సాంప్రదాయానికి ఫ్యాషన్ హంగులు మాలినీ స్పెషాలిటీ

సాంప్రదాయానికి ఫ్యాషన్ హంగులు మాలినీ స్పెషాలిటీ

Saturday October 10, 2015,

3 min Read

ఈ తరం కుర్రకారు మాటెత్తితే చాలు ఫ్యాషన్, ట్రెండ్ అనే మాట్లాడుతుంటారు. ఫ్యాషన్ పేరుతో సంప్రదాయాన్ని పట్టించుకోవట్లేదనే విమర్శా ఉంది. అందుకే మాలినీ ముద్దప్ప సంప్రదాయ దుస్తులకు కొత్త అందాలు అద్దుతూ ఈ తరం మహిళల్ని ఆకట్టుకుంటున్నారు. బెంగళూరులోని మాలినీ వర్క్ షాప్‌ని ఓసారి తరచిచూస్తే భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన దుస్తులు మనసు దోచేస్తాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న ట్రెడిషనల్ వేర్‌ని తనదైన స్టైల్‌లో పరిచయం చేస్తున్నారీమె.

కృష్ణ @ బెంగళూరు

దుస్తులు తయారు చెయ్యడమంటే మాలినికి ఎంతో ఎంతో ఇష్టం. ముఖ్యంగా మహిళలకు దుస్తులు రూపొందించడాన్ని ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రత్యేకంగా భావిస్తారు. గార్మెంట్స్ రంగంలో రెండు దశాబ్దాల్లో రకరకాల బ్రాండ్లకు పనిచేసిన అనుభవం ఉంది. Abercombie, Fitch, GAP లాంటి బ్రాండ్లకు సేవలందించారు. చివరగా Levi Strauss & Co లో దక్షిణాసియాకు సోర్సింగ్ హెడ్‌గా కూడా పనిచేశారు. " ప్రతీ బ్రాండ్‌లో నేను పోషించిన పాత్ర నాకు చాలా ప్రత్యేకం. అక్కడ ఎంతో నేర్చున్నాను నేను " అంటారు. 

ఎవరి దగ్గర ఎంతకాలం పనిచేసినా తాను సొంతగా ప్రారంభించిన సంస్థే తనకెంతో ప్రతిష్టాత్మకమని భావిస్తారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన స్వదేశీ కళాకారులతో కలిసి పనిచెయ్యడం ద్వారా సొంత లేబుల్ తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది తనకు. రెండేళ్ల క్రితం కృష్ణ(Krsnah) పేరుతో బెంగళూరులో స్టోర్ ప్రారంభించారు మాలిని. తన సోదరి శోభనా శంకర్‌తో కలిసి తన కలను సాకారం చేసుకున్నారు. 

image


బాల్యంలోనే ఫ్యాషన్ ఓనమాలు

ఫ్యాషన్ పై ప్రేమ, స్టైల్‌పై ఆసక్తి మాలినికి చిన్ననాటి నుంచే ఉన్నాయి. ఆమె తండ్రి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో పనిచేసేవారు. దీంతో వారి కుటుంబం తరచూ వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. అలా బాల్యం ఎంతో సంతోషంగా గడిచిపోయిందంటారామె. " దేశంలోని సుందర ప్రాంతాలైన కశ్మీర్, అస్సాం, పూణెల్లో తిరిగాం. ఆర్మీ పార్టీల కోసం మా అమ్మ నన్ను అలంకరించేది. తన లాగా నేనూ అందంగా కనిపించాలని తాపత్రయపడేది. రంగులు, స్టైల్ పై నాకున్న ప్రేమ అంతా అమ్మ నుంచి వచ్చిందే. ఆమె అందంగా ఉండటమే కాదు... ఆత్మస్థైర్యం, మనోవిశ్వాసం కూడా ఎక్కువ. ఎంతగా అంటే... ఎప్పుడూ ఆమె గుడ్డిగా ఫ్యాషన్‌ను ఫాలో అయ్యేది కాదు. సొంత స్టైల్‌నే నమ్ముకునేది. నాకు ఇప్పుడు స్టైల్‌పై ఆసక్తిగా ఉండటానికి కారణం ఆ రోజులే " అని గుర్తుచేసుకుంటారు మాలిని. 

దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు తిరగడం ద్వారా అక్కడి సంప్రదాయ దుస్తుల గురించి తెలిసింది. చిన్నప్పుడే డిజైన్స్, ప్యాటర్న్స్ పై ప్రయోగాలు చేశారు మాలిని. తన కోసం, తన సోదరి కోసం చీరలు, స్కర్ట్స్ తయారు చేశారు. కాలేజీలో ఉన్నప్పుడు బాంబే డయింగ్ వస్త్రాలు తీసుకొచ్చి తనకు నచ్చేలా దుస్తులు కుట్టుకునేది. చిన్ననాటి నుంచి ఉన్న ఆసక్తే.. 21 ఏళ్లకే తాను డిజైన్ చేసిన దుస్తులతో తొలి ఎగ్జిబిషన్ నిర్వహించేలా చేసింది.

"నేను కుట్టిన డంగరీస్ ఇప్పటికీ నా ఫేవరెట్. పువ్వులు ముద్రించిన వస్త్రంతో దాన్ని కుట్టా. అది నా స్నేహితులకు, ఇరుగుపొరుగు వారికి బాగా నచ్చింది. మాకు కూడా అలాంటిది కుట్టివ్వాలని నన్నడిగారు. ఖాళీ సమయంలో కుట్టిచ్చేదాన్ని. అలా నా పాకెట్ మనీ నేనే సంపాదించుకున్నా. వస్త్రంలోనే కాదు రంగులోనూ ఏదో ప్రత్యేకత ఉంటుందని నాకు అనిపించింది. అది దృష్టిలో పెట్టుకొని దుస్తులకు మంచి ఫినిషింగ్ ఇచ్చేదాన్ని. ఆ దుస్తులు అందర్నీ ఆకట్టుకునేవి" అంటూ గతాన్ని వివరిస్తారు మాలిని.
image


సంప్రదాయాన్ని బతికించడమే లక్ష్యం

మాలినీ బృందంలో ప్రస్తుతం ఆరుగురు పనిచేస్తున్నారు. తన సోదరి ఫేస్‌బుక్ కమ్యూనికేషన్స్ చూసుకుంటారు. ఆమె దగ్గర ఓ మాస్టర్ కట్టర్, ముగ్గురు టైలర్లున్నారు. తాము తయారుచేసే దుస్తులు విభిన్నంగా ఉండటమే కాదు అద్భుతంగా కూడా ఉంటాయంటారామె. "కృష్ణాలో ప్రతీ ఒక్కరికీ కావాల్సింది దొరుకుతుంది. ప్రతీ గార్మెంట్ వెనుక ఓ కథ ఉంటుంది. చేనేత కళాకారుల నుంచి సేకరించిన వస్త్రం, కళాకారులు శ్రమించి తయారు చెయ్యడం, అంతర్జాతీయ స్థాయిలో దుస్తుల్ని తీర్చిదిద్దడం మా ప్రత్యేకతలు. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా డిజైన్లలో మార్పులు చేస్తుంటాం. వారికి సరిపోయేలా దుస్తుల్ని తయారు చేసిస్తాం" అంటారు మాళినీ. అంతిమంగా సంప్రదాయాన్ని బతికించడమే మాళినీ లక్ష్యం. అందుకే ఆమె దుస్తుల్లో సంప్రదాయం ఉట్టిపడుతుంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన సంప్రదాయ కళలు, కళాకారులను ఏకతాటిపైకి తెస్తూ దుస్తుల్ని తీర్చిదిద్దుతున్నారు. ఫ్యాక్టరీలో లేజర్ ప్రింట్‌తో తయారయ్యే దుస్తులు తనకు నచ్చవంటారు. అదే భారతదేశంలోని గుజరాత్ నుంచి అజ్రఖ్ ప్రింటింగ్ అయినా... మహారాష్ట్రలోని ఖన్న్ అయినా... ఒడిషా నుంచి ఇక్కత్ అయినా తనను బాగా ఆకర్షిస్తాయి. వారి దుస్తుల్లో వీటి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. కాంజీవరం నుంచి తీసుకొచ్చిన కాటన్ చీరకు బళ్లారీ లంబాడీల ఎంబ్రాయిడరీ మిక్స్ చేస్తూ దుస్తులు తయారుచెయ్యడం మాలినీ ప్రత్యేకత. ఇలా వేర్వేరు సంప్రదాయాల్ని కలుపుతూ చక్కని డిజైన్స్‌ని ఆవిష్కరిస్తుంటారీమె.

"ఫ్యాషన్ అంటే బాహ్యమైనది కాదు... మనలో ఉన్నదే. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేదే ఫ్యాషన్. అంతర్జాతీయంగా, భారతదేశంలో ఈ తరం మహిళలు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ర్యాంప్ పై కనిపించే వాటిని అచ్చుగుద్దినట్టు ఫాలో అవట్లేదు. వారి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా దుస్తుల్ని ఎంచుకుంటున్నారు. మీరు ధరించిన వాటితో మీరు సౌకర్యవంతంగా ఉండటమే మీ ఫ్యాషన్ ను వివరిస్తుంది" అంటారామె.

ఈ రంగంలో దశాబ్దాల అనుభవం, టాప్ బ్రాండ్స్‌తో పనిచెయ్యడం మాలినీ ముద్దప్పను ఈ స్థాయిలో నిలబెట్టాయి. తాను పర్సనల్‌గా క్వాలిటీని చెక్ చెయ్యకుండా ఏ దుస్తుల్ని కస్టమర్లకు ఇవ్వరు. ఆమె తయారుచేసే దుస్తులకు కస్టమర్ల నుంచి వచ్చే పొగడ్తలే మరింత ప్రోత్సహాన్ని ఇస్తున్నాయి.