పాడైతే వాటికవే రిపేర్ చేసుకునే రోడ్లను కనిపెట్టాడీ ప్రొఫెసర్..!!

పాడైతే వాటికవే రిపేర్ చేసుకునే రోడ్లను కనిపెట్టాడీ ప్రొఫెసర్..!!

Wednesday October 19, 2016,

2 min Read

టైటిల్ చూసి అవాక్కయ్యారా? ఇండియన్ రోడ్లను చూసీ చూసీ విసుగెత్తిన మీకు ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినట్టయిందా? అంతేకదా.. మన అతుకుల గతుకుల బతుకులకు ఇలాంటి రోడ్లంటే సుఖం కాక మరేంటి..? 

చినుకు పడితే చిత్తడయ్యే రోడ్లు.. భారీ వానకు మత్తడి దుమికే రహదారులతో సగం జీవితాలు ఇప్పటికే నాశనమయ్యాయి. వానాకాలం తర్వాత మన రోడ్ల అందచందాలను ఎంత వర్ణించినా తక్కువే. అసలే ఆదరాబాదరా బతుకులు. అందునా గతుకుల రోడ్ల మీద ఉరుకులు. దానికి తోడు హెవీ ట్రాఫిక్. బ్యాక్ పెయిన్ తో బైక్ పెయిన్ బోనస్. బండి షెడ్డుకు వెళ్తుంది. మనం ఆసుపత్రికి వెళ్తాం.

వానాకాలం తర్వాత బట్టలకు మాసికలేసినట్టు రోడ్లేస్తారు. బిందెకు సొట్లు తీసినట్టుగా, గతుకులు పూడ్చి మమ అనిపిస్తారు. మళ్లీ ఒక్కవాన పడగానే సీన్ మామూలే. తవ్వడం.. పూడ్చడం.. తవ్వడం.. పూడ్చడం.. ఈ దుస్థితి పోగొట్టడానికే నీమ్ కుమార్ భాంటియా, అతని టీం ఒక పరిష్కారం కనుగొంది. అదేంటో మీరే చదవండి.

శాశ్వత ప్రాతిపదికన టెక్నికల్ రోడ్లు...

పాడైతే వాటికవే రిపేర్ చేసుకునే రోడ్లు..

ఈ మాటలు వింటుంటేనే చెవికి ఎంత ఇంపుగా ఉన్నాయో కదా.. అవును.. కెనడాలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నీమ్ కుమార్ భాంటియా కనిపెట్టిన రోడ్లు అచ్చం అలాంటివే. రోడ్లంటే.. తారు, కంకర మిక్స్ చేసి దానిమీద నుంచి రోలర్ తొక్కించి నున్నగా చేసిన రోడ్లు కాదు. దానికి టెక్నాలజీ తోడైంది. పాడైతే దానికదే రిపేర్ చేసుకుంటుంది. ఒకసారి వేస్తే మళ్లీ దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. పైగా పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని తరహాలో ఉంటాయి. అలాగని పెద్ద ఖర్చేం కాదు. మామూలు రోడ్ల పోల్చుకుంటే ఇది చాలా చీప్.

image


ఢిల్లీ ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న నీమ్ కుమార్, 34 ఏళ్ల క్రితమే కెనడాకు షిఫ్టయ్యాడు. వాన్ కోవర్ లోని యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా( యూబీసీ)లో సివిల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంటులో పనిచేస్తున్నాడు. 2014 నుంచి నీమ్ కుమార్, అతని టీం కలిసి బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండేబావి అనే గ్రామంలో ఇలాంటి రోడ్ల కోసం ప్రాజెక్ట్ వర్క్ చేస్తోంది.

నీమ్ కుమార్ డెవలప్ చేస్తున్న రోడ్లు.. అన్ని రోడ్లలా కాదు. మామూలు తారు రోడ్లతో పోల్చితే ఈ రహదారుల మందం 60 శాతం తక్కువగా ఉంటుంది. మెటీరియల్ పరంగా చూసినా ఖర్చు తక్కువే. చాలామటుకు సిమెంట్ బదులు బూడిద వాడతారు. పగుళ్లు వస్తే దానికదే రిపేర్ చేసుకునేలా దానికి టెక్నాలజీని జత చేస్తున్నారు.

మెటీరియల్ లో వాడే ఫైబర్లకు హైడ్రోఫోలిక్ నానో కోటింగ్ ఉంటుంది. హైడ్రోఫోలియా ఏం చేస్తుందంటే.. నీళ్లను ఆకర్షిస్తుంది. ఆ నీళ్లు పగుళ్లను అరికట్టడంలో ఉపయోగపడతాయి. సో, ఎప్పుడు రోడ్డు మీద చీలిక వచ్చినా సిమెంటుని హైడ్రేట్ చేసి సిలికేట్లను ఉత్పత్తి చేస్తుంది. దాంతో రోడ్డు దానికదే రిపేర్ చేసుకుంటుంది.

ఈ తరహా రోడ్లను అతి తక్కువ ఖర్చుతో వేయొచ్చంటారు ప్రొ. నీమ్ కుమార్. మామూలు రోడ్లతో పోల్చుకుంటే 30 శాతం కాస్ట్ తగ్గిపోతుందట. పైగా ఇవి 15 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంటాయంటారాయన. కర్నాటక మినహాయిస్తే.. ఈ తరహా రోడ్లను వేయడానికి హర్యానా, మధ్యప్రదేశ్ తో కంపెనీ సంప్రదింపులు జరుపుతున్నామని చెప్తున్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే.. ఏడాదికోసారి రిపేర్లు చేయాల్సి వచ్చే ఇండియన్ రోడ్లకు మహర్దశ పట్టినట్టే.. ఏమంటారు...?