పెట్రోల్ బైకులకు పోటీనిచ్చే ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్..!

దిగ్గజాల నుంచి ఫండింగ్ పొందిన ఎలక్ట్రిక్ బైకుల స్టార్టప్

పెట్రోల్ బైకులకు పోటీనిచ్చే ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్..!

Wednesday April 20, 2016,

4 min Read


తరిగిపోతున్న ఇంధన వనరులు... 

పెరిగిపోతున్న కాలుష్యం..

తక్షణ పరిష్కారం ఏంటి..?

అందరూ అంగీకరించే ఏకైక సొల్యూషన్ ఎలక్ట్రిక్ వాహనాలు. అవును.. ఈ వాహనాలదే భవిష్యత్ అని నమ్ముతున్న బడా సంస్థలు.. ఇలాంటి వాటిపై పరిశోధనలు చేస్తున్న స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు మార్కెట్ లోకి వచ్చాయి. కానీ భారత కంపెనీలు ఏవీ ఎలక్ట్ర్రిక్ మోటార్ సైకిళ్లను ఇంకా ఆవిష్కరించలేదు. వీటి విషయంలో ఇంకా కొన్ని సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో ముందున్న సంస్థ టోర్క్ మోటార్ సైకిల్స్. కొద్ది రోజుల క్రితం ఓలా కో ఫౌండర్లు, కోక్యూబ్స్ సంస్థ వ్యవస్థాపకుల నుంచి ఫండింగ్ పొంది మార్కెట్ లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమయింది టోర్క్ మోటార్ సైకిల్స్. ఈ ఫండింగ్ తో వారు తాము అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ నమూనాను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.

ఎలక్ట్రిక్ వాహన విప్లవమే లక్ష్యం

టోర్క్ మోటార్ సైకిల్స్ ను 2009లో కపిల్ షెల్క్ స్థాపించారు. భారత్ లో ఎలక్ట్రికల్ వాహనాల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనే లక్ష్యంతో దీన్ని కపిల్ ప్రారంభించారు. పరిశోధనలు చేసి కొన్ని వాహనాలు రూపొందించారు. వాటితో అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ వాహనాల రేసింగ్ లలో పాల్గొంటున్నారు. వీరి ఎలక్ట్రిక్ వాహనాలు అంతర్జాతీయ సర్క్యూట్ లలో ప్రతిభ చూపించాయి. మెక్కా ఎలక్ట్రిక్ రేసింగ్ పోటీల్లో వీరి బైక్ మూడో స్థానంలో నిలిచింది. అలాగే వరల్డ్ ప్రీమియర్ ఎలక్ట్రిక్ మోటార్ స్పోర్ట్ రేస్ సిరీస్ ను గెలుచుకుంది.

అయితే ఫండింగ్ లేకపోవడంతో ఇంత కాలం కమర్షియల్ గా వాహనాలను ఉత్పత్తి చేయడానికి.. తమ ఆవిష్కరణలను మార్కెట్ లోకి విడుదల చేయడానికి సాహసించలేకపోయారు. తాజాగా మార్కెట్ కి ముందుగా తమ వాహన ప్రొటోటైప్ ని పరిచయం చేయడానికి కావాల్సినంత ఫండింగ్ రావడంతో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. మార్కెట్ కి మోటార్ సైకిల్ ను పరిచయం చేశాక.. కమర్షియల్ గా ఉత్పత్తి ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు కపిల్. ఇందుకోసం తయారీ యూనిట్ల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రొడక్షన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది తర్వాత మరిన్ని పెట్టుబడులు వస్తాయని కపిల్ ధీమాగా ఉన్నారు.

 టోర్క్ ఎలక్ట్రిక్ బైక్ ప్రొటోటైప్<br>

 టోర్క్ ఎలక్ట్రిక్ బైక్ ప్రొటోటైప్


స్మార్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

వచ్చే ఏడాది ప్రారంభంలో తమ ఎలక్ట్రిక్ బైక్ T6Xని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ బైక్ లో అన్ని స్మార్ట్ ఫీచర్సే ఉంటాయి. క్లౌడ్ కనెక్టివిటి, ఇంటిగ్రేటెడ్ జీపీఎస్, ఇన్ బిల్ట్ నేవిగేషన్ సౌకర్యం ఇలా అన్ని రకాల స్మార్ట్ ఫీచర్స్ ఈ బైక్ కి ఉంటాయి. ఈ ఫీచర్స్ అన్నీ మోబైల్ యాప్ తో కనెక్టయ్యేలా.. బైక్ కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యాలే ఓ అప్లికేషన్ కూడా డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఎలాంటి ఎలక్ట్రిక్ వాహనం కన్నా... రెండింతలు ఎక్కువ మెరుగైన పనితీరు ఉండేలా T6Xను డిజైన్ చేస్తున్నారు. సింగిల్ చార్జ్ తో వంద కి.మీ ప్రయాణించవచ్చు. అత్యంగా వేగంగా చార్జ్ అయ్యే సామర్థ్యంతో... పెట్రోల్ వాహనాల కన్నా పదింతలు తక్కువ ఖర్చుతో వాహనాన్ని వినియోగించుకునేలా T6X ఉంటుంది.

" ఇది భారత్ కు కావాల్సిన మోటార్ సైకిల్. మమ్మల్ని మేము ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ గా భావించము. కానీ వినియోగదారులల ఆధారంగానే బిజినెస్ చేస్తాము. ఇలా చేయడం వల్ల మేము కమర్షియల్ వాహనాలతో పోటీ పడగలము. అతి తక్కువ పెట్టుబడి మాకు మైనస్. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొగల సత్తా మా ఇంజినీరింగ్ బృందానికి ఉంది" కపిల్ , ఫౌండర్, టోర్క్ మోటార్ సైకిల్స్

కపిల్ షెల్కే, టోర్క్ మోటార్స్ ఫౌండర్ <br>

కపిల్ షెల్కే, టోర్క్ మోటార్స్ ఫౌండర్ 


ఖర్చు అతి తక్కువగా ఉండేలా ఇంజినీరింగ్ విభాగం స్పేర్ పార్టులను డిజైన్ చేశారు. బైక్ డిజైన్ లో కదిలే భాగాన్ని ఒక్కదానికే పరిమితం చేయడం ద్వారా చాలా ఖర్చును తగ్గించగలిగారు. దీని వల్ల పవర్ కాని స్పీడ్ కానీ తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు వీరి ప్రధాన లక్ష్యం.. బైక్ ను రోడ్ మీదకు తేవడమే. T6Xకు సంబంధించి ధర సహా అన్ని విషయాలను తొంభైశాతం నిర్ణయించారు. విడిభాగాలకు సంబంధించి వెండర్స్ తో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలది కావడం వల్లే ఫండింగ్ కు ఢోకా లేదని ఈ ఇండస్ట్రీ వర్గాలు అంచనాతో ఉన్నాయి.

" భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే. బ్యాటరీల ధరలు తగ్గడం, కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు విస్త్రతమైన విధానాలు అవలంభించడం ఈ రంగానికి ఉపయోగపడుతుంది. ఏడేళ్ల ట్రాక్ రికార్డుతో టోర్క్ మోటార్స్ బృందం సగటు మనిషి రోజువారీ ఉపయోగానికి పనికొచ్చేలా ఎలక్ట్రిక్ బైక్ ను రూపొందించారు" హర్ ప్రీత్, టోర్క్ మోటార్స్ కి ఫండింగ్ చేసిన అంట్రపెన్యూర్

పోటీ సంస్థల నుంచి పాఠాలు

ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్లలో మొట్టమొదటిది అథర్. అయితే ఈ స్కూటర్ ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. వీటిని పాఠాలుగా మార్చుకుని టోర్క్ మోటార్స్ తమ ప్రణాళికలు వేసుకుంటోంది. అథర్ 2014 ద్వితీయార్థంలో ఫ్లిప్ కార్ట్ ఫౌండర్స్ నుంచి ఒక మిలియన్ డాలర్లు, ఆ తర్వాత 2015 మేలో టైగర్ గ్లోబల్ నుంచి పన్నెండు మిలియన్ డాలర్లును ఫండింగ్ గా పొందింది. స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మీద పెట్టుబడిదారులు రిస్క్ చూపించడానికి ఆసక్తి చూపించడంలేదు. ఇదే పెద్ద అవాంతరమని అథర్ స్కూటర్ ఫౌండర్ తరుణ్ మెహతా అంటున్నారు. ఎన్నో వ్యయప్రయాసల తర్వాత వీరు తమ స్కూటర్ ను గత ఫిబ్రవరి ఆఖరి వారంలో విడుదల చేయగలిగారు.

టోర్క్ ఎలక్ట్రిక్  బైక్స్ బృందం <br>

టోర్క్ ఎలక్ట్రిక్  బైక్స్ బృందం


మార్కెట్ నిరుత్సాహం... విధానాలు ప్రొత్సాహకరం

2013లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటి మిషన్ ప్లాన్ -2020ని ప్రకటించింది. అయితే ఇందులో ప్రకటించిన విధానాల అమలు మాత్రం నెమ్మదిగా సాగుతోంది. 2011-12లో 28 ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు 2014-15కి ఏడుకి పడిపోయాయి. ఉత్పత్తి కూడా లక్ష వాహనాల స్థాయి నుంచి పదహారు వేలకు డ్రాప్ అయిపోయింది. అయితే ప్రభుత్వం ప్రతి ఏడాది ఏడు మిలియన్ల ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను రోడ్లకు మీదకు తేవాలనే లక్ష్యంతో ఉంది. ఢిల్లీ, బీహార్, బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో ఇప్పటికే రెండున్నర లక్షల ఈ రిక్షాలు వాడకంలో ఉన్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న పరిమితుల కారణంగా.. వీటికి పెద్దగా ఆదరణ లభించడం లేదు. కానీ ఆ పరిమితుల్ని అధిగమించడానికి టోర్క్ మోటార్ సైకిల్స్ స్మార్ట్ గా ప్రయత్నాలు చేస్తోంది. వారి ప్రయత్నాలకూ ఫండింగ్ ప్రొత్సాహమూ లభిస్తుంది. వారి అంచనాలు నిజమైతే.. పెట్రోల్ బైక్ ల స్థానాన్ని ఎలక్ట్రిక్ మోటార్ బైకులు ఆక్రమించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.