ఐఐఎం చదివి వ్యవసాయ క్షేత్రంలోకి దిగిన దేవి మూర్తి

వ్యవసాయం దండుగ కాకూడదు. పండుగ కావాలి. చాలీ చాలని బతుకులతో అతుకుల బొంతల జీవితాన్నీ ఈడ్చే రైతుల కడుపు నిండాలి. ఏటా పెరిగిపోతున్న సాగు వ్యయాన్ని తగ్గించాలి. కూలీల కొరత తీర్చే ప్రత్యామ్నాయ మార్గం వెదకాలి. ఇదే ఆలోచన ఒక మహిళ మదిలో మెదిలింది. తనది కాని వృత్తిని ఎంచుకుంది. రైతులకు కారు చవగ్గా చిన్న చిన్న యంత్రాల రూపంలో వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నఘనత సాధించారు దేవీ మూర్తి. సింపుల్ ఫార్మ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి కన్నడ దేశ కర్షకులకు సేవలందిస్తున్నారు.

ఐఐఎం చదివి వ్యవసాయ క్షేత్రంలోకి దిగిన దేవి మూర్తి

Monday June 22, 2015,

3 min Read

“ఒక మహిళ పొలంలోయంత్రాలతో పనిచేయడాన్ని రైతులు సంభ్రమాశ్చర్యాలతో చూడటం నేను గమనించాను. వాళ్లు మా పట్ల ఆకర్షితులవుతున్నారు. మేము చేస్తున్న పనులను చూస్తున్నారు. అదే వారి నుంచి సానుకూల స్పందన పొందేందుకు ఉపయోగపడుతోంది. అదే పరోక్షంగా మాకు దీవెనగా పరిణమించింది” అని దేవీ మూర్తి చెబుతున్నారు. కమల్ కిసాన్ సంస్థ వ్యవస్థాపకురాలామె. కార్యాలయంలో కంటే కర్ణాటకలోని పంట పొలాల్లో ఆమె ఎక్కువ సమయం గడుపుతున్నారు. డ్రీలెక్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్న దేవి, షీట్‌మెటల్ ప్రోడక్ట్స్ విభాగంలో ప్రొడెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. ఐఐఎం బెంగళూరులో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు సామాజిక వాణిజ్యంపై ఆమె దృష్టి పెట్టారు.

దేవి మూర్తి, కమల్ కిసాన్ వ్యవస్థాపకురాలు

దేవి మూర్తి, కమల్ కిసాన్ వ్యవస్థాపకురాలు


“షీట్‌మెటల్ విభాగంలో నా నైపుణ్యాన్ని వినియోగిస్తూ మార్పు కోసం ప్రయత్నించాలని తపన పడ్డాను. వ్యవసాయోత్పత్తులపై దృష్టి పెడితే బావుంటుందని నా మిత్రుడొకరు సూచించారు. నాకు ఆశ్చర్యమేసింది. నిజంగా అక్కడ నాలాంటి వారి అవసరం ఉందేమో తెలుసుకునేందుకు ప్రయత్నించాను. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లో తిరుగుతూ.. రైతులతో మాట్లాడుతూ రెండు సంవత్సరాలు గడిపాను” అని ఆమె వివరించారు. అలా ఆ ప్రయాణంలో భాగంగా కమల్ కిసాన్ 2012లో ఏర్పాటైంది.

చిన్నకారు, సన్నకారు రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు తయారు చేసేందుకు కమల్ కిసాన్ ఏర్పాటైంది. వ్యవసాయ కూలీలపై ఆధారపడి జరిగే పనులకు ప్రత్యామ్నాయంగా ఈ యంత్రాలు పనిచేస్తాయి. ఉత్పత్తి వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తాయి. దేశంలో ఐదు ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న వారి సంఖ్య 80 శాతం కంటే ఎక్కువే ఉంది. వ్యవసాయ కూలీల సంఖ్య తగ్గిపోవడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. దీనితో ఉత్పాదకతపై కూడా ప్రభావం ఉంటోంది.

యాంత్రీకరణకు అలవాటు పడటంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుబాటులో ఉన్న యంత్రాలు చిన్నకారు రైతులకు ఉపయోగపడే అవకాశాలు లేవు. యంత్రాలు అందుబాటులో ఉన్నచోట విడిభాగాలు, ఇతర సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. వ్యవసాయానికి సమయ పాలన చాలా అవసరమైనందున యంత్రాల ఆవశ్యకత పెరిగింది. వ్యవసాయ పనిముట్లను అందించడంలో కమల్ కిసాన్... ఫ్రాంఛైజ్ ఆధారిత పద్ధతులను పాటిస్తోంది. కూలీలు చేసే పనులను యంత్రాల ద్వారా పూర్తి చేసే వీలు కల్పిస్తుంది. ఇదీ రైతులకు అందించే సేవలాంటిదే. ఈ తరహా సేవా విధానాన్ని ఎంపిక చేసుకోవడానికీ ఓ కారణం ఉంది. వ్యవసాయ పనిముట్లను మూలధన పెట్టుబడిగా కాకుండా వర్కింగ్ క్యాపిటల్ రూపంలో రైతులకు అందిస్తారు.

వరినాటు యంత్రంతో ఓ రైతు

వరినాటు యంత్రంతో ఓ రైతు


“ లాభాపేక్షతో మాత్రమే వ్యాపారం చేయకూడదు. పర్యావరణంపై కూడా ప్రభావం చూపే వ్యాపారం ఉండాలి.. .” అని దేవి అంటున్నారు…

రైతులకు నాట్లు వేసే యంత్రాలు సరఫరా చేసే దిశగా కేంద్రాల పెంపు, స్వయం సహాయ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో కమల్ కిసాన్ విజయం సాధించింది. గ్రామీణ కార్మికుల బృందాన్ని ఎంపిక చేసి సర్వీస్ ప్రొవైడర్లుగా నియమించారు. కమల్ కిసాన్ ప్రారంభం నుంచి ఆరు నెలల పాటు నిదానంగా వృద్ధి చెందింది. ఐఐటీ మద్రాసులోని గ్రామీణ సాంకేతిక, వాణిజ్య ప్రోత్సాహక కేంద్రం నుంచి కమల్ కిసాన్‌కు ఐదు లక్షల రూపాయల సీడ్ ఫండ్ అందింది. కమల్ కిసాన్ నలుగురు సభ్యుల బృందంగా పనిచేస్తోంది. గతనెల తన తొలి వరి నాట్ల యంత్రాన్ని ఆవిష్కరించింది. బంగాళాదుంపలు, పప్పుదినుసుల సాగు యంత్రం, పండ్లు, కూరగాయల సాగు యంత్రం, కొబ్బరి సాగు యంత్రం, చెరకు సాగు యంత్రం లాంటివి ఇప్పుడు అభివృద్ది దశలో ఉన్నాయి. వరి నాట్ల యంత్రాన్ని సంప్రదాయ నర్సరీ పద్దతిలో వినియోగిస్తారు. సులభంగా వాడుకునేందుకు వీలుగా చేతితో పెడలింగ్ చేస్తారు. ఎకరాకు కేవలం వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే చాలు దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు.

గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది రైతులు ఈ యంత్రాలను అనుమానంగా చూశారు. వారిని ఒప్పించడం దేవికి సవాలుగానే పరిణమించింది. “సరైన సమయంలో, సరైన పద్ధతిలో పనిచేసే యంత్రాలను అందించగలమని రైతులను నమ్మించడం కష్టమైన పనే. మేము యంత్రాలను సరఫరా చేసిన కొందరు రైతులు మాత్రం మమ్మల్ని వారి ఇంటికి ఆహ్వానించారు. మా పనిముట్లు బాగా పనిచేస్తున్నాయని వారు కితాబిచ్చారు. మరిన్ని పరికరాల కోసం ఎదురు చూస్తున్నట్లు వివరించారు. ఈ పరిణామం మాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. సరికొత్త ఆవిష్కరణల ద్వారా వ్యవసాయదారులకయ్యే వ్యయాన్ని యాభై శాతం తగ్గించాలని ప్రయత్నిస్తున్నాం. 2015 ఆఖరుకు 50 వేల మంది రైతులను చేరుకోవడమే మా లక్ష్యం..,” అని ముగించారు దేవి.