లాజిస్టిక్ కంపెనీల పరుగో పరుగు

0
ఫాస్ట్... స్పీడ్... ప్రస్తుతం లైఫ్ లో ఎక్కువగా వినిపించే పదాలు. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కు అలవాటుపడ్డారు జనం. వస్తువుల డెలివరీల విషయంలోనూ అంతే. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే గంటల్లో వస్తువు డెలివరీ కావాలి. ఇవాళ ఆర్డర్ ఇస్తే తెల్లారేసరికి చేతిలోకి వచ్చెయ్యాలి. కస్టమర్ల అభిరుచులు ఇలా మారుతున్న తరుణంలో లాజిస్టిక్స్ కంపెనీలు రేస్ లో నిలబడాలంటే మిగతా కంపెనీల కంటే నాలుగడుగులు ముందే ఉండాలి. కొన్నేళ్లుగా హైపర్ లోకల్ సేవలు పెరిగాయి. టైనీఓల్, గ్రోఫర్స్ లాంటి కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఈ హైపర్ లోకల్ సంస్థలకు సేవలందించే లాజిస్టిక్ పార్ట్ నర్స్ పెరుగుతున్నారు. ఇ-కామర్స్ కంపెనీల కన్నా ఎక్కువగా ఒప్పందాలు జరుగుతున్నాయి.


భారతదేశంలోని ఇ-కామర్స్ స్టార్టప్స్ వాటి నికర ఆదాయంలో 30 శాతం లాజిస్టిక్స్ పైనే ఖర్చుచేస్తున్నాయని లెక్క తేల్చింది టెక్నోప్యాక్ కన్సల్టింగ్ సంస్థ. ఇండియాలో లాజిస్టిక్స్ రంగం, ముఖ్యంగా ఇంట్రా-సిటీ మోడల్ అసంఘటితంగా ఉంది. స్టార్టప్స్ ఈ రంగాన్ని సంఘటితం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ది పోర్టర్, బ్లో హార్న్, మూవో లాంటి 15 ఆన్ లైన్ లాజిస్టిక్స్ కంపెనీలు గత 18 నెలల్లో మధ్యవర్తులు, దళారులను తొలగించేశాయంటే మార్కెట్లోకి ఎలాంటి ముద్రవేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ట్రక్కులు, మినీ ట్రక్కుల డ్రైవర్లు, ఓనర్లు... ఇండస్ట్రియల్, ఇ-కామర్స్ సప్లైస్, రీలొకేషన్ చేస్తూ సేవలందిస్తున్నారు. ఈ రంగంలో 2015లో సుమారు 37 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి. పలు కంపెనీలకు మార్కెట్లో తగినన్ని అవకాశాలున్నాయి కానీ పెరుగుదల విషయంలో కచ్చితమైన హామీలు కనిపించట్లేదు.

ఇంటర్ సిటీ ఆపరేషన్స్ ఆవశ్యకత

ఈ కంపెనీలన్నీ నగరంలోపల సేవలపైనే దృష్టి పెట్టాయని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు అల్వారెజ్, మార్సల్ మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ మేనేజ్ మెంట్ డైరెక్టర్ మనీష్ సైగల్.

"ఇంట్రా సిటీ సర్వీసులకు పరిమిత అవకాశాలుంటాయి. అదే ఇంటర్ సిటీ విషయమైతే ఆశాజనక రంగం అని చెప్పొచ్చు. తద్వారా ఎక్కువ నిధులు వస్తాయి. ఎక్కువ కార్యకలాపాలు జరుగుతాయి. మరింత మంది సిబ్బంది విధుల్లో ఉంటారు"- మనీష్.

ఇంట్రాసిటీ లాజిస్టిక్స్ సర్వీసెస్ లో కమిషన్ లు చాలా తక్కువని ఒప్పుకుంటారు ఢిల్లీకి చెందిన మూవో కో-ఫౌండర్ అంజనీ కుమార్. "ఇంటర్ సిటీ మార్కెట్ పెద్దగా ఉంటుంది. ఇంట్రా సిటీతో పోలిస్తే ఇంటర్ సిటీలో రెట్టింపుగా ఉంటుంది మా వ్యాపారం విలువ" అంటారు అంజనీ. డ్రైవర్లు, కస్టమర్ల విషయంలో తేడా ఏమీ ఉండదు. కానీ ఆఫ్ లైన్ ఆపరేషన్స్ వేర్వేరుగా ఉంటాయి. కాన్పూర్ లో ఇంటర్ సిటీ, బెంగళూరులో ఇంట్రాసిటీ మార్కెట్ కోసం మూవో త్వరలో పెద్దపెద్ద ట్రక్కులను ప్రారంభించబోతోంది. బెంగళూరుకు చెందిన లెట్స్ ట్రాన్స్ పో ర్ట్ కూడా వాహనాల సంఖ్య పెంచబోతోంది.

నగరాలు దాటడం వల్ల ఉండే లాభాలు

మెట్రో నగరాల బయట సంప్రదాయ వ్యాపారులు టెక్నాలజీ ఉపయోగించుకునేలా ఒప్పించడం ఆన్ లైన్ లాజిస్టిక్స్ ప్లాట్ ఫామ్స్ కు పెద్ద సవాల్. టైర్-2, టైర్-3 నగరాల్లో సేవలు ప్రారంభించాలంటే ఈ కంపెనీలకు ఇంకొన్నేళ్లు పడుతుంది. ఈ విషయంలో మరిన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ ప్రాంతాల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కొంత ఆలస్యమవుతుంది అంటారు మనీష్. అక్కడ అడుగు పెట్టాలంటే అప్పటికే సేవలు అందిస్తున్న స్థానిక వ్యాపారులతో పోటీపడి అదే రేటుకు అంతకంటే మెరుగైన సేవల్ని కంపెనీలు అందించాల్సి ఉంటుంది. టైర్-2 నగరాల్లో రాణించాలంటే మరో రెండేళ్లైనా పడుతుంది, అప్పట్లోగా టైర్-1 నగరాల్లో ఈ కంపెనీలు పరిణితి చెందుతాయని అంటారు క్విక్లీ కో-ఫౌండర్ రోహన్ దివానీ. కానీ ది పోర్టర్ కో-ఫౌండర్ ప్రణవ్ గోయల్ అభిప్రాయం వేరేలా ఉంది. "టైర్-2, టైర్-3 నగరాల్లో పెద్ద మార్కెట్ ఉంటుంది. టైర్-2 నగరాల్లో అడుగుపెట్టేముందు కనీసం మూడు నాలుగు పెద్ద నగరాల్లో ఆధిపత్యం చూపాలి" అంటారాయన. ప్రస్తుతం అమెజాన్, ఐటీసీ, డెల్హీవరీ, రోడ్ రన్నర్ లాంటి సంస్థలకు ది పోర్టర్ సేవలు అందిస్తోంది. ఇక బిగ్ బాస్కెట్, బిస్లరీ, గ్లోఫర్స్ లాంటి సంస్థలకు సేవలందిస్తున్న లెట్స్ ట్రాన్స్ పోర్ట్ కూడా అలాంటి ఆలోచనలే చేస్తోంది. "టైర్-2, టైర్-3 నగరాల్లో చాలా మార్కెట్ ఉంది. విస్తరణ కోసం మేం సర్వేలు చేస్తున్నాం. ఎలాంటి సేవలు అందించాలన్నదానిపై దృష్టిపెడుతున్నాం" అంటారు కో-ఫౌండర్ పుష్కర్ సింగ్.


అనుకూల పరిస్థితులు

వనరులను అనుకూలంగా మార్చుకుంటేనే లాభాలు వస్తాయి. ఆర్డర్స్ ను తక్కువ ధరలకు అందిస్తుంది క్విక్లీ. చిన్న మధ్యతరహా ఎంటర్ ప్రైజెస్, కిరాణాషాపులు, ఫార్మసీస్, కేఎఫ్సీ, సబ్ వే లాంటి రెస్టారెంట్స్ కు సేవలందిస్తుంది. ప్రతీ నెల 20 శాతం వృద్ధి కనిపిస్తుంది. టెక్నాలజీ, ట్రాకింగ్ లాంటి అంశాల గురించి కస్టమర్లు పెద్దగా పట్టించుకోరని అంటారు బ్లో హార్న్ కో-ఫౌండర్ మిథున్ శ్రీవాస్తవ. "కస్టమర్లు కేవలం విశ్వసనీయత గురించే ఆలోచిస్తారు. చిన్నమధ్యతరహా ఎంటర్ ప్రైజెస్ లాంటి మినీ ట్రక్కు కస్టమర్లు కూడా ఇవేవీ పట్టించుకోరు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు కూడా ట్రక్కు ఫుల్లుగా లోడ్ అయ్యే వరకు ఆగమని చెప్పవు. టైమ్ కు వస్తువుల్ని డెలివరీ చేయాలనే చెబుతాయి" అంటారాయన. కానీ ఇంట్రాసిటీ మార్కెట్ లో సరుకులకు తగ్గ వాహనాలను సిద్ధం చేసుకునే స్తోమత కంపెనీలకు ఉండదు. అందుకే మూవో లోడ్ పూలింగ్ పై ఆధారపడతుంది. ప్రస్తుతం మూవోకు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, గోజావాస్, డెల్ఫీవరీ లాంటి కస్టమ ర్ల నుంచి నెలకు 12 వేల ఆర్డర్స్ వస్తున్నాయి.

బరిలోకి కార్లు

గతేడాది ఓలా సరుకుల రవాణాను ప్రారంభించిన తర్వాత ట్యాక్సీలు కూడా లాజిస్టిక్స్ సెక్టారులోకి ఎంటరవుతున్నాయి. కొన్ని నెలల తర్వాత ఆన్ డిమాండ్ డెలివరీ సెక్టార్ లోకి ఓలా అడుగుపెట్టబోతోంది. ఓలా, ఉబర్ లు త్వరలో మార్కెట్లోకి వస్తాయని అంటారు లాజీనెక్స్ట్ కో-ఫౌండర్ ధృవిల్ సంఘ్వీ. "ఇందుకోసం కావాల్సిన వనరులు, టెక్నాలజీ వారి దగ్గరున్నాయి. ఇంకాస్త పెట్టుబడితో ఈ ప్రయోగంలో వాళ్లు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ" అంటారాయన. ఈ కంపెనీలు అడుగుపెట్టాయంటే ఆన్ డిమాండ్ డెలివరీ బిజినెస్ కు మంచి ఊపు రావడంతో పాటు, సాంకేతిక ఆవిష్కరణలు వస్తాయంటున్నారు వాలోరైజర్ కన్సల్టెంట్ లో పార్ట్ నర్, రవాణారంగ నిపుణులు జస్పాల్ సింగ్. "అతిపెద్ద కస్టమర్ నెట్ వర్క్ తో పాటు సరైన రవాణాతో ఈ కంపెనీలు రీటైలర్లకు మంచి ప్లాట్ ఫామ్ అందిస్తాయి. వీరి సాయంతో ఇతర కంపెనీలు వారి సరుకుల్ని వేగంగా రవాణా చేస్తాయి" అంటున్నారాయన. అయితే డెలివరీ ధర, వేగం లాంటి అంశాలు సవాల్ గా నిలుస్తాయి. పర్సనల్ ట్రాన్స్ పోర్టేషన్ లాగా క్యాబ్ లకు ఈ రంగంలో ఖచ్చితమైన అవకాశాలు ఉంటాయని చెప్పలేం అన్నది క్విక్లీకి చెందిన రోహన్ అభిప్రాయం. ఇలాంటి సేవలు అందించేందుకు ఊబర్, ఓలా లాంటి కంపెనీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలున్నా లాజిస్టిక్స్ విషయానికి వచ్చేసరికి సాంకేతిక అవసరాలు వేరే ఉంటాయని అంటారు బ్లో హార్న్ కు చెందిన మిథున్.

పోటీ: మార్కెట్ లో ఎదగడం, టెక్నాలజీ

ఆన్ డిమాండ్ లాజిస్టిక్స్ కంపెనీలకు టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కీలకం. "సప్లై చెయిన్ విషయంలో బుకింగ్స్ ని ట్రాక్ చేయడం, డెలివరీల కన్ ఫర్మేషన్, సప్లై చెయిన్ ని అప్ డేట్ చేయడం లాంటి సేవలు మెరుగుపర్చాల్సి ఉంటుంది. రియల్ టైమ్ మానిటరింగ్ అవసరం" అంటారు పుష్కర్. టెక్నాలజీపైన కోట్ల రూపాయలు వెచ్చించడం కంటే ముందు, ఈ రంగంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించే టాలెంట్ స్టార్టప్స్ కి ఉండాలంటారు లాజీనెక్స్ట్ కు చెందిన ధృవిల్.

యువర్ స్టోరీ మాట

ఆన్ డిమాండ్ లాజిస్టిక్స్ త్వరలో బాగా వృద్ధి చెందుతుంది. మరిన్ని నిధులు వస్తాయి. గత రెండేళ్లలో దేశంలో కనిపిస్తున్న పారిశ్రామిక వృద్ధిని గమనిస్తే... రికొంతమంది లాజిస్టిక్స్ రంగంలో అడుగు పెడతారనిపిస్తుంది. ప్రస్తుతం వస్తున్న హైపర్ లోకల్ స్టార్టప్స్ తో పరిశ్రమకు మంచి ఊపు వస్తుంది. ఔట్ సోర్సింగ్ డెలివరీ ప్రక్రియ అవసరానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటుంది. చాలాకాలంగా కేవలం స్థానికంగా నడుస్తూ, అసంఘటితంగా ఉన్న రంగం ఇప్పుడిప్పుడు పారదర్శకత, విశ్వసనీయత పెంచుకుంటున్నాయి. అయితే కస్టమర్ల అసరాలకు తగ్గట్టు సేవల్ని అందించే కంపెనీలే ఛాంపియన్లుగా నిలబడతాయన్నది వాస్తవం. సరికొత్త వ్యాపార వ్యూహాలతో వచ్చేవాళ్లు, ఇంటర్, ఇంట్రా సిటీ సర్వీసులకు వన్ స్టాప్ సొల్యూషన్ ఇచ్చేవాళ్లు, మొత్తం ప్రక్రియను టెక్నాలజీ సాయంతో సులభతరం చేసేవాళ్లు ముందువరుసలో ఉంటారు. నెమ్మదిగా, నిలకడగా ఉంటేనే విజేతలుగా నిలుస్తాం అంటారు కానీ.. లాజిస్టిక్స్ విషయానికి వస్తే నిలకడగా ఉండాలి, వేగంగా ఉండాలి.