బీపీఎల్‌ మళ్లీ వచ్చిందోచ్...

బీపీఎల్‌ మళ్లీ వచ్చిందోచ్...

Thursday March 17, 2016,

6 min Read


బీపీఎల్ టీవీ మనందరికీ గుర్తుండే ఉంటుంది. బిలీవ్ ఇన్ ది బెస్ట్ కాప్షన్‌తో సెవన్టీస్ టు నైన్టీస్‌ వరకు కస్టమర్లను ఆకట్టుకున్న కంపెనీ. బీపీఎల్ టీవీ ఇంట్లో ఉండటం అప్పట్లో గొప్ప హోదా. జమానా మారిపోయింది. వేగంగా మారుతున్న కాలంతో, ప్రత్యర్థులతో పోటీ పడలేక బీపీఎల్ కంపెనీ టీవీల ఉత్పత్తితీ ఆపేసింది. టెలివిజన్ రంగంలో ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న ఆ కంపెనీ ఒక్కసారిగా ప్రొడక్షన్ 2006-07లో ఆపేయడంతో చాలామంది కస్టమర్లు నిరాశకు లోనయ్యారు. 

మళ్లీ దశాబ్దం తర్వాత ఫ్లిప్‌కార్ట్ సహకారంతో బీపీఎల్ మళ్లీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. బీపీఎల్ టీవీ రంగాన్ని ఏలిన కాలానికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. ఇప్పుడంతా హెచ్‌డీ శకం. ఈ సమయంలో మళ్లీ కస్టమర్లను ఆకట్టుకోగలమా అన్న అనుమానాలు బీపీఎల్ మేనేజ్‌మెంట్‌కు వచ్చాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన సపోర్ట్‌తో బీపీఎల్ మళ్లీ కస్టమర్ల మనసు గెలుచుకోగలిగింది. బిలీవ్ ఇన్ ది బెస్ట్ అంటూ ఆన్‌లైన్ మార్కెట్లో ఇరగదీస్తోంది.

సరిగ్గా పొయిన ఏడాది జూన్ నెలలో బీపీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ జీ నంబియార్ కాసింత ఉత్సుకతతో, ఒకింత నెర్వస్‌తో ఉన్నారు. అందుకు కారణం దశాబ్దం తర్వాత తమ 32 అంగుళాల టెలివిజన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి పెట్టడమే. ఒకప్పుడు టెలివిజన్ మార్కెట్ రంగాన్ని ఏలిన ఈ దిగ్గజ కంపెనీ ఈసారి మాత్రం భయం భయంగా తమ కొత్త ప్రాడక్ట్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. కస్టమర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆ కంపెనీ చైర్మన్ అజిత్ టెన్షన్ తో ఉన్నారు.

రిలీజ్ రోజు రానే వచ్చింది. బీపీఎల్ టీమ్ ఉద్యోగులంతా ఆరోజు బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్ ఆఫీస్‌లో కంప్యూటర్ ముందు స్క్రీన్‌ను చూస్తూ కూర్చున్నారు. సేల్స్ ఆరంభమైన కొద్ది సేపటికే షేర్ మార్కెట్‌ మాదిరిగా బీపీఎల్ అమ్మకాలు కూడా వేగంగా కదిలాయి. అంతే అజిత్‌తోపాటు ఆ కార్యాలయంలో ఉన్న ఉద్యోగులందరి మొహాల్లో చిరునవ్వు. బీపీఎల్ ఈజ్ బ్యాక్. ఒకప్పటి టెలివిజన్ రంగపు రారాజు మళ్లీ వచ్చేసింది.

టీవీ అమ్మకాలు ప్రారంభించిన మూడు నెలల్లోపే బీపీఎల్ చరిత్ర సృష్టించింది. ఫ్లిప్‌కార్ట్ టెలివిజన్ కేటగిరీలో పదిశాతం అమ్మకాలు ఒక్క బీపీఎల్ టీవీలవే. మొత్తంగా చూస్తే ఫైవ్ పర్సెంట్ ఈ సంస్థదే.

‘‘ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తున్న టాప్ త్రీ ప్రాడక్ట్‌లలో బీపీఎల్ చేరింది. విజయవంతమైన మా అమ్మకపు బ్రాండ్‌లలో ఇప్పుడు బీపీఎల్ కూడా ఒకటి’’ అని ఫ్లిప్‌కార్ట్‌లో లార్జ్ అప్లయెన్సెస్ కేటగిరి వ్యవహారాలు చూస్తున్న అమిత్ బన్సాల్ అన్నారు. బీపీఎల్ టీవీని మళ్లీ మార్కెట్‌లోకి తీసుకురావడం వెనుక అమిత్ కృషి ఎంతో ఉంది.

రీ ఎంట్రీ..

టెలివిజన్ రంగంలోకి బీపీఎల్ రీఎంట్రీ ఇవ్వడం వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. ఆన్‌లైన్ రీటైల్ మార్కెట్‌లో తమ 6బ్రాండ్లను అమ్మేందుకు ఎల్జీ, సామ్‌సంగ్, సోనీ నిరాకరించడమే బీపీఎల్ ఎంట్రీకి మార్గం సుగమమం చేసింది. ‘‘టెలివిజన్ రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కంపెనీలైన ఆ మూడు మాతో కలిసి పనిచేసేందుకు నిరాకరించాయి. అయితే మాకు మాత్రం మా కస్టమర్లకు మంచి ప్రాడక్ట్‌ను అందించాలనిపించింది మరిఇప్పుడేం చేయాలి’’ ఈవే ప్రశ్నలు నన్ను వేధించాయి అని అమిత్ చెప్పారు. దశాబ్దంపాటు ఉత్తరమేరికాలో ఉండి, మూడేళ్లపాటు రిలయన్స్ ఇండియా రిటైల్ వ్యవహారాలు చూసిన అమిత్ 2014లో ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. ఫ్లిప్‌కార్ట్ అప్పటికే ఆన్‌లైన్ మార్కెట్‌లో దుమ్మురేపుతున్నప్పటికీ, అమిత్ మాత్రం తమ సంస్థను మరింత రేంజ్‌కు తీసుకెళ్లడంపై ఆలోచన చేస్తున్నారు.

‘‘అప్పుడు నాకు ఓ ఘటన గుర్తుకొచ్చింది. పంజాబ్‌లోని మా ఇంట్లో కొత్త ఫ్లాట్ ప్యానల్ ఉంది. కానీ మా అమ్మానాన్న మాత్రం పాత బీపీఎల్ టీవీ కావాలని అంటుండేవారు. వారి ఆలోచనలు గుర్తుకొచ్చాయి. అంతే బీపీఎల్ వంటి చారిత్రాత్మక బ్రాండ్లతో ఎందుకు కలిసి పనిచేయకూడదనిపించింది. ఫ్లిప్‌కార్ట్‌లో చేరిన తర్వాత నాకొచ్చిన క్రేజీ ఐడియాలలో ఇది కూడా ఒకటి’’ అని అమిత్ వివరించారు.

 

 


అయితే బీపీఎల్‌ ఒకప్పుడు ఈ రంగాన్ని ఏలింది కదా.. అని బన్సాల్ చూస్తూ కూర్చోలేదు. అసలు కస్టమర్లు బీపీఎల్ గురించి ఇప్పుడేం అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 35 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఓ సర్వే నిర్వహించారు. ‘‘ఆశ్చర్యం.. ఇప్పటికీ బీపీఎల్‌కు అదే ఆదరణ. తమ ఇళ్లలో ఇప్పటికీ బీపీఎల్ ప్రాడక్ట్స్ ఉన్నాయని, అవి ఇంకా పనిచేస్తున్నాయని చెప్పారు. చాలామంది బీపీఎల్ ట్యాగ్ లైన్ బిలీవ్ ఇన్ ది బెస్ట్‌ను ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. ఈ రీసెర్చ్ నన్నెంతో ఎగ్జయిటింగ్‌కు గురిచేసింద’’ని అమిత్ అంటున్నారు. అలా 2015 ఆరంభంలో బీపీఎల్ చైర్మన్ అజిత్‌ను కలిశారు అమిత్. 

మరోవైపు బీపీఎల్ మాత్రం కష్టాల్లో ఉంది. ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన కంపెనీ .. ఇప్పటి ఎల్జీ, సోనీ, సామ్‌సంగ్‌తో పోటీ పడలేక పోయింది. కంపెనీపై ఆధిపత్యం కోసం కుటుంబంలో విభేదాలు కూడా అమ్మకాలపై ప్రభావం చూపాయి. దీనికితోడు అప్పటివరకు టెక్నాలజీ పార్ట్‌నర్‌గా ఉన్న సాన్యో కంపెనీ కూడా కష్టాలపాలైంది. దీంతో లార్జ్ అప్లయెన్సెస్ రంగం నుంచి 2006-07లో బీపీఎల్ వైదొలిగింది. అప్పటి నుంచి మెడికల్ ఎక్విప్‌మెంట్, హోమ్ ఆటోమేషన్ ప్రాడక్ట్స్, సొల్యూషన్స్‌పై దృష్టి సారించింది.

 

 


టెలివిజన్ రంగం నుంచి వైదొలిగినప్పటికీ గత రెండేళ్లుగా వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగాన్ని ఎప్పటికప్పుడు కుతూహలంగా పరిశీలిస్తున్నారు అజిత్. ఇలా అజిత్-అమిత్ మధ్య కొన్నిసార్లు చర్చలు జరిగిన తర్వాత వారిమధ్య ఒప్పందం కుదిరింది. ‘‘మేం డిస్ట్రిబ్యూషన్‌ను ఆపేసినప్పుడు ఎంతోమంది డీలర్లు మాకు ఫోన్ చేసేవారు. డిమాండ్ ఉన్నప్పటికీ ప్రాడక్ట్స్‌ను ఎందుకు ఆపేశారని అడిగేవారు. గత ఏడాది అమిత్ మమ్మల్ని కలిసినప్పుడు, మాకు కూడా అనిపించింది. మళ్లీ మేంతిరిగి రావడానికి ఆన్‌లైన్ మార్కెటే కరెక్ట్ అని. అంతే మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించాం’’ అని అజిత్ చెప్పుకొచ్చారు.

బ్యాక్ టు ది గేమ్..

ఫ్లిప్‌కార్ట్ సహకారంతో మళ్లీ టెలివిజన్ల ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ, దానికి వాస్తవ రూపం ఇచ్చేందుకు ఎంతో కష్టాలు పడాల్సి వచ్చింది. తమ ఫ్యాక్టరీలను చాలావరకు బీపీఎల్ ఎప్పుడో అమ్మేసింది. అలాగే పాత సప్లయర్లు కూడా బిచాణా ఎత్తేశారు. ఇప్పుడంతా అవుట్ సోర్సింగ్ శకం. ఈ సమయంలోనే ఫ్లిప్‌కార్ట్ రంగంలోకి దిగింది. ఆరంభంలో ట్రయల్ రన్ బేసిస్‌పై లిమిటెడ్ మోడల్స్, లిమిటెడ్ ఆర్డర్లను తీసుకోవాలని బీపీఎల్, ఫ్లిప్‌కార్ట్ నిర్ణయించాయి. పెద్ద పెద్ద ఓఈఎంఎస్‌లు తక్కువ సంఖ్యలో ఇచ్చేందుకు సప్లయర్లు అంగీకరించలేదు. అయినా సప్లయర్లను ఫ్లిప్‌కార్ట్ ఎలాగోలా ఒప్పించింది. హోమ్ ఆటోమేషన్ వ్యాపారంలో పనిచేస్తున్న కొందరినీ బీపీఎల్ టెలివిజన్ రంగంలోకి తీసుకొచ్చింది. అలాగే కొంతమంది స్పెషలిస్టులను ఉద్యోగులుగా తీసుకుంది. కావాల్సిన స్పెసిఫికేషన్స్ కోసం బీపీఎల్ ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్ టీమ్‌తో కలిసి పనిచేశారు.

‘‘కస్టమర్ల ఏం కోరుకుంటున్నారో ఎప్పటికప్పుడు మాకు ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది. ఫీచర్లు, ధర ఇలా అన్ని కస్టమర్ల సర్వే ఆధారంగానే ఎంపికచేశాం. అలాగే మా అనుభవాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు అందించాం. అందుకే మా రెండు సంస్థలది గొప్ప భాగస్వామ్యం. మరిన్ని సరికొత్త ప్రాడక్ట్‌లతో మేం కస్టమర్ల ముందుకు వస్తాం’’ అని అజిత్ చెప్పారు. ఈ టెలివిజన్ల ఉత్పత్తి కోసం బీపీఎల్ ఇప్పటివరకు 15 కోట్ల రూపాయలను వర్కింగ్ క్యాపిటల్‌గా ఇన్వెస్ట్ చేసింది.

కానీ ప్రాడక్ట్‌ను ఉత్పత్తి చేయడం, కావాల్సిన రిక్వైర్‌మెంట్స్‌ను ఏర్పాటు చేసి, కస్టమర్లకు అందుబాటులో ఉంచడం ఆన్‌లైన్ రీటైల్ మార్కెట్‌లో నాణానికి ఒకవైపు మాత్రమే. కన్జూమర్ అప్లయెన్సెస్‌లలో తక్కువ బరువున్న టీవీలను దేశంలోని ఆ మూల నుంచి ఈ మూలకు ట్రాన్స్‌పోర్టు చేయడం అంత ఈజీ కాదు. దీనికి తోడు ఇన్‌స్టాలేషన్‌లో సమస్యలు, ఆ తర్వాత సేల్స్ సర్వీస్. ఇన్ని రకాల కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నింటిని గురించి ఫ్లిప్‌కార్ట్‌కు ముందు నుంచే తెలుసు. వాస్తవానికి టెలివిజన్ అమ్మకాలను ఫ్లిప్‌కార్ట్ 2012లోనే ప్రారంభించింది. అమ్మకాలు కూడా బానే ఉన్నాయి. అయితే డెలివరీ సరిగా లేకపోవడం, ఇన్‌స్టాలేషన్, సర్వీస్‌లో సమస్యల కారణంగా కస్టమర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో ప్రారంభించిన కొన్ని నెలల్లోనే ఫ్లిప్‌కార్ట్‌ టెలివిజన్ల విక్రయాల డివిజన్‌ను మూసేసింది.

అయితే 2014లో టెలివిజన్ కేటగిరీపై దృష్టిపెట్టాలని ఫ్లిప్‌కార్ట్ మరోసారి నిర్ణయించింది. ఈసారి సప్లయ్ బాగా ఉండేందుకు దేశవ్యాప్తంగా మంచి నెట్‌వర్క్‌ను బిల్డ్ చేసుకుంది. ‘‘బల్కీ గూడ్స్‌ను షిప్పింగ్ చేయడం అంత ఈజీ కాదు. దీంతో టీవీల కోసమే ప్రత్యేకంగా బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలలలో గిడ్డంగులను ఏర్పాటు చేయాలని ఫ్లిప్‌కార్ట్ నిర్ణయించింది. ఇన్ హౌజ్ లాజిస్టిక్స్ కంపెనీ ఈ-కార్ట్‌కు టెలివిజన్ల సరఫరా బాధ్యతను అప్పగించింది. ఇన్‌స్టాలేషన్, సేల్స్, సర్వీస్ కోసం జీవ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. జీవ్స్ సంస్థ 2014 నుంచి అప్లయెన్సెస్ రిపైర్, మెంటైనెన్స్ సర్వీసులు అందిస్తున్నది. దేశం నలుమూల నుంచి వస్తున్న ఆర్డర్ల ఒత్తిడిని తట్టుకునేందుకు జీవ్స్‌తో కలిసి బీపీఎల్ పనిచేస్తుంది. కస్టమర్ల కంప్లయింట్లను నేరుగా జీవ్స్ సంస్థ పరిష్కరిస్తుంది.

‘‘ప్రతి వారం జీవ్స్‌తో సమావేశాలు జరుపుతుంటాం. వారి ఎంఐఎస్‌లో మాకు ఓ విండోను ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో మేం అగ్రస్థానంలో ఉండేందుకు ఎంతో కృషిచేస్తున్నాం’’ అని అజిత్ వివరించారు.

భారీ ఆకాంక్షలు..

పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో కొత్త రేంజ్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది బీపీఎల్. ఇప్పటికే 32 అంగుళాల టీవీని లాంచ్ చేశారు. 40 అంగుళాల, స్మార్ట్ టీవీని త్వరలో లాంచ్ చేయబోతున్నారు. టెలివిజన్‌ రంగంపైనే ప్రధానంగా దృష్టిపెట్టినప్పటికీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్లను కూడా తయారు చేస్తోంది. ‘‘మొదట మేం మా సంస్థ విలువను పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత మార్కెటింగ్‌, ఆర్ అండ్ డీ, ప్రొడక్షన్లపై దృష్టిసారిస్తాం’’ అని అజిత్ చెప్పారు. దశాబ్దాల చరిత్ర ఉన్న బీపీఎల్ ఇప్పుడు కొత్త శకం ఆన్‌లైన్ బ్రాండ్‌గానూ సత్తా చాటుతోంది.

‘‘ఆన్‌లైన్‌ మార్కెట్లో కస్టమర్ల స్పందన ఇట్టే తెలిసిపోతుంది. డిమాండ్లేంటి, ఎలాంటి ప్రాడక్ట్స్ కావాలి, ఏం ఫీచర్లుండాలి, ఎలాంటి టెక్నాలజీని వారు కోరుకుంటున్నారు అన్న విషయం తెలుసుకోవడం చాలా సులభం. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో, దేనికి లేదో కూడా తెలుస్తోంది. సంప్రదాయ మోడల్‌లో కస్టమర్ల స్పందన మొదటగా డీలర్లకు, అక్కడి నుంచి రీజినల్ ఆఫీస్, అక్కడి నుంచి హెడ్ ఆఫీస్‌కు తెలుస్తుంది. ఆ తర్వాతే ఫ్యాక్టరీ, ఆర్ అండ్ డీకి చేరుతుంది. ఆ తర్వాతే ఏమైనా మార్పులు చేర్పులు సాధ్యమవుతాయి’’ అని అజిత్ చెప్పారు.

బీపీఎల్‌తో భాగస్వామ్యం సక్సెస్ కావడంతో మరిన్ని సక్సెస్ స్టోరీలకు ఫ్లిప్‌కార్ట్ ప్లాన్ చేస్తోంది. వీయూ, సాన్‌సూయ్ వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. లార్జ్ అప్లయెన్సెస్ రంగంలో ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌గా నిలువాలని, ఆధిపత్యం చెలాయించాలని లక్ష్యాలుగా పెట్టుకుంది.

‘‘ఆన్‌లైన్ లార్జ్ అప్లియెన్సెస్ రంగంలో 60% ఇప్పటికే మా సొంతమైంది. మొబైల్స్, ఫ్యాషన్స్ తర్వాత మాకు లార్జ్ అప్లయెన్సెసే మూడో అతి పెద్ద కేటగిరి. వచ్చే రెండు నుంచి ఐదేళ్లలో ఈ రంగమే మాకు భారీ లాభాలు ఆర్జించిపెడుతుందని ఆశిస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు వ్యాపారం రెండింతలైంది. ఏడాది నుంచి 18 నెలల లోపు దీన్ని మూడింతలు చేయాలన్నదే మా లక్ష్యం’’ అని అమిత్ వివరించారు.

image


తొలి ఏడాది అమ్మకాల ద్వారా 50 కోట్ల రూపాయలను ఆర్జించాలని బీపీఎల్ ఆరంభంలో లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుండటంతో దాన్ని 70 కోట్ల రూపాయలకు మార్చుకుంది. ‘‘మా దృష్టంతా ఇప్పుడు టార్గెట్‌ను చేరడమే. టెలివిజన్ రంగం మాకు ఎంత ముఖ్యమో ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది’’ అని అజిత్ చెప్పారు. కన్జూమర్ల రెస్పాన్ చూసి అజిత్ ఉబ్బితబ్బిబవుతున్నారు. ‘‘కస్టమర్ల స్పందన చూసి ఆనందంలో మునిగి తేలుతున్నాను’’ అని అజిత్ మనసులో మాట చెప్పుకొచ్చారు.

ఫ్లిప్‌కార్ట్-బీపీఎల్ భాగస్వామ్యం ఈ-కామర్స్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది. ఆన్‌లైన్ బిజినెస్ కారణంగా సంప్రదాయ వ్యాపారాలు దెబ్బతింటున్నాయన్న అపవాదును ఫ్లిప్‌కార్ట్‌ చెరిపేసింది. ఇలాంటి ఒప్పందాలు మరిన్ని జరగాలని, గత కాలపు వైభవాలను ఆధునిక కస్టమర్లకు అందించాలని యువర్‌స్టోరీ ఆకాంక్షిస్తోంది.