ఎక్కడ ఏ ఆఫర్ ఉందో చెప్పేసే మొబైల్ యాప్

ఎక్స్ క్లూజివ్ ఆఫర్లన్నీ అరచేతిలో ప్రత్యక్షం జీపీఎస్ బేస్డ్ మొబైల్ యాప్ తయారు చేసిన కేరళ కుర్రాళ్లు

ఎక్కడ ఏ ఆఫర్ ఉందో చెప్పేసే మొబైల్ యాప్

Monday July 27, 2015,

4 min Read

ఓ న్యూ స్టార్ట్ అప్ ప్రారంభమైన విధంబెట్టిదనిన


రెగ్యులర్ ఆన్లైన్ షాపింగ్ సంగతి కాసేపు పక్కన పెడితే-పత్రికల్లోనో, టీవీల్లోనో, లేకుంటే హోర్డింగుల రూపంలోనో కనిపిస్తే తప్ప ఎక్కడ షాపింగ్ చేస్తే బెనిఫిటో, ఎవరు ఏ ఆఫర్ పెట్టారో కనుక్కోవడం కష్టమైన పనే. సరిగ్గా ఈ కాన్సెప్టు మీదే వర్కవుట్ చేస్తే పుట్టుకొచ్చింది ఒక యాప్. దానిపేరే షాప్ ఆన్ లేడీ.

యాప్ యాప్ హుర్రే హుర్రే!

కేరళలోని స్టార్ట్ అప్ విలేజ్. ఎన్నో కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్న వేదిక. ఉరిమే ఉత్సాహం, పుష్కలమైన టాలెంట్ ఉన్న ఎంతోమందికి అదొక మంచి ప్లాట్ ఫామ్. అలా కేరళ స్టార్ట్ అప్ విలేజ్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే 'అడిక్టివ్ ఇన్నోవేషన్స్' ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. ఆంటోనీ ఎస్ పాధడాన్, ఆంటో వర్గీస్, ఆషిక్ కళింగల్, అశ్విన్ చాకో, రోహిత్ కృష్ణన్, కిరణ్ కురియాస్, ఆదిత్య జోబ్. ఈ ఏడుగురు కుర్రాళ్లు ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరంలోనే ఓ స్టార్ట్ అప్ కి నాంది పలికారు. నెటిజన్ల అవసరాలన్నీ తీర్చేలా వెబ్ డిజైనింగ్, మొబైల్ సాఫ్ట్ వేర్ డెవలప్ మెండట్, సెర్చింజిన్ ఆప్టిమైజేషన్, సెర్చింజిన్ మార్కెటింగ్ వంటి సేవలు అందిస్తుంది వీరు ప్రారంభించిన అడిక్టివ్ ఇన్నోవేషన్స్.

షాప్ ఆన్ లేడీ టీమ్

షాప్ ఆన్ లేడీ టీమ్


యాప్ ఇలా తయారైంది

డిగ్రీలు తీసుకోగానే మొదట చేసిన పని యాప్ తయారు చేయడం. దానిపేరే షాప్ ఆన్ లేడీ ..ఇది ఒకరకంగా ఆన్ లైన్ జీపీఎస్ సిస్టమ్ వంటి అప్లికేషన్. యూజర్ల దగ్గరి ప్రదేశాల్లో ఏ షాప్ లో ఏఏ ఆఫర్లున్నాయ్..ఎలాంటి దుస్తులు ఉన్నాయ్..వాటి వెరైటీలు.. అలాగే గృహోపకరణాలు.. ఇవన్నీ కలిసి ఓ ఫ్యాషన్ జీపీఎస్ లాగా మహిళలకు ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ ను ఉపయోగించుకుని షాపింగ్ చేయవచ్చు. లేదంటే నచ్చిన వస్తువులను తర్వాత కొనుక్కునేందుకు సేవ్ చేయవచ్చు. లేదంటే ఇంకొకరికి షేర్ చేయవచ్చు. అవిగాకుండా ఏవైనా ప్రొడక్ట్స్ ఉంటే సేల్ కూడా చేయవచ్చు. దీన్ని ఆన్ లైన్ షాపింగ్ సైట్ లా కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇది రియల్ టైమ్ ఎక్స్ పీరియన్స్ ను కలగజేస్తుంది..అంటే నిజమైన ఐటెమ్స్ కన్పిస్తాయ్ ఈ అప్లికేషన్లో. మామూలుగా అయితే షాప్కి వెళ్లడం, కాసేపు విండో షాపింగ్ చేయడం..తర్వాత మరో షాప్ కి వెళ్లడం చేయాలి..కానీ ఇలా ఆన్ లైన్ రియల్ టైమ్ మార్కెట్ వల్ల మొబైల్ నుంచే ప్రతీ షాపునూ యాక్సెస్ చేయవచ్చు. అలానే మొబైల్ నుంచే ఆర్డర్ ఇవ్వడం ద్వారా డైరక్ట్ గా డెలివరీ కూడా తీసుకోవచ్చు అని అడిక్టివ్ ఇన్నోవేషన్స్ స్టార్ట్ అప్ బ్యాచ్ లో ఒకరైన ఆంటోనీ అంటాడు..

మిగిలినవాటికి దీనికీ తేడా ఏంటంటే..

మామూలుగా ఆన్ లైన్ సైట్ లో పర్టిక్యులర్ గా ఏదోక కంపెనీ ప్రాడక్ట్స్ ఉండొచ్చు. లేదంటే ఆ సైట్ అమ్మే వస్తువులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ షాప్ ఆన్ లేడీ అప్లికేషన్ ఆ ప్రదేశంలో దొరికే అన్ని ప్రొడక్ట్స్ వివరాలు ఇస్తుంది కాబట్టి ఆరకంగా ఇది ఇప్పటి రెగ్యులర్ ఇ-కామర్స్ సైట్లకి భిన్నంగా ఉందని స్పష్టమవుతోంది.

ఎన్ని షాపులు రిజిస్టర్ అయ్యాయంటే..

మరి ఇంత విన్నూత్నమైన అప్లికేషన్ పాపులర్ కావాలంటే ముందుగా ఇందులో వ్యాపారసంస్థలు రిజిస్టర్ చేసుకోవాలి..అందుకే షాప్ ఆన్ లేడీ చిన్నపెద్ద షాపులు, వాటితో పాటు ఫ్యాషన్ డిజైనర్లను, బొటిక్స్ యజమానులను తమ అప్లికేషన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది. ఇప్పటికే ఈ ఏడుగురు కుర్రాళ్ల టీమ్ కేరళలో 3500 బొటిక్స్, బ్యూటీ పార్లర్లు, జ్యూయెలరీ షాపులను తమ యూజర్లుగా రిజిస్టర్ చేసుకుంది.

బట్టల మీదే ఫోకస్

ఆండ్రాయిడ్ బేస్డ్ ప్లాట్ ఫామ్ తో యాప్ ప్రస్తుతం నడుస్తోంది. విమెన్ కేర్ ప్రొడక్ట్స్, కాస్ట్యూమ్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు కాబట్టి ఈ యాప్ ను విమెన్స్ డే న విడుదల చేసి తమ ప్రత్యేకత చాటారు. దానికి వచ్చిన రెస్పాన్స్ గురించి ఆంటోనీ ఇలా అన్నాడు..

"మొబైల్ యాప్ విడుదల చేసిన రోజు నుంచే 40 దేశాల నుంచి 12 వేల హిట్స్ వచ్చాయి. త్వరలోనే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ వెర్షన్ పై నడిచే యాప్ ను కూడా విడుదల చేస్తాం"

షాప్ ఆన్ లేడీలో ప్రత్యేకత ఏంటి?

షాప్ ఆన్ లేడీ వంటిదే మరొకటి గ్లిట్ స్ట్రీట్ అనే స్టార్టప్. అది ఢిల్లీ బేస్డ్ కంపెనీ. దానికీ షాప్ ఆన్ లేడీ కి తేడా ఏమిటంటే.. బొటిక్స్ ను వ్యక్తిగతంగా కలిసి మార్కెటింగ్ చేసుకోవడం గ్లిట్ స్ట్రీట్ కంపెనీ చేస్తుంటే.. షాప్ ఆన్ లేడీ మాత్రం దాని కన్నా బెటర్ మోడల్.. అలానే మొబైల్ యాప్ ద్వారా ఇలా విండో షాపింగ్ చేయడం లాంటివి చేస్తుంది. ఇదే షాప్ ఆన్ లేడీకి ఉన్న అడ్వాంటేజ్. ఇప్పటికే సక్సెస్ అయిన ' రోపోసో' దారినే ఇది కూడా ఎంచుకోవడంతో కేరళ స్టార్ట్ అప్ విజయవంతం అవుతుందనే అంచనాలున్నాయి. రోపోసో ఇండియన్ విమెన్ ఫ్యాషన్ లో వస్తున్న ట్రెండ్స్ ను ఫాలో అవుతూ ఎక్స్ క్లూజివ్ గా లేడీస్ ప్రొడక్ట్స్ కి సెర్చ్ ఇంజిన్ లా పని చేస్తూ పేరు తెచ్చుకుంది..

త్వరలో చెన్నై, బెంగళూరు

ఆన్ లైన్ మార్కెట్ ఈ కామర్స్ తో 2020కల్లా 70 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. జనాభా ఎక్కువ ఉన్న మనదేశంలో ఈ కామర్స్ విప్లవం స్టార్ట్ అప్స్ స్వర్ణయుగం అని నిపుణులు చెప్తున్నారు. ఓ రకంగా ఐటీ రివల్యూషన్ తర్వాత ఇప్పుడు ఈ కామర్స్ బూమ్ మొదలైంది. ఆకోవలో షాప్ ఆన్ లేడీ సూపర్ హిట్టవ్వడానికి అన్ని అవకాశాలూ పుష్కలంగా కనిపిన్నాయి. అతి పెద్దదైన మహిళల మార్కెట్ ను టార్గెట్ పెట్టుకోవడం, మొబైల్ యాప్ తో ఆన్ లైన్ షాపింగ్ వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తాయని భావించాలి. అడిక్టివ్ ఇన్నోవేషన్స్ చేపట్టే ఇతర డిజైన్ అండ్ డెవలప్ మెంట్ సర్వీస్ కు వచ్చే ఆదాయంతో ప్రస్తుతం షాప్ ఆన్ లేడీ నడుస్తోంది." 2013 లో డిగ్రీ తీసుకున్న తర్వాత స్కూళ్లు, మోటెల్స్ , వైఎంసీఏ, మేధర్ బిల్డర్స్, ఇండోసెర్ట్ వంటి సంస్థలకు వెబ్ ఆధారిత సేవలు అందించాం.. ఇప్పుడు మా ఫోకస్ అంతా షాప్ ఆన్ లేడీపై పెడుతున్నాం" అని ఆంటోనీ అంటున్నాడు.భవిష్యత్ తో కేరళలో తమ ప్రొడక్ట్ ను బాగా జనంలోకి తీసుకెళ్లాలని ఆ తర్వాత చెన్నై, బెంగళూరుకు విస్తారిస్తామని చెప్తున్నాడు. సో..వాళ్లకి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం