10 రూపాయలకే బోలెడన్ని బ్రాండింగ్ పాఠాలు చెప్తున్న చాయ్ వాలా!!

10 రూపాయలకే బోలెడన్ని బ్రాండింగ్ పాఠాలు చెప్తున్న చాయ్ వాలా!!

Thursday February 18, 2016,

3 min Read

అది ఒకానొక ఆఫీస్! అప్పుడు సమయం సాయంత్రం నాలుగు! అంతలో పీమ్ పీమ్ అంటూ ఒక మోపెడ్ హారన్ విచిత్రంగా మోగింది! అందరూ ఒకేసారి అలర్టయ్యారు! హేయ్.. రమేశ్ వచ్చాడు అంటూ సీట్లలోంచి దిగ్గున లేచి నుంచున్నారు! హమ్మయ్య ప్రాణం లేచివచ్చిందని కొందరు ఊపిరి పీల్చుకున్నారు!! నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బిలబిలమంటూ మోపెడ్ దగ్గరికి పరిగెత్తుకొచ్చారు! వాళ్లను చూసిన రమేశ్‌ ఒక పలకరింపు నవ్వు నవ్వాడు! అలా స్మయిలీ ఫేస్ తోనే పనిలో నిమగ్నమయ్యాడు! మోపెడ్ హాండిల్‌కు అటు ఇటు తగిలించిన బుట్టల్లోంచి మూడు ఫ్లాస్కులు బయటకు తీశాడు! ఒకదాంట్లో వేడివేడి పాలు! మరోదాంట్లో గరంగరం టీ! ఇంకోదాంట్లో హాట్ వాటర్‌! వచ్చిన వాళ్లవైపు చూసీ చూడకుండానే వాళ్లతో మాట్లాడుతూ.. టీ తాగేవారికి టీ, కాఫీ అలవాటున్నవారికి కాఫీ, లెమన్ టీ ఇంట్రస్ట్ ఉన్నవాళ్ల కోసం లెమన్ టీ కలిపి ఇచ్చాడు! నిమిషాల్లో రెండు చేతులా 20 మందికి ఎవరికి ఏం కావాలో అది టకటక ఇచ్చేశాడు!!

image


రమేశ్‌ ఏం చేసినా అద్భుతమే! టీ సూపర్‌! కాఫీ వండర్‌!! లెమన్ టీ బ్రహ్మాండం!! దటీజ్ రమేశ్‌ బ్రాండ్! ఇంకెక్కడా దొరకవు అలాంటి టీ కాఫీలు! నమ్మరుగానీ, స్టార్ హోటల్లో దొరికే హై-టీ కూడా ఇతను చేసిన టీ ముందు బలాదూర్. చాయ్ మరీ స్ట్రాంగ్ గా ఉంది బాబూ అంటే, నవ్వుతూ కప్పులో కాసిన్ని పాలు కలుపుతాడు. తలపట్టేసింది రమేశ్‌ అంటే.. వేడివేడి లెమన్ టీలో ఒక పుదీనా ఆకు వేసి ఇస్తాడు. ఒక్క గుక్క తాగితే చాలు .. దెబ్బకు మైండ్ రీ ఫ్రెష్. అంతెత్తునుంచి ఫ్లాస్కు ఒంచి కప్పులో పోస్తే టీ అయినా కాఫీ అయినా నురగ సర్రున పొంగాల్సిందే.

కాఫీ, టీ, లెమన్ టీ. ఏదైనా పది రూపాయలే. టీ వ్యాపారమే కదాని తీసిపారేయకండి. పైకి సింపుల్‌గా కనిపించినా కస్టమర్ల మనసులు గెలుచుకునే గ్రేట్ బిజినెస్. తరచిచూస్తే రమేశ్‌ చేసే వ్యాపారం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు బోలెడున్నాయి.

కస్టమర్‌ను అర్ధం చేసుకోవడం

ఈ కిటుకు రమేశ్‌ కు బాగా తెలుసు. ఎవరు తన దగ్గర ఏం తాగుతారో..! ఎవరి టేస్ట్ ఏంటో.. . ఎవరెవరు కాఫీ ప్రిఫర్ చేస్తారో? ఎవరు షుగర్ తక్కువ తాగుతారో.. ఎవరికి టీ స్ట్రాంగ్‌గా ఉంటే నచ్చదో!! అందరి అభిరుచీ, అందరి అలవాట్లూ తెలుసు.

ఈ బంధం దృఢమైంది

బిబినెస్‌లో కావాల్సిందదే! నువ్వెవరో నేనెవరో అనుకుంటే ఎన్నటికీ కస్టమర్ బ్యాంక్ క్రియేట్‌ కాదు! అతనెవరో తెలియని పర్సనే కావొచ్చు! కానీ ఒకచిన్న పలకరింపు నవ్వు చాలు ఇద్దరి మధ్య ఆత్మీయతను పెరగడానికి! రమేశ్ కూడా అంతే! ప్రాపర్ రిలేషన్‌షిప్‌ మెయింటెన్ చేస్తాడు! ఎవరైనా మిస్సయితే ఫలానా సర్ రాలేదేంటని ఆరా తీస్తాడు! చుట్టుపక్కల అపార్టుమెంట్లలో ఉండే సెక్యూరిటీ గార్డులతోనూ సన్నిహితంగా ఉంటాడు! ఎవరితో ఎలా మాట్లాడాలోఅలా మాట్లాడతాడు! లౌక్యం తెలిసిన కుర్రాడు!!

ప్రతీ నిమిషమూ ముఖ్యమే

మాడ్లాడాలి.. చెయ్యాలి. అంతేకానీ పని పక్కన పెట్టి అదేపనిగా గంటలు గంటలు బాతాఖానీ కొట్టొద్దు! రమేశ్ ఈ విషయంలో పక్కా ప్రొఫెషనల్. టైం సెన్స్ పాటిస్తాడు. అపార్టుమెంటో, ఆఫీసో!! ఎక్కడ ఆగినా పదినిమిషాల కంటే ఎక్కువ కేటాయించడు. ఎందుకంటే టైమే అతని పెట్టుబడి. టైమే అతని రాబడి. పొరపాటున కూడా టీ ఫ్లాస్కు బదులు కాఫీ ఫ్లాస్కు ఓపెన్ చేయడు. ఏ రంగు ఫ్లాస్కులో ఏముందో ముందే తెలుసుకాబట్టి అనవసరంగా వేరేది ఓపెన్ చేసి టైం వేస్టు చేయడు. ఆగిన చోటల్లా మినిమం రూ. 200 గ్యారెంటీ.

మారుతున్న కాలానికి అనుగుణంగా..

సాధారణంగా రెయినీ సీజన్‌లో డేలాంగ్ కాఫీ టీలు తాగుతారు. ఆ టైంలో రమేశ్ బిజినెస్ ఏ మాత్రం వదులకోడు. ఠంచనుగా రోజూ అదే టైంకి అదే కస్టమర్ దగ్గరికి వస్తాడు.

బ్రాండ్ బిల్డప్

రమేశ్‌ ఇచ్చే టీ ఒక బ్రాండ్. అతనొక ప్రిఫర్డ్‌ వెండర్‌. ఎవరితో పోల్చుకున్నా బెటర్‌ పర్సన్‌. అతనంటే అందరికీ అభిమానం కూడా. ఒక్కరోజు కనిపించకుంటే ఏదో వెలితి.ఆ పూట గడవదేమో అన్నంత బాధ. ఇదంతా రమేశ్ ఓవర్ నైట్‌లో సంపాదించలేదు. రోజురోజుకీ కస్టమర్ల అభిమానాన్ని, ఆప్యాయతలను సంపాదించుకున్నాడు. అదంతా కేవలం వేడివేడి టీ కప్పుతోనే సాధ్యం కాలేదు. గుండె అంతరాంతరాల్లోంచి వచ్చే నులివెచ్చని పలకరింపు కూడా తోడైంది. ఆ రిలేషనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది.