సొంతింటి కలకు క్లారిటీ ఇచ్చే 'రియాల్టీ కంపాస్'

సొంతింటి కలకు క్లారిటీ ఇచ్చే 'రియాల్టీ కంపాస్'

Monday July 20, 2015,

4 min Read

గృహమే కదా స్వర్గసీమ అంటారు ఒకరు... తరతరాలుగా చెరగని చిరునామా అంటారు ఇంకొకరు... సొంతింటి కల నెరవేరుస్తామని ఊరిస్తారు మరొకరు... ఇలా టీవీలో చూసినా, పేపర్లో చూసినా, ఆన్ లైన్ లో చూసినా కొత్తకొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన ఏవేవో అడ్వర్టైజ్‌మెంట్లు కనిపిస్తూనే ఉంటాయి. చూసేందుకు అన్నీ బాగానే అనిపిస్తాయి కానీ... దిగితే కానీ లోతు తెలియదు. ఓసారి వెళ్తే కానీ అసలు విషయం బయటపడదు. ప్లాటో, ఫ్లాటో, విల్లానో అమ్మేప్పుడు అవి ఉంటాయి ఇవి ఉంటాయని చెప్తారు కానీ... తీరా గృహప్రవేశం చేశాక కనిపిస్తుంది అసలు సినిమా. చాలామంది ఇలాంటి తప్పుడు ప్రకటనల బుట్టలో పడి సొంతింటి కలను పీడకలగా మార్చేసుకుంటున్నారు. అందుకే జీవితంలో తీసుకోబోయే అతి కీలక నిర్ణయం ఇలా ఇబ్బందిపాలు చేయకూడదన్న ఆలోచనతో, ఆశయంతో సేవలందిస్తోంది రియాల్టీ కంపాస్.

ఇల్లు వెతికితే ఐడియా తట్టింది !

అది 2013. ఇద్దరు స్నేహితులు. శంకర, నిమేష్. ఇద్దరూ ఓ మంచి ఇంటి కోసం వెతుకుతున్నారు. చాలా వెబ్ సైట్లు చూశారు. ఎంత వెతికినా ఏం లాభం. కావాల్సిన సమచారం దొరకలేదు. కనిపించిన సమాచారం కూడా తప్పని అర్థమైంది. ఇల్లు కొనాలంటే అయోమయం. తమ సంగతి సరే. తమలాగా ఇళ్లను వెతికేవారి పరిస్థితేంటీ ? సరిగ్గా ఈ ప్రశ్నే రియాల్టీ కంపాస్‌కు బీజం పడేలా చేసింది.

"మాకున్న అవగాహన, పరిజ్ఞానంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాం. ఇల్లు వెతికే వారికి మరింత సులభంగా సమాచారాన్ని అందించేందుకు సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందన్న దానిపై కసరత్తు చేశాం" అంటారు నిమేష్.

ఆలోచన వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చెన్నైలోని అతిపెద్ద డెవలపర్స్ అయిన కాసాగ్రాండ్‍ని శంకర సంప్రదించాడు. వెతికే తీగ కాలికి తగిలినట్టైంది. ఎందుకంటే కాసాగ్రాండ్ ఎండి అరుణ్ కూడా ఇలాంటి ఐడియాపైనే కసరత్తు చేస్తున్నాడు. వీళ్లంతా కలిసి కస్టమర్ల అభిరుచులపై, అవసరాలపై పరిశోధన చేసి విశ్లేషించారు. ఆ తర్వాత వెబ్ సైట్ పని మొదలుపెట్టారు. అలా రియాల్టీ కంపాస్ పట్టాలెక్కింది.

image


పారదర్శకంగా... నిష్పక్షపాతంగా...

రియాల్టీ కంపాస్ అన్నిహంగులతో కూడిన మొట్టమొదటి రియాల్టీ సెర్చ్ ఇంజిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే... ఏ నగరంలో అయినా అక్కడున్న ప్రాజెక్టుల వివరాలుంటాయి. అంతేకాదు... మిగతా ప్రాజెక్టులతో పోల్చిచూసుకునే వెసులుబాటు కూడా ఉంది. వీరి వెబ్ సైట్ లో కనిపించే వివరాలన్నీ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఈ బృందం. చిన్నది పెద్దది అన్న తేడా లేకుండా ప్రతీ ప్రాజెక్ట్ వివరాలుంటాయి. కొన్ని ప్రాజెక్టుల్లో అమ్మడానికి తక్కువ యూనిట్లు ఉన్నా సరే... వీరి దగ్గర ఆ సమాచారం కూడా ఉంటుంది. బడ్జెట్, లొకేషన్, బిల్డర్ కేటగిరీ లాంటి వేర్వేరు వివరాలను అందించేలా ఆల్గోరిథంను డెవలప్ చేశారు. ఇవన్నీ కొనుగోలుదారులకు కావాల్సిన వివరాలను అందించేందుకు ఉపయోగపడుతున్నాయి. సాధారణంగా ఇల్లు కొనాలన్నా, ప్లాటు కొనాలన్నా వెంటనే బ్రోకర్లు సీన్‌లోకి వస్తారు. కానీ ఇక్కడ ఆ చికాకులేమీ లేవు. ఒక్కముక్కలో చెప్పాలంటే బ్రోకర్‌లెస్ ప్లాట్‌ఫామ్ ఇది. కొనుగోలుదారులు నేరుగా బిల్డర్లతో మాట్లాడొచ్చు. సందేహాలు తీర్చుకోవచ్చు. నమ్మకంగా అనిపిస్తేనే ముందుకెళ్లొచ్చు. అనవసరమైన ఫోన్ కాల్స్ చికాకు పెట్టే సమస్యే లేదు. ప్రస్తుతం మిగతా వెబ్ సైట్లతో పోలిస్తే రియాల్టీ కంపాస్ దగ్గర ఎక్కువ సమాచారం ఉందనడం అతిశయోక్తి కాదు.

ప్రధానంగా రెండు రీసెర్చ్ టూల్స్ ని డెవలప్ చేశారు. అవి...

1. ఇంటి విలువను నిర్ధారించే క్యాలిక్యులేటర్: ఇల్లు కొనాలంటే ముందుగా తలెత్తే ప్రశ్న... మన బడ్జెట్ ఎంత అని. ఆ బడ్జెట్ నిర్ధారించుకునేందుకు ఉపయోగపడే క్యాలిక్యూలేటర్ ఇది. అసలు మన జీతం ఎంత ? డౌన్‌పేమెంట్ ఎంత చెల్లించే స్తోమత ఉంది ? ఎంత వరకూ రుణం తీసుకునే అవకాశం ఉంది ? ఈఎంఐ ఎంత చెల్లించాలనుకుంటున్నారు ? 20 ఏళ్ల కాలంలో ఇంటి అద్దె ఎంతవుతుంది ? ఈ లెక్కన ఇల్లు కొంటే లాభమా ? నష్టమా ? లోన్ తీసుకొని కొన్న ఇంటిపై అసలు, వడ్డీ చెల్లించడం ద్వారా కలిగే ఆదాయపు పన్ను ప్రయోజనాలు... లాంటి వివరాలన్నీ ఈ వెబ్ సైట్లో తెలుసుకోవచ్చంటే నిజంగా ఆశ్చర్యమే. ఇన్ని వివరాలను అందించేలా క్యాలిక్యులేటర్‌ని డెవలప్ చేశారు.

2. కొలంబజ్: స్థిరాస్తి కొనాలంటే ఎన్నో అపోహలు. ఇంకెన్నో భయాలు. మరెన్నో ప్రశ్నలు. నిజమే మరి. జీవితంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ మాత్రం ఆరా తీయడం అవసరమే. చాలామంది స్నేహితులు, బంధువుల దగ్గర్నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు. కానీ విచిత్రమేంటంటే... ఇల్లు కొనాలన్న ఆలోచన వచ్చిన వాళ్లంతా అడుగు ముందుకెయ్యలేరు. కారణం... సరైన ఇల్లు దొరకట్లేదన్న భయంతో ఇల్లు కొనడాన్ని వాయిదా వేస్తుంటారు. కస్టమర్లు ఎదుర్కొనే ఈ సమస్యపైనా పరిశోధన జరిపింది ఈ సంస్థ. అందుకే కొలంబజ్ రీసెర్చ్ టూల్ ని రూపొందించింది. సందేహాలేవి ఉన్నా రియల్ ఎస్టేట్ ఫోరమ్స్ ని సంప్రదించొచ్చు. నిపుణులతో మాట్లాడొచ్చు. కావాల్సిన సలహాలు తీసుకోవచ్చు.

రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే... బిల్డర్లు, ప్రాపర్టీ కన్సల్టెంట్లు ప్రచారం కోసం ఏటా ఖర్చు పెట్టే మొత్తం ఆరేడు వందల కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ ఏటా 20 లక్షల మంది ఇంటి కోసం వెతికితే... వారిలో ఐదు వేల మంది మాత్రమే నూతన గృహ ప్రవేశం చేస్తున్నారు. మిగతా వాళ్లంతా మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు. ఇందుకు చాలా కారణాలుంటాయి. ఆ కారణాలనూ విశ్లేషిస్తోంది రియాల్టీ కంపాస్.

"కస్టమర్లకు రియాల్టీ కంపాస్‌ను దగ్గర చేసేందుకు మేం సోషల్ మీడియాని విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాం. వారి సమస్యల్ని సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఇటీవల 'బిల్డర్లు మాట తప్పి మిమ్మల్ని ఎలా మోసం చేశారు?' అన్నదానిపై వినియోగదారుల అభిప్రాయాలను సేకరించాం. మా పోర్టల్ గురించిన సమాచారాన్ని అందించాం" అంటారు నిమేష్.

కంపెనీ ప్రారంభించిన 11 నెలలకే ప్రాపెల్ హోల్డింగ్స్ నుంచి పెట్టుబడులు వచ్చాయి. ప్రాపెల్ హోల్డింగ్స్‌కు భారతదేశంలో విదేశాల్లో పార్ట్‌నర్స్ ఉన్నారు. టెక్నాలజీ, ఫార్మసీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో మంచి నైపుణ్యం ఉంది. రియాల్టీ కంపాస్‌కు ముగ్గురు కో-ఫౌండర్లు.

image


1. నిమేష్ భండారి, సీఈఓ: నిమేష్ ఐఐటీ-ఐఐఎం పూర్వ విద్యార్థి. Paytm.com ద్వారా బస్ టికెట్ల అమ్మకాల్లో తన మార్క్ చూపించాడు. మొబైల్ ఇంటర్నెట్ రంగాల్లో పదేళ్లకు పైగా అనుభవం కూడా ఉంది. Ibibo, Reliance ADAG, TomTom లాంటి కంపెనీలకూ పనిచేశాడు. ప్రస్తుతం నిమేష్ రియాల్టీ కంపాస్ సేల్స్, మార్కెటింగ్ వ్యవహారాలను చూసుకుంటున్నారు.

2.శంకర శ్రీనివాసన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్: శంకర గతంలో CFO, Rupeerail.com లను స్థాపించి సక్సెస్ అయ్యాడు. Infosys, RR Donnelly సంస్థల్లో ఛార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశాడు. స్టార్టప్స్ కు నిధుల సేకరణలో అందరికీ సాయపడుతుంటాడు. ప్రస్తుతం రియాల్టీ కంపాస్ లో రీసెర్చ్ అండ్ ఆపరేషన్స్ వ్యవహారాలను చూస్తున్నారు.

3. అలోక్ మిశ్రా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్: అలోక్ బెంగళూరుకు చెందిన సోషల్ గేమింగ్ కంపెనీ కో-ఫౌండర్. ఎంటర్ ప్రైజెస్ అప్లికేషన్స్ లో ఆరేళ్లకు పైగా అనుభవం ఉంది. మణిపాల్ ఇన్ స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్. రియాల్టీ కంపాస్ లో ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ వ్యవహారాలను చూస్తున్నారు.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొయంబత్తూర్ లాంటి ఏడు ప్రధాన నగరాల్లో రియాల్టీ కంపాస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది వేల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సమాచారం వీరి గుప్పిట్లో ఉంది. మరికొన్ని రోజుల్లో మిగతా నగరాలకు విస్తరించే ప్రణాళికలున్నాయి. 2015 జూన్ లో మొబైల్ యాప్ ని కూడా లాంఛ్ చేశారు. కార్పెట్ ఏరియాకు సంబంధించిన వివరాలను అందించే తొలి ప్రాపర్టీ పోర్టల్ ఇదే కావడం విశేషం.

website