త్వరలో టీఎస్‌-వ్యాలెట్‌ ప్రవేశపెడతాం.. !

వందశాతం నగదు రహిత తెలంగాణ కావాలని కేసీఆర్ పిలుపు

త్వరలో టీఎస్‌-వ్యాలెట్‌ ప్రవేశపెడతాం.. !

Tuesday November 29, 2016,

4 min Read

వందశాతం ఆన్ లైన్ లావాదేవీలకోసం త్వరలోనే టీఎస్‌ వాలెట్‌ ప్రవేశపెడుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఐటీ శాఖ ఆధ్వరంలో దానికి సంబంధించిన యాప్ పూర్తి కావొచ్చిందని తెలిపారు. మీడియా తనవంతు బాధ్యతగా టీఎస్-వాలెట్‌ మీద విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ఎంత తొందరగా బ్యాంక్ నుంచే లావాదేవీలు మొదలుపెడితే అంత తొందరగా నగదు సమస్య నుంచి బయటపడతామన్నారు.

కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానితో గంటకుపైగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వాటి వాటి పరిష్కార మార్గాలను ప్రధానితో చర్చించారు. గంటకు పైగా జరిగిన ఆ సమావేశంలో కేసీఆర్ గత అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం నగదు రహిత లావాదేవీలపై జనంలో ఎలాంటి అవగాహన కల్పించాలి.. ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ కావాలి అనే అంశంపై సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

మొదటగా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని క్యాష్‌లెస్‌ నియోజకవర్గంగా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. సిద్ధిపేట అనుభవంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను క్యాష్‌లెస్‌గా మారుస్తామన్నారు. గుజరాత్‌లోని అకోదరా గ్రామం వందశాతం డిజిటల్ విలేజ్‌గా మారిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రూ.500 పైబడిన లావాదేవీలను నగదు రహితంగా జరిగేలా చూస్తామన్నారు. అందుకే రూ.500 నోట్లను ఎక్కువగా రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరినట్టు కేసీఆర్ తెలిపారు. కొత్తగా ఏటీఎం వచ్చినప్పుడు కూడా ఇలాగే అనుమానపడ్డామని, తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. ఆసరా పెన్షన్ల చెల్లింపులో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

image


బ్యాంకుల ద్వారానే కొనుగోళ్లు, అమ్మకాలు జరగాలని కేసీఆర్ అన్నారు. బ్యాంకుల ద్వారా ట్రాన్జాక్షన్‌ చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు. కేంద్రం నిర్ణయంపై రాష్ట్రాలు ప్రేక్షకపాత్ర వహించడం సమంజసం కాదని సీఎం అభిప్రాయ పడ్డారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో స్వైపింగ్‌ మెషీన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాయింట్‌ ఆఫ్‌ సేల్, మార్కెట్ల దగ్గర స్వైపింగ్ యంత్రం పెట్టాలని కోరారు. అకౌంట్లు ఉన్న ప్రతీ ఒక్కరు బ్యాంకు ద్వారానే లావాదేవీలు జరిపేలా చేయాలని, అకౌంట్లు లేనివారికి అకౌంట్లు తెరిపించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో సమస్యల్ని అధిగమించేందుకు టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశామనీ, అలాగే త్వరలోనే జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేసి జిల్లా స్థాయిల్లోనూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అధిగమించేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 5,200 బ్రాంచీలు మాత్రమే ఉన్నాయి. అందుకే ప్రతీ 1,000-1,500 జనాభా ఉన్న గ్రామంలో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ అన్నారు. దేశంలో ఉన్న ఏటీఎంలు 14.5 లక్షలు మాత్రమే అని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో 85 వేల నుంచి లక్ష స్వైపింగ్‌ మిషన్లు ఉన్నాయన్నారు. నగదురహిత లావాదేవీల కోసం దేశంలో పది కోట్ల స్వైపింగ్‌ మిషన్లు అవసరపడతాయని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా నోట్ల రద్దు ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్రంగా పడిందని సీఎం అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్‌ చాలా పెద్దది కాబట్టి కొంతమేర స్తంభించిపోయే అవకాశం ఉందన్నారు. నగరంలో భవన నిర్మాణ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు కాబట్టి .. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూలీలు ఉపాధి కోల్పోకుండా ఉండటం కోసం.. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించినట్టు కేసీఆర్ తెలిపారు.

కేంద్ర నిర్ణయాన్ని అమలు చేసుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.5 భోజన కేంద్రాలు 150కి పెంచుతామని తెలిపారు. ఆధార్‌ కార్డు డేటా బేస్‌ను రాష్ట్రాలకు అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన వెల్లడించారు. ఐదారురోజుల్లో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

image


దేశవ్యాప్తంగా 25 కోట్ల జన్‌ ధన్‌ ఖాతాలను తెస్తే.. మన రాష్ట్రంలో అవి 85 లక్షల అకౌంట్లు ఉన్నాయని సీఎం తెలిపారు. ఇండియా ఎకానమీ బలం రూ.140 లక్షల కోట్లుంటుందన్న కేసీఆర్ అందులో 12 శాతం మాత్రమే నగదు ఉందన్నారు. నోట్ల రద్దునాటికి తెలంగాణలో 75 వేల కోట్ల నగదు చెలామణీలో ఉందని.. రద్దు తర్వాత బ్యాంకుల్లో 32 వేల కోట్లు డిపాజిట్ అయిందని.. గత 20 రోజులుగా రూ.12 నుంచి 13కోట్ల నగదు జనం చేతిలోకి వెళ్లిందని చెప్పారు.

పెద్ద నోట్ల రద్దుతో అన్ని రాష్ట్రాల ఆదాయం పడిపోయిందన్న మాట వాస్తవమే అని సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. నల్ల కుబేరులను పట్టుకోవాలంటే కొన్ని వ్యూహాలుంటాయి.. అవి అందరికీ అర్థం కావన్నారు. నోట్ల రద్దు అనేది ఒక వ్యూహం.. ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అవుతుందని అభిప్రాయ పడ్డారు. ఒకవేళ మోడీ తీసుకున్న నిర్ణయం తప్పయితే ప్రజలే తీర్పు చెప్తారని అన్నారు. అంతేకానీ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం మంచిది కాదని చెప్పారు. దేశంలో ఒక శాతం మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారని.. ఈ నిర్ణయంతో భవిష్యత్‌లో జీఎస్‌టీ, బ్యాంక్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్సులు మాత్రమే ఉంటాయని అన్నారు. మున్ముందు తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే ఆదాయం ఐదు రెట్లు పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇంతకు ముందు నోట్ల రద్దు నిర్ణయంపై అడుగుపడలేదు.. ఇప్పుడు పడింది.. కాబట్టి పాజిటివ్‌గా ముందుకు పోదాం అని సీఎం పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలన్నీ బ్యాంకుల ద్వారా జరగాలని.. ఎన్నికల్లో ప్రచార సరళి కూడా మారాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తల్లి నుంచి కూతుళ్లకు సంక్రమించే గోల్డ్, తరతరాలుగా పూజగదిలో ఉండే బంగారు వెండి ఆభరణాల విషయంలో లెక్క చెప్పమంటే కష్టమవుతుందని.. ఇదే విషయం ప్రధాని మోడీకి చెప్పానని అన్నారు. దాన్ని బ్లాక్ మనీ కింద జమకట్టలేమని పీఎంకు చెప్పినట్టు తెలిపారు.

దేశం అవినీతి రహిత, నల్లధన రహిత దేశంగా రూపాంతరం చెందాలని సీఎం ఆకాంక్షించారు. మోడీ నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం సమజంసం కాదన్న కేసీఆర్.. గుడ్డిగా సమర్ధించడం కూడా సరికాదన్నారు. లోటుపాట్లను, జనం ఈతిబాధల్ని సూచిస్తూ, వాటికోసం నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. ఒక గొప్ప సంస్కరణ చేపట్టినప్పుడు కచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనమీద ఉందన్నారు. అవినీతి, బ్లాక్‌మనీ లేని దేశంకంటే గొప్పదేశం మరొకటి లేదని అన్నారు. అందుకోసం తెలంగాణ రాష్ట్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు సీఎం కేసీఆర్.

రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల నిర్వహణను ప్రోత్సహించేందుకు, ఈ – పేమెంట్స్ వ్యవస్థను పెంపొందించేందుకు అవసరమైన విధానం రూపొందించడానికి ఆదివారం అయిదుగురు సభ్యులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. సీనియర్ ఐఎఎస్ అధికారులు సురేష్ చంద్ర, శాంతికుమారి, నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ కమిటీలో వున్నారు.