విశాఖలో హలో దోశ ట్రక్కులు నడుపుతున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు

విశాఖలో హలో దోశ ట్రక్కులు నడుపుతున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు

Tuesday May 10, 2016,

2 min Read


వైజాగ్ లో ఎంవీపీ సెకండ్ సర్కిల్ దగ్గర ఉంటుంది హలోదోశ ట్రక్. అల్లంత దూరంనుంచి చూడగానే కడుపులో ఆటోమేటిగ్గా ఎలుకలు పరిగెడతాయి. ఘుమఘుమలాడే వాసనకు నాలుక లబలబలాడుతుంది. అర్జెంటుగా వెళ్లి వేడివేడి దోశలు రెండైనా లాగించేయాలని మనసు ఆరాటపడుతుంది. ఎందుకంటే అమోఘమైన దోశలకు ఇది కేరాఫ్. దీన్ని ప్రారంభించింది ఓ ఇద్దరు సాఫ్ట్ వేర్ కుర్రాళ్లంటే నమ్మలేం. 

image


పెట్టిన వారం పదిరోజులకు ట్రక్ దగ్గరకు అంతగా జనం రాలేదు. సాధారణ స్ట్రీట్ ఫుడ్ అనుకున్నారు. ఒక్కసారి ఇక్కడ తినడం మొదలు పెట్టాక రిపీటెడ్ గా వస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్షన్ బాగుంది. ప్రారంభించి నాలుగు నెలలవుతోంది. రోజుకి 200 నుంచి 250 దోశలు అమ్ముడు పోతున్నాయి. మొదట ఒక ట్రక్ నడిపారు. ఇప్పుడు మరో ట్రక్ ని ఏర్పాటు చేశారు. స్విగ్గి లాంటి డెలివరీ స్టార్టప్ లతో టై అప్స్ పెట్టుకున్నారు. తొందరలోనే ఆన్ లైన్ ఆర్డర్లు తీసుకుంటున్నామని కో ఫౌండర్ రమేష్ అంటున్నాడు. విజయవాడ, తిరుపతిలో ఫ్రాంచైజీ కోసం కొంతమంది అప్రోచ్ అయ్యారని రమేష్ చెప్తున్నాడు. మరో నెలరోజుల్లో అక్కడ కూడా ఆపరేషన్స్ ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చాడు.

101 వెరైటీల దొశలు

సాయంకాలం చిరుతిళ్లకు వైజాగ్ పెట్టింది పేరు. అలా అని ఏది పడితే అది తినే రకంకాదు జనం. ఆ బేసిక్ ప్రిన్స్ పుల్ మీదనే క్వాలిటీకి పెద్దపీట వేశారు. దొశల తయారీకి బట్టర్ మాత్రమే ఉపయోగిస్తారు. దీంతో ఆయిల్ గొడవ లేదు. సాధారణ దొశలు 25నుంచి 30 రూపాయలు ఉంటే, ఇక్కడ మాత్రం దొశలు 50 నుంచి 90 రూపాయలు ఉంటుంది. ప్రారంభించిన రోజు నుంచే అన్ని వెరైటీలు అందుబాటులో ఉండటం వ్యాపారానికి కలసి వచ్చిందని రమేష్ అంటున్నాడు.

హలో దొశ టీం

ఇక టీం విషయానికొస్తే రమేష్ దీని కో ఫౌండర్. 2010లో అనిట్స్ నుంచి బిటెక్ పూర్తి చేసిన రమేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. 2015లో నుంచి స్టార్టప్ పై పనిచేశాడు. చంద్రమౌళి మరో కో ఫౌండర్. గీతం నుంచి 2010 లోనే బిటెక్ చేసిన చంద్ర కూడా సాఫ్ట్ వేర్ ప్రొఫెషన్ కు గుడ్ బై చెప్పి దీంట్లో చేరాడు. వీరితో పాటు మరో 10 మంది పనిచేస్తున్నారు.

ప్రధాన సవాళ్లు

వీకెండ్స్ లో ఉన్న క్రౌడ్ సాధారణ రోజుల్లో ఉండటం లేదు. దీన్ని మెరుగు పరచాలి. ఆన్ లైన్ ఆర్డర్లు రెవెన్యూ సస్టేయిన బుల్ గా ఉండకపోవచ్చు. దీన్ని అధిగమించాల్సి ఉంది. క్వాలిటీ విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరం. దీనికోసం ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి. ట్రక్ ల సంఖ్య పెరిగిన కొద్దీ దీన్ని మేనేజ్ చేయాలి. దాన్ని అధిగమించాల్సి ఉంది.

భవిష్యత్ ప్రణాళికలు

1.ఆన్ లైన్ డెలివరీ ను ప్రారంభించి వచ్చే ఆరు నెలల్లో హైదరాబాద్ లో ట్రక్ లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేస్తున్నట్లు రమేష్ చెప్పాడు.

2.ఫ్రాంచైజీ లను ఇచ్చి ఆంధ్ర, తెలంగాణల్లోని అన్ని పట్టణాల్లో ట్రక్ లను ప్రారంభిస్తామని రమేష్ అంటున్నాడు.

3.ఫండింగ్ వస్తే మరిన్ని ట్రక్ లను, మరిన్ని మెట్రోలకు విస్తరించాలని చూస్తున్నామని చెప్పి రమేష్ ముగించాడు.