క్యాబ్ బుక్ చేసుకున్నంత ఈజీగా ప్రైవేట్ జెట్ బుకింగ్..

క్యాబ్ బుక్ చేసుకున్నంత ఈజీగా ప్రైవేట్ జెట్ బుకింగ్..

Saturday January 14, 2017,

3 min Read

ఈమధ్య వచ్చిన ఓలా, ఉబర్ లాంటి క్యాబ్ అగ్రిగేటర్లు, జూమ్ కార్ లాంటి సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్స్.. అనుకున్నంత గొప్ప సర్వీస్ ఇవ్వడం లేదు. సగటు ప్రయాణికుడికి తమ లక్ష్యాన్ని సేల్ చేస్తున్నారంతే. బుకింగ్ ఇంటర్ఫేస్ అంతా అతుకుల బొంత. ఈ లోపాన్ని సరిచేస్తే గానీ సర్వీస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు. సరే, ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తుఫానులా దూసుకొచ్చిన టెక్నాలజీ, స్టార్టప్ ప్రభంజనం వెరసి ప్రైవేట్ జెట్, చార్టర్ ఫ్లయిట్స్ బుకింగ్ కూడా క్యాబ్ బుకింగ్ మల్లే ఈజీ అయింది.

మొదటితరం సీరియల్ ఆంట్రప్రెన్యూర్ అయిన రాజీవ్.. బుక్ మై చార్టర్స్ సీఈవో కమ్ ఛైర్మన్. బారాన్ ఏవియేషన్ పెట్టకముందు నుంచే ఏవియేషన్ రంగంలో సక్సెస్ ఫుల్ మెంటార్. ఐటీ, టెలికం సెక్టార్లలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. సొంత కంపెనీ స్థాపించడానికి ముందు యూరోపియ్ ఏవియేషన్ సంస్థకు ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2011లో బారాన్ ఏవియేష్ స్థాపించి ఉద్యోగి నుంచి యజమాని అయ్యాడు.

ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఏవియేషన్ మార్కెట్ ముక్కలు ముక్కలుగా ఉంది. సమయానికి మంచి ఎయిర్ క్రాఫ్ట్ దొరకడం పెద్ద సవాల్. కొటక్ లాంటి వెల్త్ మేనేజ్ మెంట్ సంస్థలు చెప్తున్నదాని ప్రకారం- దేశంలో ఉన్న నాన్ మెట్రో సిటీల్లో చార్టర్ మార్కెట్ కు సరైన గుర్తింపే లేదు. సరిగ్గా ఈ పాయింట్ ని క్యాష్ చేసుకోడానికే బారాన్ ఏవియేషన్ సంస్థను స్థాపించారు తండ్రీకొడుకులు.

image


కమర్షియల్ ఫ్లయిట్ బుక్ చేసుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు. డజన్ల కొద్దీ విమానాలు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. కానీ ఎటొచ్చీ చార్టర్ ఫ్లయిట్ బుక్ చేసుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఒక్కోసారి బుక్ చేయడానికి రెండురోజులు పట్టేది. అది కూడా లిమిటెడ్ ఛాయిస్. అంతా బ్రోకర్ కనుసన్నల్లో నడిచేది. వాళ్లు చెప్పిందే వేదం. కస్టమర్ కంపార్ చేసుకోడానికి ఆప్షన్ లేదు. ఈ తతంగం పూర్తయ్యేసరికి బోలెడంత టైం వేస్ట్, మనీ వేస్ట్.

రెగ్యులర్ ఎయిర్ టికెట్ కొన్నంత ఈజీగా చార్టర్ ఫ్లయిట్ ఎందుకు బుక్ చేసుకోలేం? అంటే దీనికి ఎన్నో టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఏవియేషన్ రంగంలో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమే సరిగా లేదు. ప్రైవేట్ చార్టర్ బుకింగ్ కోసం ఒక పర్టిక్యులర్ ప్లాట్ ఫామే లేదు.

ఈ లోపాలన్నీ సరిదిద్ది, చార్టర్ బుకింగ్ ను సులభతరం చేయడానికే బారాన్ ఏవియేషన్ స్థాపించారు తండ్రీ కొడుకులు. టెక్నికల్ సమస్యలను అధిగమించడానికి మూడేళ్లు పట్టింది. ఇంకా పేటెంట్ పెండింగ్ లోనే ఉంది. ప్రస్తుతానికి బుక్ మై చార్టర్ దేశవ్యాప్తంగా 22వేల రూట్లలో 40కి పైగా ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసులను అందిస్తున్నారు. 16 ఆపరేటర్లతో ఏషియాలోనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అగ్రిగేటర్ గా నిలిచింది బుక్ మై చార్టర్స్. సొంత ప్రాపర్టీ టెక్నాలజీతో సుపీరియర్ బుకింగ్ ఇంజిన్ బిల్డప్ చేసి ఫ్లయిట్ అవైలబులిటీ, ఫీజిబులిటీని పారదర్శకం చేసింది. అంతా ఆన్ లైన్లోనే కస్టమర్ కు సమాచారం అందిస్తుంది. అంతా కలిపి ఒక నిమిషం కూడ పట్టదు జెట్ బుక్ చేసుకోడానికి.

దేశవ్యాప్తంగా 149 ఎయిర్ పోర్టులతో బారాన్ ఏవియేషన్ ఒప్పందాలున్నాయి. ఇతర కమర్షియల్ సర్వీసులు 33 ఎయిర్ పోర్టులతోనే సరిపుచ్చాయి. అదీగాక అవసరాన్ని బట్టి, ఎంపిక చేసుకున్న రూటుని బట్టి, 60 నుంచి 80 డిస్కౌంట్ కూడా ఇస్తారు.

కంపెనీని టాప్ ప్లేస్ లో నిలబెట్టడానికి ఎన్నో సవాళ్లు అధిగమించారు తండ్రీ కొడుకులు. ఎందుకంటే ఈ తరహా వ్యాపారంలో వీళ్లే మొదలు కాదు. ఎంతోమంది ఈ రంగంలో తలపండిన వాళ్లున్నారు. అయితే వీరికి ఉన్న గత అనుభవమే సవాళ్లను గెలిచేలా చేసింది. మఖ్యంగా టయర్-2 సిటీల్లో పైచేయి సాధించారు. ప్రముఖ హోటళ్లతో, బ్యాంకులతో వ్యూహాత్మక ఒప్పందాలతో- మార్కెట్ ను ప్రభావితం చేయగలిగారు. ఆరుగురికి కలిపి రూ. 30వేలల్లో ఒక చార్టర్ ఇప్పించగలుగుతారు. అలాంటి వంద విమానాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

బుక్ మై చార్టర్స్ ద్వారా నెలకు సగటున 30 విమానాలు బుక్ అవుతున్నాయి. 10 లక్షల దాకా కొటేషన్లు జెనరేట్ అవుతున్నాయి. నెలకు 50వేల మంది యూజర్లు కనెక్టవుతున్నారు. ఇప్పటికైతే కంపెనీకి బయట నుంచి ఇన్వెస్టర్లు లేరు. ప్రి సిరీస్ ఏ ఫండ్ కోసం చూస్తున్నారు. అది ఓకే అయితే సంస్థను అంతర్జాతీయంగా విస్తరించాలనేది ప్లాన్. యూరప్, ఆఫ్రికా దేశాల్లో సర్వీసులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తండ్రీకొడుకులు.

బుక్ మై చార్టర్స్ కు పోటీగా మరో ప్లాట్ ఫాం ఉంది. క్రికెటర్ యువరాజ్ సింగ్ (యువీ వెంచర్స్) ఫండింగ్ చేసిన జెట్ సెట్ గో దీనికి ప్రధాన కాంపిటీటర్. కాకపోతే దీనికి ఇన్ స్టంట్ బుకింగ్ సిస్టమ్ లేదు.

ప్రస్తుతానికి ఇండియాలో చార్టర్ మార్కెట్ విలువ రూ. 1800 కోట్లు. 2020 నాటికి అది రూ. 5వేల కోట్లు అయ్యే అవకాశం ఉందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇక గ్లోబల్ విషయానికొస్తే 20 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కెట్ ఉంది. అయినప్పటికీ ఆన్ లైన్ బుకింగ్ సర్వీసు ఇంకా నవజాత శిశువే.