కోల్‌కతా జనాలకు ఈ-కామర్స్ టేస్ట్ 'జస్ట్ షాప్ 24'

కోల్‌కతా జనాలకు ఈ-కామర్స్ టేస్ట్ 'జస్ట్ షాప్ 24'

Wednesday September 09, 2015,

4 min Read

ఉత్క‌ర్ష్ లోహియా, చేత‌న్ సేథి, పొర‌వ్ జైన్ అనే ముగ్గురు యువ‌కులు తాము దాచుకున్న కొద్దిపాటి డ‌బ్బుల‌తో మొద‌లు పెట్టిన ఆన్‌లైన్ గ్రాస‌రీస్ పోర్ట‌ల్.. జ‌స్ట్ షాప్ 24 . ప్ర‌స్తుతం కోల్‌క‌తా, హౌరాల‌లో ఇంటింటికీ స‌రుకుల‌ను అందిస్తున్న ఈ వెబ్‌సైట్‌ను మ‌రింత విస్త‌రించేందుకు త్వ‌ర‌లో నిధులు స‌మీక‌రించ‌నున్నారు. స్కూల్లో చ‌దువుతున్న‌ రోజుల నుంచే ఉత్క‌ర్ష్‌కు కంప్యూట‌ర్ల పిచ్చి. అప్ప‌టి నుంచే అత‌ను వెబ్ సైట్లు డిజైన్ చేయ‌డం లాంటి ఇంట‌ర్నెట్ ప్రాజెక్టుల్లో బిజీగా వుండేవాడు. ఆయ‌న తండ్రికి ఓ బుక్ షాప్ వుండేది. కంప్యూట‌ర్ల‌లో వెబ్ సైట్లు డిజైన్ల‌ నుంచి కాస్త విరామం దొరికితే, ఆ పుస్త‌కాల షాపులో పుస్త‌కాల్లో మునిగిపోయేవాడు. '' పుస్త‌కాల‌కు సంబంధించినంత వ‌ర‌కు మేం ఎక్కువ‌గా అమ‌ెజాన్ పై ఆధార‌ప‌డే వాళ్ళం. అందుకే నేను కూడా ఆన్‌లైన్ బుక్ స్టోర్ ఓపెన్ చేయాల‌నుకున్నాను. అయితే.. ఆయ‌న‌ చ‌దువ‌య్యేస‌రికి అమ‌ెజాన్, ఫ్లిప్ కార్ట్‌లు ఆన్ లైన్ పుస్త‌కాల‌ మార్కెట్‌ను పూర్తిగా ఆక్ర‌మించేసాయి " అంటారు ఉత్కర్ష్.

image


చార్ట‌ర్డ్ అకౌంటెన్సీ చ‌దువుకున్న ఉత్క‌ర్ష్ ఈ పోర్ట‌ల్‌ను ప్రారంభించ‌క‌ముందు నాలుగేళ్ళ‌పాటు య‌ర్న‌స్ట్ అండ్ యంగ్‌లో ప‌నిచేసారు. ఈ రంగంలో అప్ప‌టికే స్థిర‌ప‌డిన సంస్థ‌ల బిజినెస్ మోడ‌ల్స్ అన్నిటినీ క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసారు. ఆ సంస్థ‌ల‌న్నిట‌ికీ భారీ వేర్ హౌస్‌లు, ఇత‌ర‌త్రా ర‌వాణా స‌దుపాయాలు వున్నాయి. బిగ్ బాస్కెట్ లాంటి భారీ సంస్థ‌ల‌కు రోజూ భారీస్థాయిలో ఆర్డ‌ర్లు వుంటాయి. దానికి త‌గ్గ‌ట్టే వ‌స్తువ‌ుల‌ను ఆ సంస్థ నిల‌ువ వుంచుకుంటుంది.

ఉత్క‌ర్ష్

ఉత్క‌ర్ష్


అయితే, జ‌స్ట్ షాప్ 24 ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఇదో కొత్త స్టార్ట‌ప్.. ఇంకా భారీ స్థాయిలో డిమాండ్ లేదుక‌నుక‌... ప‌రిమిత స్థాయిలోనే ఫాస్ట్ మూవింగ్ స‌రుకుల‌ను మాత్ర‌మే నిల్వ‌వుంచుతున్నారు. మిగిలిన వాటికి ఆయా డీల‌ర్ల‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆర్డ‌ర్ చేసిన 24 గంట‌ల్లో డెలివ‌రీ అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నారు. క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్రం 30 గంట‌ల గ్యారంటీ ఇస్తారు. ఈ లోపే డెలివ‌రీ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు.

ప‌శ్చిమ బెంగాల్ లో ని సింగూరులో టాటా ప‌రిశ్ర‌మ ఏర్పాటు సంద‌ర్భంగా జ‌రిగిన అల్ల‌ర్ల‌ను అప్ప‌టి వామ‌ప‌క్ష‌ప్ర‌భుత్వం పాశ‌వికంగా అణ‌చివేసేందుకు ప్ర‌య‌త్నించిన నేప‌థ్యంలో పారిశ్రామిక‌ీక‌ర‌ణ వ్య‌తిరేక వాగ్దానంతో తృణమూల్ కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చింది. అయితే, టాటా లాంటి కంపెనీల‌కు దాని వ‌ల్ల పెద్ద న‌ష్ట‌మేమీ లేదు. ఆ సంస్థ ప‌రిశ్ర‌మ పెడ‌తామంటే, క‌ళ్ళ‌క‌ద్దుకుని పిలిచే రాష్ట్రాలు చాలా వుంటాయి. కానీ చిన్న చిన్న స్టార్ట‌ప్‌ల ప‌రిస్థితి అది కాదు. అంత‌కు మందు వామ‌ప‌క్ష ప్ర‌భుత్వం స్టార్ట‌ప్‌ల‌కు స్వ‌ర్ణ‌యుగం అని చెప్ప‌లేం కానీ, తృణ‌మూల్ హ‌యాంలో మాత్రం న‌ర‌కం క‌నిపించింది. “ ఎక్క‌డ లేని లైసెన్సులు తీసుకోవాలి. వీటి కోస‌మే వ‌న‌రుల‌న్నీ ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చేది. అన్నినిబంధ‌న‌లనూ పాటిస్తూ స‌రైన ప‌ద్ధ‌తిలో సంస్థ‌ను నెల‌కొల్ప‌డానికి మ‌రింత స‌మ‌యం, డ‌బ్బు ఖ‌ర్చయ్యాయి ” అని సంస్థ నెలకొల్ప‌డంలో త‌న అనుభ‌వాన్ని పంచుకున్నారు ఉత్క‌ర్ష్.


అలా అని స‌మ‌స్య‌ల‌న్నీ ప్ర‌భుత్వం వ‌ల్లే అని చెప్ప‌లేం. లైసెన్సులు, చ‌ట్ట ప‌రంగా అనుమ‌తులు తెచ్చుకోవ‌డం ఒక‌తెత్త‌యితే, కోల్‌కొతాలోని ప్ర‌జ‌ల మ‌న‌సు గెల‌వ‌డం అంత‌కు ప‌దిరెట్లు క‌ష్టం. ఇక్క‌డి జ‌నం అంత తేలిక‌గా మార‌రు. టెక్నాల‌జీ అంటే మోజు లేదు. దీంతో పాటు, ఒక్క‌రూపాయి ధ‌ర హెచ్చుత‌గ్గులున్నా జనం ఒప్పుకోరు.

చేతన్ సేథి

చేతన్ సేథి


అయితే, ఇక్క‌డ స్టార్ట‌ప్‌కి అనుకూలించే అంశాలు కూడా కొన్ని వున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్క‌డ ఆఫీస్ స్పేస్ చౌక‌గా దొరుకుతుంది. వెబ్ డిజైనింగ్, వేర్ హౌసింగ్, లాంటివి కూడా త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులోకి రావడంతో ప్రాధమిక ఖ‌ర్చుల‌ను చాలా వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు.

అలాగే, స్టార్ట‌ప్ రంగంలో ఇంకా పెద్ద‌గా పోటీ లేదు క‌నుక‌... కొత్త‌గా వ‌చ్చే సంస్థ‌లు వృద్ధి చెంద‌డానికి బాగా అవ‌కాశాలున్నాయి. మిగిలిన మెట్రోలు, పెద్ద న‌గ‌రాల‌తో పోలిస్తే, కోల్‌కతా లో ఈ చివ‌రి నుంచి ఆ చివ‌రికి ప్ర‌యాణించ‌డం తేలిక‌. దీని వ‌ల్ల ర‌వాణా ఖ‌ర్చులు కూడా కొంత త‌క్కువే. ముందే చెప్పిన‌ట్టు ఇక్క‌డి జ‌నానికి టెక్నాల‌జీ కొత్త కాబట్టి, ఈ స్టార్ట‌ప్‌ల‌ని కొంత ఆస‌క్తిగా ఆహ్వానించే అవ‌కాశాలు కూడా వుంటాయి.

స‌వాళ్ళ విష‌యానికొస్తే, గ‌తం గురించి జ‌స్ట్ షాప్ 24 పెద్ద‌గా ఆలోచించడం లేదు. భ‌విష్య‌త్తు మీదే దృష్టి పెడుతోంది. ఈ రంగంలో స‌మ‌స్య‌లు కాలం గ‌డిచే కొద్దీ వ‌స్తాయి. జ‌స్ట్‌షాప్ 24 పెట్టింది ఈ ఏడాది మార్చిలోనే క‌నుక‌, ఇప్ప‌టికీ పెద్ద‌గా క‌ష్టాలు లేక‌పోయినా రాబోయే రోజుల్లో రావొచ్చని ఉత్క‌ర్ష్ మాన‌సికంగా సిద్ధ‌ప‌డుతున్నారు. ఇప్ప టి దాకా ప్రధానంగా ప్రాథ‌మిక అవ‌స‌రాల మీదా, స‌రైన టీంని రిక్రూట్ చేసుకోవ‌డం, ఇటు సంస్థ‌లోనూ, అటు క‌స్ట‌మ‌ర్ల విష‌యంలోనూ స‌రైన నియ‌మ నిబంధ‌న‌లనూ, విధానాల‌నూ రూపొందించుకోవ‌డం మీద‌నే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. ఇప్పుడిక మార్కెటింగ్, కొత్త క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డం, ఆర్డ‌ర్ల‌ను టైంకి డెలివ‌ర్ చేయ‌డం లాంటి అంశాల‌పై దృష్టి పెట్టాల‌నుకుంటున్నారు.

కోల్‌కతాలో నిల‌దొక్కుకుంటే, గ్రోస‌రీస్‌తో పాటు, మందులు,మ‌రికొన్ని ఇత‌ర స‌రుకుల‌కు కూడా విస్త‌రించాల‌ని ఈ టీమ్ భావిస్తోంది. అలాగే భౌగోళికంగా కూడా దేశంలోని మ‌రికొన్ని రెండోశ్రేణి న‌గ‌రాల‌కు విస్త‌రించాల‌నుకుంటున్నారు. ఇప్ప‌టి దాకా సంస్థ ఎదుగుద‌ల ప్రోత్సాహ‌క‌రంగానే వుంది. “ అన్ని రంగాల్లోనూ ఈ కామ‌ర్స్ పైపైకి వెళ్తోంది. గ్రోస‌రీ ప‌రిశ్ర‌మ అటు అంత‌ర్జాతీయంగా చూసుకున్నా, ఇటు దేశీయంగా చూసుకున్నా..అతి పెద్ద ప‌రిశ్ర‌మ‌. క‌నుక ఈ రంగంలో ఈ- కామ‌ర్స్ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో మేం స్థిర‌ప‌డ‌డం సంతోషంగా వుంది. ” అన్నారు ఉత్క‌ర్ష్..

పోర్వ్  జైన్

పోర్వ్ జైన్


క‌స్ట‌మ‌ర్ల రెస్పాన్స్ కూడా వీరి ఉత్సాహానికి మ‌రో కార‌ణం. మొద‌టి నెల మార్కెటింగ్‌పై పెద్ద‌గా ఖ‌ర్చుపెట్ట‌లేదు. ఒక‌సారి మార్కెటింగ్ మొద‌లుపెట్టాక అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. నిజానికి పెద్ద‌గా మైలురాళ్ళ‌ని చెప్పుకోవ‌డానికి ఏమీ లేక‌పోయినా.. స్టార్టప్ మొద‌లుపెట్టిన అతికొద్ది కాలంలోనే ఈ స్పంద‌న వారికి చాలా ధైర్యాన్ని ఇచ్చింది.

వారానికి అయిదారు డెలివ‌రీల‌తో మొద‌లుపెట్టాం. ఇప్పుడు రోజుకు 25 నుంచి 30 ఆర్డ‌ర్లు డెలివ‌ర్ చేస్తున్నాం. ప్రారంభించిన రెండు నెల‌ల్లోనే ఎంతో పోటీ వున్న ప‌రిస్థితుల్లో కూడా.. ఆన్‌లైన్ గ్రోస‌రీ షాపింగ్ కోల్‌కతా కీ వ‌ర్డ్స్ గూగుల్ సెర్చిలో ఈ సైట్ నాలుగో ర్యాంకులో వుంది. రోజుకు వంద‌కు పైగా డైలీ యూజ‌ర్స్ వెబ్ సైట్ విజిట్ చేస్తున్నారు.

గ్రాడ్యుయేష‌న్ చ‌దువుతున్న‌రోజుల్లో కోల్‌కతా లో ఆన్‌లైన్ గ్రాస‌రీ స్టోర్లు లేని రోజుల్లో ఉత్క‌ర్ష్ ఈ సైట్ గురించి క‌ల గ‌న్నాడు. తీరా అత‌ను పోర్ట‌ల్ పెట్టేస‌రికి మార్కెట్లోకి మ‌రికొన్ని సైట్లు వ‌చ్చేసాయి. సాల్ట్ ఎన్ సోప్, హోమ్ జీనీ, ఆన్‌లైన్ గ్రోస‌రీ బ‌జార్ లాటి సైట్లు అప్ప‌టికే వున్నాయి. అయితే, జ‌స్ట్ షాప్ 24 కి వున్న కొన్ని ప్ర‌త్యేక అంశాలు ఈ వెబ్ సైట్ స‌క్సెస్‌కి కార‌ణాల‌వుతాయ‌ని ఉత్క‌ర్ష్ న‌మ్ముతున్నాడు. స‌రుకులు రిట‌ర్న్ చేయడానికి ష‌రుతులు లేక‌పోవ‌డం, వాట్స‌ప్‌లో కూడా ఆర్డ‌ర్ చేయ‌గ‌ల‌గ‌డం, ప్లాస్టిక్ బ్యాగుల‌కు, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కి అద‌నంగా వ‌సూలు చేయ‌క‌పోవ‌డం లాంటివి జ‌స్ట్ షాప్ 24 ను మిగిలిన పోర్ట‌ల్స్ కంటేముందు నిల‌బెడ‌తాయ‌ని ఉత్క‌ర్ష్ అంటున్నారు.

ఎన్నోక‌ష్టాలు ప‌డి, చార్ట‌ర్డ్ అకౌంటెన్సీ పాస్ అయి, మంచి జీతం వ‌చ్చే ఉద్యోగం సంపాదించాక అవ‌న్నీ వ‌దిలేసి .. మ‌ళ్ళీ స్టార్ట‌ప్ అంటూ తిర‌గ‌డం ఉత్క‌ర్ష్ జీవితంలో అత్యంత పెద్ద స‌వాలు. అయితే, ఈ రంగంలో మార్కెట్ ను చేజిక్కించుకోగ‌ల‌గ‌డం, భవిష్య‌త్తు ఆశాజ‌న‌కంగా వుండ‌డం ఆయ‌న‌కిప్పుడు ఎక్క‌డ లేని సంతోషాన్నిస్తున్నాయి. “ గ్రోస‌రీస్ అనేవి ప్ర‌తి వ్య‌క్తికీ అవ‌స‌ర‌మే. జేబులో సెల్ ఫోన్ వున్న ఆటో డ్రైవ‌ర్ కూడా మా వెబ్ సైట్ లో ఆర్డ‌ర్ చేయొచ్చు. ” అంటారు ఉత్క‌ర్ష్.

ఇప్పుడిప్పుడే స్టార్ట‌ప్ రంగంలోకి వ‌చ్చిన ఉత్క‌ర్ష్ అప్పుడే స‌లహాలు ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డట్లేదు. అయితే, త‌న అనుభవం నుంచి ఒక్క మాట చెప్ప‌ద‌ల‌చుకున్నారు. “ మ‌రీ ఎక్కువ ఆలోచించ‌కండి. మొద‌లు పెట్టండి. మిగిలిన స‌మ‌స్య‌ల‌న్నీ అవే స‌ర్దుకుంటాయి. మీరు మొద‌లు పెడితే స‌క్సెస్ కావ‌చ్చు, లేదా ఫెయిల్ కావ‌చ్చు. అస‌లు మొద‌లే పెట్ట‌క‌పోతే, స‌క్సెస్ అయ్యే అవ‌కాశమేలేదు క‌దా.. ” అంటారు ఉత్క‌ర్ష్.