా తెరిస్తే ఏకంగా లక్షా 70 వేలమంది సబ్‌స్ర్కైబర్లు వచ్చిచేరారు. ఆయనను అనుసరిస్తున్నవారికి సొంతంగా గార్డెనింగ్‌ను ఎలా మొదలుపెట్టాలో చక్కటి సూచనలిస్తూ సహాయం చేస్తున్నారు కోహ్లెర్. ఒక ఉత్పత్తిని ఆన్‌లైన్‌లో అమ్మడంకంటే ఈ మొబైల్ వీడియోల ప్రచారం ద్వారా విక్రయించటం ఎన్నోరెట్లు తేలిక అని ఇప్పటికే నిరూపణ అయ్యింది. ఆన్‌లైన్‌లో ఉత్పాదక వస్తువు విశిష్టతలను వివరంగా చెప్పటం కష్టం. కానీ మొబైల్ వీడియోలో కళ్లకు కట్టినట్లు ఆ వస్తువు పనితనాన్ని కూడా చూపించొచ్చు. మిక్సీలను తయారుచేసే బ్లెండ్‌టెక్ సంస్థ సీఈవో డిక్‌సన్ అదే చేశారు. తమ ఉత్పత్తుల ఉపయోగాలను వివరిస్తూ వీడియోలు తీసి యూట్యూబ్‌లో ఉంచారు. రోజూ వాడే పండ్లు, కూరగాయలను తమ ఉత్పత్తుల ద్వారా ఎంతబాగా మిక్స్ చేసుకోవచ్చో మొబైల్ వీడియో ద్వారా చూపించారు. మరో అడుగు ముందుకేసి ఎలక్ట్రానిక్స్ నుంచి గోల్ఫ్ బంతివరకు అన్నింటినీ మిక్సీచేసి చూపించారు. అంతే, అభిమానులు పోటెత్తారు. ఏకంగా 7,77,000 మంది సబ్‌స్ర్కైబర్లు వచ్చిచేరారు. రోజూ లక్షల మంది చూస్తున్నారు.

వినియోగదారుడితో ముఖాముఖి

మొబైల్ వీడియోల్లో మరో గొప్ప ప్రత్యేకత వినియోగదారుడితో ముఖాముఖి మాట్లాడే అవకాశం. వినియోగదారులు అగిగే ప్రశ్నలకు ఉత్పత్తిదారుడు సమాధానమిచ్చేందుకు అవకాశముంటుంది. ఇది మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు దీర్హకాలంపాటు సంబంధాలు కొనసాగించేందుకూ మంచి మార్గం. వ్యాపారస్తుల మార్కెటింగ్ సామర్థ్యాన్ని బట్టి మొబైల్ వీడియోల ఉపయోగం భవిష్యత్తులో మరింత పెరుగుతుందనటంలో సందేహంలేదు.


About the Guest Author:

JT Ripton, a business consultant and freelance writer. He can be reached out on Twitter @JTRipton.