ఆ గ్రామం 21 దేశాలకు ఆదర్శం

ఆ గ్రామం 21 దేశాలకు ఆదర్శం

Wednesday June 24, 2015,

3 min Read

సొంతూరు రూపు రేఖల్నే మార్చేసిన పొపట్రావ్ పవార్...

ప్రభుత్వానికే ఆదర్శంగా నిలిచిన పవార్ పాఠాలు...

గ్రామంలో దోమను చూపించాలంటూ సవాల్...

పెళ్లికి ముందు పరీక్షలు ఈ గ్రామంలో తప్పనిసరి...

దేశ జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఇప్పటికీ గ్రామాల్లోనే నివసిస్తున్నారు. గ్రామీణ జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు కృషి చేసిన సామాజిక వ్యవస్థాపకుల గురించి మేం ఎన్నో కథనాలు రాశాం. దాహార్తితో అల్లాడుతోన్న పల్లెల్లో నీరు అందించిన వారు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిన వ్యక్తులు, ఆధునిక వ్యవసాయ పద్దతులు పరిచయం చేసిన దార్శినికులు ఇలా ఎందరో ఉన్నారు. కానీ తన గ్రామాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. దారిద్ర్యం తాండవిస్తున్న గ్రామాన్ని అభివృద్ధిలోనే ఆదర్శంగా నిలిపాడా వ్యక్తి. ఇవాళ మహారాష్ట్రవ్యాప్తంగా అతను ప్రవేశపెట్టిన విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలనుకుంటోంది. ఇవన్నీ సుసాధ్యం చేశారని చెప్పుకుంటున్న వ్యక్తే పొపట్రావ్ పవార్. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో హివారే బజార్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్. 20 ఏళ్లలో తన గ్రామ రూపురేఖల్నే మార్చేశారు. కరవుపీడిత ప్రాంతంగా ఉన్న హివారేబజార్‌ని పచ్చగా, సంపన్నఆదర్శగ్రామంగా చేసిన ఘనుడు పొపట్రావ్. అన్నాహజారే స్వగ్రామం రాలేగావ్ సిద్ధిని ఆదర్శంగా తీసుకుని తన గ్రామాన్ని అభివృద్ధిపథంలో ముందుకు నడిపించారు.

బంతిపూల తోటలో పొపట్రావ్ పవార్

బంతిపూల తోటలో పొపట్రావ్ పవార్


జాగృతి యాత్రలో ఉన్న మాకు మొదటిరోజే ఆయన్ని కలిసే సువర్ణావకాశం లభించింది. ఆ రోజు ఆయన 450 మంది యువకులనుద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగం నుంచి మేం ఆరు పాఠాలు నేర్చుకున్నాం. అవి మీకోసం..


1) ప్రజలకు అధికారం దక్కాలి..

గ్రామంలో తప్పనిసరిగా ఒక నాయకుడుండాల్సిన అవసరంలేదు. గ్రామాన్ని సాధికారితవైపు నడిపించే విధానం తెలియాలి. అదే పొపట్రావ్ సిద్దాంతాల్లో ముఖ్యసూత్రం. ఈ విధానమే గ్రామాభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకునేలా చేసింది. ప్రభుత్వం ఎప్పుడు నిధులు మంజూరు చేసినా గ్రామస్థులంతా ఓ చోట కూర్చొని చర్చించుకునేవారు. ఆ నిధుల్ని సమాజాభృద్ధికి ఎలా వినియోగించాలన్నదానిపై నిర్ణయాలు తీసుకునేవారు.. “గ్రామాలకు సంబంధించిన నిర్ణయాలు దిల్లీలో కూర్చొని తీసుకోకూడదు. పల్లెలకే ఆ అధికారం అవకాశమివ్వాలి, ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలు,తక్షణావసరాలేంటో వారికే తెలుసు కాబట్టి’’ అంటారు పొపట్రావ్.


2) గ్రామ వికాసానికి నీరే ఆధారం

మనదేశంలో చాలా గ్రామాల్లో నీటికొరతే ప్రాథమిక సమస్య. 20 సంవత్సరాల క్రితం హివారే బజార్ లోనూ ఇదే పరిస్థితి. ఇవాళ వారు అనుసరించే నీటి నిర్వహణ విధానాన్ని విశ్వవిద్యాలయాలు బోధిస్తున్నాయి. వారికిది ఎలా సాధ్యపడిందంటే ..? మొదట అధిక నీరు అవసరమయ్యే చెరకు, అరటి సాగు నిషేధం మొదలు పెట్టారు. ఆ తర్వాత వర్షపునీరు ఒడిసిపట్టే కాల్వల ఏర్పాటు చేయడంతో గ్రామావసరాలకంటే ఎక్కువనీరు సమకూరడమే కాకుండా పక్కగ్రామాలకు నీరు విక్రయించే స్థాయికి చేరుకున్నారు.


3) విద్య ఒక పెట్టుబడి

20 వసంతాల క్రితం ఈ ప్రాంతంలో అక్షరాస్యత 30శాతం, నేడు 95 పర్సెంట్. మంచి విద్యావ్యవస్థ నెలకొల్పేందుకు ఇక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడిపెట్టారు. ఫలితంగా హెవారెబజార్‌లో స్కూళ్లన్నీ ఫేమస్ అయిపోయాయి. ఎంతగానంటే చుట్టుపక్కల ఊళ్లనుంచి విద్యార్ధులు ఇక్కడకొచ్చి చదవుకునేంతగా. ‘నేతల విగ్రహాలు నెలకొల్పాలని మేం అనుకోం ఆ డబ్బుని పాఠశాలలపై పెట్టుబడి పెట్టాలని చూస్తాం అంటారు పొపట్రావ్. అవును పాఠశాలే పెట్టుబడి, అందుకే ఇవాళ ఆ పాఠశాలల్లో విద్యార్దులు ఎటువంటి రుసుము చెల్లించకుండా విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. చదువు పూర్తయ్యాక గ్రామంలోనే ఉంటామని ఒక్క సంతకం చేస్తే చాలు వారికి పూర్తిగా ఉచిత విద్యనందిస్తున్నారు.

ఆలోచనలకు ఆకాశమే హద్దు

ఆలోచనలకు ఆకాశమే హద్దు


4) ఉపాధి పెరిగేకొద్దీ పెదరికం తగ్గంది

ఈ రోజు ఇండియాలో నగరాల కంటే ఎక్కువ అభివృద్ధి చెందిందీ గ్రామం. ఊరు విడిచి వలస వెళ్లిన వారంతా మళ్లీ సొంతూరు బాటపట్టాలనుకుంటున్నారు. కేవలం మూడంటే మూడే కుటుంబాలు నేడు పేదరిక రేఖ దిగువున ఉన్నాయని పొపట్రావ్ సగర్వంగా చెప్పారు. అందరికీ ఉద్యోగం, ఉపాధికల్పన లక్ష్యాన్ని చేరుకునేందుకు రుణాల పంపిణీ ప్రారంభించారు. పాల వ్యాపారం, వడ్రంగి పని, టైలరింగ్ ఇలా అందరికీ ఆర్ధిక చేయూత కల్పించారు. అలానే ఇతర గ్రామాల నుంచి వచ్చే యువతకు ఉపాధి కల్పించడంలో వీరు సఫలీకృతులయ్యారు.


5) ఆసాధ్యం కోసం కష్టపడడం... అనుకున్నది సుసాధ్యం చెయడం

హివారెబజార్ విజయగాధ ఈ ఒక్క ఛాలెంజ్‌తో అర్ధం చేసుకోవచ్చు. “ఇక్కడ ఒక్క దోమను చూపించండి వంద రూపాయలు మీకు నీనిస్తా’’ అని పొపట్రావ్ సవాల్ విసిరారు. ఎందుకంటే గ్రామం మొత్తం ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది, దోమల ఆనవాళ్లే అక్కడ కనిపించవ్ మలేరియా అన్న మాటే వినిపించదు. ఈ అద్భుతంతో గ్రామం పేరు మార్మోగిపోయింది. రాజకీయనాయకులు, ప్రముఖులు, పర్యాటకులు ఇలా 21 దేశాల నుంచి ఇది ఎలాసాధ్యమయ్యింది అని తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చారు.

ఇది హివారే బజార్..ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు జరుగుతున్నాయి. హెచ్ఐవీ/ఎయిడ్స్ పై యుద్దంలో భాగంగా ప్రతీ జంట పెళ్లికి ముందు తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలనే నియమం పెట్టారు. భారతదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఒకే ఒక్క గ్రామం హివారే బజార్

నీటితో కళకళలాడుతున్న హివారే బజార్

నీటితో కళకళలాడుతున్న హివారే బజార్


6) ప్రభావం వ్యాప్తి..

హివారెబజార్ సాధించిన ప్రగతి మిగతా ప్రాంతాలకు విస్తరించాలనే సంకల్పంతో చుట్టుపక్కల ఊళ్లను దత్తత తీసుకోవాలని నిర్ణయించారు గ్రామస్థులు. హివారెబజార్ లో అనుసరించిన పద్ధతులనే అక్కడా అమలుచేయాలని నడుంబిగించారు. వాళ్లు దత్తత తీసుకున్న ఓ గ్రామం ఆత్మహత్యలకు బాగా అప్రసిద్ధి అలాంటి పల్లెలో ఇవాళ వెలుగులు నింపారు. దత్తత తీసుకుని హివారెబజార్ ఫార్ములా అమలుచేశారు. ఫలితంగా ఇప్పటివరకు ఒక్క ఆత్మహత్య కూడా చోటుచేసుకోలేదు. మరోవైపు పొపట్రావ్ అభివృద్ధి పనులును గుర్తించి మహారాష్ట్ర సర్కార్ రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మోడల్ విలేజ్ ప్రోగ్రామ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది.

**జాగృతి యాత్ర సిరీస్ లో భాగంగా ఈ కథనం మీకందిస్తున్నాం. జాగృతి సహకారంతో సామాజిక కథనాలు ప్రచురిస్తున్నాం. జాగృతి యాత్రలో ఉన్న అలెసియో పిరోని ఈ కథనాన్ని మనతో షేర్ చేసుకున్నారు.