పర్యావరణం పాడైపోతుంటే ఏం చేస్తున్నారు..? కేంద్రంపై పిటిషన్ వేసిన చిన్నారి  

0

చిన్నారులకు బడి, ఆట తప్ప వేరే ప్రపంచం తెలియదు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈమధ్య పిల్లలు పిడుగులై కురుస్తున్నారు. జవాబు చెప్పలేని ప్రశ్నలు సంధిస్తున్నారు. అవేవో ధర్మసందేహాలు కాదు. ఏకంగా కోర్టుల్లోనే పిటిషన్లు వేస్తున్నారు. రిధిమా పాండే అనే తొమ్మిదేళ్ల చిన్నారి అలాంటి పిటిషనే దాఖలు చేసింది. అది ఎరిపైనో కాదు.. ఏకంగా కేంద్ర ప్రభుత్వంపైనే. పర్యావరణం ఇంతగా సర్వనాశనమై పోతుంటే ఇంతకాలం మీరేం చేశారు.. నాకు జవాబు చెప్పండి అని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ద్వారా నిగ్గదీసింది.

రిధిమా తన లీగల్ గార్డియన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై పిటిషన్ ఫైల్ చేసింది. దాన్ని స్వీకరించిన గ్రీన్ ట్రైబ్యునల్- చిన్నారి అడిగిన ప్రశ్నలకు సంజాయిషీ కోరుతూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో ఆ చిన్నారికి జవాబు చెప్పండి అని ఆదేశించింది.

పిటిషన్ లో రిధిమా చాలా ప్రశ్నలే సంధించింది. అడవుల పెంపకంపై సర్కారు తీసుకున్న నిర్ణయాలేంటి? శిలాజ ఇంధనాల వాడకం వల్ల జరుగుతున్న అనర్ధాలను ఎలా అడ్డుకుంటున్నారు అని అడిగింది.

మా ప్రభుత్వం గ్రీన్ హౌస్ ఉద్గాలరాలను తగ్గించడానికి తీసుకునే చర్యల్లో విఫలమైంది. ఇది మాలాంటి పిల్లల భవిష్యత్ కు మంచిది కాదు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు మన దేశంలో ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయి. అందుకు సర్కారుకు సామర్ధ్యం కూడా వుంది. అందుకే నేను గ్రీన్ ట్రైబ్యునల్ ని ఆశ్రయించాను అని రిధిమా పిటిషన్ లో పేర్కొంది.  

Related Stories