రెస్టారెంట్‌కు వెళ్లక ముందే సీటు రిజర్వ్ చేసే ' డైన్ ఔట్ '

6 నెలల్లోనే లాభాలు ఆర్జించిన డైన్ ఔట్ నలుగురు స్నేహితులు ప్రారంభించిన స్టార్టప్రెస్టారెంట్లలో సీట్లను రిజర్వ్ చేసి పెట్టే డైన్ ఔట్

రెస్టారెంట్‌కు వెళ్లక ముందే సీటు రిజర్వ్ చేసే ' డైన్ ఔట్ '

Wednesday August 26, 2015,

3 min Read

స్టార్టప్ కంపెనీల్లో అతి తక్కువకాలంలోనే నిలదొక్కుకున్న కంపెనీ డైన్ ఔట్ (Dineout). ప్రారంభమైన ఆరు నెలల్లోనే డైన్ ఔట్ లాభాల్లో పయనించింది. వెబ్ సైట్ కేంద్రంగా నడుస్తున్న ఈ కంపెనీ రెస్టారెంట్లలో సీట్లను రిజర్వ్ చేసి పెడుతుంది. ఒక్క ఢిల్లీలోనే నెలకు 8 వేల నుంచి 10 వేలవరకూ సీట్లను రిజర్వ్ చేసి పెడుతోందంటే ఎంత విజయవంతంగా ఇది నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. రెస్టారెంట్స్ అన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావడం వాళ్లు చేసిన మొదటి పని. ఆ తర్వాత సీట్లను ముందే రిజర్వ్ చేసే వెసులుబాటు కల్పించడంతో రెస్టారెంట్ ఓనర్లకు బిజినెస్ పెరిగింది. దీంతో.. రెస్టారెంట్ల మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొంది.

2013 జనవరిలో యువర్ స్టోరీ నిర్వహించిన వెబ్ స్పార్క్ (WebSpark) పోటీల్లో డైన్ ఔట్ విజయం సాధించింది. క్వాల్‌కామ్ వెంచర్స్ (Qualcomm Ventures) తో కలిసి కన్జ్యూమర్ ఇంటర్నెట్ కంపెనీలకు యువర్ స్టోరీ ఈ పోటీలకు ఆహ్వానించింది. 40 కంపెనీలను వెనక్కినెట్టి డైన్ ఔట్ ఈ బహుమతి గెలుచుకుంది. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు వివేక్ కపూర్ (Vivek Kapoor), సాహిల్ జైన్ (Sahil Jain) లను సంస్థ ప్రస్థానంపై వివరించమని అడిగినప్పుడు వాళ్లు డైన్ ఔట్ గురించి చెప్పారు.

డైన్ఔట్ వ్యవస్థాపకులు

డైన్ఔట్ వ్యవస్థాపకులు


కీర్తి ప్రతిష్ఠలు ముఖ్యం

2012లో రూ.60 లక్షలతో డైన్ ఔట్ ను ప్రారంభించామన్నారు వివేక్. కొన్ని నెలలుగా ఇది నిలకడగా అభివృద్ధి సాధిస్తోంది. “ ఢిల్లీలోని రెస్టారెంట్స్ మమ్మల్ని ఓ ప్రధానమైన భాగస్వామిగా భావిస్తున్నాయి. ఎందుకంటే మేం వాళ్లకు గణనీయమైన వ్యాపారాన్ని అందిస్తున్నాం. ఇప్పుడు రెస్టారెంట్లు మా సైట్ లో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి ” అంటారు వివేక్.

ఇటీవలికాలంలో మేం సాధించిన ఈ ఘనత అంతా రెస్టారెంట్లది, మార్కెటింగ్ చేస్తున్న తన టీమ్‌దేనని చెప్తారు వివేక్. “ భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నాం. భారతీయుల సంపద బాగా పెరుగుతోంది. బయటికెళ్లి తినడం చాలా అలవాటుగా మారింది. భోజనప్రియులకు వాళ్లకు ఇష్టమైన ఆహారం ఎక్కడుందో సూచించడం, వాళ్లకు ఆ సౌకర్యాన్ని అందించడం.. లాంటి వ్యాపారానికి ఎంతో మార్కెట్ ఉంది. వ్యవహారం చిన్నదైనప్పటికీ రాబడి మాత్రం చాలా గణనీయంగా ఉంటుంది ” అంటారు వివేక్. వివేక్‌తో పాటు ఇప్పుడు పార్టనర్స్‌గా ఉన్న వీళ్లంతా నర్సరీ నుంచే కలిసుండడం విశేషం. “ మా మధ్య చాలా మంచి అవగాహన ఉంది. అందుకే మేం ఇంత సమర్థంగా పని చేయగలుగుతున్నాం..” అంటారు వివేక్.

ఎదురైన సవాళ్లు

అన్ని స్టార్టప్ కంపెనీలకూ ఎదురయ్యే సమస్యల లాగే దీనికి కూడా నియామకాలు పెద్ద సవాల్. అయితే.. వీళ్లంతా చాలా సమర్థులైన వాళ్లను తీసుకోగలిగారు. “ మేం మనుషులను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాం. సరైన వ్యక్తులను తీసుకోకపోతే మా కంపెనీ సమర్థంగా నడవలేదు. స్టార్టప్‌కి ఎలాంటి వాళ్లు అవసరమో అలాంటి వాళ్లనే ఎన్నుకున్నాం. మేం నలుగురం పనివిషయంలో రాజీపడం.. మొత్తం పనిని మేమే చేసి పెడతాం ” అంటారు వివేక్.

ఇక డైన్ ఔట్ కు ఎదురైన మరో సవాల్ రెస్టారెంట్స్ వ్యాపారం ఒక క్రమపద్ధతిలో లేకపోవడం. “ ప్రస్తుతం ఉన్న రెస్టారెంట్స్ వ్యవస్థను సమీకరించడం చాలా కష్టం. ఈ కష్టాలు భరించక తప్పదు. వినియోగదారులను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అధిగమించగలం” అంటారు వివేక్.

భవిష్యత్ ప్రణాళికలు

ఆరంభంలో మేం సమీకరించిన మొత్తమంతా వ్యాపారాన్ని విస్తరించడానికి, టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడానికి ఖర్చుచేశామని చెప్పారు వ్యవస్థాపకుల్లో ఒకరైన సాహిల్ జైన్. “మా మొత్తంలో 20శాతాన్ని మార్కెటింగ్ కోసం ఖర్చు చేశాం. ముంబై, పూణె, బెంగళూరులో శాఖలను ఏర్పాటు చేస్తున్నాం. మార్చిలో ముంబైలో, జూన్‌లో బెంగళూరులో.. ఆ మధ్యకాలంలోనే పుణెలో కూడా బ్రాంచీలను ప్రారంభిస్తాం ” అన్నారు సాహిల్. టెక్నాలజీపైనే వీళ్ల పెట్టుబడి మొత్తంలో 30-40శాతం వరకూ ఖర్చుచేశారు. డైన్ఔట్ కు ఆండ్రాయిడ్ యాప్‌తో పాటు పూర్తిస్థాయిలో పనిచేసే వెబ్ సైట్ కూడా ఉంది.

డీల్ డన్

2014లో డైన్ ఔట్‌ను టైమ్స్ సిటీ (టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సంస్థ) 10 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. డీల్ మొత్తంపై అధికారికంగా రెండు కంపెనీలూ స్పందించకపోయినప్పటికీ మార్కెట్ వర్గాలు మాత్రం ఇదే విషయాన్ని ధృవపరుస్తున్నాయి. మైల్ స్టోన్ పేమెంట్స్ కింద దాదాపు రూ.65 కోట్లు డైన్ ఔట్‌కు అందనుంది.

సెప్టెంబర్ 2015లో డైన్ ఔట్ సంస్థ బెంగళూరుకు చెందిన ఇన్ రెస్టోను కొనుగోలు చేసింది. దీని వల్ల రెస్టారెంట్ మేనేజ్‌మెంట్‌లో బి2బి సేవలను కూడా అందించడం సాధ్యపడ్తుంది.

ఒకప్పుడు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమైన వీళ్ల సేవలు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై సహా.. ఎనిమిది నగరాలకు విస్తరించింది. ఇప్పుడు కంపెనీ దగ్గర 20 వేలకు పైగా రెస్టారెంట్లు లిస్ట్ అయి ఉన్నాయి. 2 వేల రెస్టారెంట్లలో రియల్ టైంలో టేబుల్ బుక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.