ఒత్తిడిని ఇలా ఎదుర్కోండి !  

0

స్టార్టప్ అంటేనే ఒత్తిడి ఎక్కువ. మహిళల విషయంలో ఈ ప్రెషర్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద ఉద్యోగాలను కాదనుకుని, సొంతంగా ఏదైనా చేసి ప్రపంచానికి తమ సత్తా చాటాలని అనుకుంటారు. కానీ ఇంటి నుంచి మొదలయ్యే వ్యతిరేకత ఆ తర్వాత స్నేహితులు, ఆఫీసు వరకూ విస్తరిస్తుంది. వీటన్నింటినీ ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. స్టార్టప్‌పై దృష్టి సారిస్తూ, దాని విస్తరణల గురించి ఆలోచిస్తూ, పైసా జీతం తీసుకోకుండా కష్టపడ్తుంటే.. ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ నుంచి వస్తున్న ఈ ఒత్తిడిని హ్యాండిల్ చేయడం అంతకంటే ఇబ్బందికరమైన విషయం. ఈ నేపధ్యంలో మహిళా ఆంట్రప్రెన్యూర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలో సూచిస్తున్నారు సైకియాట్రిస్ట్, సైకోథెరపిస్ట్ డా. పూర్ణిమా నాగరాజ.

ఆమె మాటల్లోనే..

''స్టార్టప్ ఏర్పాటు ఆలోచనే ఓ తెగింపునకు సూచన. ప్రశాంతమైన ఉద్యోగాన్ని వదిలేసి ఏదో చేయాలనే తపన బలంగా ఉండడమే ఇందుకు కారణం. అయితే దీనికి సాధారణంగా ఇంటి నుంచే వ్యతిరేకత మొదలవుతుంది. అందుకే సహనం చాలా ఎక్కువ కావాలి. మామూలుగానే జీతం లేకుండా ఒకటి, రెండేళ్ల పాటు మనపై కాళ్లపై మనం నిలబడాల్సిన అవసరం ఉంటుంది. వీటికి తోడు రాత్రింబవళ్లూ అదే ఆశగా, శ్వాసగా జీవించాలి. అందుకే ఆ తెగింపునకు.. సహనం కూడా జత కావాలి. అప్పుడే మనలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.

ఇంటి నుంచే మొదలా ?

స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునే వాళ్లలో అధిక శాతం మంది యువతే ఉంటారు. తల్లిదండ్రులకూ అమ్మాయిల విషయంలో కొద్దిగా ఆందోళన ఉంటుంది. హ్యాపీగా పెళ్లి చేసుకుని, రిలాక్స్‌డ్ లైఫ్‌ అనుభవించకుండా ఎందుకీ టెన్షన్ అని వాళ్లు చెబ్తూ ఉంటారు. వాళ్ల యాంగ్జైటీని కూడా మనం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులతో(భార్యా లేదా భర్త కూడా అయిండొచ్చు) కూర్చుని మాట్లాడాలి. మీరు ఏం చేద్దామనుకుంటున్నారో, ఏం చేయగలరో వాళ్లకు చెప్పగలగాలి. అందుకు మీలో మొదట ఆ ప్రాజెక్ట్‌పై మీకు స్పష్టత, కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పటికీ వాళ్లు మీ మాటను లక్ష్యపెట్టకుండా ఒత్తిడి తెస్తూ ఉంటే.. వాటన్నింటినీ తట్టుకునే నిలబడేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి.

జోకులేసుకోండి !

ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు.

'నీ వల్ల ఏమవుతుంది ?, నీ వల్ల ఇవన్నీ కావులే ' అనే మాటలను పట్టించుకోవద్దు.

సెల్ఫ్ మోటివేషన్ ఒక్కటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

బాడీతో పాటు మైండ్‌ కూడా రిఫ్రెష్ కావాలి.

గంటలకు గంటలు అలా కుర్చీకి అతుక్కుపోవద్దు.

ఐదారు గంటల పాటు అలానే కూర్చుంటే భవిష్యత్తులో మహిళలకు అనేక సమస్యలు వస్తాయి.

గంటకో సారి 5 నిమిషాల బ్రేక్ తీసుకోండి. వీలైతే కాస్త దూరం అలా నడవండి.

కలీగ్స్‌లో జోకులేసుకోండి. యూట్యూబ్‌లో లాఫర్ ప్రోగ్రామ్స్ పెట్టుకుని నవ్వుకోండి.

గంట గంటకూ టీ, కాఫీ బ్రేకులు మాత్రం వద్దు. ఇవి ఎన్ని ఎక్కువగా తాగితే అంత ఒత్తిడిని పెంచుకుంటున్నట్టే లెక్క.

కనీసం 6-8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.

నిద్ర తగ్గితే మతిమరుపు పెరుగుతుంది, అలెర్ట్‌నెస్ తగ్గిపోతుంది.

వీలైతే రోజులో ఒకటి, రెండుసార్లు పవర్ న్యాప్స్ తీసుకోండి.

మెంటల్ వెకేషన్ అనే కాన్సెప్ట్ ట్రై చేయండి. ఆఫీసులోనే కూర్చుని మీకు ఇష్టమైన లొకేషన్‌లో విహరించండి. మీరు అక్కడ ఉన్నట్టు, ఆ ప్రాంతంలో వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఊహించుకోండి. కాసేపటి తర్వాత ఎంత రిఫ్రెష్ అవుతారో మీరే గమనిస్తారు.

స్టార్టప్స్ రూపాయి రూపాయి చూసుకోవాలి. పెద్ద వెకేషన్స్‌కు వెళ్లలేరు. అందుకే కొంత మంది గ్రూపుతో కలిసి హ్యాపీగా సైకిల్ రైడ్ వెళ్లండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంజాయ్ చేసి రండి. ఆ పాజిటివ్ ఎనర్జీ వారమంతా మీలో ఉత్సాహాన్ని నింపుతుంది.

వీలైతే తల్లిదండ్రులను ఓ సారి ఆఫీస్ లేదా మీ వర్క్‌స్పాట్‌కు తీసుకురండి. మీరు ఎంత కష్టపడతున్నారో వాళ్లకు అర్థమయ్యేలా చేయండి.

ఎప్పుడు కౌన్సెలింగ్ అవసరం ?

నిత్యం నీరసపడిపోతూ ఉన్నారా ?

ఎవరో ఒకరు ఏదైనా నెగిటివ్ కామెంట్ చేసే సరికి నిరుత్సాహపడిపోతున్నారా ?

నేను చేయలేమోననే ఆందోళన, ఒత్తిడి మిమ్మల్ని కుంగదీస్తోందా ?

పరిస్థితి చేజారిపోతుంటే కౌన్సెలింగ్‌కు వెళ్లడం తప్పేమీకాదు. మీరు ఒక్కరే వెళ్లాల్సిన పనిలేదు. అవసరమైతే గ్రూప్ అంతటికీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి''.

Related Stories

Stories by team ys telugu