మహిళల కోసం, మహిళలే నడిపిస్తున్న ట్రెక్కింగ్ కంపెనీ

సాహసమే ఊపిరిగా శిఖరాగ్రానికి చేరుకున్న ఆమె... తనలా నిత్యం ధైర్యసాహసాలతో సహవాసం చేసే మహిళలకు ఆదర్శంగా నిలవడమే కాదు... మార్గదర్శిగానూ వ్యవహరిస్తోంది. "లఢాఖీ వుమెన్ ట్రావెల్ కంపెనీ" వ్యవస్థాపకురాలైన థిన్లాస్ కొరోల్.. ఆడవారి కోసం మాత్రమే ఈ సంస్థను నెలకొల్పారు. అంతేకాదు.. ఈ సంస్థలో పనిచేసే వారందరూ ఆడవాళ్లే కావడం విశేషం. ఫెమీనా ఆవార్డ్స్ 2015 పారిశ్రామికవేత్తల విభాగంలో నామినేషన్ దక్కించుకున్న థిన్లాస్ కొరోల్... ఓ గ్రామీణ యువతి స్థాయి నుంచి అసాధార స్త్రీగా ఎదిగిన వైనం తెలుసుకుందాం.

మహిళల కోసం, మహిళలే నడిపిస్తున్న ట్రెక్కింగ్ కంపెనీ

Sunday May 17, 2015,

3 min Read

లఢాఖ్‌లోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన థిన్లాస్.. తమ గ్రామంలోని ఇతర పిల్లల మాదిరే తన తోబుట్టువులతోపాటూ గొర్రెలను కాస్తూ, తమ పంట పొలాల బాగోగులూ చూసుకుంది. అయితే తన బాల్యం.. బాధ్యతల నడుమ నలిగిపోయిందని థిన్లాస్ ఎన్నడూ బాధపడలేదు. పొలాల్లో పనిచేయడం, గొర్రెలను మేపడం వల్లే తనకు కష్టపడేతత్వం అలవడిందని ఆమె గట్టిగా నమ్ముతుంది. ఆరుగురి సంతానంలో ఆఖరిదైన థిన్లాస్.. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకోగా వారికి మరో ఇద్దరు సంతానం కలిగారు. అలా తన తోబుట్టువుల సంఖ్య ఏడుకు చేరుకోగా... వారి నడుమే తన బాల్యాన్ని గడిపింది థిన్లాస్.

థిన్లాస్ ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్‌లో పాల్గొంటున్న మహిళలు

థిన్లాస్ ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్‌లో పాల్గొంటున్న మహిళలు


తమ స్వగ్రామం అయిన తక్ మాచిక్ లో ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకునే వెసులుబాటు ఉండటంతో... ఉన్నత పాఠశాల విద్యకోసం థిన్లాస్ పక్క గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత పెద్దన్నయ్యతో పాటూ లేహ్ లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించింది.

పాఠశాల చదువులు పూర్తవుతూనే లఢాఖ్ విద్యార్ధి సంఘం SECMOL( స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్, కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడాఖ్)లో సభ్యత్వం పొందిన థిన్లాస్... అదే తన జీవితాన్ని మలుపుతిప్పిందని చెబుతుంది. అక్కడే ఆమెకు ట్రెక్కింగ్ పరిచయం అయింది.

థిన్లాస్, లడాఖీ విమెన్ ట్రావెల్ కంపెనీ వ్యవస్థాపకురాలు

థిన్లాస్, లడాఖీ విమెన్ ట్రావెల్ కంపెనీ వ్యవస్థాపకురాలు


"ఇక్కడే ట్రెక్కింగ్‌ను మొదలుపెట్టి దాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. ఓ సారి నేను ట్రెక్కింగ్‌కు వెళుతున్నప్పుడు.. కొందరు గ్రామస్థులు నేను విదేశీయురాలినని పొరబడి నాతో ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే.. ఓ స్థానిక అమ్మాయి ట్రెక్కర్ అవుతుందని వారు కలలో కూడా ఊహించలేరు" అంటుంది థిన్లాస్.

SECMOL ద్వారా సంపాదించిన అనుభవంతో... స్థానిక ట్రెక్కింగ్ సంస్థల్లో గైడ్‌గా పనిచేయాని ఎంతగానో ప్రయత్నించింది థిన్లాస్. కానీ, అమ్మాయి అనే ఒకే ఒక కారణంతో సదరు సంస్థలన్నీ అమెను రిజెక్ట్ చేశాయి. 2004లో SECMOL ట్రావెల్ ఎజెన్సీలోనే అరౌండ్ లడాఖ్ విత్ స్టూడెంట్స్ వింగ్‌లో చేరింది. అయితే ఆ గ్రూప్‌లో ఇతర మహిళలు కూడా ఉన్నప్పటికీ... వారు చుట్టుపక్కల టూరిస్ట్ స్పాట్‌లకు, సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే గైడ్ లుగా వ్యవహరించేవారు.

LWTC కి అంకురార్పణ

లఢాఖ్ ట్రెక్కింగ్ పరిశ్రమలో మహిళల పట్ల చూపుతున్న వివక్షే LWTC స్థాపనకు పురిగొలిపిందంటారు థిన్లాస్. ఈ ఆలోచనే పురుష గైడ్‌లతో సౌకర్యంగా ప్రయాణించలేని మహిళా ట్రెక్కర్లుకు కొత్త ఊపిరులనూదింది. "ట్రెక్కింగ్ పరిశ్రమలోని ఇతర మహిళలకు ఎంతో కొంత సహాయపడగలనన్న ఆలోచనే నన్ను ముందుకు నడిపించింది" అని అంటుంది థిన్లాస్.

"LWTCలో పనిచేసే ఎంతోమంది మహిళలకు నేనే బాధ్యత వహిస్తున్నాను. ఈ సంస్థకు ఎలాంటి ఆదరణ లేని రోజుల్లోనే ఇక్కడ చేరినవారు ఇప్పటికీ మాతోనే పనిచేస్తున్నారు. వారే నా బలం" అని థిన్లాస్ చెబుతున్నప్పుడు ఆమె కళ్లు గర్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

మహిళా ట్రెక్కర్లు

మహిళా ట్రెక్కర్లు


లింగ వివక్ష

ఇప్పటికీ లఢాఖ్ ట్రెక్కింగ్ పరిశ్రమలో ప్రజ్వరిల్లుతున్న లింగ వివక్షపై థిన్లాస్ అసంతృప్తి వ్యక్తపరుస్తూనే ఉంటుంది. "పురుషలు నడిపిస్తున్న వందలాది సంస్థల నడుమ మాదీ ఓ ప్రత్యేకమైన ఏజెన్సీ. LWTC బయట కూడా కొందరు మహిళా ట్రెక్కర్లు గైడ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వారెంతమంది ఉంటారో నాకు తెలీదు. కానీ, ఈ రంగంలో 400 మంది పురుషుల నడుమ కేవలం 25మంది మహిళలు తమ సత్తా చాటుకుంటున్నారు"

గైడ్‌గా కెరీర్ ను ప్రారంభించిన తొలినాళ్లలో థిన్లాస్ ఫ్రీలాన్సర్‌గా పనిచేసింది. ట్రెక్కింగ్‌కు వెళుతున్నప్పుడు ఎంతో మంది లఢాఖీ మహిళలు తమకు అందులో మెళుకువలు నేర్పించమని థిన్లాస్‌ను కోరేవారు. కానీ, ఫ్రీలాన్సర్ కావడం వల్ల వాళ్లను తనతో పాటూ తీసుకువెళ్లలేకపోయేది ఆమె. అయితే... ఈ పరిశ్రమలో అమ్మాయిలకు ఉన్న డిమాండ్ ఏంటో అప్పుడే ఆమెకు తెలిసొచ్చింది.

అప్పుడే ట్రెక్కింగ్ వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన ఆమె మదిలో మెదిలింది. "LWTC ని ప్రారంభించక ముందు ఈ పరిశ్రమలో ఎన్నో ఏళ్లు పని చేశాను. కాబట్టి, ఇందులోని లోటు పాట్లపై నాకు పరిపూర్ణ అవగాహన ఉంది. ఇకపోతే ఏజెన్సీ ప్రారంభించేందుకు నాకు కొంత డబ్బు అవసరం అయింది. నేను కూడబెట్టుకున్నది కొంత వరకూ సరిపోగా... మిగతా మొత్తాన్ని నా కుటుంబం సమకూర్చింది. అయితే వాళ్లు ఇచ్చింది పెద్ద మొత్తమేమీ కాద"ని తన సొంత ఏజెన్సీని లాంచ్ చేసిన రోజులను ఆనందంగా గుర్తుచేసుకుంటుంది థిన్లాస్.

అతివల ఆతిథ్యం

సాధారణంగా లఢాఖ్‌లో ట్రెక్కింగ్ కు వచ్చే వారికి విడిది కల్పించే బాధ్యతలను మహిళలే ఎక్కువగా నిర్వర్తిస్తుంటారు. ఎందుకంటే... కుటుంబ పోషణ నిమిత్తం ఇంటిలోని పురుషులు ఎప్పుడూ తమ పట్టణానికి దూరంగానే ఉంటుంటారు. LWTC విదేశీ అతిథులను ఈ మారుమూల గ్రామాలకు తీసుకువస్తుంది. అలా ఇక్కడి మహిళలకు విభిన్న సంప్రదయాలపై అవగాహన కలుగుతుంది. దీనివల్ల వారికి ఎంతోకొంత ఆదాయం కూడా లభిస్తుంది.

2014లో థిన్లాస్ "లఢాఖ్ మహిళల సంక్షేమ సంస్థ"ను(లఢాఖీ వుమెన్ వెల్ఫేర్ నెట్వర్క్) స్థాపించింది. మహిళా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేసే ఈ సంస్థకు థిన్లాస్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.

ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతమైన శిఖరాలపై...

ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతమైన శిఖరాలపై...


"మా సొంత గ్రామంలో కన్నా నేను లేహ్ లోనే ఎక్కువ సమయాన్ని గడిపాను. అందుకే ఇక్కడే ఏజెన్సీని ప్రారంభించాను. ఒక వేళ అవకాశం దొరికితే ఇప్పటికీ మా స్వగ్రామమైన తక్ మాచిక్‌లో కొంత సమయం గడిపేందుకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే... ఇప్పటికీ ఎప్పటికీ అది మా సొంత ఊరు కాబట్టి" అని లేహ్ తో అనుబంధం పెనవేసుకున్న తన పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటుంది థిన్లాస్.