మూడు లక్షల మొక్కల నాటిన బస్ కండక్టర్..

మూడు లక్షల మొక్కల నాటిన బస్ కండక్టర్..

Thursday October 20, 2016,

2 min Read

బస్ కండక్టరంత టిపికల్ జాబ్ మరొకటి ఉండదు. రోజంతా ఊపరిసలపని డ్యూటీ ఏదైనా ఉందీ అంటే అది ఒక్క బస్ కండక్టర్ డ్యూటీనే. ఒకరోజు వీక్లీ ఆఫ్ దొరికితే అది బాడీ రీచార్జ్ అవడానికే సరిపోతుంది. అలాంటి కష్టతరమైన విధుల్లో ఉండికూడా సమాజానికి పాటుపడటమంటే చిత్తశుద్ధి బలంగా ఉండాలి. 49 ఏళ్ల యోగనాథం కూడా అలాంటి కమిట్మెంట్ ఉన్నోడే. 30 ఏళ్లుగా బస్ కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మొక్కలు నాటాడు.

మొక్కలు నాటాలన్న సంకల్పం ఈనాటిది కాదు. 80వ దశకంలోనే నిలగిరిలో చెట్ల నరికివేతను తీవ్రంగా వ్యతిరేకించాడు. అలా అక్కడి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాడు. ప్రతీ సోమవారం యోగనాథానికి వీక్లీ ఆఫ్. వారమంతా ఆ రోజుకోసమే ఎదురు చూస్తుంటాడు. సినిమాలు, షికార్లు గట్రా ఏవీ ప్లాన్ చేసుకోడు. ఎందుకంటే మొక్కే ప్రాణంగా, చెట్టే ఆశగా బతికేవాడికి షోకులు, షికార్లు అంతగా రుచించవు. మనోడు ఈ కేటగిరికి చెందినవాడు. పొద్దున్నే మొక్కలు తీసుకుని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు తిరుగుతాడు. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ మొక్క నాటేస్తాడు.

ఇప్పటిదాకా యోగనాథం 3వేల స్కూళ్లకు పైగా తిరిగి మొక్కలు నాటాడు. ప్రాణాధారమైన చెట్ల పెంపకంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాడు. ఎన్నో అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాడు. మొక్కలు నాటించడమే కాదు.. దాన్ని ఏ స్కూల్లో ఎవరు నాటతే వారి పేరు పెట్టాడు. ఉదాహరణకు రాము అనే కుర్రాడు కానుగ చెట్టు నాటితే దానికి రాము కానుగ అని పేరు పెట్టేవాడు. అంతేకాదు.. ఆ నాటిన కుర్రాడే రోజూ నీళ్లు పోయాలని షరతులు పెట్టాడు.

image


ఈ అభనవ అశోకుడి ప్రయత్నానికి మెచ్చి ఎన్నో అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక ఇకో వారియర్ అవార్డు, రాష్ట్ర పర్యావరణ శాఖ నుంచి పురస్కారం, సీఎన్ఎన్ ఐబీఎన్ నుంచి రియల్ హీరోస్ అవార్డు, పెరియార్ పురస్కారం ఇలా.. లెక్కలేనన్ని అవార్డులొచ్చాయి. డిపార్టుమెంటులో కూడా యెగనాథానికి మంచి పేరుంది.