మంచిర్యాల కలెక్టర్ నిర్మించిన ఆ గోడకు మంచి హృదయముంది!

మంచిర్యాల కలెక్టర్ నిర్మించిన ఆ గోడకు మంచి హృదయముంది!

Tuesday May 09, 2017,

3 min Read

మంచిర్యాల బస్టాండ్ రైల్వేస్టేషన్ రోడ్డు మీదుగా పోతుంటే, జిల్లా పరిషత్ బాలుర పాఠశాల దగ్గర కనిపిస్తుందొక స్టాల్. అల్లంత దూరంనుంచే కొటేషన్! సాయం చేసే చేతులకివే మా శతకోటి నమస్కారాలు అని! ఇంకాస్త తల పైకెత్తి చూస్తే ఆపన్నహస్తం అని తాటికాయంత అక్షరాలు! “మనం చేసే ఎన్నో సత్కారాల కన్నా- మనం చేసిన ఒక దానం మిన్న”అని మరో సూక్తి మనసుని హత్తుకుంటుంది. ఇదేదో ఇంట్రస్టింగ్గా ఉందే అని అడుగులు దానంతట అవే అటువైపు పడతాయి. స్త్రీలు, పురుషులు, అమ్మాయిలు, అబ్బాయిలు అని వేర్వేరుగా కార్టన్ డబ్బాలు కనిపిస్తాయి. అందులో బట్టలు, చెప్పులు, దుప్పట్లు, గుట్టలుగా కనిపిస్తాయి. ఒకాయన బండిమీద తీసుకొచ్చి అక్కడొక కవర్ వదిలేసి వెళ్తాడు. ఒకావిడ సంచీలో బట్టల్ని అమ్మాయిల విభాగంలో దులుపుతుంది. కొంతమంది వాటన్నిటినీ వేరు చేసి, శుభ్రంగా మడతపెట్టి కవర్ నీట్‌గా సర్దుతుంటారు.

image


కట్ చేస్తే.. ఆరోజు ఆదివారం. బట్టలన్నీ బస్తాల్లోకి నింపుకుని ఆటో బయలుదేరి మురికివాడలోని చౌరస్తాలో ఆగుతుంది. బండి ఆగీఆగగానే పిల్లలు, పెద్దలు బిలబిలమంటూ గుమిగూడతారు. గోలగోలగా ఉంటుంది. అందరికీ ఇస్తాం.. కంగారొద్దు అంటూ ఒక గొంతు పదేపదే చెప్తుంటుంది. రంగురంగుల గౌన్ అందుకున్న ఓ చిన్నారి, సరిపోతుందా లేదాని చూసుకుని ముసిముసిగా నవ్వుతుంటుంది. ఎన్నాళ్లయింది బీరపువ్వు రంగు చీర కట్టుకుని కట్టుకుని! ఓ వృద్ధురాలి కళ్లలో చెప్పలేనంత సంతోషం! హమ్మయ్య నాకూ టీ షర్టు వచ్చింది! ఓ కుర్రాడికి ఆనందానికి పట్టపగ్గాలుండవు. చెప్పులు కావల్సిన వాళ్లకి చెప్పులు.. దుప్పటి అవసరమైన వాళ్లకు దుప్పటి. చీరలైతే చీరలు, గిన్నెలైతే గిన్నెలు. పాతవే కావొచ్చు.. కానీ కొత్త ఆనందాన్ని ఇచ్చేవి. వాడినవే కావొచ్చు.. మరొకరికి అవసరానికి మారేవి.

ఇదే ఆపన్నహస్తం కాన్సెప్ట్. మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చేస్తున్న మనసున్న ప్రయత్నం. మొదటి ప్రయత్నంలోనే జనం నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఆపన్నహస్తం స్టాల్‌లో నిత్యం వందలకొద్ది పాత బట్టలు, చెప్పులు, బ్యాగులు, వస్తున్నాయి. పేదవారికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు పోగవుతున్నాయి. వాటన్నింటిని అంగన్‌వాడీ సిబ్బంది చక్కగా ప్యాక్ చేస్తారు. వాటన్నిటినీ బస్తాల్లో నింపి మురికివాడలు, గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి, యాచకులకు, అనాథాశ్రమాలకు వెళ్లి ఇస్తుంటారు. కేవలం జిల్లా కేంద్రం నుంచే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల వారు కూడా వచ్చి బట్టలు, దుప్పట్లు ఇచ్చి వెళ్తుంటారు. ఈ చిన్నసాయానికే ఎంత తృప్తిగా ఉందో మాటల్లో చెప్పలేమని ఓ ఇల్లాలు సంతోషం వ్యక్తం చేసింది.

మహారాష్ట్రలో ఒక కలెక్టరేట్ ముందు ఇలాంటి- వాల్ ఆఫ్ కైండ్ నెస్ చూసి మంచిర్యాల కలెక్టర్ ఇన్ స్పైర్ అయ్యారు. ఈ ప్రయత్నం మనమెందుకు చేయకూడదు అనుకున్నారు. వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి, అంగన్వాడీ వర్కర్లను రంగంలోకి దింపారు. వర్కవుట్ అవుతుందా లేదా? జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే అనుమానాలుండేవి. అవన్నీ పటాపంచలు కావడానికి వారం రోజులు కూడా పట్టలేదు. జనం నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటిదాకా 9వేల బట్టలొచ్చాయి. 1000దాకా నోట్ బుక్స్ ఇచ్చారు. చెప్పుల షోరూం యజమానులు మేము సైతం అన్నారు. లాభం సంగతి పక్కన పెట్టి, కొత్త చెప్పులు, బూట్లు దానం చేశారు. ఇంకో రెండు మూడు నెలల తర్వాత సక్సెస్ రేటుని బట్టి, ఎలా ముందుకుపోవాలన్నది డిసైడ్ చేస్తామంటున్నారు కలెక్టర్ కర్ణన్. ప్రస్తుతానికైతే మంచిర్యాల టౌన్‌లో ఒకే ఒక స్టాల్ ఉంది. మున్ముందు మరిన్ని సెంటర్లలో వాల్ కైండ్ నెస్ గోడల్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామంటున్నారు. దానం ఇచ్చేవాళ్లు గొప్పవాళ్లు.. తీసుకునేవాళ్లు అదృష్టవంతులు. మధ్యలోనే తన గొప్ప ఏం లేదని తన సింప్లిసిటీని చాటిచెప్పారు కలెక్టర్ కర్ణన్.

image


ఆపన్న హస్తం పేరుతో కలెక్టర్ చేస్తున్న సేవా ప్రయత్నంపై జనం నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోంది. పేదవారికి తోచిన సాయం చేయడమనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామంటున్నారు మంచిర్యాల టౌనుకి చెందిన మల్లయ్య అనే చిరువ్యాపారి. ఇంతటి గొప్ప పనిలో తమని భాగస్వామ్యం చేసినందుకు గర్విస్తున్నామంటున్నారు.

ప్రతి మనిషిలోనూ ఎంతోకొంత మంచితనం ఉంటుంది. కాకపోతే దానికో టైం రావాలి. పక్కవారికి సాయం చేయాలని చాలామంది మనసులో ఉన్నా కుదరకపోవచ్చు. ఒక పాత టీ షర్టుని ఓ నిరుపేద కుర్రాడికిచ్చినా మంచిపని చేసినట్లే. ఈ సూత్రంతోనే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమందికి సాయమందిస్తోంది వాల్‌ ఆఫ్‌ కైండ్‌ నెస్. మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చేస్తున్న మంచిపని కూడా అదే.