ఈ యాంకరమ్మ ఒకప్పుడు మగాడు!!

దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ న్యూస్ రీడర్ సక్సెస్ స్టోరీ !!

ఈ యాంకరమ్మ ఒకప్పుడు మగాడు!!

Tuesday December 22, 2015,

4 min Read


వాళ్లూ మనలాంటి మనుషులే. కాకపోతే చిన్నతేడా. మనసు అనుకునేది ఒకటి. శరీరం చేసేదొకటి. సర్దుబాటు అవదు. దాన్ని సమాజం అర్ధం చేసుకోదు. అవమానాలు. చీదరింపులు. అవహేళన. చిన్నచూపు. అవకాశాలుండవు. సౌకర్యాలుండవు. ఒక్కోసారి బతికే అర్హతే ఉండదు. అటుఇటుకాని జీవితం. అంతా తలకిందులు. సంఘం అప్రకటితంగానే వెలి వేస్తుంది. అదొక తీవ్రమైన మానసిక సంఘర్షణ. భౌతికంగానూ నిత్యం యుద్ధం.

వ్యవస్థ మీద యుద్ధం

ఆమె కాదు. అతడూ కాదు. అలాఅని- ఏమీ కాదని కూడా కాదు. ఒక మేల్‌. ఒక ఫిమేల్‌. రెండూ కలగలిసిన జీవితం. దానికోసం ఎడతెగని యుద్ధం. ఆత్మగౌరవం కోసం అలుపెరుగని పోరాటం. అన్యాయంగా బలైపోతున్న జీవితం కోసం ఆరాటం. ఇంటినుంచే మొదలయ్యే ఛీత్కారం. సమాజంలో ఏహ్యభావం. వెరసి వ్యవస్థ మీద కోపం. ఆ కోపంలోంచి కసి. కసినుంచి పట్టుదల. రెండూ కలిస్తే ఆత్మవిశ్వాసం. గుండెలో ధైర్యం. ఫైనల్‌ గా ఒక విజయం. పద్మినీ ప్రకాశ్‌ గెలుపు అలాంటిదే.

image



పద్మిని ప్రకాష్. తమిళనాట ఈ పేరొక ప్రభంజనం. ఆ గెలపు వెనుక 32 ఏళ్ల మానసిక సంఘర్షణ ఉంది. వెలివేసిన సమాజం చేతనే శెభాష్ అనిపించు కోవడం వెనుక ఎందరికో స్ఫూర్తి రగిలించే విజయగాథ ఉంది. థర్డ్‌ జెండర్ న్యూస్ యాంకర్‌! కాంటెపరరీ జర్నలిజంలో అదంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ నిరూపించింది. అలా దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ న్యూస్ రీడర్‌ గా చరిత్ర తిరగరాసింది.

జీవితానికి సరిపడా కన్నీళ్లే

ఒక్కసారి గతం తరచి చూస్తే- పద్మిని ప్రకాశ్ జీవితం నిండా కన్నీళ్లే ఉన్నాయి. ఊహ తెలిసినప్పటి నుంచి మనసు విచిత్రంగా ఆలోచించేది. అమ్మాయిలా ఉండాలని.. అమ్మాయిలతోనే స్నేహం చేయాలని.. అమ్మాయిల్లా డ్రస్ వేసుకోవాలని.. మేకప్ వేసుకోవాలని.. లిప్ స్టిక్ పూసుకోవాలని. పైకి మగాడే. కానీ మనసంతా ఆడతనం. క్లాసికల్ డాన్స్ చేస్తానంటే అందరూ నవ్వేవారు. ఆ కళ్లేంటి అమ్మాయిలా తిప్పుతున్నావని. అబ్బాయిల స్నేహాలు నచ్చేవి కావు. అమ్మాయిలతోనే కలిసి తిరగాలనిపిస్తుంది. క్లాసురూంలో అందరూ ఆటపట్టించేవారు. విషయం నాన్నకు తెలిసింది. భయంకరంగా కొట్టాడు. ఇద్దరు కొడుకులుంటే అందులో ఒకడు ఇలా అయిపోయాడేంటని తన్నాడు. ఒకసారి బలవంతంగా జుట్టు కత్తిరించాడు. పెద్ద జడ. ఒక్కసారిగా తెగిపడే సరికి దుఖం ఆగలేదు. రోజంతా ఏడ్చింది. ఎవరూ ఓదార్చలేదు. చివరికి ఇంట్లో నుంచి గెంటేశాడు. నువ్వసలు పుట్టనే లేదనుకుంటాను అని తండ్రి నిశ్కర్షగా చెప్పాడు. ఇదంతా అడ్డుకోడానికి అమ్మ లేదు. పద్మిని నెలల వయసులోనే తల్లి చనిపోయింది. అలా 2000 సంవత్సరంలో బట్టలు సర్దుకొని ఇల్లొదిలింది.

అప్పుడు మొదలైంది బతుకు పోరాటం

పద్మిని వెర్షన్ ఒకటే. చేయని తప్పుకు ఎందుకు శిక్ష అనుభవించాలి. ఎలా పుట్టాలో తన చేతుల్లో లేదు. కానీ ఎలా వుండాలో మాత్రమే ఉంది. అయినా సమాజం వెలివేసిందేమిటి? దేహంలో జరిగే పరివర్తను కారణమెవరు? మానసికోద్రేకాల్ని ఆపడం ఎలా? ఈ సంఘర్షణ ఆత్మహత్యకు ప్రేరేపించింది. 13 ఏళ్లప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసింది. కానీ ఎక్కడో మూల చిన్న ఆశ బతికించింది. అప్పుడు మొదలైంది బతుకు పోరాటం. ప్రయాణం ఎటువైపో తెలియదు. గమ్యం ఎక్కడో అర్ధం కాదు. లక్ష్యం మీద క్లారిటీ లేదు. కానీ తిరిగింది. అన్ని ప్రదేశాలూ తిరిగింది.

అలా మొదలైంది గెలుపు ప్రయాణం

ఏదో ఒకటి సాధించాలి. అలా జరగాలంటే ముందు చదువు మీద దృష్టి పెట్టాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఒక్కటే మార్గంలా కనిపించింది. డిగ్రీ కామర్స్. కానీ డబ్బుల్లేక అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత డాన్స్ మీద ఇంట్రస్టుతో భరతనాట్యం నేర్చుకుంది. 2004లో సర్జరీ అయింది. పూర్తిగా స్త్రీలా మారిపోయింది. ఒడ్డూ, పొడుగూ అందం కలిసొచ్చాయి. ట్రాన్స్ జెండర్ బ్యూటీ కాంటెస్ట్‌- 2009 టైటిల్ గెలిచుకున్నారు. అలా మొదలైంది గెలుపు ప్రయాణం. తర్వాత టీవీ సీరియళ్లలో నటించే అవకాశం వచ్చింది. మధ్యలో చిన్నచిన్న యాడ్స్ కూడా .

image


రాత్రి ఏడు గంటల బులెటిన్ ఒక సంచలనం

పద్మిని ప్రకాశ్‌ రూపురేఖలు, బాడీ లాంగ్వేజ్‌- కోయంబత్తూరుకు చెందిన లోటస్ న్యూస్ ఛానల్ వారిని ఆకర్షించాయి. థర్డ్‌ జెండర్. అయితే ఏంటి? వారికి సమాజంలో బతికే అర్హత లేదా? వారికి అవకాశాలు కల్పిస్తే వచ్చే నష్టమేంటి? యాజమాన్యం ఎంతో ఉన్నతంగా ఆలోచించింది. న్యూస్ రీడర్ గా పిలిచి అవకాశం ఇచ్చింది. పద్మినీ ప్రకాశ్‌ కు ఆ ప్రొఫెషన్ ఇష్టమే. కానీ వ్యూయర్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు. ముఖ్యంగా డిక్షన్. వార్తల స్వభావానికి తగినట్టు గొంతులో భావాలు పలికించడం సాధ్యమేనా? అలా పలికించినా స్వరం సహకరిస్తుందా? ఆహార్యంలో ఎంత ఆడతనం ఉన్నా గొంతు మాత్రం కొంత మగవారిలా ఉంది. అదొక్కటే పద్మినీ భయం. కానీ రానురాను అంతా సర్దుకుంది. ఇప్పుడు లోటస్ ఛానల్‌లో రాత్రి ఏడు గంటల బులెటిన్ ఒక సంచలనం. కౌంట్ డౌన్ దగ్గర్నురంచీ బులెటిన్ ఎండ్ అయ్యేంత వరకు పద్మినీ ప్రకాశ్‌ ను కొన్ని లక్షల మంది చూస్తారు. ఇప్పుడా బులెటెన్‌ రేటింగ్ ఆకాశమార్గం పట్టింది. పద్మిని తమ కొలిగ్ అయినందుకు ఛానల్ ప్రతినిధులంతా గర్వంగా ఫీలవుతున్నారు. రోజూ రాత్రి ఏడు గంటలకు తనను టీవీ తెరపై అందరూ చూస్తారు. తమ్ముడు చెల్లి అక్క కూడా చూస్తునే ఉంటారు. ఏదో ఒకరోజు తండ్రి తనని చూసి ఫోన్ చేయకపోతారా అని గుండె లోలోతుల్లో కన్నీళ్లు పెట్టుకుంటారు.

కమ్యూనిటీ తరుపున గొంతుకై

ప్రస్తుతం పద్మిని- ప్రకాశ్ అనే బాల్య స్నేహితుడినే పెళ్లి చేసుకుంది. ఈ మధ్యనే ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారు. తమిళనాడు ప్రజలు పద్మినీ ప్రకాశ్‌ ని మనసారా దీవించారు. ఆ ఆశీస్సులతోనే ఆమె ట్రాన్స్ జెండర్ హక్కుల కోసం పోరాడుతోంది. ఇంతకాలం నిర్లక్ష్యం చేయబడ్డ తన కమ్యూనిటీ తరుపున గొంతుకై నినదిస్తోంది. ట్రాన్స్ జెండర్‌ సర్జరీ చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో- దాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్న తన డ్రీమ్. దాంతోపాటు సెక్సువల్ డిసీజెస్ మీద కౌన్సెలింగ్, సరైన గైడెన్స్, శిక్షణా తరగతులు నిర్వహించాలన్నది తన ముందున్న లక్ష్యం. సెక్సువల్ మైనారిటీ మీద రాజీలేని పోరాటం చేస్తున్న పద్మిని ప్రకాశ్‌కు సర్వత్రా మద్దతు దొరుకుతోంది. ఆమె ఆశయం సిద్ధించాలని మనమూ కోరుకుందాం..