ఆరేళ్ల నుంచే పిల్లలకు ఆర్థిక విషయాలు నేర్పించవచ్చంటున్న ప్లేమూలా

మనీ మేనేజ్మెంట్‌ని పిల్లల ఆటగా మార్చేసిన ప్లేమూలాపిల్లలు, యువతకు ఆర్థిక పాఠాలు ఆర్థిక సంక్షోభం నుంచి నేర్చుకున్న పాఠాలే పునాదిప్రపంచంలో ప్రతీ పేరెంట్, పిల్లల చెంతకు చేరతామంటున్న ప్లేమూలా

ఆరేళ్ల నుంచే పిల్లలకు ఆర్థిక విషయాలు నేర్పించవచ్చంటున్న ప్లేమూలా

Thursday July 09, 2015,

4 min Read

మీకు ఆరేళ్ల పిల్లలు దాటిన ఉంటే వారికి ఏం నేర్పిస్తారు ? మహా అయితే ఆటలు, కాసిని పాటలు(రైమ్స్) అంతే. డబ్బులు, వాటి నిర్వహణ, పెట్టబడులు, సంపాదించడంలో ఉన్న తృప్తిలాంటివి తెలియచెప్పాలనే ఆలోచన వచ్చిందా ? జీవితం సౌకర్యవంతగా గడిపేందుకు మనీ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే పిల్లలకు ఈ విషయంలో కూడా మనమే నేర్పించాల్సి ఉంటుంది. ఓ ఆట రూపంలో ఈ అంశాలను చిన్నారులకు నేర్పించాలని ఆలోచించింది ఓ సింగపూర్ కంపెనీ. దాని ఫలితమే ప్లేమూలా గేమ్.

image


సంక్షోభంలో మొదలైన ఆలోచన

2008 ప్రాంతంలో మిన్ క్సువాన్ లీ, ఆడ్రే టాన్‌లు ప్రపంచం ఎదుర్కున్న ఆర్థిక సంక్షోభం ప్రభావంలో పడ్డారు. మనీ మేనేజ్‌మెంట్ ఎంత ప్రధానమైన విషయమో వారికి అప్పుడే అర్ధమైంది. డబ్బు.. మనుషుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో.. అప్పుడే ఆ యువకులకు అర్ధమైంది. దీని నిర్వహణ సరిగా లేకపోతే లైఫ్‌స్టైల్స్ ఎలా మారిపోతాయో తెలిసొచ్చింది. తోటి వారిలో చాలామంది ఎప్పటికీ తీర్చలేని అప్పుల్లో కూరుకుపోవడాన్ని వారు గమనించి ఆశ్చర్యపోయారు.

“అసలు పెద్దలు, పిల్లల్లో ఎంతమంది ఆర్థికంగా విద్యావంతులు ? వారి పిల్లలకు తల్లిదండ్రులు ఈ అంశంపై ఎంతవరకూ నేర్పిస్తున్నారు” అని తెలుసుకోవాలనుకున్నారు. దీనిపై చేసిన రీసెర్చ్‌లో వారికి ఆశ్యర్యపోయే ఫలితాలు వచ్చాయి. కేవలం 10శాతం కుటుంబాలు మాత్రమే... పిల్లలతో డబ్బు నిర్వహణ విషయంపై మాట్లాడుతున్నారనే విషయం అర్ధమైంది.

తప్పు ఎక్కడుందంటే...

ప్లేమూలాకు మిన్ క్సువాన్ లీ, ఆడ్రే టాన్‌లు సహ వ్యవస్థాపకులు. “డబ్బు అంశంలో పిల్లలు ఎక్కువగా నేర్చుకోరు. అలాగే ఆర్థిక అంశాలపై మాట్లాడేప్పుడు పెద్దలు కూడా పిల్లలు లేకుండా చూసుకుంటున్నారు. స్కూల్స్‌లో నేర్పుతున్న అంశాలన్నీ కేవలం పుస్తకాలకే పరిమితమవుతున్నాయి. మనీ మేనేజ్మెంట్‌లో నిపుణులుగా ఉన్న పేరెంట్స్ కూడా... పిల్లలను ఆర్థిక అంశాల్లో తీర్చిదిద్దలేకపోతున్నారు. ఈ అంశంలో మేమేం చేయగలమని ఆలోచించాం. తల్లిదండ్రులకు సహాయంగా ఉంటూ... పిల్లలకు ఆర్థిక అంశాలను నేర్పించేలా ప్లాట్‌ఫాం డిజైన్ చేయాలని భావించా. ఆ ఆలోచన నుంచి పుట్టినదే PlayMoolah” అంటున్నారు టాన్.

పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు, యువతకు ఆర్థిక అంశాలను నేర్పి, ప్రతిభావంతులుగా మార్చడం, నగదు నిర్వహణలో నిపుణులుగా చేయడాన్ని ఒక మిషన్‍గా చేపట్టారు ప్లేమూలా ఫౌండర్స్. 35 ఏళ్ల వయసు గలవారి వరకూ ఆర్థిక నియంత్రణ తమ యాప్స్ ద్వారా నేర్చుకోవచ్చంటున్నారు వీరు. పిల్లలు, పేరెంట్స్, యువత నగదు నిర్వహణను నేర్చుకునేందుకు అవసరమైన మొబైల్ సూట్, వెబ్ యాప్స్‌ను రూపొందించడానికి మూడేళ్ల ఈ సంస్థకు మూడేళ్ల సమయం అవసరమైంది. డబ్బుకు సంబంధించిన అంశాల్లో... కుటుంబంలోని పెద్దలు, పిల్లలు ఒకరికొకరు సహకరించుకునేందుకు ప్లేమూలా తోడ్పడుతోంది.

ప్లేమూలా నుంచి వైమూలా

తాజాగా వైమూలా పేరుతో కొత్త ప్రోడక్ట్ లాంఛ్ చేసింది ప్లేమూలా. దీనిద్వారా తమకు 35ఏళ్ల వయసొచ్చేవరకూ.. జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో యువతకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు. ఈ గేమ్‌లో ఒక అవతార్‌ను క్రియేట్ చేసి.. జీవితంలోని వివధ స్థాయిల్లో వ్యక్తులు ఎలా మార్పు చెందుతారో, ఆ అవతార్‌ని కూడా అలా మార్చుకోవచ్చు. పెళ్లి సమయంలో తీసుకునే నిర్ణయాలు, మొదటి ఇల్లు కొనుగోలు సమయంలో చేపట్టాల్సిన చర్యలు, ఇతర పెద్ద ఖర్చులను తట్టుకోవడానికి ఏం చేయాలి... వంటివి ఇందులో ఉంటాయి. పైకి కనిపించే ఖర్చులతోపాటే.. అంతర్గతంగా దాగి ఉండే ఖర్చులు, బడ్జెట్ వేసుకోవడం, ఆర్థిక నియంత్రణను పిల్లలు నేర్చుకోగలగుతారు. అప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతను ఈ యాప్ టార్గెట్ చేసింది. వీరు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించేది ఇప్పుడే. సుదీర్ఘ కాలానికి ఉపయోగపడేలా అవసరమైన డెసిషన్స్ తీసుకోవడం... వీరికి చాలా అవసరం.

టీం చిన్నదే అయినా యూజర్స్ ఎక్కువే

అతి తక్కువ మందితోనే ప్లేమూలా టీం రూపొందింది. ఈ కంపెనీలో అనుభవజ్ఞులైన ఆరుగురు మెంబర్లే ఉన్నారు. అయినా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 10వేలమందికిపైగా యూజర్స్‌ను సాధించింది ప్లేమూలా. అలాగే గ్లోబల్‌గా ప్రఖ్యాతి చెందిన డీబీఎస్, ఓసీబీసీ వంటి బ్యాంకులతో కీలక ఒప్పందాలు చేసుకుంది కూడా. ఆర్థిక సంస్థలకు తమ సాఫ్ట్‌వేర్‌లను లైసెన్స్‌ల రూపంలో అందిస్తోంది ప్లేమూలా. కస్టమర్లు కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకోడానికి ఇది ఉపయోగపడుతుండడంతో... బ్యాంకులు కూడా దీనివైపు మొగ్గు చూపుతున్నాయి. 2013 సంవత్సరానికిగాను ఏషియా పసిఫిక్ ఎకానమీ కార్పొరేషన్, విమెన్ అండ్ ది ఎకానమీ ఫోరంలు... యంగ్ విమెన్ ఇన్నోవేటర్స్ అవార్డును... ప్లేమూలా వ్యవస్థాపకులకు అందిచడం విశేషం.

తమ సక్సెస్ అవార్డులతో రాదనీ.... తాము రూపొందించిన ప్రోడక్టులు కస్టమర్లలో చైతన్యం కలిగించినపుడే అంటున్నారు ఈ యువతులు.

“డబ్బు విషయంలో యూజర్ల మైండ్‌సెట్ ఎలా మారుతోందనే అంశం పైనే మా విజయం ఆధారపడి ఉంది. ‘ప్లేమూలా ద్వారా డబ్బు విషయంలో నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఈ విషయాలు ముందే తెలిసి ఉంటే ఇంకా బాగుండేద’ని... మమ్మల్ని కలిసిన కస్టమర్లు చెబ్తున్నారు. మరో కస్టమర్ నాతో ఇలా అంది‘వారి పెళ్లికి ముందే ఈ నా ఫ్రెండ్స్ అందరికీ వైమూలా గేమ్ ఆడాలని రికమెండ్ చేస్తాను’అంది. ఈ వ్యాఖ్యలు మా సక్సెస్‌కు కొలబద్దల్లాంటివి ”అన్నారు ఆడ్రే.

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లన్నిటిలోనూ విస్తరించేందుకు ప్రణాళికలున్నాయి ఈ కంపెనీ దగ్గర.

“మేం ప్రారంభంలోనే సింగపూర్‌ను ఎంచుకోలేదు. మొదట యూఎస్ మార్కెట్‌ని పరిశీలించాం. ఆ తర్వాత ఏషియా మార్కెట్లపై దృష్టి పెట్టాం. అన్ని ప్రాంతాల్లోని చిన్నారులు, యువతకు నగదు నిర్వహణపై నేర్చుకోవాల్సిన అవసరముంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ముఖ్యంగా సింగపూర్ లాంటి ప్రాంతాల్లో సాధారణంగా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇండోనేషియాతోపాటు ఇతర ఆసియా దేశాల్లో అర్బన్ ప్రాంతాలు ఎక్కువగా ఉండే మార్కెట్లను లక్ష్యంగా నిర్ణయించుకున్నాం”అని చెప్పారు ఆడ్రే.

ఇండోనేషియాలో వీధి బాలల కోసం మైక్రోస్కూల్ పేరుతో ఉచిత వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తోంది ప్లేమూలా. ఈ టీం చేపట్టిన సామాజిక బాధ్యతా కార్యక్రమం ఇది. ధనికులు, పేదలకు కూడా డబ్బు నిర్వహణపై చైతన్యం అవసరమని ఈ కార్యక్రమం నిరూపించడం విశేషం. అయితే... ఇక్కడ డబ్బుని మెయింటెయిన్ చేయడంలో అనుసరించే పద్ధతులు మారతాయంతే.

రిటైర్మెంట్ వరకూ ప్రణాళికలు

తమ గేమ్‌లో యాభై సంవత్సరాల వయసులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, రిటైర్మెంట్‌ సమయానికి అవసరమైన నిధులు వంటి కాన్సెప్ట్‌లను కూడా జత చేస్తోంది ప్లేమూలా. ఇవాల్టి కోసం బతికితే చాలనే భావనను యువత నుంచి తరిమేసే లక్ష్యం నిర్ణయించుకుంది ఈ కంపెనీ. దీర్ఘకాల పెట్టుబడులపై అవగాహన, ఉపయోగాలను... చిన్నతనం నుంచే ఒక పాఠంలా తెలుసుకోవాలని అంటోంది ప్లేమూలా.

మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‍‌గా తన అనుభవాలను వివరించారు ఆడ్రే. “మహిళా వ్యవస్థాపకురాలిగా ముగింపు లేని ఒక ప్లాట్‌ఫాం ప్రయాణించడం చాలా గొప్ప విషయం. అయితే ఒక గొప్ప లక్ష్యం కోసం, చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం.. సుదీర్ఘ కాలం కొనసాగినా అందులో కష్టం ఉండదు. ఈ మిషన్‌పై నాకు పూర్తి విశ్వాసముంది. ఇందుకోసం ఇదే తరహా ఆలోచనలున్నవారితో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధమవుతున్నాం, మా ప్రయాణం ఇంకా చాలా దూరం కొనసాగాల్సి ఉందం”టున్నారు ఆడ్రే.

గుండె ఆగిపోయే టార్గెట్

టార్గెట్ విషయంలో ప్లేమూలా చెప్పే మాట వింటే ఎవరికైనా గుండె ఆగిపోతుంది. ప్రపంచంలో ప్రతీ పేరెంట్, ప్రతీ చిన్నారి చెంతకు చేరేందుకు ప్రయత్నిస్తున్నామని చెబ్తోందీ సంస్థ. పేదలు, ధనికులు అనే తేడా లేకుండా అందరి దగ్గరకు వైమూలా చేరాలని భావిస్తున్నామన్నారు. ప్రజలందరికీ ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రసాదించడమే తమ మిషన్ అంటున్నారు. ఈ లక్ష్యాన్ని అందుకోగలిగితే... ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవాన్ని తెచ్చినట్లే అంటున్నారు వారు. ప్రపంచం మరోసారి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేనాటికి... అందరూ ఆర్థికంగా అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం పప్లేమూలా రూపొందించిన గేమ్ వైమూలా... ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలపై ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతోంది. సింగపూర్‌లో మాత్రం ఐఓఎస్ ఆధారిత డివైజ్‌లకే పరిమితం.

వెబ్‌సైట్ : playmoolah