ఆ పాత పంటలు మళ్లీ వస్తున్నాయ్!!

ఆ పాత పంటలు మళ్లీ వస్తున్నాయ్!!

Tuesday May 09, 2017,

3 min Read

మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కొర్రాల పాయసం, పచ్చజొన్నల గటక, రాగి జావ లాంటి పేర్లు జనాల నాలుకల మీద తిరుగుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటకు సార్ధకత చేకూరుతోంది.

image


గటకే తిన్నామో..! గంజే తాగామో..! అని మాట వరుసకు అంటుంటాం. పేదతిండి అని చెప్పడానికి వాడే ఉపమానం అది. నిజానికది గరీబు తిండి కాదు. నిఖార్సయిన తిండి. నిండైన తిండి. గంభీరమైన తిండి. శ్రీమంతుల తిండి. ఇంకా చెప్పాలంటే- చిరుధాన్యాలకు మించిన పౌష్టికాహారం- ఈ భూమండలం మీదనే లేదు. అందుకే ఒకప్పటి పచ్చజొన్నల గట్క మళ్లీ రారమ్మని పిలుస్తోంది. ఆనాటి రాగిజావ తిరిగి కళ్లముందు కదలాడుతోంది. కనుమరుగైన సామపాశం మళ్లీ సాహో అంటోంది. మచ్చుకైనా కనిపించని సజ్జ మలీదలు మిర్రిమిర్రి చూస్తున్నాయి. ఈ తరానికే తెలియని నూనె పోలెలు నున్నగా కవ్విస్తున్నాయి. ప్రాభవం కోల్పోయిన చిరుధాన్యాలు చిరునవ్వులు రువ్వుతున్నాయి. సన్నబియ్యం, బాసుమతి రైస్ తినడమే స్టేటస్ అనుకునే రోజులు పోతున్నాయి. దంపుడు బియ్యం ఎంత రేటున్నా సరే కొంటున్నారు. రాగి అంబలి తాగడానికి క్యూ కడుతున్నారు. ఎండాకాలం సామబియ్యం తింటే చలువ అని జనానికి అర్ధమైంది. చలికాలం కొర్రబువ్వ తినాలని ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. పజ్జొన్న రొట్టె, కొర్రబియ్యం తింటే షుగర్, బీపీ కంట్రోల్ అవుతుందనే అవేర్‌నెస్ వచ్చింది. శ్రీమంతుల ఇళ్లలోనూ పాత పంటల అన్నం దొరుకుతోంది. తెల్లబువ్వ తింటేనే ఆరోగ్యం, ఐశ్వర్యం అనుకునే వాళ్ల మైండ్ సెట్ మారుతోంది. పజ్జొన్న రొట్టెలో తొగరిపప్పు వేసుకుని తినే అదృష్టం కోసం వెంపర్లాడుతున్నారు.

పత్తి పండిస్తేనే గిట్టుబాటు అవుతుంది. మిర్చీ వేస్తేనే అనుకున్న ధర వస్తుంది.. అనుకునే రోజులు పోతున్నాయి. చిరుధాన్యాల సాగులోనూ లైఫ్ బిందాస్ అనుకుంటున్నారు. పురుగుమందుల జోలికి పోవడం లేదు., మేకల గొర్రెల పెంటనే ఎరువులుగా వాడుతున్నారు. పాతాళానికి బోర్లేసే తంటాలు పడటం లేదు. వాననీటినే ఒడిసిపట్టి, అద్భుతమైన పంటలు పండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, ఝరాసంగం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ రైతును కదిలించినా చిరుధాన్యాల మీద- పీహెచ్‌డీ స్టూడెంట్ కి సరిపోయేంత మెటీరియల్ చెప్తాడు. నల్లవడ్ల బియ్యం ఎందుకు తినాలో పోచయ్య అనే రైతు చెప్తుంటే- ఇంతకాలం మనం తిన్న చెత్తేంటో తెలుస్తుంది. 

image


జొన్నలంటే మనకు ఎరుకైంది మహా అయితే రెండు మూడు రకాలు. కానీ, అందులోనూ పది రకాల వెరైటీలున్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతాం. మొక్కజొన్న, పచ్చజొన్న, ఎర్రజొన్న, తెల్లజొన్న, తెల్లమల్లె జొన్న, రికపచ్చల జొన్న, గుండుశాయి జొన్న, తోక జొన్న, ఎర్రశాయి జొన్న, పేలాల జొన్న.. ఇలా పది రకాల జొన్నలుంటాయి. ఈతరం కోడళ్లకి అవిశెలు ఎలా వుంటాయో తెలియదు. ఆమాటకొస్తే వరినాటు ఎలా వేయాలో కూడా అర్ధంకాదు. మలీద ముద్దల పేరు చెప్తే నోరెళ్లబెడతారు. అందుకే అక్కడ ప్రతీ ఊళ్లో, ప్రతీ తండాలో ఒక కోడళ్ల సంఘం ఉంటుంది. అంటే, అత్తలు కోడళ్లకు పాతతరం వ్యవసాయ పద్ధతులను, ఆహారపు అలవాట్లను నేర్పిస్తారు. ఒకరకమై వారసత్వ మార్పిడి జరుగుతోందక్కడ. అస్తిత్వం పొల్లుపోవడం లేదు. శతాబ్దాల పాటు ఉనికి అలాగే ఉంది. కనుమరుగు అవుతున్న చిరుధాన్యలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాన్న దక్కన్ డెవలప్ మెంట్ సోసైటి 20 ఏళ్ల సంకల్పం- ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తోంది. ధ్వంసమైన జీవ వైవిధ్యం ఊపిరిపోసుకుంది. పురుగుమందుల వ్యవసాయం- సంప్రాదయబాట పట్టింది. చిరుధాన్యాల సాగుపై వారు గ్రామ గ్రామాన తిరిగి చైతన్యం తెస్తారు. ఏటా సంక్రాంతి నాడు పాత పంటల జాతర ఏర్పాటు చేస్తారు. దేశ విదేశాల నుండి అతిధులు వచ్చి పాత పంటల జాతరలో పాల్గొంటారు. సుమారు 30 రకాల సంప్రదాయ చిరుధాన్యలు కచ్చుర బండ్లమీద సందడి చేస్తాయి.

వాణిజ్య పంటలు అవసమరే. కానీ తినే పంటలు కూడా కావాలి. ఆ విషయంలో రైతుకి అవగాహన తేవడంలో సొసైటీ విజయం సాధిస్తోంది. కమర్శియల్ క్రాప్ కి ఏమాత్రం తగ్గకుండా- చిరుధాన్యాలతో ఎంత లాభాలను పొందవచ్చో ఊరూరూ తిరిగి రైతులకు చెప్తుంటారు. మైక్ పట్టుకుని ఉపన్యాసం దంచితే రైతులు ఎవరూ వినరు. అందుకే ప్రతీ పంట మీద ఒక పాట శ్రుతి చేసుకుంటుంది. ప్రతీ ధాన్యం మీద చెక్క భజన అలరిస్తుంది. రైతులకు ఏ రూపంలో చెప్తే అర్ధమవుతుందో ఆ రూపాన్ని ఎంచుకున్నారు. ఇలాంటి కళారూపాల ప్రచారం ఫలితంగా.. జహీరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలలో చిరుధాన్యాల సాగు గణనీయంగా పెరగింది. వానాకాలం, యాసంగి పంటలన్నీ చిరుధాన్యాలే. అందుకోసం ప్రత్యేకంగా విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. జహీరాబాద్, కొహిర్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్కల్, మొగ్దంపల్లి మండలాల్లోని సుమారు 70 గ్రామాల్లోని విత్తన బ్యాంకులన్నీ మహిళల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఈ విత్తనాల ద్వార సుమారు 15వేల ఎకరాల పైగా సాగు చేస్తుంటారు. ఒక్కో రైతు పదికి పైగా పాతపంటలను పండిస్తున్నాడు. వ్యవసాయం అంటే వాణిజ్యపంటలే అన్న భావన ఇక్కడి రైతుల్లో పోయింది. మిర్చీని మాత్రమే లాభసాటి పంటగా చూసే రైతు- సజ్జలు పండిస్తూ సంతోషాన్ని ప్రకటిస్తున్నాడు. చిరుధాన్యాలకు మించిన చిరునవ్వుల వ్యవసాయం మరోటి లేదని నిండు మనసుతో నమ్ముతున్నాడు.