ఒకప్పుడు న్యూస్ పేపర్లు అమ్మిన అమ్మాయి ఇప్పుడేం సాధించిందో తెలుసా..?

శివంగి విజ‌య‌గాథ‌ చదివితే అందరూ శెభాష్ అంటారు!!

ఒకప్పుడు న్యూస్ పేపర్లు అమ్మిన అమ్మాయి ఇప్పుడేం సాధించిందో తెలుసా..?

Tuesday November 08, 2016,

2 min Read

ఏదైనా చేయాలంటే ఫైర్ ఉండాలి..!

ఎంకరేజ్ లేకపోయినా కరేజ్ ఉండాలి..!!

స్తోమత లేకపోయినా తపన ఉండాలి..!!!

కాసుల బలం లేకపోయినా కసి, పట్టుదల ఉండాలి..!!

అలాంటి దమ్మూ ధైర్యం కలేజా కసి తపన పట్టుదల ఉన్న ఒక అమ్మాయి గురించి మీరిప్పుడు చదవబోతున్నారు..!!

కాన్పూరుకు 60 కిలోమీటర్ల దూరంలో దేహ అని చిన్న పల్లెటూరు. మొన్నటిదాకా అక్కడ శివంగి ఎవరు అని ఎవరిని అడిగితే.. ఓహో ఆ అమ్మాయా.. ఇల్లిల్లూ తిరిగి న్యూస్ పేపర్ వేస్తుందిలే అనేవారు. ఇప్పుడు వెళ్లి అడిగండి.. కళ్లింత చేసుకుని లేచి నిలబడి గర్వంగా ఆమె గురించి చెప్తారు.

గ్రామీణ ప్రాంతం అనగానే మొక్కుబడి చదువులు. అత్తెసరు మార్కులు. అందునా అమ్మాయిల పరిస్థితి మరీ దారుణం. పేదరికం పై చదువులను తొక్కి పడుతుంది. పెళ్లి అనే గుదిబండ పుస్తకాలను పుస్తెలుగా మారుస్తుంది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పేం లేదు. ఆణిముత్యాలు లేక కాదు. కానీ వాటిని వెలికి తీసేవాళ్లేరి..?

image


అలాంటి ఆణిముత్యమే శివంగి. అమ్మానాన్నలు నిరుపేదలు. రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ ఇల్లు గడవదు. వాళ్ల కష్టాన్ని చూడలేక శివంగి రోజూ పొద్దున్నే ఇల్లిల్లూ తిరిగి న్యూస్ పేపర్లు, మేగజిన్లు వేసేది. వచ్చిన నాలుగు డబ్బులతో పుస్తకాలు, నోట్ బుక్కులు కొనుక్కునేది. అలా ఇంటర్మీడియెట్ వరకు గవర్నమెంటు కాలేజీలోనే చదివింది. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు ఆపొద్దనేది ఆమె సంకల్పం. ఆ బలమొక్కటి చాలు.. ఆర్ధిక అంతరాలు ఎన్ని వచ్చినా అవలీలగా దేటేయడానికి.

ఒకరోజు శివంగి పేపర్లో ఒక ప్రకటన చదివింది. అదేంటంటే.. సూపర్ 30 అనే సంస్థ పేద పిల్లలకు ఐఐటీ కోచింగ్ ఇస్తున్నారట. ఆ ప్రకటన చూడగానే శివంగిలో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. వేటకు సిద్ధమైన సింహంలా అప్రయత్నంగా లేచి నిలబడింది. పిడికిలి బిగించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్లి ఇన్-స్టిట్యూట్ వాళ్లను కలిసింది. తనకూ తెలుసు. ఐఐటీ- జేఈఈ ప్రిపరేషన్ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని. అయినా అమ్మాయి అప్రోచ్ అయిన తీరుని చూసి వాళ్లు ముచ్చట పడ్డారు. కొద్ది రోజుల్లోనే అందరిలో తలలో నాలుక అయింది. ముఖ్యంగా కోచింగ్ సెంటర్ హెడ్ ఆనంద్ తల్లికి బాగా దగ్గరైంది. దాదీ అని ఆప్యాయంగా పిలిచేది. ఆమెకు హెల్త్ బాలేనప్పుడు శివంగే దగ్గరుండి అన్నీ చూసుకునేది.

శివంగి ఎక్కడా తగ్గలేదు. ఏ సబ్జెక్టుకూ వెరవలేదు. ఆనాడు పేపర్లో ప్రకటన చూసి బిగుసుకున్న ఆమె పిడికిలి.. ఐఐటీ రూర్కీలో సీటు కొట్టేదాకా సడల్లేదు. మొక్కవోని ఆత్మవిశ్వాసం గెలుపు తీరాన సగర్వంగా నిలబెట్టింది. శివంగి రూర్కీకి వెళ్లిపోయింది. ఆ రోజు ఆనంద్ కుటుంబ సభ్యుల్లో ఏదో తెలియని దిగులు. ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఏడ్చారు. సొంత కూతురు వదిలి వెళ్లిపోయినంతగా బాధపడ్డారు. శివంగికి ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది. మొదట ఆనంద్ సర్ కే ఫోన్ చేసి చెప్పిందట..

సంతోషంలో మాటలు రాలేదు..!

ఉద్వేగంతో కన్నీళ్లొచ్చాయి..!!

గుండె గర్వంతో ఉప్పొంగింది..!!!

గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక పేదింటి ఆడకూతురు అత్యంత కష్టమైన ఐఐటీ జేఈఈని బద్దలుకొట్టి, రూర్కీలో సీటు సంపాదించి, ఇప్పుడొక గొప్ప స్థాయిలో ఉందని- ఆనంద్ ఒక స్ఫూర్తిదాయకమైన స్టోరీని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పేప‌ర్లు అమ్ముకునే స్థాయి నుంచి ఇంజ‌నీర్‌గా మంచి ఉద్యోగం సాధించిన శివంగి విజ‌య‌గాథ‌ను చదివిన ప్రతీ ఒక్కరూ శెభాష్ అని చప్పట్లు కొట్టారు!!