ఆర్గానిక్ టూరిజంతో రైతులను గట్టెక్కిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

వ్యవసాయాన్ని ఆకర్షణీయంగా మారుస్తున్న మాండ్యా కొత్త తరం అంట్రప్రెన్యూర్

ఆర్గానిక్ టూరిజంతో రైతులను గట్టెక్కిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

Friday April 22, 2016,

5 min Read

బెంగళూరు టు మాండ్యా హైవే

కర్నాటకలో అత్యంత రద్దీగా ఉండే హైవేల్లో ఒకటి. హైవేపై హోటళ్లు, దాబాలు కామనే. కానీ అక్కడ అన్నింటిలో కల్లా ప్రత్యేకమైనది ఆర్గానిక్ మాండ్యా..

ఆర్గానిక్ స్పెషల్ వ్యవసాయ ఉత్పత్తుల స్టోర్ తో పాటు.. వాటితోనే ఆహార పదార్థాలు తయారు చేసే హోటల్ ఉందక్కడ. ప్రత్యేకంగా ఆ హోటల్లో తిని.. అక్కడి ఉత్పత్తులు కొనడానికి మాండ్యాకు బయలుదేరుతారంటే అతిశయోక్తి కాదు.

ఓ వారాంతం...

నాలుగైదు బస్సులు, కార్లు ఉదయమే మాండ్యా సమీప గ్రామాలకు చేరుకున్నాయి. వాటిల్లో దిగిన వారు పొలాల్లోకి వెళ్లి పనులు చేశారు.. గ్రామీణ క్రీడలు ఆడుకున్నారు.. వ్యవసాయాన్ని నేర్చుకున్నారు... తినే తిండి ఎలా వస్తుందో తెలుసుకున్నారు..! .. సంతృప్తిగా బయలుదేరారు.. ఇదో ఆర్గానిక్ టూరిజం లాంటిది.

ఈ రెండూ ఆలోచనలు అమెరికాలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని వదిలేసి వచ్చిన ఓ యువకుడివి. రైతులను అప్పుల బారి నుంచి బయటపడేసి.. ఆదాయ వనరులు పెంచి.. వారికి మరింత అండగా ఉండేందుకు మొదలైన ఆలోచన ఈ "ఆర్గానిక్ మాండ్యా"

"అమెరికా టు మాండ్యా..." మిషన్ ఫార్మింగ్

ఆర్గానిక్ మాండ్యా వ్యవస్థాపకుడు మధుచందన్ చిక్కదేవయ్య. కాలిఫోర్నియాలో వెర్టిఫాయా కార్పొరేషన్ కో ఫౌండర్. సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా కావాల్సినంత పేరు వచ్చింది. కానీ పుట్టిన ఊరుకి ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్న పళంగా మొత్తం వదిలేసి మాండ్యా వచ్చాడు. మధుచందన్ బాల్యం మొత్తం మాండ్యాలోని వ్యవసాయ యూనివర్శిటీ ప్రాంగణంలోని పొలాల్లోనే గడిపోయింది. మధుచందన్ తండ్రి... వ్యవసాయ వర్శిటీలోనే ఉద్యోగం చేసేవారు. అక్కడే వైస్ చాన్సలర్ హోదాలో రిటైర్ అయ్యాడు. చిన్నతనంలో తను నడిచిన, తిరగాడిన నేల తల్లి ఆప్యాయతే మధుచందన్ ను అమెరికా నుంచి రప్పించింది. ప్రపంచం మొత్తంలో హోల్ సేల్ రేట్లకు అమ్మి రిటైల్ రేట్లకు కొనుక్కునే ఒకే వ్యక్తి రైతు అని మధుచందన్ విశ్లేషిస్తారు. అందుకే రైతులకు ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు.

మధుచందన్ 2014 ఆగస్టులో మాండ్యాకు వచ్చాడు. అప్పటికే అక్కడ రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. 20 మంది చెరకు రైతులు దిగుబడి లేక అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు. అది తెలుసుకుని మధు కదిలిపోయాడు. మాండ్యా బెంగళూరుకు కేవలం వంద కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. కానీ రైతుల పరిస్థితి మాత్రం దుర్భరంగా వుంది. బ్యాంకులకు రైతులు రూ.1200 కోట్ల మేర బాకీ పడ్డారు. మద్దతు ధర లేకపోవడం, ప్రభుత్వాలు సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం, ఫార్మింగ్ టెక్నిక్స్ పై రైతులకు పెద్దగా సమాచారం లేకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఈ సందర్భంలో రైతులు చాలా మంది ఆర్గానిక్ పద్దతుల వ్యవసాయంపై వైపు మళ్లడం గమనించారు మధుచందన్. అయితే వారికి తమ ఉత్పత్తులను అమ్ముకునే మార్గం తెలియక.. సరైన ధర లభించక నష్టపోతున్న వైనాన్నీ గుర్తించారు. అందుకే మరింతమంది రైతులను అర్గానిక్ వ్యవసాయం వైపు ప్రొత్సహించి... వారి ఉత్పత్తులకు మంచి ధర కల్పించాలని సంకల్పించాడు. ఆ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్నదే ఆర్గానిక్ మాండ్యా.

" రైతులు వ్యవసాయాన్ని వదిలేసి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి పట్టణాలకు వెళ్లిపోతున్నారు. సాగుతో వారికి స్థిరమైన ఆదాయం రావడం లేదు. దాంతో కుటంబాన్ని పోషించలేకపోతున్నారు. చివరికి భారీ అప్పులు బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. దీని నుంచి వారిని బయట పడేయడానికే ఆర్గానిక్ మాండ్యా"- మధుచందన్, ఆర్గానిక్ మాండ్యా ఫౌండర్

మధుచందన్, ఆర్గానిక్ మాండ్యా ఫౌండర్

మధుచందన్, ఆర్గానిక్ మాండ్యా ఫౌండర్

మిత్రుల సాయం - రైతులకు అండ

అర్గానిక్ మాండ్యా ఆలోచన వచ్చిన వెంటనే మధుచందన్.. తన పాతమిత్రులు, కొలిగ్స్ ను సంప్రదించి రూ.కోటి మూలధనాన్ని సేకరించారు. దాంతోనే మాండ్యా ఆర్గానిక్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. మొదటి దశలో 240మంది రైతుల్ని ఒప్పించి తమ సంఘంలో చేరేలా ప్రొత్సహించారు. ప్రభుత్వ ఫార్మాలిటీస్ పూర్తి చేసి రైతుల ఉత్పత్తులను ఆర్గానిక్ మాండ్యా బ్రాండ్ కింద అమ్మకానికి రెడీ చేశాడు. అందుకోసం మధుచందన్ కి ఎనిమిది నెలల సమయం పట్టింది. రైతుల ఉత్పత్తులను అమ్మకానికి చాలా మార్కెటింగ్ ఆలోచనలు చేశారు కానీ... రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు చేరే కాన్సెప్ట్ వర్కౌట్ కాదని గుర్తించారు. బెంగళూరు-మాండ్యా జాతీయ రహదారిలో ఉత్పత్తులను అమ్మకానికి ఉంచాలని నిర్ణయించుకున్నారు.

" బెంగళూరులో ఆర్గానిక్ మాండ్యా చైన్ షాపులు తెరవడం, ఈ కామర్స్ వెబ్ సైట్ ను లాంఛ్ చేయడం, రెస్టరెంట్లు, షాపులకు అమ్మడంలాంటి ఆలోచనలు చాలా వచ్చాయి. కానీ ఇవేవి రైతుల నుంచి నేరుగా వినియోగదారు వద్దకు చేర్చే పద్దతులు కావు. అయితే అది మా ప్రాధాన్యం కాదు. ఓ రైతు కష్టాన్ని వినియోగదారులు అర్థం చేసుకునేలా.. వినియోగదారు ఆలోచనలను రైతు తెలుసుకునేలా చేయడమే మా ప్రయత్నం" -మధుచందన్, ఆర్గానిక్ మాండ్యా ఫౌండర్

ఆర్గానిక్ మాండ్యా స్టోర్

ఆర్గానిక్ మాండ్యా స్టోర్

ఈ ఆలోచనతోనే మాండ్యా రహదారిలో ఓ ఆర్గానిక్ సూపర్ మార్కెట్ తో పాటు దానికి అనుబంధంగా రెస్టరెంట్ ను ప్రారంభించారు. తమ రైతుల ఉత్పత్తులు ఆ రహదారి గుండా పోయేవారిని కచ్చితంగా ఆకర్షిస్తాయని మధుచందన్ కు తెలుసు. అయితే ముందుగా హోటల్లో ఆర్గానిక్ ఉత్పత్తుల రుచి చూసి.. ఆ తర్వాత షాపులో ఉత్పత్తులు కొనుగోలు చేస్తారని భావించారు. ఆశ్చర్యంగా వారంలోనే రెస్టరెంట్ కన్నా.. షాపుకే గారాకీ పెరిగింది. కొంత మంది వినియోగదారులు ఆర్గానిక్ మాండ్యా ఉత్పత్తుల కోసమే బెంగళూరు నుంచి వస్తున్నామని చెప్పడం.. మధుచందన్ లో ఆత్మవిశ్వాసం మరింత పెంచింది.

నాలుగు నెలల్లో రూ.కోటి అమ్మకాలు

ఆర్గానిక్ స్టోర్స్, హోటల్ లాంఛ్ చేసిన నాలుగు నెలల్లోనే రూ.కోటి అమ్మకాలు నమోదు చేసి సంచలనం సృష్టించింది ఆర్గానిక్ మాండ్యా. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా స్టోర్ కి తీసుకురావడం, డబ్బులు తీసుకెళ్లడం.. ఈ మొత్తం ప్రాసెస్ ఆరు నిమిషాల్లో పూర్తయిపోతుంది. ఇప్పుడు ఈ మధుచందన్ ప్రారంభించిన ఆర్గానిక్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఐదు వందల మంది రైతులు ఉన్నారు. అందరూ కలిసి దాదాపుగా రెండు వందల ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. 70 రకాల ఉత్పత్తుల్ని పండిస్తున్నారు. బియ్యం, పప్పులతో పాటు ఎడిబుల్ ఆయిల్స్, మసాలాలు, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఆర్గానిక్ పద్దతిలో సాగు చేస్తున్నారు. మంత్లీ బాస్కెట్ ను రూ.999, రూ.1499, రూ.1999 ధరల్లో అందిస్తున్నారు.

ఆర్గానిక్ టూరిజానికి శ్రీకారం

ఎలాంటి పురుగుమందులు, రసాయినాలు వాడకుండా చేసే ఆర్గానిక్ వ్యవసాయానికి కొంచెం మ్యాన్ పవర్ అవసరం ఎక్కువ ఉంటుంది. సాధారణంగా పేద రైతులు ఈ భారాన్ని భరించలేరు. అందుకే మధుచందన్ వినూత్నమైన ఆలోచన చేశారు. అదే ఆర్గానిక్ టూరిజం. ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రజల్లో ప్రజలకు అవగాహన పెంచడానికి... రైతులుకు సహాయంగా ఉండేలా దీన్ని సృష్టించారు. దీని ప్రకారం సోషల్ నెట్ వర్కింగ్ లో ప్రచారం చేయడం ద్వారా యువతను ఆకర్షిస్తున్నారు.

1. చెమటను డొనేట్ చేద్దాం రండి..: ఇంతకూ ఎవరూ ఆలోచించని కొత్త కంట్రిబ్యూషన్ స్వెట్ డొనేషన్. ఇరవై శాతం మంది రైతులు సరైన సమయంలో వ్యవసాయ కూలీలు లభించక పంటను నష్టపోతున్నారు. వీరి కోసమే ఈ కాన్సెప్ట్ ను డిజైన్ చేశారు. వ్యవసాయాన్ని ఇష్టపడేవారు వీకెండ్స్ లో మాండ్యా రైతులతో కలసి పొలాల్లో పనిచేయవచ్చు. ఈ ప్రచారాన్ని ప్రారంభించిన సగం రోజులోనే 24 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే వాలంటీర్స్ సంఖ్య బెంగళూరు నుంచే వెయ్యి మందికి చేరింది. రిటైరైన వ్యక్తులు, కాలేజీ విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరు ఓ టూరిజం స్పాట్ కు వచ్చినట్లు వచ్చి రైతు పొలంలో పనిచేస్తారు. దానివల్ల రైతుకు కొన్ని వేల రూపాయలు ఆదా అవుతున్నాయి.

స్వెట్ డొనేషన్ క్యాంప్ లో యువతరం

స్వెట్ డొనేషన్ క్యాంప్ లో యువతరం

2. ఫార్మ్ షేర్: ఈ విధానంలో ఓ కుటుంబానికి అర ఎకరం నుంచి రెండెకరాల వరకు కౌలుకు ఇస్తారు. దీని కోసం రూ.35వేలు తీసుకుంటారు. ఈ విధానంలో వ్యవసాయం చేయాలనుకున్నవారు ఏడెనిమిది రోజులు పొలంలోనే నివాసం ఉండి సాగుని ప్రాక్టీస్ చేయవచ్చు. వారి తిండిని వారే సాగుచేసుకోవచ్చు. వారు లేని సమయంలో ఆర్గానిక్ మాండ్యాకు చెందిన ఓ రైతు ఆ పొలం బాధ్యతలు చూస్తారు. మొత్తం పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని కౌలుకు తీసుకున్నవారు తీసుకెళ్లవచ్చు. లేదా ఆర్గానిక్ మాండ్యా కు అమ్మవచ్చు. దీని వల్ల వ్యవసాయంపై మక్కువ ఉన్నవారికి టూరిజం ఎక్స్ పీరియన్స్ తో పాటు సొంతంగా సాగు చేసుకున్న అనుభూతి వస్తుంది. రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది.

మాండ్యా ఆర్గానిక్ పొలాల్లో ఐటీ ఉద్యోగులు

మాండ్యా ఆర్గానిక్ పొలాల్లో ఐటీ ఉద్యోగులు

3. టీమ్@ఫార్మ్: ఈ విధానంలో కార్పొరేట్ కంపెనీ తమ ఉద్యోగులను వారాంతంలో ఒక రోజు వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయవచ్చు. గ్రామీణ క్రీడలు ఆడుకోవచ్చు. ఆర్గానిక్ బెల్లం తయారీ ప్రాసెస్ ను కూడా ఇందులో చూడవచ్చు. ఈ ప్యాకేజీలో ఒక్కో వ్యక్తి రూ.1300 తీసుకుంటున్నారు.

ఆర్గాని్క మాండ్యా టూరిజంలో డెలిగేట్స్

ఆర్గాని్క మాండ్యా టూరిజంలో డెలిగేట్స్

మాండ్యాలో రివర్స్ మైగ్రేషన్

ఆర్గానిక్ సాగుకి టూరిజానికి సక్సెస్ ఫుల్ గా లింక్ పెట్టేయడంతో ఇప్పటి దాకా వలస పోయిన రైతులు వెనక్కి వస్తున్నారు. గత రెండునెలల కాలంలోనే ఇలా 57 మంది రైతులు మళ్లీ వ్యవసాయం కోసం గ్రామాలకు తిరిగివచ్చారని మధుచందన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతంలాగే వినియోగదారుకు, రైతులకూ లాభం కలిగేలా ఆర్గానిక్ మాండ్యాను కొనసాగించడమే లక్ష్యమంటన్నారు. ఆర్గానిక్ మాండ్యాలో రిజిస్టర్ చేసుకున్న రైతుల కుటుంబాలకు డిస్కౌంట్ రేట్లతో నిత్యావసరాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు.

2020కల్లా మాండ్యా మొత్తాన్ని ఆర్గానిక్ డిస్ట్రిక్ట్ గా మార్చాలనేదే సాధించాలనేదే మధుచందన్ టార్గెట్.