మద్యం సామ్రాజ్యంలో మహిళా విజయం

ఊహించని వ్యాపారంలో అడుగులు..3 ఏళ్లలో 100 కోట్ల టర్నోవర్, 5000 ఔట్ లెట్లే లక్ష్యం..

మద్యం సామ్రాజ్యంలో మహిళా విజయం

Thursday April 02, 2015,

4 min Read

మహిళా వ్యాపారవేత్తలుగా బయటకు రావాలనుకుంటున్నారా ! పాత చింతకాయ పచ్చడి లాంటి ఆలోచనలను వదలండి.. వాటికే అంటిపెట్టుకుని ఉండకండి. కొత్త పంథాలో ఆలోచించండి౎ అని ప్రోత్సహిస్తున్నారు 'ఐ బ్రాండ్స్ బేవరేజెస్‌ లిమిటెడ్‌' చైర్మన్‌, మేనేజింగ్‌ డైరైక్టర్‌ లిసా శ్రావ్‌. ఎందుకంటే ఎవరూ ఊహించని లిక్కర్‌ రంగంలో ఆమె నభూతో నభవిష్యత్తు అనే రీతిలో వెలిగిపోతున్నారు. పురుషాధిక్యం ఎక్కువగా ఉండే మద్యం రంగాన్ని ఎంచుకోవడంలోనే ఆమెకు ఉన్న అభిరుచి, నూతనత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 2010 ఆగస్టులో ఐ బ్రాండ్స్ బేవరేజెస్‌ను ఆమె నెలకొల్పింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో మనదేశ ప్రజలకూ లిక్కర్ అందించాలన్న లక్ష్యంతో ఈ సంస్థలను ఆమె స్థాపించారు. బ్లెండ్‌, డిజైన్‌, వినియోగదారులు చెల్లించే ధరలకు సరిపడా క్వాలిటి ఉండే సరుకును అందించడమే ఆమె లక్ష్యం. ఆ కంపెనీ ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు వద్దన్న వారు, నవ్వుకున్న వారు, ఈ రంగంలో బతికి బట్టకట్టలేదు అనే వారే ఎక్కువ శాతం ఉన్నారు. ఈ నేపధ్యంలో ఐ బ్రాండ్స్ ఏర్పాటు వెనుక కష్టం, ఆలోచన మొదలైన విషయాల గురించి లిసా చెప్పిన ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే..

image


'' నా తల్లిదండ్రులు పంజాబ్‌ వాళ్లు. నేను పుట్టి పెరిగింది యూకెలో. నివాసం లండన్‌లో. మెరైన్‌ బయాలజిస్ట్ అవ్వాలన్నది నా చిన్ననాటి కల. కానీ షార్కులు గుర్తుకు వచ్చి దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాను. అసలు బయాలజీ సబ్జెక్టునే పక్కన పెట్టాను. వేరే మార్గంలో వెళ్లాను. ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌, కన్స్యూమర్ బిహేవియర్‌ ప్రత్యేకాంశాలుగా మేనేజీరియల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ స్టడీస్‌లో బీఎస్సీ( ఆనర్స్) డిగ్రీని బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్‌ యూనివర్శిటీ నుంచి పూర్తి చేశాను. నిత్యనూతనమైన మీడియా రంగంలో ప్రవేశించాను. యూకేలోని పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో పనిచేశాను. వయాకామ్‌, వివేంది యూనివర్శల్‌, న్యూస్‌ కార్పొరేషన్‌ వంటి మొదలైన సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించాను

భారత్‌కు తరచుగా వస్తుండే దానిని. 2003లో నాకు పెళ్లయింది. మాకు సంతానం ఇద్దరు. ఇసాబెల్లా, మార్కస్‌. సంతానానికి ముందే నాకు ఈ లిక్కర్‌ వ్యాపారం చేయాలన్న కొత్త ఆలోచన వచ్చింది. మన దేశంలో ప్రీమియం లిక్కర్‌ సెగ్మెంట్‌కు ఉన్న మార్కెట్‌ చాలా తక్కువ. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ రంగంలోకి దిగాను. 15 ఏళ్ల క్రితం యూకేలో డబుల్‌ డచ్‌ బీర్‌ బ్రాండ్‌ ఉండేది. అది మా నాన్న స్థాపించిన సంస్థ ఉత్పత్తే. బేవరేజెస్‌ గురించి కొంత అవగాహన నాకూ అప్పటి నుంచే కొద్దోగొప్పో ఉండేది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా భారత్‌లో మద్యం ఉత్పత్తుల్లో పలు రకాలు అందుబాటులో లేవు. ఈ లోటును భర్తీ చేయాలన్న లక్ష్యమే ఐ బ్రాండ్‌‌స బేవరెజెస్‌ది. రెండేళ్ల శ్రమ అనంతరం భారత్‌లో మా ఉత్పత్తులు ప్రారంభించాము. మా మొట్టమొదటి ఉత్పత్తి గ్రాంటన్‌ విస్కీ. చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్త బేవరేజెస్‌లో మాది కూడా ఉంది. అంతేకాదు అవార్డులు సొంతం చేసుకున్న కంపెనీ కూడా ఇది. మేము అద్భుతమైన నాలుగు ప్రొడక్టులను ఉత్పత్తి చేస్తున్నాము. ప్రీమియం విస్కీ బ్రాండ్‌, త్రీ రాయల్స్, డీలక్స్ విస్కీ, గ్రాంటన్‌ విస్కీ. గ్రాంటన్‌ ప్యాకేజ్‌కు గాను 2014 ఐఎన్‌డీ స్పిరిట్‌ అవార్డు లభించింది. జమైకన్‌ ఫ్లేవర్డ్ డార్క్ రమ్‌, రమ్‌ 99, అరుదైన ఫ్రెంచ్‌ బ్రాందీ, గ్రాంటన్‌ ఎక్స్ఓ బ్రాందీలు కూడా మా ఉత్పత్తులే అని చెప్పడానికి గర్వంగా ఉంది. 

image


లిక్కర్‌ ఉత్పత్తి రంగంలో పూర్తిగా మునిగిపోవాలనుకోవడం లేదు. లిక్కర్‌ రంగంలో వ్యాపారమనేది కత్తిమీద సాములాంటిది. అదీ కాక పురుషు పుంగవులు డామినేషన్‌ ఎక్కువుగా ఉండే ఈ వ్యాపారంలో ఒక మహిళగా నిలదొక్కుకుని, ఎదగడాన్ని సవాల్‌గా తీసుకుంటాను. బేవరేజేస్‌కు సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తుంటాను. మాన్యుఫాక్యరింగ్‌, సేల్స్, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, ప్రొడక్ట్ డిజైన్‌, ప్యాకేజింగ్‌ ఇలా ప్రతీ దానిపైనే నాకు అవగాన ఉంది. జాతీయ, అంతర్జాతీయ సలహాదారుల బోర్డు ఒకటి నాకు ఉంది. మేలి రకపు ఉత్పత్తులకు వీరి సలహాలు చాలా దోహదపడతాయి. మా ఉత్పత్తుల ధరకు తగ్గట్టుగానే వాటి నాణ్యత ఉంటుంది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మాది చిన్న కంపెనీయే. కానీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐ బ్రాండ్‌ ఉత్పత్తులు నార్త్ లో పంజాబ్‌, హర్యానా, చండీఘడ్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సౌత్‌లో గోవా, పాండిచ్చేరిలో మొత్తం కలిపి 5000 చోట్ల మా ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. మొట్టమొదటి సారిగా పారామిలిటరీ ఆర్డర్లు కూడా మాకు దక్కాయి. మా ఉత్పత్తులకు ముఖ్యంగా గ్రాంటన్‌ విస్కీకి విపరీతమైన మార్కెట్‌ ఉంది. ఢిల్లీ, రాజస్థాన్‌, త్రిపుర, మేఘాలయతో పాటు నార్తర్న్ ఇండియాలో ఐ బ్రాండ్‌ ఉత్పత్తులను క్రమంగా ప్రవేశపెడతాము. వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, పశ్చిమబెంగాల్‌, అండమాన్‌, నికోబార్‌లలోనూ మా ఉత్పత్తులు లభిస్తాయి. 

వచ్చే మూడేళ్లలో రూ. 100 కోట్ల మార్కెట్‌ చేయాలన్నది లక్ష్యం. దేశంలోని 5 అత్యుత్తమ లిక్కర్‌ కంపెనీలలో ఐ బ్రాండ్స్ కు స్థానం దక్కేందుకు అహర్నిశలు కృషి చేస్తాము. మరో ముఖ్య విషయం గురించి చెప్పాలి. ఐ బ్రాండ్స్ స్థాపనకు, ఎదుగుదలకు ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. ఈవిషయంలో నాకు స్ఫూర్తిగా నిలిచి నావెన్నంటే ఉన్న నా తండ్రి, భƒర్త, స్టీవ్‌ జాబ్స్ ను మర్చిపోలేను. మా ఇంట్లో మగపిల్లలు లేరు. మేమిద్దరం ఆడపిల్లలమే. అందుకని నన్ను ఒక మగపిల్లవాడిని పెంచినట్లు పెంచారు. అవి ఇంటి పనులు లేదా బయటి పనులు కావచ్చు వాటి బాధ్యత నాపై ఉండేది. ఆ విధంగా నేను పెరిగాను. నాకున్న శక్తి మా నాన్నే. ఐ బ్రాండ్స్ మీటింగ్‌లకు, డిస్ట్రిబ్యూటర్లను కలిసేటప్పుడు నాకు తోడుగా, రక్షణగా నా భర్త ప్రతిసారీ వచ్చేవారు. మేము పడ్డ శ్రమకు ఫలితం దక్కింది. కేవలం మూడేళ్లలో రెట్టింపు టర్నోవర్‌కు చేరుకున్నాము. మా కంపెనీ ప్రారంభించిన నాలుగేళ్లకు ప్రెస్టీజియస్‌ 'లిక్కర్‌ అవార్డు ఫర్‌ ది బెస్ట్ స్టార్టప్‌' కంపెనీ అవార్డు, స్పిరిట్స్ 2014 అవార్డు, ది ఇండ్‌ స్పిరిట్‌ 2014 ఎక్సలెన్స్ ఇన్‌ ప్యాకేజింగ్‌ అవార్డు, ఫ్రాంచైజ్‌ ఇండియా 2014 వంటి నాలుగు అవార్డులు సొంతం చేసుకున్నాము. మా టీమ్‌, నేను పడ్డ కష్టానికి, అంకితభావానికి ఫలితం ఈ అవార్డులు. ఐ బ్రాండ్‌ ఉత్పత్తులు కావాలంటూ డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారు. మొదట్లో నన్ను ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్‌లు జరిగేటప్పుడు యువకుడైన నా మేనేజర్‌తో మాట్లాడేవారే తప్పా నాతో మాట్లాడేవారే కాదు. ఆ పద్ధతి క్రమంగా మారింది'' అని లిసా ఇప్పుడు గర్వంగా చెప్తారు. ఒక మహిళగా మీ జీవితం కష్టమైందా, సుఖమైందా అని అడిగితే.. ఆ కోణంలో నా జీవితాన్ని చూడట్లేదు. 21వ శతాబ్దపు మహిళగా నా అవకాశాలకు హద్దు లేదని ఆమె సమాధానం చెప్పారు. రోజంతా కష్టపడ్డా, నా కుటుంబంతో ఉదయం పూట గడిపే సమయం చాలా ఆనందాన్ని ఇస్తుందని లిసా అంటారు. 


అవార్డ్ తో గర్వంగా లిసా

అవార్డ్ తో గర్వంగా లిసా


కాలం చెల్లిన సాంప్రదాయాలకు లోబడి ఉండద్దు, మీ వ్యాపారంపై పూర్తి శ్రద్ధ పెట్టండి, మీలో దాగి ఉన్న శక్తి ఏంటో తెలుసుకోండి, ధృడమైన భావాలతో, ధైర్యంగా జీవించండి 

అని మహిళా వ్యాపారవేత్తలకు ఆమె సూచిస్తారు. స్పష్టమైన ఆలోచనా విధానం, లక్ష్యాలను ఏర్పరచుకోవడం, తమపై తమకు విశ్వాసం పెంపొందించుకోవడం ద్వారా ప్రతి మహిళ తాను అనుకున్నది సాధించవచ్చని లిసా ఘంటాపథంగా చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్‌ సూక్తిని ఆమె ప్రస్తావించారు. ' ఒక గుంపును అనుసరించే మహిళ ఆ గుంపులో చేరుతుంది లేదా దానికి కొంత దూరంలోనైనా ఉంటుంది. అదే తనంత తానుగా వెళ్లే మహిళ ఇంతకు ముందు ఎవ్వరూ చూడని కొత్త చోటును తనంత తానుగా వెతుక్కుంటుంది'౎ అన్నది ఆ సూక్తి సారాంశం. కొన్నేళ్లుగా ఈ సూక్తి నా నరనరాన జీర్ణించుకుపోయిందని లిసా ఆనందంగా చెప్పారు.