మానసిక సమస్యలకు జంతువుల సాయంతో వైద్యం !

వినూత్న తరహా వైద్య సేవలు అందిస్తున్న యానిమ‌ల్ ఏంజెల్స్‌ఆరోగ్య‌, మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు శున‌కాల‌తో చికిత్స ముంబై, హైద‌రాబాద్‌, నాసిక్‌ల‌లో జంతు వైద్యం అందిస్తున్న రోహిణి, రాధిక‌యానిమల్ థెర‌పీలో గుర్రాలు, ప‌క్షులు, చేప‌లు, జింక‌లూ భాగ‌మే!

మానసిక సమస్యలకు జంతువుల సాయంతో   వైద్యం !

Wednesday June 24, 2015,

4 min Read

మ‌న‌కు ఆరోగ్య, మాన‌సిక స‌మ‌స్య‌లు త‌లెత్తితే ఏం చేస్తాం.. ఎవ‌రో ఒక డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లి వైద్యం చేయించుకుంటాం. ఆయ‌న రాసిన మందు బిళ్లల‌ను మింగి కోలుకుంటాం. ఐతే యానిమ‌ల్ థెర‌పీ ద్వారా కూడా మాన‌సిక, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ చెప్పే విధానం ఉంద‌న్న విష‌యం ఎంత‌మందికి తెలుసు ? భార‌త్‌లో ఇప్పుడిప్పుడే ఈ థెర‌పీ ప్ర‌వేశిస్తున్న‌ప్ప‌టికీ విదేశాల్లో మాత్రం ఎప్ప‌టినుంచో ఉంది. శున‌కాలు, గుర్రాలు, జింక‌లు, ప‌క్షులు, పిల్లులు, చేప‌ల‌ను ఈ థెర‌పీలో వినియోగిస్తున్నారు. ఇలాంటి చికిత్స‌ల‌ను అందించే యానిమ‌ల్ ఏంజెల్స్ థెర‌పీ ముంబైలో ఉంది..

ఫ్లూడో లాబ్రాడ‌ర్ బ్రీడ్ శున‌కం. ఇప్పుడు థెర‌పీ డాగ్‌గా ప‌నిచేస్తున్న‌ది. ఈ శున‌కం వారం మొత్తం బిజీగానే ఉంటుంది. ముంబైలోని స్కూళ్ల‌లో చిన్నారుల‌తో క‌లిసి మెలిసి తిరుగుతుంది.. థెర‌పీలో భాగంగా పిల్ల‌ల‌ను సంతోష‌పెడ‌తుంది. వారిని మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ప‌డేందుకు స‌హ‌క‌రిస్తుంది. ఫ్లూడో అందిస్తున్న చికిత్స అంత చిన్న‌దేమీ కాదు.. లైంగిక వేధింపుల‌కు గురై, జీవితం అంటేనే విర‌క్తి క‌లిగిన ఓ 12 ఏళ్ల బాలిక‌ను మ‌ళ్లీ సాధార‌ణ చిన్నారిగా మార్చింది. లైంగిక వేధింపుల త‌ర్వాత ఆ చిన్నారి ఎప్పుడూ ఒంట‌రిగా, ఏదో కోల్పోయిన‌ట్టుగా గ‌డిపేది. ఎవ‌రితోనూ క‌లిసేది కాదు, మాట్లాడేది కాదు. త‌న కుడిచేతిని ఛాతికి ద‌గ్గ‌ర‌గా మ‌డిచిపెట్టుకునేది. రాసేందుకు కూడా ఇష్ట‌ప‌డేది కాదు. ఏదో మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డేది. ఫ్లూడోతో ఆడుకున్న త‌ర్వాత ఆ స‌మ‌స్య‌ల నుంచి ఆ బాలిక బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగింది. ఇప్పుడు సంతోషంతో గ‌డుపుతుంది, న‌వ్వుతుంది, అంద‌రితోనూ ఆడుకుంటున్న‌ది. ఇప్పుడు త‌న చేతితో ఫ్లూడోను నిమురుతూ ఆడుకుంటున్న‌ది కూడా.

యానిమ‌ల్ అసిస్టెడ్ థెర‌పీ

శున‌కాల‌తో చేస్తున్న చికిత్స‌ను యానిమ‌ల్ అసిస్టెడ్ థెర‌పీ (ఏఏటీ)గా పిలుస్తారు. ఆరోగ్య‌, మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి చిన్నారులు, పెద్ద‌లు, వృద్ధులు కోలుకునేందుకు శిక్ష‌ణ పొందిన శున‌కాల‌తో థెర‌పీ ఇవ్వ‌డం ఇప్పుడు పెరిగిపోయింది. ఈ రంగంలో తొలిసారిగా చికిత్స అందిస్తున్న యానిమ‌ల్ ఏంజెల్స్ ఫౌండేష‌న్‌లో ఫ్లూడో ఇప్పుడో భాగం. ఈ సంస్థ‌ను క్లినిక‌ల్ సైకాల‌జిస్ట్‌, స‌ర్టిఫైడ్ ఏఏటీ ప్రాక్టీష‌న‌ర్స్ రోహిణీ ఫెర్నాండెజ్‌, రాధికా నాయ‌ర్‌లు 2005లో ఏర్పాటు చేశారు. ఆరంభంలో ఒకే ఒక్క లాబ్రాడ‌ర్ డాగ్‌తో చికిత్స అందించేవారు. ఇప్పుడు 20 శున‌కాలు వీరి సంస్థ‌లో ఉన్నాయి.

రోగుల‌తో ఫ్లూడో..

రోగుల‌తో ఫ్లూడో..


మాన‌సిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌వారికి శున‌కాల‌తో చికిత్స ఇవ్వాల‌న్న ఆలోచ‌న రోహిణికి మాస్ట‌ర్స్ డిగ్రీ చేస్తుండ‌గా వ‌చ్చింది. జంతువులంటే అంత‌గా ఇష్ట‌ప‌డ‌ని కుటుంబం నుంచి రోహిణికి ఒక శున‌కాన్ని పెంచుకోవాల‌న్న కోరిక క‌లిగింది. త‌న క్ల‌యింట్ల‌కు యానిమ‌ల్ అసిస్టెడ్ థెరపీ కోసం ఉప‌యోగ‌ప‌డేలా శున‌కాల‌ను ఉప‌యోగించ‌డంపై రీసెర్చ్‌, స్పెష‌లైజేష‌న్స్ చేశారు. త‌న లాబ్ర‌డ‌ర్ ఏంజెల్‌ను తొలి థెరాపెట్‌గా ఆమె ఉప‌యోగించారు. అదే ఆమె సంస్థ‌కు ఏనిమ‌ల్ యాంజిల్స్ అనే పేరు పెట్టేలా స్ఫూర్తి క‌లిగించింది.

థెర‌పీ డాగ్స్‌కూ ప‌రీక్ష‌లు !

ఐతే అన్ని శున‌కాలు థెర‌పీకి ప‌నికిరావు. అలాగే ఏఏటీ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా పేషంట్లతో ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ప్పుడు ఎంతో ఒత్తిడికి గురి కావాల్సి వ‌చ్చింది. థెర‌పీ స‌మ‌యంలో శున‌కాలు రెచ్చిపోకుండా, చ‌క్క‌గా స్పందించేలా చూసుకోవాల్సి వ‌చ్చింది. యానిమ‌ల్ ఏంజెల్స్ కోసం మంచి ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన‌, స్నేహ‌పూర్వ‌కంగా మెసిలే, శారీర‌కంగా, మాన‌సికంగా ఆరోగ్యంగా ఉండే వాటిని మాత్ర‌మే ఎంపిక‌చేసి శిక్ష‌ణ ఇస్తారు. సంస్థ‌కు అవ‌స‌ర‌మైన ల‌క్ష‌ణాలు ఉన్నాయో, లేవో ప‌రీక్షించేందుకు ఓ టెస్ట్ కూడా నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాతే రిజిస్ట‌ర్ చేసుకుంటారు. 

"చికిత్స‌కు ఉప‌యోగించే శున‌కాలు సున్నితంగా మ‌సులుకునేలా శిక్ష‌ణ ఇస్తాం. చిన్నారులు వాటి తోక‌ల‌తో ఆడుకున్నా ఏమీ అన‌కుండా చూసుకుంటాం. ఒక‌వేళ క్ల‌యింట్స్ చేసేది న‌చ్చ‌కుంటే అక్క‌డి నుంచి వెళ్లిపోయేలా శిక్ష‌ణ ఇచ్చాం. కానీ ఎప్పుడూ అర‌వ‌డం కానీ, కొర‌క‌డం కానీ చేయ‌వు" అని రోహిణి వివ‌రించారు.

ట్రైన్డ్ సైకాల‌జిస్ట్స్‌

యానిమ‌ల్ ఏంజెల్స్‌లో న‌లుగ‌రు శిక్ష‌ణ పొందిన సైకాల‌జిస్టులు ఉన్నారు. వీరు ముంబై, హైద‌రాబాద్‌, నాసిక్ న‌గ‌రాల్లో 10 వివిధ స్కూల్స్‌, కిండ‌ర్‌గార్టెన్‌, మెంట‌ల్ హెల్త్ సెంట‌ర్స్‌ను త‌రుచుగా సంద‌ర్శిస్తారు. ఇప్పుడైతే ఈ ర‌క‌మైన థెర‌పీకి ఒప్పుకుంటున్నారు కానీ.. సంస్థ‌ను ప్రారంభించిన కొత్త‌లో రోహిణి, రాధిక ఎన్నో అడ్డంకుల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. శున‌కాల‌తో చికిత్సా అంటూ చాలా మంది అదో ర‌కంగా మాట్లాడేవారు. ఇండియాలో ఈ సంస్థ ఏర్పాటుకు ముందు ఎవ‌రూ కూడా యానిమ‌ల్ థెర‌పీ గురించి విని ఉండ‌లేదు. "ఇలాంటి చికిత్స ప‌ట్ల ప్ర‌జ‌లు అనుమానాస్ప‌దంగా చూసేవారు. శున‌కాలు మురికిగా ఉంటాయ‌ని, ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని భావించేవారు" అని రోహిని వివ‌రించారు. శున‌కాల కోసం వెత‌క‌డం, వాటిని ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్ల‌డం కోసం ఆమె చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ముంబై వంటి న‌గ‌రాల్లో శున‌కాల ర‌వాణ అంత సుల‌భంగా ఉండేది కాదు. ఇప్పుడు ముంబైలో వివిధ ప్రాంతాల్లో ఈ సంస్థ‌కు నెట్‌వ‌ర్క్స్ ఉన్నాయి. చికిత్స ఎక్క‌డ చేయాలో, ఆ ప్రాంతానికి స‌మీపంలో ఉన్న శున‌కాల‌ను రోహిణి, రాధిక త‌మ‌తో తీసుకెళ్తున్నారు.

పెట్ థెర‌పీతో ఉప‌యోగాలు

"శున‌కాల‌ను చిన్నారులు త‌మ స్నేహితుల్లా భావిస్తారు. పెద్ద‌లు వాటిని త‌మ పిల్ల‌లా చూసుకుంటారు" అని అంటారు రోహిణి. ఈ సంబంధ‌మే స‌మ‌స్య నుంచి వారు బ‌య‌ట‌ప‌డేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆమె అభిప్రాయం. శున‌కాల‌తో గ‌డుపుతున్న స‌మ‌యంలో త‌మ స‌మ‌స్య గురించి పూర్తి వివ‌రాలు అంద‌జేస్తార‌ట‌. ఆటిజంతో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు శున‌కాల‌తో ఆడుకోవ‌డం ద్వారా సోష‌ల్ స్కిల్స్‌, భావాలు వ్య‌క్తిక‌రించే, మాట్లాడే ల‌క్ష‌ణాలు అల‌వాడుతాయి. మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారులు శున‌కాల‌ను పెంచ‌డం, వాటిని ఆడించ‌డం ద్వారా మెంటార్‌, ఆర్గ‌నైజేష‌న‌ల్ స్కిల్స్ పెరుగుతాయ‌ని సైకాల‌జిస్ట్‌లు అంటారు. ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డం, బాధ్య‌త‌ల‌ను గుర్తించ‌డంతోపాటు త‌మ ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌ల‌న్న ఆస‌క్తి కూడా పిల్ల‌ల్లో పెరుగుతుందన్న‌విష‌యాన్ని సైకాల‌జిస్టులు గుర్తించారు. చిన్నారుల‌కు శున‌కాల‌పై న‌మ్మ‌కం పెరిగి, వాటితో మంచి అనుబంధాన్ని పెంచుకుంటారు. ఈ ప్ర‌త్యేక సంబంధం ప్ర‌భావ‌వంత‌మైన చికిత్స అందించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

డాగ్‌తో ఆడుకుంటున్న చిన్నారి

డాగ్‌తో ఆడుకుంటున్న చిన్నారి


బైపోల‌ర్ డిజార్డర్, మాన‌సిక చింత‌, పార్కిన్స‌న్స్ వంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న పెద్ద‌లు.. శున‌కాల‌తో ఆడుకోవ‌డం ద్వారా రిలీఫ్‌గా ఫీల‌వుతున్నార‌ట‌. నొప్పి త‌గ్గ‌డం, మాన‌సిక ప‌రిస్థితుల్లో మార్పు రావ‌డం, శక్తి పుంజుకోవ‌డం, ఓర్పు పెర‌గ‌డం, మాన‌సికంగా ధృడంగా త‌యారవ‌డం వంటి మార్పులు సంభ‌విస్తున్నాయ‌ట‌. జంతువుల‌తో గ‌డ‌ప‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్ లెవ‌ల్స్ పెరిగి ఆత్మ విశ్వాసం, ఉత్సాహం రేకెత్తుతున్నాయ‌ని నిర్వాహకులు చెబ్తున్నారు. అలాగే ఒంట‌రి అనే భావ‌న కూడా త‌గ్గిపోతుందని సైకాల‌జిస్టులు వివ‌రిస్తున్నారు. శారీర‌కంగా, లైంగికంగా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న వారు సైతం ఈ చికిత్స త‌ర్వాత ప్ర‌జ‌ల‌తో క‌లిసి మెలిసి ఉంటున్నార‌ని చెప్తున్నారు.

ఏఏటీలో ఎక్కువ‌గా వినియోగిస్తున్న జంతువులు శున‌కాలే. ఎందుకంటే ఇవి సుల‌భంగా శిక్ష‌ణ పొంద‌గ‌లుగుతాయి. రొట్టావైల‌ర్ వంటీ బ్రీడ్స్ ఐతే ఎంతో న‌మ్మ‌కంగా, తెలివిగా ఉంటాయి. సెల‌బ్ర‌ల్ ప్లాసీ, డౌన్ సిండ్రోమ్ వంటి స‌మ‌స్య‌లున్న చిన్నారుల చికిత్స కోసం గుర్రాల‌ను కూడా ఉప‌యోగిస్తున్నారు. వృద్ధుల కోసం పిల్లుల‌ను, ఉద్రేక‌పూర‌క వ్య‌క్తుల చికిత్స కోసం చేప‌ల‌ను వినియోగిస్తున్నారు. యానిమ‌ల్ అసిస్టెడ్ థెర‌పీలో కుందేళ్లు, జింక‌లు, ప‌క్షుల‌ను కూడా వినియోగిస్తున్నారు. ఈ ఏఏటీ కాన్సెప్ట్‌, ట్రీట్‌మెంట్‌, ట్రైనింగ్‌ను దేశ‌వ్యాప్తంగా విస్త‌రించాల‌న్న‌ది రోహిణి ప్లాన్‌. ఇత‌ర న‌గ‌రాల్లో మ‌రింత మంది థెర‌పిస్టులు ఈమెతో క‌లిసి ప‌నిచేస్తున్నారు. ఒక‌వేళ మీ శున‌కం కూడా థెర‌పెట్‌కు కావాల్సిన ల‌క్ష‌ణాలున్నాయ‌ని మీరు భావిస్తే... ఎలాంటి మొహ‌మాటం లేకుండా టెంప‌ర్‌మెంట్ టెస్టింగ్‌కు తీసుకెళ్లండి..