జాయ్ ఫుల్ జర్నీ' ప్రెస్ ప్లే' లక్ష్యం

ఉద్యోగాలు, వ్యాపారాలతో రోజువారీ ప్రయాణాలు చేసే వారి జీవితాలు నరకప్రాయం. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు చేసే ప్రయాణాలు.. మరీ విసుగు. రాత్రిళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళే వాహనాల్లో కానీ కనీసం సినిమాలైనా ఉంటాయి. అయితే ఆ సినిమాను అంతకు ముందే చూసిందే అయినా.. చెత్త సినిమా అయినా మనం భరించలేం. ప్రత్యామ్నాయం లేక సతమతమవుతాం. ఇలాంటి వారి కష్టాలను తొలగించేందుకు వచ్చిందే ప్రెస్ ప్లే. జర్నీని ఆటా,పాటలతో నింపేసే ఈ ప్రెస్ ప్లే ఏంటో మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

జాయ్ ఫుల్ జర్నీ' ప్రెస్ ప్లే' లక్ష్యం

Monday March 30, 2015,

3 min Read

ప్రయాణాల్లో వినోదాన్ని అందించడం ద్వారా.. విసుగును దూరం చేయడమే లక్ష్యంగా.. “ప్రెస్ ప్లే” ఆవిర్భవించింది. సంస్థ నిర్వాహకులు వినోదాన్ని పంచే కార్యక్రమాలను లోడ్ చేసిన ట్యాబ్ లను ప్రయాణికులకు అందచేస్తారు. ఈ ట్యాబ్ లు చేతికి అందాక ప్రయాణికులు బస్సుల్లోని టీవీలపై ఆధార పడడం కానీ, , ఆ బస్సు నిర్వాహకులు వేసే మనకు నచ్చని సినిమాను చూసి తీరాల్సిన అవసరం కానీ ఉండదు.

ఆనంద్ సిన్హా, జార్జ్ అబ్రహం అనే మిత్రద్వయం గతంలో జోమాటో సంస్థలో కీలక పదవుల్లో ఉండేవారు. వీరిద్దరూ తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి.. ప్రెస్ ప్లేని ప్రారంభించారు. అమెరికాకు చెందిన డిఈ షా సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు.. ఆనంద్, జార్జిని కలిశాడు. వాళ్ళిద్దరూ ఒకే అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ మేట్స్ గా ఉండేవారు. డిఈ షా సంస్థలో ఉద్యోగంతో విసుగు చెందిన ఆనంద్.. కొత్త ఆవిష్కారంతో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని ఆలోచిస్తూ ఉండేవాడు. దీంతో అతడు ఉద్యోగాన్ని వదిలేసి జొమాటో లో చేరాడు. త్వరిత కాలంలోనే.. జార్జ్ కూడా ఆనంద్ ని అనుసరించాడు. వారిద్దరూ కలిసి అవిశ్రాంతంగా శ్రమిస్తూ.. జొమాటో సంస్థలో కంట్రీ మేనేజర్ల స్థాయికి చేరుకున్నారు. జొమాటో భారత దేశ విభాగానికి ఆనంద్ అధిపతి కాగా.. యుఏఈ రీజన్ లో సంస్థ ఉత్పత్తుల అమ్మకాలు పెంచే బాధ్యతలను జార్జ్ నిర్వహించారు.

image


జొమాటోలో పనిచేస్తున్నప్పుడే.. ‘ప్రయాణంలో వినోదం’ అన్న ఆలోచన మొదలైంది. ఆ కోరిక మాలో రోజురోజుకీ పెరిగిపోతూ వచ్చింది అని ఆనంద్ గుర్తు చేసుకున్నారు. జొమాటోలో జాతీయ స్థాయి సేల్స్ హెడ్ గా, నేను దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటించాల్సి వచ్చేది. ఈ సుదూర ప్రయాణాల వల్ల ఒరిగేదేమీ లేదని త్వరగానే అర్థమైపోయింది. ప్రయాణం చేస్తున్నప్పుడు ఓ వినోదం గానీ, ఓ ఆనందం గానీ లేక చాలా సందర్భాల్లో ప్రయాణాలంటేనే అసహ్యమేసేది. అలాంటప్పుడే.. ప్రయాణంలో వినోదం గురించి ఆలోచన నాలో నవ్యోత్సాహాన్ని నింపింది.

ఓసారి ఆలోచన వచ్చాక.. ఇక ఆనంద్ మనసు తనను నిలువనీయలేదు. తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాను ఉద్యోగాన్ని వదిలేయడానికి ముందు.. తన ప్రయత్నం ఏమేరకు సఫలమవుతుందో తెలుసుకునేందుకు.. వినియోగదారుల సమాచారాన్ని (ఫీడ్ బ్యాక్) సేకరించాడు. దాన్ని క్షుణ్ణంగా క్రోడీకరించుకున్నాక.. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు.

“ జొమాటోలో పని చేస్తున్నప్పుడు, ఓ వారాంతపు రోజున, అమృత్ సర్ వెళ్ళేందుకు బస్సులో టికెట్ బుక్ చేసుకున్నాను. ఐదు వినోదాత్మక సినిమాలు నింపిన ఓ పది ట్యాబ్ లను నా వెంట తీసుకు వెళ్ళాను. ప్రయాణం మొదలు కాగానే, నావద్దనున్న ట్యాబ్ లను ఒక్కోటి వంద రూపాయల చొప్పున ప్రయాణికులకు పది ట్యాబ్ లనూ ఐదే నిముషాల్లో అమ్మేశాను. ఆ ప్రయోగం గురించి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అప్పుడిక నా ఆలోచనను అమలు చేయవచ్చని దృఢ నిశ్చయానికి వచ్చాను. ముఖ్యంగా నా ఆలోచన అమలైతే.. మన దేశంలోనే పని చేయవచ్చన్న ఆలోచన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 2013 అక్టోబర్ నెల్లో ఇది జరిగింది. ఇక నా ఆలోచనను అమలు చేసేందుకు అదే సరైన సమయమని నిర్ధారించుకున్నాను. “

image


ట్యాబ్స్ ఎత్తుకుపోతే !

బస్సు ప్రారంభమయ్యే సమయానికి కొద్ది సేపటికి ముందు.. మా ప్రెస్ ప్లే ఆపరేటర్ బస్సులోకి ప్రవేశిస్తాడు. ప్రయాణికులకు మా ఉత్పత్తిని విక్రయిస్తాడు. సినిమాలు, ఆటల్లాంటి కంటెంట్ ను అందించే చాలామందిని భాగస్వాములుగా చేర్చుకున్నాము. వారు కూడా రంగంలోకి దిగి.. మా ఉత్పత్తులను ప్రయాణికులు అందిస్తారు. ప్రయాణానికి ముందు.. ట్యాబ్ లు పూర్తి ఛార్జింగ్ తో ఉన్నాయా లేదా అన్నది పరిశీలిస్తాము. ప్రయాణికులు మా ట్యాబ్ ను తీసుకునేందుకు ఇష్టపడితే.. వంద రూపాయలు వసూలు చేస్తాము. ట్యాబ్ లను, ప్రయాణికుడి ముందున్న సీటు వెనుక భాగంలో.. ప్రత్యేక హార్డ్ వేర్ ద్వారా అతికించి లాక్ చేస్తాము. ట్యాబ్ లను ప్రయాణికులు తమతో పాటు తీసుకు వెళ్ళకుండా ఈ జాగ్రత్త తీసుకుంటాము.

ట్యాబ్లెట్స్ సురక్షితంగా ఉండేలా చూసుకోవడమే అతి పెద్ద సవాలన్నది ఆనంద్ అభిప్రాయం. ఎందుకంటే.. ఆ ట్యాబ్ లను బస్సుల్లో శాశ్వతంగా అతికించి ఉంచడం గానీ, వాటి భద్రతకు మరో వ్యక్తిని నియోగించడం కానీ, వారికి ఇష్టం లేదు. ఈ విధానం అమల్లోకి తెచ్చి కొంత పరిశీలించిన తర్వాత, హార్డ్ వేర్ ను మరింత పకడ్బందీగా రూపొందించడం మొదలు పెట్టారు. అన్నీ సొంతంగా వారే డిజైన్ చేసుకుంటారు.

బస్సు ఆపరేటర్లు ఇప్పుడు భారీ ఆర్డర్లతో మమ్మల్ని సంప్రదిస్తున్నారు. కొంత మందైతే.. బస్సులోని అన్ని సీట్లకూ ట్యాబ్ లను శాశ్వతంగా అతికించమని కోరుతున్నారు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగ రవాణా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాము. మా ఆలోచనను అమలు చేసిన తొలి రోజు నుంచే మేము ఆదాయాన్ని పొందుతూ వస్తున్నాము. అదే మాకో మైల్ స్టోన్ అని చెప్పాలి. అంటూ తమ ఎదుగుదల గురించి వివరించారు ఆనంద్.

భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆనంద్, వివరిస్తూ.. ఇప్పుడు బయటికి రావాలన్న ఆలోచనే లేదు. మా వినియోగదారులకు ప్రతిరోజూ సంతోషాన్ని వినోదాన్ని పంచాలన్న ఏకైక లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాము. కొత్త సంస్థ మనుగడకు ఐదేళ్ళ సమయం చాలా పెద్దది. సాంకేతికత ఎన్నో మార్పులను తెస్తుంది. అచ్చం మా ఉత్పత్తి లాగానే.

గతంలో.. ఇదే తరహాలో.. బెంగళూరుకు చెందిన యువర్ బస్ అనే బస్ సంస్థను.. ఇబిబో గ్రూప్ చేపట్టింది.. తర్వాత.. దీన్ని రెడ్ బస్ సంస్థలో విలీనం చేసింది.