చెత్త ఏరుకునే స్థాయి నుంచి ట్రక్ డ్రైవరుగా మారిన లక్ష్మి!

ఆత్మవిశ్వాసంతో డ్రైవింగ్ నేర్చుకుంటున్న లక్ష్మీ-కష్టాలను ఎదురించి పట్టుదలతో ముందుకు సాగుతున్న మహిళ-

చెత్త ఏరుకునే స్థాయి నుంచి ట్రక్ డ్రైవరుగా మారిన లక్ష్మి!

Monday January 25, 2016,

2 min Read

ఆత్మ విశ్వాసం ఉండాలే గానీ అసాధ్యమైన పనంటూ ఏదీ ఉండదు. పట్టుదల, నేర్చుకోవాలన్న తపన ఉంటే చాలు ఎంత కష్టమైన పని అయినా చేసేయొచ్చని అంటోంది బెంగళూరుకు చెందిన లక్ష్మీ. నిన్న మొన్నటి వరకు ఈమె గురించి ఎవరికీ అంతగా తెలియదు. కానీ త్వరలోనే బెంగళూరులో మొట్టమొదటి గార్బేజ్ ట్రక్ డ్రైవర్ గా స్టీరింగ్ పట్టి రికార్డు సృష్టించనుంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన లక్ష్మీ కెంపెగౌడ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని హౌస్ కీపింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూనే డ్రైవింగ్ లో శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం టన్ను సామర్థ్యం గల ట్రక్కు నడిపేందుకు సిద్ధమైన లక్ష్మీ హెవీ వెహికిల్ లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది.

image


బెంగళూరు జేసీ రోడ్డులోని సిమెంట్ కాలనీలో ఉండే 30 ఏళ్ల లక్ష్మికి చిన్నతనంలోనే పెళ్లైంది. ఆ వెంటనే ముగ్గురు పిల్లలు పుట్టారు. భర్త తాగుడుకు బానిసకావడంతో పిల్లలను సాకేందుకు ఆమె పారిశుధ్య కార్మికురాలిగా పనిచేయడం మొదలుపెట్టింది. లక్ష్మీకి చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ నేర్చుకోవాలన్న కోరిక ఉన్నా-కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఆమె కల కలగానే మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికుల జీవితంలో వెలుగులు నింపే ప్రయత్నంలో ఉన్న హసిరుదాలా అనే సంస్థ లక్ష్మీ జీవితాన్నే మార్చివేసింది.

"నాకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉండేది. డ్రైవింగ్ స్కూల్ ఫీజు కట్టే స్థోమత లేకపోవడంతో ఆ కల కలగానే మిగిలిపోయింది. హసిరుదాలా సంస్థ సాయంతో డిసెంబర్ లో డ్రైవింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాను. డిసెంబర్ 31న నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. ఇది నాకు న్యూ ఇయర్ గిఫ్ట్."- లక్ష్మీ

మొదటి రోజు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న లక్ష్మీ భయంతో వణికిపోయింది. రోజులు గడిచే కొద్ది భయం స్థానాన్ని ఆత్మవిశ్వాసం భర్తీ చేసింది. ప్రస్తుతం ఏ వెహికిల్ నైనా ఈజీగా నడుపుతానని గర్వంగా చెబుతోంది. గార్బేజ్ ట్రక్ డ్రైవర్ గా గార్డెన్ సిటీని క్లీన్ గా మార్చేందుకు తనవంతు సాయం చేస్తానంటోంది. ప్రస్తుతం హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ డ్రైవింగ్ లో శిక్షణ తీసుకుంటున్న లక్ష్మీ భవిష్యత్తుపై కొండంత ఆశతో ఉంది. ఆమె ముగ్గురు సంతానంలో 15ఏళ్ల కూతురు ప్రతిభ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో చదువును మధ్యలోనే ఆపేసింది. తల్లికి సాయపడుతూనే టైలరింగ్ కోర్సు చేస్తోంది. ఇక ఇద్దరు కొడుకులు ధనుష్ (12), ఆకాశ్ (10) రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకుంటున్నారు.

ఇంగ్లీషు చదివగలిగే లక్ష్మీ ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ క్లాస్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత ప్లస్ టూ కూడా కంప్లీట్ చేస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.