ఉదయాన్నే టిఫినీలు డెలివర్ చేసే 'ది ఫస్ట్ మీల్'

బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయొద్దని ది ఫస్ట్ మీల్ ప్రచారంవివిధ మెనూ ఆప్షన్లలో ఇంటికే పొద్దున్నే టిఫిన్, జ్యూస్హైదరాబాద్‌లో పెరుగుతున్న ఫుడ్ టెక్ స్టార్టప్ కల్చర్వీకెండ్స్‌లో బ్రంచ్‌లు కూడా సిద్ధం

ఉదయాన్నే టిఫినీలు డెలివర్ చేసే 'ది ఫస్ట్ మీల్'

Sunday September 06, 2015,

4 min Read

ఉదయం లేవగానే... వేడి వేడి కాఫీ.. కాసేపటికి హాట్ టిఫిన్ కడుపులో పడితే ఆ సుఖమే వేరు. రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది. డే రిలాక్స్‌డ్‌గా మొదలవుంది. అయితే ఈ మధ్య ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బ్రేక్ ఫాస్ట్ చేయడమే గగనమవుతోంది. కొంత మంది బద్దకంతో మరికొంత మంది ఏకంగా లంచ్ త్వరగా చేసేద్దామనే సాకుతో టిఫినీలను ఎగ్గొట్టేస్తున్నారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయని తెలిసినా చేసేది లేక కడుపు మాడ్చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వాళ్లందరి కోసం ఉదయాన్నే మీ ఇంటిముందుకే రుచికరమైన టిఫిన్, కడుపులో చల్లగా ఉంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ డెలివర్ చేస్తామంటూ ముందుకు వచ్చింది హైదరాబాదీ సంస్థ 'ది ఫస్ట్ మీల్'.

image


హైదరాబాద్ కూడా ఇప్పుడిప్పుడే బెంగళూరు బాటపడ్తోంది. ఫుట్ డెలివరీ స్టార్టప్స్ జోరు మెల్లిమెల్లిగా పెరుగుతోంది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వచ్చింది 'ది ఫస్ట్ మీల్'. ఈ స్టార్టప్ ఏర్పాటుకు ముందు 600 మందితో చేసిన చిన్న మార్కెట్ స్టడీ చేశారు. వాళ్లందరూ చెప్పిన సమాధానం ఒక్కటే. 'చేసుకునే ఓపిక లేదు కానీ.. రెడీగా ఉంటే తప్పకుండా తిని వెళ్తాం' అనే సమాధానం వచ్చిందని చెబ్తారు ది ఫస్ట్ మీల్ కో ఫౌండర్ యువరాజ్. అంతే కాదు.. టెక్, డిజైన్ ఏజెన్సీ స్టార్టప్స్ ఏర్పాటు చేసి వాటిని వదిలి వచ్చేంత పొటెన్షియల్ ఇందులో ఉందని గుర్తించాకే రంగంలోకి దిగామంటారు యువరాజ్.

" ఓ రోజు మా ఫ్రెండ్ వాళ్ల అమ్మ ఫోన్ చేశారు. మా రూమ్‌మేట్ సరిగ్గా టిఫిన్ తినడం లేదని.. తనకు ఏదైనా ఏర్పాటు చేయమని అడిగారు. వీలైతే వాచ్‌మెన్‌కు డబ్బులిచ్చి రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ ఉండేట్టు చేయమని రిక్వెస్ట్ చేశారు. సరే.. మాట కాదనలేక వాచ్‌మెన్‌కు డబ్బులిచ్చి రోజూ ఉదయాన్నే ఎనిమిదిలోపు టిఫిన్ తెచ్చిపెట్టమని అడిగాను. ఉదయాన్నే మా ఫ్రెండ్ కూడా.. టేబుల్ పై రెడీగా ఫుడ్ ఉండడంతో.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ చేసే ఆఫీస్ వెళ్లడం మొదలుపెట్టాడు. అప్పుడే నాకు అనిపించింది.. రెడీగా ఉంటే.. ఫస్ట్ మీల్ ఎవరూ వదలరని. అప్పుడే నాకు ఈ ఐడియా తట్టిందని చెప్తారు'' యువరాజ్.

వాలెంటైన్స్ డే రోజు మొహం వాచేలా తిట్లుతిన్నాం

సరే.. ఫుడ్ స్టార్టప్ మొదలుపెట్టాలనే ఆలోచన వచ్చిన తర్వాత యువరాజ్‌తో పాటు సాస్వత, సూరజ్, రవి, సాత్విక్‌లు కలిసొచ్చారు. కొంత మంది టెక్నాలజీలో అనుభవం ఉంటే.. మరికొందరికి ఆపరేషన్స్, డిజైన్స్, మార్కెటింగ్‌లో పట్టుంది. అయితే వీళ్లలో ఎవరికీ ఫుడ్ ఇండస్ట్రీపై ఆ స్థాయిలో అనుభవం లేదు. అదే ఓ రోజు.. జీవితకాలానికి సరిపడా అనుభవాన్ని ఇచ్చిందని చెప్తారు యువరాజ్.

''మేం ఈ ఏడాది ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే రోజున ఓ కాన్సెప్ట్ డిజైన్ చేశాం. ' గిఫ్ట్ యువర్ వాలెంటైన్ ది ఫస్ట్ మీల్ ' అని ప్రచారం చేశాం. సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్, ఇంగ్లిష్ బ్రేక్ ఫాస్ట్ ఇవ్వాలని అనుకున్నాం. సోషల్ మీడియాలో చేసిన ప్రచారంతో 60 ఆర్డర్లు వస్తాయని అనుకుంటే.. 150 వరకూ ఆర్డర్లు వచ్చాయి. ఆల్ హ్యాపీస్ అనుకున్నాం. మేం ఆర్డర్ ఇచ్చిన రెస్టారెంటులో మాకు ఫుడ్ ఉదయం ఆరు గంటల కల్లా అందాల్సి ఉంది. కానీ మా టీమంతా వెళ్లి చెఫ్‌ను ఆరు గంటలకు నిద్రలేపాల్సి వచ్చింది. దీంతో.. ఫుడ్ తయారీ లేట్ అవడం, అవి సరైన సమయానికి డెలివర్ చేయలేకపోవడం, కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకుండా.. హైదరాబాద్ అంటా డెలివర్ చేస్తామని చెప్పడంతో.. నానా తిట్లు తినాల్సి వచ్చింది. ఫోన్‌లో ఆ రోజు తిన్న, విన్న తిట్లు.. జీవితంలో అప్పటివరకూ ఎప్పుడూ వినలేదేమో.. ! తీరా అంత మందికీ ఆ రోజు సాయంత్రానికి కూడా బ్రేక్ ఫాస్ట్ సరఫరా చేయలేకపోయాం. అదీ జీవితంలో మర్చిపోలేనంత పెద్ద పాఠాన్నే నేర్పింది'' - యువరాజ్.

image


ఏంటి ఫస్ట్ మీల్ కాన్సెప్ట్ ?

తక్కువ ధరలో ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ అందించడం. అది కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ.. ఫ్రూట్ సలాడ్, ఫ్రెష్ జ్యూస్ కూడా డెలివర్ చేయడం. జూన్ 22వ తేదీన ప్రారంభమైన ది ఫస్ట్ మీల్‌కు.. ఇప్పటి వరకూ 700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. రోజుకు వంద ఆర్డర్ల ఫుడ్‌ను.. వారానికి 500 బ్రేక్‌ఫాస్టులను డెలివర్ చేస్తోంది. ప్రస్తుతానికి రూ. 80కి ఫుల్ కోర్స్ బ్రేక్ ఫాస్ట్‌తో పాటు ఫ్రూట్ జ్యూస్‌ను ఆఫర్ చేస్తున్నారు. శని,ఆదివారాల్లో బ్రంచ్‌ కూడా డెలివర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీకి పరిమితమైన డెలివరీని త్వరలో ఇతర ప్రాంతాలకూ విస్తరించబోతున్నారు. సమీప రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుని.. వాళ్ల నుంచి ఫుడ్‌ను ఔట్‌సోర్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో వాల్యూమ్స్ పెరిగినప్పటికీ.. సొంత కిచెన్ ఆలోచన మాత్రం లేదని చెబ్తోంది ఫస్ట్ మీల్ టీం. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా మెనూను మార్చుకుంటూ.. కొత్తు రుచులను పరిచయం చేయడం సొంత చెఫ్స్‌తో కుదిరే పనికాదని.. అందుకే రెస్టారెంట్లతో డీల్ చేస్తున్నట్టు ది ఫస్ట్ మీల్ చెబ్తోంది. అయితే డెలివరీ విషయంలో మాత్రం పూర్తిగా సొంత టీమ్‌నే నమ్ముకున్నారు. ఎందుకంటే ఉదయాన్నే కస్టమర్లకు ఇళ్లకు వెళ్లాల్సి ఉన్నందున రిస్క్ తీసుకోలేమని అంటున్నారు.

'' ఊరికే టిఫిన్లను సరఫరా చేయడానికే అయితే తాము అవసరం లేదని ఇప్పటికే మార్కెట్లో చాలా మంది అందుకోసం ఉన్నారనేది వీళ్ల మాట. న్యూట్రిషియస్ ఫుడ్‌ను కస్టమర్లకు అందిస్తూ.. బ్రేక్‌ఫాస్ట్ ఎంత ముఖ్యమో జనాలకు అర్థమయ్యేలా చెప్పడం తమ లక్ష్యం అంటారు. ఫుడ్ డెలివరీకి టెక్నాలజీని, డిజైన్‌ను జత చేసి కస్టమర్లకు ఉదయాన్నే హ్యాపీనెస్ పంచడం టార్గెట్ అంటోంది ది ఫస్ట్ మీల్ టీ ''.

ఫ్యూచర్ ప్లాన్స్

  • ప్రస్తుతానికి సొంత నిధులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సమీకరించిన నిధులతో ది ఫస్ట్ మీల్‌ను ఏర్పాటు చేసిన టీమ్.. ఫండింగ్ కోసం ఎదురుచూస్తోంది. ఇన్వెస్టర్లతో యాక్టివ్‌గా చర్చలు జరుపుతున్నామని... నెల రోజుల్లో కనీసం కోటి రూపాయల ఫండింగ్ డీల్ ఓకె కావొచ్చని ది ఫస్ట్ మీల్ కో ఫౌండర్ యువరాజ్‌ వెల్లడించారు.
  • హైదరాబాద్ అంతటికీ ఆరు నెలల్లో విస్తరించాలని ప్లాన్.
  • ప్రస్తుతానికి వెబ్ సైట్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్న సంస్థ, త్వరలో యాప్ లాంఛ్ చేయబోతోంది.
  • ఆరు నెలల్లో పూణె లాంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించే యోచన.


website