సరుకు రవాణాలో అపార అవకాశాలంటున్న 'ది పోర్టర్'

సరుకు రవాణా రంగంలో అద్భుత వ్యాపార అవకాశాలుఐఐటీ మాజీ విద్యార్ధుల వినూత్న ఆలోచనది పోర్టర్.. రవాణా ఆధారిత మార్కెట్ ప్లేస్

సరుకు రవాణాలో అపార అవకాశాలంటున్న 'ది పోర్టర్'

Tuesday May 19, 2015,

3 min Read

రవాణా, ప్రజా రవాణాలో రోజుకో కొత్త సైట్, యాప్ పుట్టుకొస్తున్న రోజులివి. ఇప్పటికి దాదాపు 500మిలియన్ డాలర్లలను ఈ తరహా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు చాలా మంది. ఉబెర్ ఫర్ ఎక్స్ అనే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తోంది. మన దేశం కూడా ఈ రేసులో ముందంజలోనే ఉంది. ఓలా, ట్యాక్సీ ఫర్ ష్యూర్, జొమాటో వంటి కంపెనీలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండడమే దీనికి తార్కాణం.

image


ప్రణవ్ గోయల్-ఉత్తమ్ దిగ్గా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పట్టభద్రులు. వికాస్ చౌదరీ ఐఐటీ కాన్పూర్‌లో విద్యాభ్యాసం చేశారు. వీరు ఉబెర్ సంస్థ బిజినెస్ మోడల్‌ను చాలా నిశితంగా పరిశోధించారు. టెక్నాలజీ ఆధారంగా ఈ రంగంలో ఇతర కంపెనీలు విస్తరిస్తున్న తీరును ఆకళింపు చేసుకున్నారు. ముంబై రవాణా సదుపాయాలపై గ్రౌండ్ రీసెర్చ్ చేసిన ఈ ముగ్గురు... మార్కెట్ సామర్ధ్యానికి, ఇప్పుడున్నవి సరిపడేంత లేవనే విషయం వీరికి అర్ధమైంది. "న్యూఢిల్లీ- బెంగళూరుల్లోనూ ప్రాథమిక పరిశోధన పూర్తి చేశాం. నగరాల్లో అంతర్గత రవాణా తగినంతగా లేదం"టారు ప్రణవ్.

సామర్ధ్యం ఉండీ, సదుపాయాలు లేకపోవడమే ది పోర్టర్ ప్రారంభానికి ప్రధాన కారణం. ది పోర్టర్.. రవాణా రంగానికి సంబంధించిన మార్కెట్ ప్లేస్ ఇది. కస్టమర్లను, కమర్షియల్ వాహనాలతో కలిపే సాధనం ఇది. అత్యంత వేగంగా సరుకు రవాణా చేయగలగడం దీని విశిష్టత. “ రేట్ల నిర్ణయంలో పారదర్శకత, ట్రాకింగ్, నోటిఫికేషన్ అలర్ట్స్ వంటి ప్రీమియం సదుపాయాలను... అతి తక్కువ ధరకే అందించగల టెక్నాలజీ ఆధారిత సర్వీస్ సంస్థ మాదం"టారు ప్రణవ్.

ప్రస్తుతం ట్రక్ డ్రైవర్లకు, కస్టమర్లకు మధ్య చాలా అభిప్రాయ బేధాలున్నాయి. తమ చుట్టూ అపార అవకాశాలున్నా... వాటి గురించి తెలుసుకునే ఛాన్స్ డ్రైవర్లకు ఉండడం లేదు. తమ అవసరాలకు తగిన పరిష్కారం వెతుక్కోవడం వినియోగదారులకూ సాధ్యపడ్డం లేదు. “సరుకు రవాణా రంగంలో ఉన్న అస్థిరతను పారద్రోలి, వ్యవస్థీకృతంగా దేశవ్యాప్త సర్వీసులు అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ రంగంలో రిటర్న్ కస్టమర్లు ఉండడం చాలా అరుదు. అలాగే వెయింటింగ్ సమయం చాలా ఎక్కువగా ఉంటోంది. ఇవి చాలా పెద్ద సమస్యలు. దీనితో సామర్ధ్యానికి తగినట్లుగా సదుపాయాలు ఉపయోగించుకోవడం సాధ్యపడ్డల్లేదు. దీన్ని అధిగమించేందుకు పుట్టిన ఆలోచనే ది పోర్టర్" అంటారు ఉత్తమ్.

ముంబై కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ రియల్ టైం ట్రాకింగ్, ఆటోమేటిక్ నోటిఫికేషన్స్, డిజిటల్ ట్రిప్ లాగ్స్‌తోపాటు పారదర్శకమైన ధరలతో సేవలు అందిస్తోంది. అలాగే రవాణా విషయంలో అన్ని చట్టబద్ధమైన నిబంధనలు పాటిస్తూ... పత్రాలతో సహా రవాణా చేస్తుండడం ది పోర్టర్ ప్రత్యేకత.

ఢెలివరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు రెండు, మూడు బడా సంస్థలపైనే ఆధారపడి పని చేస్తున్నాయి. ఈ కంపెనీల వాహనాలు నిండుగా ఉండాలంటే.. ఆయా సంస్థలు వీటికి పని చెప్పాల్సిందే. దీంతో ఈ అమ్మకందారుల కారణంగా మధ్యవర్తుల సంఖ్య పెరిగిపోతోంది. “ విపరీతంగా పెరిగిపోతున్న ఈ మధ్యవర్తులను నియంత్రించడమే మా లక్ష్యం. రవాణారంగంలో ఓ చివర ఉండే కస్టమర్‌ని, మరో చివర ఉండే సర్వీస్ ప్రొవైడర్‌తో నేరుగా కలుపుతున్నాం. సాధారణంగా ప్రయాణించిన దూరం, ప్రారంభ- ముగింపు సమయాలన్నీ వ్యక్తిగతంగా నోట్ చేస్తుంటారు. కానీ మా డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా అన్నీ ఆటోమేటిక్‌గా రికార్డయిపోతాయం"టారు ఉత్తమ్.

ప్రారంభంలో 2 టాటా ఏస్ వాహనాలతో ప్రారంభమైన దిపోర్టర్... ఐదు నెలల్లోనే 15 టాటా ఏస్‌లు, 2 టాటా 407(హైయర్ వేరియంట్)లతో సేవలందించే స్థాయికి చేరుకుంది. మొదట్లో రోజుకు 15-20 ఆర్డర్లను నిర్వహించామని చెబ్తున్నారు సిబ్బంది. “ఓ సంస్థాగత కంపెనీకి సేవలందించడంతో మొదలైన మా ప్రయాణం... మొదటి నెలలోనే 82 ట్రాన్సాక్షన్లు పూర్తి చేసి విజయవంతంగా ప్రారంభమైందనే చెప్పాలి. తరువాతి నెలలో ఆన్ డిమాండ్ సర్వీస్ ప్రారంభించాక... వేగం ఊపందుకుంది. ప్రస్తుతం రోజుకు 400కుపైగా ఆర్డర్లను నిర్వహిస్తోంది దిపోర్టర్.

image


ది పోర్టర్‌లో ఉండే వాహనాలన్నిటిలోనూ ఓ స్మార్ట్‌ఫోన్ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. దీనిలో వీరే అభివృద్ధి చేసిన ఓ మొబైల్ యాప్ ఎప్పుడూ రన్నింగ్‌లో ఉంటుంది. "ఈ యాప్ ద్వారా రియల్ టైం ట్రాకింగ్ సాధ్యమవుతుంది. దీంతో కస్టమర్లకు అప్‌డేట్స్, అలర్ట్స్ ఇవ్వడం సాధ్యం. సామర్ధ్యాన్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగంచుకోడానికి కూడా ఈ ట్రాకింగ్ ఉపయోగపడుతుంది"అంటారు ప్రణవ్.

భారతదేశంలో రోడ్డు రవాణా రంగం విలువ 150 బిలియన్ డాలర్లు. ఇందులో ఐదో వంతు చివరి నిమిషంలో జరిగే డెలివరీలే. ఇందులో నగరాల్లో 10-12 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఈ అవకాశాన్ని అందుకోడానికి దిపోర్టర్ ప్రయత్నిస్తోంది. ముంబైలో 200ట్రక్కులతో సేవలందించే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. అలాగే ఢిల్లీ, బెంగుళూరుల్లోనూ ఏడాదిలో సేవలు ప్రారంభించే ప్రణాళికలున్నాయి దిపోర్టర్ సంస్థకు. షిప్పర్, బ్లోహార్న్ వంటి సంస్థలతో దిపోర్టర్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.