తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అమ్మ..!!

జీవితమంతా పోరాటం చేసిన జయలలిత

0

ప్రార్థనలు ఫలించలేదు. డాక్టర్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అమ్మ తిరిగొస్తుందన్న ఆశ అడియాశే అయింది. రెండున్నర నెలల పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందిన జయలలిత అందరినీ శోక సంద్రంలో ముంచారు. ఇక సెలవంటూ తిరుగురాని లోకాలకు తరలిపోయారు.

తమిళనాడు అమ్మను కోల్పోయింది. వ్యక్తిగతంగా, రాజకీయపరంగా జీవితమంతా పోరాటం చేసిన జయలలిత.. మృత్యువుతో జరిగిన పోరులో ఓడిపోయారు. కష్టాలకు ఎదురొడ్డి, స్వయం కృషితో ఉన్నత శిఖరాలకు చేరిన అమ్మ ఇక అలసిపోయానంటూ సెలవు తీసుకున్నారు. కొంతకాలంగా చెన్నై అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమెకు ఆదివారం సాయంత్రం కార్డియాక్‌ అరెస్ట్‌ సమస్య తలెత్తడంతో జనరల్‌ వార్డుకు నుంచి హుటాహుటిన క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. కార్డియాలజిస్టుతో పాటు పల్మనాలజిస్టులు ట్రీట్‌మెంట్‌ ప్రారంభించారు. ఆమె గుండె, ఊపిరితిత్తులు పనిచేసేందుకు ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మాంబ్రేన్ హార్ట్‌ అసిస్ట్‌ డివైజ్‌ తో పాటు లైఫ్‌ సపోర్టింగ్‌ సిస్టంపై ఉంచారు. గతంలో ఆమెకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన వైద్య నిపుణుడు డాక్టర్‌ రిచర్డ్‌ను సంప్రదించిన అపోలో హాస్పిటల్‌ వైద్యులు ఆయన సూచనల మేరకు చికిత్స అందించారు. సోమవారం ఉదయం యాంజియోగ్రాం సర్జరీ చేసిన డాక్టర్ల అమ్మ పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు. అయితే సర్జరీ జరిగిన కొన్ని గంటలకే జయ ఆరోగ్యం మరింత విషమించింది. ఆమెను రక్షించేందుకు డాక్టర్లు సకల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రెండున్నర నెలలుగా హాస్పిటల్‌లో చికిత్స పొందిన జయలలిత తుదిశ్వాస విడిచారు.

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై గత రెండున్నర నెలలుగా ఆందోళన కొనసాగింది. ఆస్పత్రిలో చేరిన మొదట్లోఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటున్నారన్న డాక్టర్ల ప్రకటనతో జనం ఊపిరి పీల్చుకున్నారు. జయలలిత పూర్తిగా కోలుకున్నారని, త్వరలో డిశ్చార్జ్‌ అవుతారని డాక్టర్లు, అన్నాడీఎంకే నాయకులు చెప్పడంతో అమ్మ త్వరలోనే ఇంటికి వస్తారని అంతా భావించారు. కానీ ఇంతలోనే ఊహించని విధంగా కార్డియాక్‌ అరెస్ట్‌ తో అపస్మారక స్థితిలోకి చేరిన జయలలిత కన్నుమూశారు.


అమ్మ అపోలోలో చేరిన నాటి నుంచి జరిగిన కీలక పరిణామాలు గమనిస్తే.. సెప్టెంబర్‌ 22న తీవ్ర జ్వరం, డీ హైడ్రేషన్‌తో జయలలిత హాస్పిటల్‌లో చేరారు. రెండు రోజుల చికిత్స అనంతరం సెప్టెంబర్‌ 24న జయ కోలుకున్నారని, ఆహారం తీసుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. అయితే జయ ఆరోగ్యానికి సంబంధించి సోషల్‌ మీడియాలో పుకార్లు షికారు చేస్తుండటంపై స్పందించిన అపోలో హాస్పిటల్‌ వాటిని ఖండిస్తూ బులెటిన్‌ రిలీజ్‌ చేసింది. సెప్టెంబర్‌ 27న జయ హాస్పిటల్‌ నుంచే విధులు నిర్వహిస్తున్నారని, కావేరీ నదీ జలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై సూచనలు చేసినట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. సెప్టెంబర్‌ 29న మరో హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేసిన అపోలో డాక్టర్లు జయ ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నారని, పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని చెప్పారు. ఆ మరుసటి రోజు డీఎంకే చీఫ్‌ కరుణానిధి సీఎం జయలలిత ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.


అక్టోబర్‌ 1న తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌రావ్‌ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సీఎం జయలలితను పరామర్శించారు. మరుసటి రోజు లండన్‌కు చెందిన ప్రఖ్యాత లంగ్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ రిచర్డ్‌ ను సలహా కోరగా ఆయన సూచనల మేరకు ట్రీట్‌మెంట్‌ ప్రారంభించారు. అక్టోబర్‌ ఆరున జయ చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యుల బృందం చెన్నైకి చేరుకుంది. అప్పటి నుంచి స్పెషలిస్ట్‌ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ కొనసాగింది. నవంబర్‌ 3న జయలలిత పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్లు హెల్త్‌ బులిటెన్‌లో స్పష్టం చేశారు. మరో పది రోజులకు ఆమె పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారని, త్వరలో విధులు నిర్వహిస్తారంటూ జయలలిత పేరుతో సంతకం చేసిన లేఖ విడుదల చేశారు. నవంబర్‌ 19న ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ నుంచి ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించారు. డిసెంబర్‌ 4న త్వరలోనే జయ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వస్తారని డీఎంకే ప్రకటించింది. అయితే ఈ స్టేట్‌మెంట్‌ వెలువడిన కొన్ని గంటల్లోనే ఆమె కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించి ట్రీట్‌మెంట్‌ ప్రారంభించారు. అయితే ప్రాణాలు కాపాడేందుకు చేసిన డాక్టర్లు ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో జయలలిత ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Related Stories

Stories by team ys telugu