అంధులను నడిపించే బూట్లకు దారులు పరిచింది వీళ్లే 

అంధులకు దారి చూపే ‘లేచల్’ హ్యాప్టిక్ షూస్... ఫోన్‌లో జీపీఎస్ టెక్నాలజీకి షూస్ డివైస్ తో అనుసంధానం...‘లేచల్ ’ షూస్ పై ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో పరిశోధనలు...

0


మీరు కొత్తదారిలో వెళ్తున్నారా..? మీ దగ్గర ఫోన్ వుందా..? అందులో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ( జీపీఎస్) వుంటే చాలు.. మీరు చేరాలనుకున్న గమ్యానికి దారి చూపించేస్తాం. అనిరుధ్ శర్మ తన స్నేహితుడు క్రిస్పియన్ లారెన్స్ కలిసి రూపొందించిన టెక్నాలజీ ఇస్తున్న అభయమిది. చేతిలో ఫోన్‌ను చూసుకుంటూ సరైన దారిలో వెళ్తున్నప్పుడు మధ్యలో ఎదురుగా చిన్న స్థంభాన్ని ఢీ కొట్టేవరకు తెలీదు. ఆదారి సరైంది కాదని. ఈ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారీ ఇద్దరు మేధావులు. డ్యూసెర్ టెక్నాలజీస్ (DUCERE TECHNOLOGIES) అనేది.. లే-చల్ (LECHAL) కంపెనీకి మాతృసంస్థ. లేచల్ కంపెనీ హ్యాప్టిక్ షూస్‌ను తయారు చేస్తోంది. చూపులేని వారికోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ వియరబుల్ హ్యాప్టిక్ షూస్ ఎమ్.ఐ.టీ టెక్నాలజీ రివ్యూలో 35 కు 35 పాయింట్ల తో పాటూ అవార్డునూ సొంతం చేసుకుంది.

లేచల్ (LECHAL) ప్రధానంగా నాలుగు విశిష్టతలతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఎక్కడ ఏముందనేది తెలుసుకుని ప్రయాణించడం, దృఢత్వం, చురుకుదనంతో కూడిన సహకారం, సులభంగా వెళ్లగలగటం ఇవే లేచల్ తయారుచేసే హ్యాప్టిక్ షూస్ లోని విశేషాలు.

అనిరుధ్ శర్మ, క్రిస్పియన్ లారెన్స్
అనిరుధ్ శర్మ, క్రిస్పియన్ లారెన్స్

నేవిగేషన్ (గమనాన్ని గుర్తించి ప్రయాణించడం)

నేవిగేషన్ విషయానికొస్తే... ముందుగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) తో ఫోన్ ద్వారా గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడు గమ్యానికి సంబంధించిన సమాచారం తరంగాల రూపంలో హ్యాప్టిక్ షూస్ అందుకుంటుంది. అది ఆయా ప్రాంతాల సరిహద్దులను, స్వరూపాలను విశ్లేషించుకుంటుంది. ఇక మీ ఫోన్ లోని జీపీఎస్ వ్యవస్థను గమనించాల్సిన అవసరమే అసలు వుండదు. సరైన దారిలో గమ్యానికి చేర్చే బాధ్యత హ్యాప్టిక్ షూస్ తీసుకుంటాయి. మీ పాదాల ముందు ఏ చిన్న అడ్డంకి ఎదురైనా వెంటనే సిగ్నల్స్ అందుతాయి. మీరు వెళ్లాల్సిన ప్రదేశం ఏదిశగా వుందో.. ఎన్ని మలుపులు తిరగాలో.. ఎక్కడ ఎత్తుపల్లాలున్నాయో అన్నీ షూస్ అర్థం చేసుకుంటూ ముందుకు నడుపుతాయి.

ఫలితంగా గమ్యస్థానానికి చేరేవరకూ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా తీసుకెళ్లే పని లేచల్ షూస్ వే. పైగా మధ్యలో ఎలాంటి ఒడిదుడుకులు, నష్టం వుండదు.

చురుకుదనంతో సాయం(Smart Assist)

సంపూర్ణ జీపీఎస్ , మ్యాప్‌లతో కూడిన ఈ విభాగంతో.. ఆయా ప్రాంతాలను, సరిహద్దులను ఫోన్ ద్వారా సులభంగా గుర్తిస్తూ ప్రయాణించవచ్చు. పైగా మీ ఫోన్‌ను పోగొట్టుకునే ఆస్కారమే వుండదు. ఫోన్ మీ దగ్గర లేనట్లయితే లేచల్ టెక్నాలజీ వెంటనే సంకేతాలను పంపుతుంది. ఇందులో పలురకాల మార్పులను మనకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు కూడా వుంది.

దృఢత్వం (Fitness)

లేచల్ షూస్ టెక్నాలజీలో మరో అద్భుతం దృఢత్వం. ఈ షూస్ ఉపయోగించి నడవటం వల్ల బాడీ ఫిట్నెస్ కూడా రెట్టింపు అవుతుంది. నడిచే సామర్థ్యం పెరగడమే కాకుండా అలసట అనేది దరి చేరదు. శరీరంలో అనవసర కెలోరీలన్నీ ఖర్చయిపోయి బాడీ ఫిట్ గా వుండేందుకు సహకరిస్తుంది.

సులభంగా ఉపయోగం ( Accessibility)

లేచల్ సంస్థ ఈ షూస్‌ను అంధులు, చూపు సరిగా కనబడనివారికోసం తయారు చేసింది. వారు నడిచేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్‌తో సాఫ్ట్‌వేర్ విశ్లేషణలు జరిపి సరైన దిశను చూపిస్తుంది. అది తెలిసిన ప్రాంతమైనా, తెలీని ప్రాంతమైనా సరే. జీపీఎస్ సిస్టమ్ సాయంతో లేచల్ ప్రయాణాన్ని సుఖమయం చేసేస్తుంది. గమ్యాన్ని సులభంగా చేర్చేస్తుంది.

ప్రస్తుతం లేచల్ వ్యవస్థాపకులు తయారు చేసిన ఈ ప్రాడక్ట్‌పై హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో పరిశోధనలు అంతిమ దశకు చేరుకున్నాయి. చూపులేనివారికి ఉపయోగపడే ఇలాంటి ఫుట్‌వేర్ పై పరిశోధన జరపడం, దాని సామర్థ్యం, ఆవశ్యకతను గుర్తించే పరిశీలనా ప్రయత్నాలు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. డాక్టర్ వీరేందర్ సంఘ్వాన్ మార్గనిర్దేశకత్వంలో డాక్టర్ ఆంథోనీ విపిన్ దాస్ నాయకత్వాన ఈ పరిశోధన శరవేగంగా కొనసాగుతోంది. శక్తివంతమైన, ఎక్కడేముందో అవలీలగా తెలుసుకోగలిగే, అందరికీ అందుబాటులో వుండే ఫుట్ వేర్ గా లేచల్ (LECHAL) ఇప్పటికే పలువురి నుంచి ప్రశంసలను అందుకుంది. పైగా చూపులేని వారిలో ఆత్మస్థైర్యాన్ని, స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్లగలమనే ధైర్యాన్ని కలిగిస్తోంది.

ఒక్క లేచల్ (LECHAL) షూస్ ను రూపొందించడంలోనే కాకుండా ఇంకా వైద్యరంగానికి ఉపయోగపడే చాలా ప్రాజెక్ట్ లకు అనిరుధ్ శర్మ భాగస్వామ్యం వహిస్తున్నాడు. మన చుట్టూ అందుబాటులో వుండే వస్తువులతో ప్రింటర్ ఇంక్ ను తయారు చేయడం, పిల్లలకు త్రీడీలో కథలను చెప్పే సాఫ్ట్ వేర్ రూపకల్పన.. ఇలా పలు ప్రాజెక్ట్ లపై అనిరుధ్ పరిశోధనలు చేస్తున్నాడు.

లేచల్ (LECHAL) షూస్ అందరికీ అందుబాటులోకి వస్తే.. నేవిగేషన్ వ్యవస్థను కేవలం ఫోన్ స్ర్కీన్ లో చూసుకునేందుకే కాకుండా...నడిచేందుకు కూడా ఉపయోగించవచ్చని ప్రతి ఒక్కరూ అనుభవపూర్వకంగా తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఏదేమైనా లేచల్ నేవిగేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.