పాత కళ్లద్దాలు పారేయకుండా ఈ పిల్లకు ఇవ్వండి

17 ఏళ్ల వయస్సులోనే అత్యద్భుత సామాజి ఆలోచనవేల మంది దృష్టిలోపం ఉన్నవాళ్లకు వరంపాత కళ్లద్దాలు, ఫ్రేములను సేకరిస్తున్న వైనంఆలోచింపజేస్తున్న ఆరుషి గుప్తా సేవ

పాత కళ్లద్దాలు పారేయకుండా ఈ పిల్లకు ఇవ్వండి

Sunday April 12, 2015,

3 min Read

“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం”... ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో గోడలమీదో, పుస్తకాల్లోనో చదువుకున్న మాట. మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఏ భాగానికి ఇబ్బంది వచ్చినా తట్టుకోలేం. భరించలేం. కానీ కళ్లకే ఎందుకు అంత ప్రాధాన్యం? ఎందుకంటే... చూపు లేకపోతే జీవితం దుర్భరం. మాట్లాడలేకపోయినా, వినికిడి శక్తి లేకపోయినా, కాళ్లు, చేతులు లేకపోయినా ఎలాగోలా బతకచ్చు. కానీ కళ్లు లేకపోతే ? నిరంతరం ఎదుటివారిపై ఆధారపడాలి. ప్రతి చిన్న అవసరానికి ఎవరో ఒకరి సహాయం అవసరమవుతుంది. అందుకే కళ్లకి అంత ప్రముఖ స్థానం.

పాత కళ్లద్దాలు ఏం చేస్తారు ?

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని బారాఖంబా రోడ్ లోని ఓ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతోంది ఆరుషి గుప్తా. ఓసారి తను ఉపయోగిస్తున్న కళ్లజోడు స్థానంలో కొత్తది కొనుక్కొంది. మరి పాతది ఏం చేయాలి ? మనం కొత్త కళ్లద్దాలు కొనుక్కుంటే పాతవి ఏం చేస్తాం ? సాధారణంగా చాలామంది ఇంట్లో ఏదో ఓ మూల పడేస్తారు. కొన్ని రోజుల తర్వాత అవి చెత్తబుట్టలోకి చేరతాయి. మరికొంతమంది షాపులోనే వదిలేసి వస్తారు. అంటే వాటితో మనకు ఎలాంటి ఉపయోగమూ లేదు.

ఆరుషి కూడా అలానే చేస్తే ఇక్కడ ఆమెను ప్రస్తావించాల్సిన అవసరం ఉండేది కాదు. ఎలాంటి ఉపయోగమూ లేకుండా ఇంట్లో పడి ఉన్న పాత కళ్లద్దాలను చూస్తున్నప్పుడు ఆమెకు ఓ ఆలోచన కలిగింది. వాటిని చూపులేని, కళ్లద్దాలు కొనుక్కోలేని పేదలకెవరికైనా ఇస్తే ఉపయోగించుకుంటారు కదా! అని. వెంటనే తనకు తెలిసిన ఓ స్వచ్ఛంద సంస్థకు వాటిని అందచేసింది. అక్కడితో ఆగలేదు ఆరుషి. తనతో పాటు అందరితో ఇలా చేయించాలని నిర్ణయించుకుంది. అలా మొదలైందే... “స్పెక్టాక్యులర్ డ్రైవ్”. పాత కళ్లద్దాలన్నింటినీ సేకరించి... కళ్లజోడు కొనుక్కోలేని దుస్థితిలో ఉన్న పేదవారికి, అవసరమైన వారికి అందచేయడమే ఈ “డ్రైవ్” లక్ష్యం.


ప్రమేరికా స్పిరిట్ ఆఫ్ కమ్యూనిటీ అవార్డుతో ఆరుషి గుప్తా

ప్రమేరికా స్పిరిట్ ఆఫ్ కమ్యూనిటీ అవార్డుతో ఆరుషి గుప్తా


“స్పెక్టాక్యులర్ డ్రైవ్” చర్యల్లో భాగంగా... ఇరుగుపొరుగువారు, ఆప్టికల్స్ (కళ్లద్దాల) షాపులు, వివిధ సంస్థలు, తెలిసినవాళ్లందరి నుంచి ఆరుషి పాత కళ్లద్దాలను, ఫ్రేములను సేకరించేది. అలా సేకరించిన వాటిని హెల్ప్ ఏజ్ ఇండియా, జన్ సేవా ఫౌండేషన్, గూంజ్ వంటి ఎన్జీఓలకు, స్వచ్ఛంద సంస్థలకు అందచేసేది. వారిద్వారా అవి పేదలకు చేరేవి.

ఆరుషి 2009 నుంచి “డ్రైవ్” కార్యకలాపాలను పెంచడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. వివిధ ఎన్జీఓల సాయంతో పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు (ఫ్రీ ఐ క్యాంప్స్), కళ్ల పరీక్షలు, అతి తక్కువ ఖర్చుతో క్యాటరాక్ట్ చికిత్సలు, కళ్లద్దాలు అందచేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అసలు ఎంతమంది ఇలాంటి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు? అనే ప్రశ్న ఆరుషి మదిలో నిరంతరం మెదులుతూ ఉండేది. దాంతో, ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి పరిశోధన మొదలుపెట్టింది. ఆ పరిశోధనలో ఆమెకు ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. భారత దేశంలో సుమారు 15కోట్లకు పైగా పేదలు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వారు వైద్య పరీక్షలు చేయించుకోలేక, కళ్లద్దాలు కొనుక్కోలేక అలాగే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదంతా తెలుసుకున్న ఆరుషి... “స్పెక్టాక్యులర్ డ్రైవ్” చర్యలను మరింత పెంచాలని నిర్ణయించింది.

సేకరించిన కళ్లద్దాలతో ఆరుషి

సేకరించిన కళ్లద్దాలతో ఆరుషి


ఎంతో మందిని కలిసింది, తన ఉద్దేశాలను వివరించింది, పోస్టర్లను ముద్రించి పంచింది. పాత కళ్లజోళ్ల సేకరణకు డ్రాప్ బాక్స్ లను ఏర్పాటుచేసింది. ఎంత చేసినా ప్రజల్లో చైతన్యం రాకపోతే ఉపయోగం ఏముంటుంది? ఆరుషికి అదే పెద్ద సవాల్. స్కూల్ ముగిసిన తర్వాత ఉన్న కొద్దిపాటి సమయాన్ని దీనికోసం ఉపయోగించేది. ఎలాగైనా ఈ సమాజంలో దృష్టిలోపంతో బాధపడేవారు లేకుండా చేయాలనేదే ఆమె లక్ష్యం. ఆరుషి శ్రమ, పట్టుదల ఫలితంగా ఇప్పటివరకూ సుమారు 1500 మంది బాధితులు లబ్ది పొందగలిగారు. ఇది నిజంగా ఓ స్పెక్టాక్యులర్ ఎఫెక్ట్. తన డ్రైవ్ ద్వారా ఆరుషి పొందిన సంతృప్తి, తన ద్వారా సాయం పొందిన వారి కళ్లలో ఆనందం మాటల్లో వర్ణించలేనివి.

కేవలం ఒక పాఠశాల స్థాయి విద్యార్థిని తన కృషితో 1500 మందికి సాయం చేస్తే... మరి మనందరం కలిస్తే ఇంకెంత మార్పు జరుగుతుంది? అది ఊహకు అందదు. ఆరుషి పేర్కొంటున్న కొన్ని సూచనలను అమలుచేస్తే... మరెంతో మందికి ఆరోగ్యకరమైన చూపును ప్రసాదించవచ్చు

. “పాత, పాడైన ఫ్రేములను రీసైకిల్ చేయడం వల్ల తక్కువ ధరకే వాటిని మళ్లీ తయారుచేయవచ్చు, విక్రయించవచ్చు. పాత ఫ్రేములు చెత్త ద్వారా భూమిలో కలుస్తాయి కానీ కరగవు. ఆ ప్లాస్టిక్ ద్వారా కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి. అందువల్ల పాతవాటిని రీసైకిల్ చేస్తే గ్లోబల్ వార్మింగ్ నుంచి ఈ భూమిని కొంతమేరకైనా కాపాడవచ్చు”... అంటుంది ఆరుషి.

చిన్న వయసులోనే మొగ్గతొడిగిన ఈ సేవా కుసుమం... 4వ ప్రమెరికా స్పిరిట్ ఆఫ్ కమ్యూనిటీ అవార్డుల జాబితాలో చోటుదక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 285 మిలియన్ల మంది దృష్టిలోపాలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) అంచనా. వీరిలో 246 మిలియన్ల మంది చికిత్స చేస్తే నివారించగలిగే లోపాలతో ఇబ్బందులు పడుతున్నారు. వీరిది కనీసం కళ్లద్దాల కోసం కూడా డబ్బులు వెచ్చించలేని దుస్థితి.

ఇప్పటికైనా ఆలోచించండి !

చిన్న చిన్న పనులే పెద్ద మార్పులకి దోహదం చేస్తాయి అనడానికి మంచి ఉదాహరణ ఆరుషి గుప్తా, ఆమె ప్రారంభించిన “స్పెక్టాక్యులర్ డ్రైవ్”. రోజుకొక మంచి పని... అంత ఖాళీ లేదా? కనీసం వారానికొకటి... అంటే సంవత్సరానికి 52. ఒక మనిషిగా ఇంతకన్నా తృప్తినిచ్చే అంశం మరొకటుంటుందా!! ఆలోచించండి ఫ్రెండ్స్!!!