అంబాసిడర్ ను రూ.80 కోట్లకు కొనేసిన ప్యూగోట్  

0

అంబాసిడర్. కింగ్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్. దశాబ్దాలపాటు ఒకవెలుగు వెలిగిన కారు. ఈ బ్రాండ్ ఇప్పుడు యూరోపియన్ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. ఫ్రెంచ్ ఆటోమోబైల్ దిగ్గజం ప్యూగోట్ 80 కోట్లకు అంబాసిడర్ ను కొనేసింది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రం కూడా పూర్తయింది. తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. 700 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఏడాదికి లక్ష కార్లు ప్రొడ్యూస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

50వ దశకం చివరనుంచి నుంచి అంబాసిడర్ కారు రారాజుగా వెలిగింది. బ్రిటిష్ కారు మారిస్ ఆక్స్ ఫర్డ్ త్రీ తర్వాత హిందుస్థాన్ అలాంటి మోడల్ నే తయారుచేసింది. 1958లో మొదటి ప్లాంట్ కోల్ కతాలో స్థాపించింది.

అనతికాలంలోనే అంబాసిడర్ కారు మార్కెట్ ని శాసించింది. దశాబ్దాలపాటు తిరుగులేని కారుగా రోడ్లమీద దౌడు తీసింది. 1980వ దశకం అర్ధభాగంలో ఏడాదికి 24వేల యూనిట్లను అమ్మిందంటే అంబాసిడర్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. బ్యూరోక్రాట్ల నుంచి పోలిటీషియన్లు, బిజినెస్ మేన్లు అందరికీ ప్రియమైన వాహనంగా మారిపోయింది. ఎన్ని మోడల్స్ మార్కెట్లోకి వచ్చినా అంబాసిడర్ ముందు దిగదుడుపుగానే మిగిలాయి.

అయితే టెక్నాలజీ అంబాసిడర్ ని దెబ్బకొట్టింది. హై ఎండ్ కార్ల ముందు నిలవలేకపోయింది. మెల్లిగా దాని ప్రభ మసకబారింది. 2013-14 నాటికి అమ్మకాలు పూర్తిగా క్షీణించాయి. ఆ యేడు 2,200 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆ తర్వాత వేగంగా సేల్స్ పడిపోయాయి. అప్పుడే హిందుస్తాన్ మోటార్స్ ప్లాంట్ షట్ డౌన్ చేయాలని నిర్ణయించుకుంది. చివరి రోజుల్లో రోజుకి ఐదు కార్లను మాత్రమే ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ చేసుకుంది.

ఈ నేపథ్యంలో అంబాసిడర్ ను ఫ్రెంచ్ ఆటోమోబైల్ దిగ్గజం ప్యూగోట్ కొనుగోలు చేసింది. దానికి ఇండియా మార్కెట్ కొత్తేం కాదు. 1993లోనే ప్యూగోట్ 309తో వచ్చింది. అది ప్రీమియర్ ఆటోమోబైల్స్ తో కలిసిన జాయింట్ వెంచర్. కొన్ని కారణాల వల్ల 1997లో వైదలగింది. మళ్లీ 2011లో రీ ఎంట్రీ ఇచ్చింది. గుజారత్ లో ప్లాంట్ పెట్టాలని తీర్మానం చేశారు. కానీ అప్పుడు కూడా సాధ్యం కాలేదు.

ఎట్టకేలకు ఈసారి బ్రాండ్ అంబాసిడర్ కొనేసి గట్టి పట్టుదలతో వచ్చింది ప్యూగోట్. 2018నాటికి ఇండియాలో పాతుకుపోవాలని నిర్ణయించింది.