ఈ ఆటోడ్రైవర్ గురించి తెలుసుకుంటే గ్రేట్ అని చప్పట్లు కొడతారు..!! 

4


జన్రల్ గా ఆటో డ్రైవర్ అనగానే పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తాడు. సీటు మీద నిర్లక్ష్యంగా పడేసిన మురికి ఖాకీ చొక్కా.. పీక్కుపోయిన మొహం.. తైలసంస్కారం లేని జుట్టు.. ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడే కళ్లు. 90 శాతం ఆటోడ్రైవర్ల బాడీ, బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. కానీ ఆ ఆటోడ్రైవర్ అందరిలా కాదు. అతని రూటే సెపరేటు. తెలుసుకుంటే శెభాష్ అని అభినందిస్తారు. చదివాక గ్రేట్ అని చప్పట్లు కొడతారు. మరి ఇంకెందుకు లేటు..

పేరు అన్నాదురై. సొంతూరు చెన్నయ్. 32 ఏళ్లుంటాయి. ఒక షేరింగ్ ఆటో ఉంది. తిరువన్మియ్యూరు టు షోలింగనళ్లూరు రూట్లో తిరుగుతుంటాడు. ఇతని ఆటో అందరిలాంటి బండి కాదు. ఫెసిలిటీస్ చూస్తే దిమ్మదిరిగిపోతుంది. ఫ్రీ వై-ఫై, మొబైల్ చార్జింగ్ పోర్ట్, ఓ 40దాకా మేగజిన్లు, ఒక 10 వార్తా పత్రికలు, ఇవి కాక ఒక టీవీ, లాప్ టాప్, టాబ్ ఉంటాయి. ఎక్కిన ప్రతీ ఒక్కరూ.. అన్నాదురై ఆటో అమేజింగ్ ఆటో అంటారు.

అన్నాదురై తంజావూరు అనే చిన్న టౌన్ లో పుట్టి పెరిగాడు. అతనికి నాలుగేళ్ల వయసప్పుడే అమ్మానాన్న చెన్నయ్ కి షిఫ్టయ్యారు. హై స్కూల్ వరకే చదివాడు. ఆ తర్వాత బతుకుదెరువు కోసం ఆటోని నమ్ముకున్నాడు. ఏడేళ్లుగా బండి నడుపుతున్నాడు.

ఒక ఆటోలో ఇన్నేసి సౌకర్యాలు ఎందుకూ అంటే సన్నగా నవ్వుతాడు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే.. ఏమో తెలియదని తల గోక్కుంటాడు. ఇవి ఇంకా సరిపోవేమో అన్నట్టుగా చూస్తాడు. ఫైనల్ గా ఒక్క జవాబు మాత్రం చెప్తాడు.. ఏం చేసినా కస్టమర్ల సంతోషం కోసమే అని..

అతిథి దేవో భవ.. అన్నాదురై నమ్మిన సిద్ధాంతం ఇది. అందరి దగ్గరా డబ్బులు తీసుకుంటాడు కానీ, ఉపాధ్యాయుల దగ్గర మాత్రం పైసా ముట్టుకోడు. ఎందుకంటే- ఈ దేశంలో డాక్టర్లయినా, ఇంజినీర్లయినా, చివరికి ప్రెసిడెంటయినా- గురువు అనేవాడు పాఠాలు చెప్తేనే కదా అంతటివారయ్యేది.. అందుకే వారి దగ్గర డబ్బులు తీసుకోకుండా గౌరవిస్తాను అంటాడు. అతని లాజిక్ లో గొప్ప సంస్కారం ఉంది కదా. 

అన్నట్టు మర్చిపోయాం.. మనోడిలో ఇంకో మంచితనం కూడా వుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులను, మదర్స్ డే నాడు చంటిపిల్లల తల్లులను, ఫాదర్స్ డే రోజున నాన్నలను, చిల్డ్రన్స్ డే పురస్కరించుకుని స్కూల్ పిల్లలను తన ఆటోలో ఫ్రీగా తీసుకెళ్తాడు.

అమేజింగ్ ఆటో.ఇన్ అనే వెబ్ సైట్ కూడా నడుపుతున్నాడు. దాంతోపాటు మొబైల్ యాప్ కూడా వుంది. ఫేస్ బుక్ పేజీ కూడా క్రియేట్ చేశాడు. దానికి ఒక పదివేల మంది ఫాలోయర్స్ కూడా ఉన్నారు. మోటివేట్ చేసే స్పీచ్ లు ఇవ్వడంలో అన్నాదురై దిట్ట. అందుకే చాలామంది సభల్లో, సమావేశాల్లో అతణ్ని గెస్టుగా పిలుస్తుంటారు. రెండుసార్లు టీఈడీ టాక్స్ (technology, entertainment, design) కూడా ఇచ్చాడు. ఒక ట్రస్ట్ కూడా నడుపుతున్నాడట.

ఏం చేసినా.. ఎన్ని చేసినా.. ఆటోవాలాల బతుకుల్లో మార్పు తేవాలన్నదే మనోడి జీవిత లక్ష్యం. దశాబ్దాలుగా వారి అణగారిన జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని జీవితాశయంగా పెట్టుకున్నాడు. అతడి ఆశయాన్ని మనమూ గౌరవిద్దాం.. అతని లక్ష్యం నెరవేరాలని కూడా మనసారా కోరుకుందాం.. జయహో అన్నాదురై..

Related Stories

Stories by team ys telugu