వచ్చిన లాభంలో 75 శాతం సమాజసేవకే ఖర్చుచేస్తున్న అర్బన్ ఈటరీ  

1

ఊరు మనకు చాలా ఇచ్చింది.. ఎంతోకొంత తిరిగివ్వాలి.. లేకుంటే లావైపోతాం! ఈ మధ్య వచ్చిన ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్. నిజమే ఊరు మనకు ఎంతో ఇచ్చింది. ఆమాటకొస్తే దేశం ఇంకా ఇచ్చింది! కానీ తిరిగి మనమేం ఇస్తున్నాం? ఈ పాయింట్ మీద ప్రశ్నిస్తే ఆన్సర్ దొరకడం కష్టం! తిరుమలగిరికి క్రాస్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసిన అర్బన్ ఈటరీ దగ్గర నిలబడితే చూస్తే సమాధానం ఆటోమేటిగ్గా దొరుకుతుంది.

సొంతలాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్! ఈ మాటంటే వెళ్లువెళ్లవోయ్ అన్నట్టు చూస్తారు! నేను, నా కుటుంబం, నా వ్యాపారం, నా ఉద్యోగం..! ఈ లెక్కల్లో పడి పోయిన వాళ్లకు సమాజ సేవ అనే కాన్సెప్టే ఒంటపట్టదు. ఆత్మహత్య చేసుకున్న రైతు గురించి చెప్తే, అయ్యయ్యో అని నిట్టూర్చి వదిలేస్తారు. ఉగ్రదాడిలో జవాను నేలకొరిగిన వార్త పేపర్లో చూసి, పక్కన పడేస్తారు. తల్లిపాలకోసం తల్లడిల్లే చిన్నారి కష్టం అర్ధం కాదు. నోరులేని మూగజీవి హింసకు గురవుతుంటే పట్టించుకోరు. పర్యావరణం కళ్లముందు సర్వనాశనం అవుతున్నా, నిస్సహాయంగా చూస్తారు. యాభై రూపాయల విరాళానికే, వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఏకంగా వ్యాపారంలో లాభం ఇవ్వమంటే ఇస్తారా? అలా ఇచ్చేవాళ్లు ఉండొచ్చుగాక. కానీ ఎంతమంది? నూటికో కోటికో ఒక్కరుంటారు.

సికింద్రాబాద్ తిరుమలగిరి క్రాస్ రోడ్ నుంచి, బొల్లారం రూట్లో వెళ్తుంటే, బస్టాప్ పక్కన లెఫ్టులో కనిపిస్తుంది అర్బన్ ఈటరీ బేకరీ. రోడ్డుమీద నుంచి చూస్తే, సిటీలోని వేలాది బేకరీల్లో ఇదొకటిలే అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లి, అక్కడి ఐటెమ్స్ తిని, వాళ్ల మోటోని చదివితే తెలుస్తుంది.. ఎంత గొప్ప మనసుతో ఈ బేకరీని ఏర్పాటు చేశారో. వచ్చిన లాభాల్లో 75 శాతం దానధర్మాలే చేస్తారంటే.. వట్టి మాట కాదు. ఎవరైనా వ్యాపారం చేస్తున్నారంటే.. లాభమెంత.. నష్టమెంత.. తర్వాత వెంచర్ ఎక్కడ.. ఇలాంటి లెక్కలే ఉంటాయి. కానీ అర్బన్ ఈటరీ అలా ఎప్పుడూ ఆలోచించదు. ఈసారి లాభం ఏ జవాను కుటుంబానికి ఇవ్వాలి? ఈసారి ప్రాఫిట్ తో ఏ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి? ఏ మూగజీవిని బతికించాలి? పర్యావరణం కోసం ఎంత ఖర్చుపెట్టాలి? ఇదే ఆలోచిస్తారు.

కిరణ్‌, శ్యామ్ అనే ఇద్దరు హైదరాబాదీల గొప్ప ఆలోచన ఇది. ఇద్దరూ అమెరికాలో డాక్టర్లు. జన్మనిచ్చిన దేశానికి ఎంతోకొంత సేవ చేయాలనే ఉద్దేశంతో అర్బన్ ఈటరీ స్థాపించారు. వ్యాపారంలో వచ్చిన లాభంలో, ముప్పావు వంతు దానం చేయడమే దీని మోటో. అలా మొదటి లాభం మంచు చరియలు విరిగిపడి మృతిచెందిన సైనికుడు హనుమంతప్ప కుటుంబానికి ఇచ్చారు. అతని కుటంబ సభ్యులకు రూ.75 వేలు అందించారు. అప్పుడు వారి కళ్లలో కనిపించిన ఆనందం మాటలకందని అనుభూతి. ఇక ఇలాంటి సాయం ఆపొద్దని అప్పుడే నిర్ణయించుకున్నారు. తర్వాత ఉరీ ఉగ్రదాడిలో చనిపోయిన చంద్రకాంత్ గలాండేకి 25వేల రూపాయలు కస్టమర్ చేతుల మీదుగా అందించారు. మహ్మద్ పాషా అనే మరో సైనికుడి కుటుంబానికి 10వేల రూపాయలు ఇప్పించారు.

ఇదే కాకుండా రోజు స్వచ్ఛ్‌ సికింద్రాబాద్ చేపడతారు. కాలేజీ స్టూడెంట్స్ శనిఆదివారాల్లోనో, ఖాళీ సమయాల్లోనూ వచ్చి వీళ్లతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ లో పాలుపంచుకుంటారు. స్వచ్ఛందంగా వచ్చి సర్వీస్ చేసినందుకు బేకరీ నుంచే ఫుడ్ అందిస్తారు. అయితే ఒక్కోసారి ఎగ్జామ్స్ మూలంగా స్టూడెంట్స్ కి టైం దొరకదు. అందుకే శాశ్వతంగా ఇద్దరు ఆయాలను నియమించుకున్నారు. ముగ్గురు మేనేజర్ల సాయంతో రోజూ సికింద్రాబాద్‌ లో ఏదో ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకుని శుభ్రం చేస్తారు. స్టాఫ్, కస్టమర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు బేకరీ బాధ్యతలు చూస్తున్న సరుణ్.

బిజినెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ బిజినెస్‌కి కాకుండా, ఇలా సమాజ సేవకు కేటాయించడం నిజంగా గొప్ప విషయం. ఎంత చేసినా సైనికులు, రైతులు చేసేదాంట్లో మేం చేసేది చాలా తక్కువ అంటారు బేకరీ నిర్వాహకులు. త్వరలో ఇలాంటి అర్బన్ ఈటరీలు దేశమంతా ఏర్పాటు చేసి, సైనికులకు, రైతులకు, అనాథ పిల్లలకు తమవంతు బాధ్యతగా సేవచేయాలనే లక్ష్యంతో వున్నారు. సత్-క్రియ పేరుతో ఒక యాప్ కూడా డిజైన్ చేస్తున్నారు. ఎవరైనా తమతో పాటు కలిసి పనిచేయాలనుకున్నా, తమ వంతు సాయం అందించాలన్నా ఆ యాప్‌ లో డైరెక్ట్‌ గా కాంటాక్ట్ కావొచ్చు.   

Related Stories