సింహం, పులి, చిరుత... వీటిల్లో మీరు ఎలాంటి నాయకుడు ?

- నాయకుల్లో మూడు రకాలు.. సింహం, పులి, చిరుత..- రాచఠీవికి, గంభీరమైన నాయకత్వానికి సింహం ప్రతీక..- తెలివైన, బలమైన, ముందుచూపున్న లీడరంటే ..పులే..- వేగం, నైపుణ్యం గల పారిశ్రామిక వేత్త ..చిరుత

సింహం, పులి, చిరుత... వీటిల్లో మీరు ఎలాంటి నాయకుడు ?

Wednesday June 17, 2015,

3 min Read

నాయకులు మూడు రకాలు. ఒకరు గంభీరమైన రాచఠీవితో సింహంలా ప్రవర్తిస్తారు. ఇంకొకరు తెలివి, బలం, ముందుచూపును నమ్ముకుని పులిలా పనిచేస్తారు. ఆఖరి వర్గం చిరుత.. ఈ కోవకు చెందిన పారిశ్రామికవేత్తలకు అమితమైన వేగం, నైపుణ్యం వుంటాయి.. ఇందులో మీరెవరో ఓసారి సరిచూసుకోండి.

image


ఒకరోజు నేను నా మూడేళ్ల కొడుకుతో యానిమల్ ప్లానెట్ ఛానల్ లో ఓ కార్యక్రమాన్ని చూస్తున్నా. అది ఇతర జంతువుల్ని సింహం, పులి,చిరుత లు ఎలా వేటాడుతాయనే దానిపై రూపొందించిన ప్రోగ్రామ్. ఈ మూడూ చాలా భయంకరమైన జంతువులు. దేనికవే ప్రత్యేకమైన శైలిని, ఆకారాన్ని, ఆహార్యాన్ని కలిగి వుంటాయి. ఆహారపు అలవాట్లు, శరీరతత్వం కూడా వాటికి ఆ గాంభీర్యాన్ని తెచ్చిపెట్టాయి.

ఆ డాక్యుమెంటరీ చూస్తుంటే ఎందుకో కొన్ని కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. మనలో కూడా సింహాలు, పులులు, చిరుతలు వుంటారు. కానీ వాళ్లను గుర్తించడమెలా..? ప్రతిఒక్క నాయకుడు లేదా ఔత్సాహిక పారిశ్రామిక వేత్త కూడా ప్రత్యేకమైన పనిచేసే శైలిని కలిగివుంటారు. ప్రధానంగా అలాంటి నాయకులను మూడు రకాలుగా విభజించవచ్చు . వాళ్లు.. సింహం, పులి, చిరుత.

image


సింహం

సింహం అంటేనే మనకు గుర్తుకొచ్చేది గంభీరమైన చూపు, జూలు. బలిష్ఠమైన శరీరం , రాజసమైన గర్జన. ఇవే దానికి ఆ రాచఠీవిని కట్టబెట్టాయి. ఇవే సింహానికి ఆ పేరును, ప్రఖ్యాతిని తెచ్చిపెట్టాయి. కానీ మీకు తెలుసో లేదో.. మగ సింహాలు వేటాడవు. దీన్ని గర్వం, పొగరు, అహంకారం చివరకు సోమరితనం.. ఇలా ఏమైనా అనుకోవచ్చు. అయితే ఆడ సింహం వేటాడి ఆహారాన్ని తెస్తే మాత్రం.. ముందుగా తినేది మగ సింహమే.

చాలామంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు , వ్యాపారులు సింహాల్లానే వుంటారు. వాళ్ల బలమైన శరీరం, శక్తివంతంగా జీవించే విధానం ఇతరులకు భయాన్ని, భక్తి లేదా గౌరవ భావాన్ని కలిగేలా చేస్తాయి. అలాగని వాళ్లు ఒక్కరే సంస్థలో బండెడు చాకిరీ చేసేస్తారని కాదు. పడే కష్టం, ఎంతకూ ఎడతెగని పని ఇదంతా... వాళ్ల అదుపులో వుండే ఉద్యోగులు చేసేదే. కానీ నాయకత్వ లక్షణాలతో వున్న వీళ్లే ఆ సంస్థకు బలం, వాళ్ల ఆలోచనలతోనే అది బాగా నడుస్తుంటుంది. వాళ్లు తమ ఉద్యోగులను ఎప్పుడూ రక్షించుకుంటూ వుంటారు. అలాగే కంపెనీని కూడా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ నాయకులు, లేదా వ్యాపారవేత్తలు అస్సలు అధైర్య పడరు. వాటిని పరిష్కరించే విషయంలో అయితే ఎక్కడా రాజీపడరు. వాళ్ల తెలివితేటలు, జ్ఞానమంతా ఆ గంభీరతే. అదే వాళ్ళను అత్యంత జాగ్రత్తగా..ముందు వెనకా ఆలోచించి నడుచుకునేలా చేస్తుంది.

image


పులి

పులులు ఎప్పుడూ గుంపులుగా వేటకు దిగవు. వెళ్తే ఒంటరిగానే వెళ్తాయి. నిజానికి పులులు ఆయా జాతి సమూహాల మధ్యే జీవిస్తాయి. పులి పంజాకు పవర్ ఎక్కువ. అందుకే ఇది శక్తికి ప్రతీక. పులి వేటాడేటప్పుడు, పిల్లిలాగా నక్కి ముందుకెళ్తుంది. చాలా దూరదృష్టితో , తీక్షణంగా చూస్తుంది. ఏకాగ్రతగా వుంటుంది. మెల్లగా వెళ్లి ఒక్కసారి చంపాలనుకున్న జంతువుపైకి చొరబడుతుంది. ఏ పారిశ్రామికవేత్తకైతే పులి లాంటి లక్షణాలు వుంటాయో... వాళ్లు పోటీదారులకోసం నిరంతరం ఎదురుచూస్తూ వుంటారు. ఏ కంపెనీ సరిగా పనిచేయడంలేదో వాళ్లు బాగా గ్రహించగలుగుతారు. ఇనుము వేడిమీద వున్నప్పుడే మనకు కావాల్సిన ఆకారంలో వంచగలమనే భావనలో వుంటారు. పులి 8 నుంచి 9 రోజులకు ఒకసారే వేటాడుతుంది. ప్రతి వేటకూ దానికి కనీసం 18 కిలోల మాంసం అవసరమవుతుంది. ఆ మాంసంతోనే మళ్లీ వేటాడే వరకు అది తనను తాను పోషించుకుంటుంది. ఇలాంటి వ్యాపారవేత్తలే.. ఎప్పుడు ఏం చేయాలి అనే పక్కా ప్రణాళికతో వుంటారు. అయితే ఎక్కువగా సందేహంతో కలవరపడుతుంటారు. పులులు కూడా అంతే. వేటాడే సమయంలో అవి చాలా వేగంగా, దూరంగా లంఘిస్తాయి. కానీ అప్పుడప్పుడూ విఫలమవుతుంటాయి. అయినా సంయమనాన్ని కోల్పోవు. ఎంతో సహనంతో వుంటాయి. మళ్లీ చంపాలనుకున్న జంతువు గొంతు పట్టుకునే వరకు విశ్రమించవు. అవి చచ్చే వరకు వేచి చూస్తాయి. ఈ సహనమే తమకు తగిన ప్రతిఫలాన్ని అందిస్తాయని ఆ పులులకు బాగా తెలుసు. పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహికులు కూడా అంతే. వాళ్ల శక్తి సామర్థ్యాలపై నమ్మకముంటుంది. అవే ఎన్నో అవకాశాలను, అడ్డంకులను, పరిష్కారాలను చూపుతాయి. చుట్టూ వున్న అందరిలోకంటే గొప్ప నాయకులుగా తయారు చేస్తాయి.

image


చిరుత

చిరుత విషయానికొస్తే.. ఇది కూడా పులిలాగే. ఒంటరిగా వేటకెళ్తుంది. అయితే.. చిరుత శక్తివంతమైంది కాదు. చాలా వేగవంతమైంది. చిరుతలోని ఆ వేగమే దాన్ని సింహం, పులి లాంటి భయంకర మృగాల సరసన నిలబెట్టింది. ఏ పారిశ్రామికవేత్తలయితే వేగంగా, దూకుడుగా వెళ్లాలనుకుంటారో.. వాళ్లు చిరుత వర్గానికి చెందుతారు. ఇలాంటి వాళ్లు బృందాలతో కలిసి సమర్థవంతంగా పనిచేయరు. ఒకవేళ అలా పనిచేయాల్సి వస్తే.. బృందంలోని మిగిలిన వాళ్లకంటే చాలా ఎక్కువ పనిని సొంతంగా చేసేస్తారు. చిరుతలు పరుగు వీరులు. కానీ.. ఎంతో దూరం ఆ వేగవంతమైన పరుగును కొనసాగించలేవు. అవి పరిగెత్తేది కొంచెం దూరమే అయినా.. అత్యంత వేగంగా దూసుకెళ్తాయి. ఇలా చిరుతల్లా వ్యవహరించే నాయకులు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పనిని చేసేస్తారు. ప్రతి పని ముగిసిన తర్వాత వాళ్లకు కచ్చితంగా విశ్రాంతి అవసరం. ఇలాంటి వ్యాపారవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చాలా బిడియంగా, వినమ్రతతో వుంటారు. విజయాలను అందుకోవడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఎలా చేస్తే సక్సెస్ వరిస్తుందో వీళ్లకు బాగా తెలుసు. అందుకే పెద్ద పెద్ద జంతువులు కూడా చిరుతలకు ఎర(ఆహారం)గా మారిపోతుంటాయి. ఇలాంటి వాళ్లు అధికారం కోసం అనవసరంగా ప్రయాసపడరు. కేవలం చేసే పనినే నమ్ముకుంటారు. అందులోనే నైపుణ్యాన్ని సాధిస్తారు.

చూశారుకదా.. సింహం, పులి, చిరుత ప్రవర్తనలు.. వేటాడే విధానం. మరీ మీరు ఏ వర్గానికి చెందుతారు..?

గెస్ట్ రైటర్ - అయ్యప్ప నగుబండి, ఆంట్రప్రెన్యూర్ - హైదరాబాద్