ఆ యాక్సిడెంట్ రుచికా జీవితాన్నే మార్చేసింది!

ఆ యాక్సిడెంట్ రుచికా జీవితాన్నే మార్చేసింది!

Wednesday February 10, 2016,

3 min Read

బీయింగ్ ఉమన్ అనే ఓ ఆర్గనైజేషన్ ప్రారంభమై ఏడాదిన్నరైంది. దీని ద్వారా మగువలకు స్వయం ఉపాధి కల్పించడమే కాదు, వారికి ఆర్థిక సాయం అందించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ గా ఈ ఆర్గనైజేషన్ నడవడానికి ఎంతో మంది కారణమైనప్పటికీ, దీన్ని మొదలు పెట్టిన రుచి శర్మ మాత్రం ప్రత్యేకం. దేశ విదేశాల్లో అందాల పోటీల్లో ఎన్నో కిరీటాలు సాధించిన రుచిక- తన జీవితంలోనే చీకట్లో గడిపిన ఆ ఆరునెలల సమయమే ఇప్పుడింత వెలుగులోకి తెచ్చిందంటారు.

image


కుకింగ్ హోస్ట్ గా

తెలుగు టీవీ తెరపై రుచికాను చాలా సార్లు చూసి ఉంటారు. కిచెన్ లో వంట చేస్తూ అందిరినీనవ్వుతూ పలకరించే రుచిక చాలా ఫేమస్. సాఫీగా సాగిపోయిన జీవితం. అప్పటికే ఓ కుకింగ్ ఇనిస్టిట్యూట్. చెఫ్ ట్రెయినింగ్ ఇచ్చేవారు. దాదాపు పది పదిహేనేళ్ల క్రితం మాట ఇది.

“అయితే ఇప్పటికీ ఎవరైనా అడిగితే సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా,” రుచిక

అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడొక సెలబ్రిటీ. అప్పుడు కెరియర్ ఓ స్టార్టప్. టీవీల్లో హెస్ట్ గా చేస్తూ ఉండేవారామె.

image


జీవితాన్ని మార్చేసిన యాక్సిడెంట్

సాఫీగా సాగుతోన్న జీవితంలో ఓ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ తో పూర్తిగా నడవలేని పరిస్థితి. మొఖంపై కూడా దెబ్బలు తగిలి పూర్తిగా అందవికారంగా తయారయ్యారు రుచిక. ఆరు నెలలపాటు మంచానికే పరిమితమయ్యారు.

“ఒంటరితనం అన్నింటి కంటే దౌర్భాగ్యం, ఎవరికీ అలాంటి పరిస్థితి రాకూడదు,” రుచిక శర్మ

ఎటూ కదలకుండా ఒంటరిగా బతకడం ఎంత కష్టమనే విషయం తెలుసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ పరిస్థితి నుంచి ఎంత తొందరగా బయటపడాలని తాపత్రయ పడ్డాను. అయినప్పటికీ ఆరు నెలలు అలాగే గడిపాను. ఆ తర్వాత కూడా ఏదో ఒక రుగ్మత వెంటాడింది.

“జీవితం అక్కడే ఆగిపోయిందనుకున్న క్షణాలు ఎన్నో. ఇంకా ఏమీ సాధించలేనుకున్న క్షణాలు అంతకంటే ఎక్కువ,” రుచిక

కానీ ఏదో ఒక శక్తి నన్ను ఇప్పుడు మీ ముందు మాట్లాడేలా చేసిందని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. నా ఆత్మవిశ్వాసం పెంచడంలో మా అమ్మ సహకారం మరవలేనిది. అప్పటికే నేను టీవీ హోస్ట్ గా చాలా పాపులర్ . చాలా మంది స్నేహితులున్నారు. కానీ అప్పుడే అర్థమైంది సన్నిహితులు కొద్దిమందే అని. నాకోసం వాళ్లున్నందుకు సంతోషిస్తున్నా అంటారామె. మిసెస్ ఇండియాకు అప్లై చేశాను. షార్ట్ లిస్ట్ లో నాపేరు చూసి మురిసిపోయాను. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదంటారు రుచిక.

image


గిన్నిస్ బుక్ రికార్డు

మిసెస్ ఇండియా పాపులర్, మిసెస్ ఇండయా హైదరాబాద్ ఇంటర్నేషనల్, మిసెస్ ఇంటర్నేషనల్ (ఫైనలిస్ట్), మిసెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ ఇలా రెండేళ్లలో మూడు కిరీటాలు అందుకున్న రుచిక హాలీడేస్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు వచ్చిన ఆలోచనే గిన్నీస్ రికార్డు ప్రయత్నం. అప్పటికే యోగా ప్రాక్టీస్ చేసి ఫేసియల్ యోగా లో ఓ మంచి పేరు సంపాదించుకున్నారు. యాక్సిడెంట్ నుంచి తొందరగా బయటకు రావడానికి యోగా కూడా తనకు సాయం చేసిందని చెప్పుకొచ్చారు.

“గిన్నీస్ రికార్డు సాధించడం ఓ సవాలు,” రుచిక

గిన్నీస్ షార్ట్ లిస్ట్ లో తమ అటెమ్ట్ కు పర్మిషన్ వచ్చేసింది. కానీ అటెమ్ట్ చేసిన ముందు రోజు జోరున పడిన వర్షం. ఎంతకీ తగ్గలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాతావరణం సహకరించకపోయినా గిన్నీస్ రికార్డు వచ్చుండేది కాదు. ఉదయం ఎనిమిది గంటల వరకూ వాన ఆగలేదు.

“నా టీం సాయం లేకపోయిఉంటే ఈరోజు ఈ రికార్డు సాధించేదాన్నే కాదు,” రుచిక

అప్పటికే యోగా చేసే స్థలం మొత్తం నీటితో నిండిపోయింది. రాత్రంతా అక్కడే కాపాలా కాశాం. ఉదయం వర్షం ఆగడంతోనే అంతా అక్కడి నీటిని తీసి సిద్ధం చేశాం. మొత్తానికి రికార్డు అటెంప్ట్ చేశాం. సాధించామని చెప్పుకొచ్చారామె.

image


బీయింగ్ విమెన్

మిసెస్ సౌతేషియా ఇంటర్నేషనల్ అనంతరం రుచిక తీసుకున్న ఓ గొప్ప నిర్ణయం బీయింగ్ ఉమెన్ అనే సేవా సంస్థను ప్రారంభించడం.

“మా సంస్థ లో ట్రెయినింగ్ అయిన వాళ్లు చేసిన చాక్లెట్స్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అమ్ముతున్నాం,” రుచిక

ఏ ఉద్దేశంతో మొదలుపెట్టానో దానికి అనుకూలంగా ఫలితాలు రావడం ఆనందంగా ఉందని రుచిక చెబుతున్నారు. మగువలకు తర్ఫీదు ఇచ్చి, వారిచే పరిశ్రమని నెలకొల్పాలనేది మా సంస్థ ఆశయం. ఎంతమంది వీలైతే అంతమందికి ఈ రకమైన సాయం అందిస్తాం. ఆడవాళ్లకు ఆర్థిక స్వావలంభన వచ్చినప్పడే వారు మరికొన్ని అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుందని రుచిక చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ బీయింగ్ ఉమెన్ సంస్థ వేల మందికి శిక్షణ ఇచ్చింది. చాలామంది చాలారకాలుగా స్థిరపడ్డారు. సమాజంలో మార్పు తీసుకు రావడానికి ఇది మొదటి మెట్టు మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆమె అంటున్నారు.

సవాళ్లే జీవితం.. వెనకడుగు వేయొద్దు

ఆంట్రప్రెన్యువర్ గా ఇప్పటికీ చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు చెప్పుకొచ్చారు రుచిక.

“ఐఎస్బీలో చాలా విషయాలు నేర్చుకున్నా,” రుచిక

వాస్తవానికి వ్యాపార వేత్తగా తాను ఫెయిల్ అయ్యానని అంటారామె. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చేరి కొన్ని వ్యాపార సూత్రాలను నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. జీవితంలో ఏ పనిచేసినా దాన్ని సవాలుగా తీసుకుంటానని అంటున్నారు.

“ఆడవారిగా పుట్టినందుకు గర్వపడండి, మీ కలలను సాకారం చేసుకోండి, ఫాలో యువర్ డ్రీమ్ అని రుచిక ముగించారు.”