‘ఇండియన్ స్టార్టప్ క్యాపిటల్’గా హైదరాబాద్ !

‘ఇండియన్ స్టార్టప్ క్యాపిటల్’గా హైదరాబాద్ !

Thursday November 05, 2015,

2 min Read

భారత దేశానికి భాగ్యనగరం ఓ 'స్టార్టప్ క్యాపిటల్'గా మారబోతోందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవం గురువారం లాంఛనంగా ముగిసింది. రతన్ టాటాతోపాటు, గవర్నర్ నరసింహన్ తెలంగాణ సిఎస్ రాజీవ్ శర్మలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ స్టార్టప్‌లు ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న డ్రీమ్ ప్రాజెక్ట్ నిజమైన క్షణాలు రానే వచ్చాయి. ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటి హైదరాబాద్, ఐఎస్‌బి, నల్సార్ విద్యాసంస్థలు సంయుక్తంగా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ 'టి హబ్' ఏర్పాటు చేశాయి.

“భారతీయ రైతు.. ప్రపంచానికి ఓ ఆదర్శ ఆంట్రపెన్యూర్.” రతన్ టాటా

ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన రతన్ టాటా.. భారత దేశంలో సాంప్రదాయ వ్యాపారవేత్తలెంతో మంది ఉన్నారన్నారు. ఈ రకంగా చూసినా భారత దేశంలో ఆంట్రప్రెన్యూర్షిప్‌కి కొదవలేదన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశం ఇప్పుడొచ్చిందని అభిప్రాయపడ్డారు.

image


స్టార్టప్ స్టేట్ తెలంగాణాలో 17నెలలకే టీ హబ్ ఏర్పాటు జరిగిందని, భవిష్యత్తులో తెలంగాణ రూపు రేఖలు మారిపోతాయనడానికి ఇదే నిదర్శనమనీ గవర్నర్ నరసింహన్ అన్నారు.

"టీ-హబ్ ఏర్పాటులో కెటిఆర్ పాత్ర ఆదర్శం. ఇతర మంత్రులకు ఆదర్శంగా నిలిచారు." నరసింహన్

టెక్నాలజీ హైదరాబాద్‌కి మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. టీ హబ్ లాంటి ఇంక్యుబేషన్ సెంటర్లు మరిన్ని ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు.

image


స్టార్టప్ కంపెనీలకు రెక్కలొచ్చాయి

భారత దేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ మారుతోంది. అవకాశాలను అందిపుచ్చుకోడానికి దేశ యువత ఎదురుచూస్తోందని కెటిఆర్ అన్నారు.

"టీ హబ్‌తో స్టార్టప్ కంపెనీలకు రెక్కలిచ్చాం." కెటిఆర్

దేశానికి హైదరాబాద్ స్టార్టప్ హబ్‌గా మారుతుందని ఆకాంక్షించిన ఆయన టి-హబ్ తో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఇందులో భాగస్వామ్యం కావొచ్చని అన్నారాయన. సరైన ఐడియాతో టి హబ్ లోనికి ప్రవేశిస్తే దాన్ని ప్రోడక్టుగా మార్చే బాధ్యత తమదని భరోసా నింపారు. యూరప్, అమెరికా తరహాలో ఇక్కడ స్టార్టప్ కల్చర్‌కు ప్రాధాన్యతనిస్తామని వెల్లడించారు. 

image


image


100కు పైగా స్టార్టప్ కంపెనీలు, ఇన్వెస్టర్లు, ఆంట్రపెన్యూర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కలారీ క్యాపిటల్ అధినేత్రి వాణీ కోలా, నాస్కామ్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి లాంటి ప్రముఖులతో పాటు విదేశీ ప్రతినిధులు కూడా టి హబ్ ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు వచ్చారు.