దక్షిణాది గర్వించదగ్గ అష్టదిగ్గజాలు

వేర్వేరు నేపథ్యాలు... వేర్వేరు విజయగాథలుయువపారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాతలు

దక్షిణాది గర్వించదగ్గ అష్టదిగ్గజాలు

Thursday July 09, 2015,

4 min Read

ఉగాది... సంస్కృత పదాలైన యుగ, ఆది నుంచి ఉద్భవించింది. "అంటే కొత్త యుగానికి ఆరంభం" అని అర్థం. భారతదేశంలో పారిశ్రామికవేత్తలెందరో ఉన్నా... మూలాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. స్టార్టప్ ప్రపంచానికి ఉగాది లాంటి వారెందరో ఉన్నారు. ఇండియాలో స్టార్టప్ విప్లవంలో మార్గదర్శకంగా నిలిచిన ప్రాంతమేదంటే అంతా దక్షిణ భారత దేశాన్నే చూపిస్తారనడంలో ఆశ్చర్యం లేదు. ఇందుకు బలమైన కారణాలున్నాయి. ఫ్లిప్ కార్ట్, ఇన్ మొబి, మింత్రా, రెడ్ బస్, ఫ్రెష్ డెస్క్ లాంటి టాప్ స్టార్టప్‌ల సృష్టికర్తలంతా దక్షిణ భారతదేశీయులే. ఇక్కడి నుంచి పుట్టుకొస్తున్న పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారి గురించి వివరించే ప్రయత్నమే ఈ కథనం.

image


బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గ్రాంట్ థార్న్ టాన్ లు షార్ట్ లిస్ట్ చేసిన ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలకు సీఐఐ అవార్డులను ప్రదానం చేసింది. ఈ పారిశ్రామికవేత్తలందరివీ వేర్వేరు నేపథ్యాలే. ఆన్ లైన్ ట్రేడింగ్ సంస్థ నుంచి మెషీన్ల తయారీ వరకు; బెంగళూరులో ఫిల్టర్ కాఫీ చెయిన్ నుంచి ఇండియాలో బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్ల అతిపెద్ద చెయిన్ వరకు... ఎవరి దారి వారిది. ఎవరి నేపథ్యం వారిది. గత మూడునాలుగేళ్లుగా తమ ఉనికిని, సత్తాను చాటుతున్న ఈ కంపెనీల ప్రస్తుత రెవెన్యూ ఐదు కోట్లకు పైనే ఉంటుంది. ఈ కంపెనీలు వచ్చే నాలుగైదేళ్లలో వంద కోట్లకు పైగా రెవెన్యూ సాధిస్తాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రిన్సిపాల్ సమీర్ అగర్వాల్ గట్టిగా నమ్ముతున్నారు.

సీఐఐతో కలిసి యువర్ స్టోరీ ఈ ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలను దక్షిణాది గర్వించదగ్గ అష్టదిగ్గజాలుగా గుర్తించింది. మరి వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.

image


యూఎస్ మహేందర్

2009లో ప్రారంభమైన హట్టికాపి కో ఫౌండర్. దక్షిణాదిలో కాఫీప్రియులకు సరసమైన ధరకే స్వచ్ఛమైన, మంచి ప్రమాణాలున్న ఫిల్టర్ కాఫీ అందిస్తున్న సంస్థ ఇది. వినడానికి చిన్న కాఫీకొట్టులా అనిపించినా బెంగళూరులో ఈ స్టార్టప్‌ది బ్రహ్మాండమైన బిజినెస్. ఇప్పటివరకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా 16 చోట్ల ఔట్ లెట్లను తెరిచిందీ సంస్థ. కస్టమర్లను సంతృప్తిపరుస్తూ, వారిలో నమ్మకాన్ని నిలబెడుతూ వ్యాపారం ఎలా చేయాలో ఈ సంస్థను చూసి నేర్చుకోవచ్చు. అందుకే మొదట్లో ఉన్న కస్టమర్లే ఇప్పటికీ ఉన్నారు. కస్టమర్లతో అంతలా దీర్ఘకాల సంబంధాలను ఏర్పరుచుకోవడం ఈ సంస్థ గొప్పదనం. అంతటితో ఆగలేదు. కస్టమర్లకు ఇస్తున్నదాంతో సరిపెట్టకుండా క్వాలిటీని మరింత పెంచేందుకు నిత్యం కసరత్తు జరుగుతూనే ఉంది.

సీకే కుమారవేల్

భారతదేశంలో నెంబర్ వన్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ అయిన నేచురల్స్ వ్యవస్థాపకుడు. చెన్నైలో ప్రారంభించిన ఈ సంస్థ సక్సెస్ యువపారిశ్రామికవేత్తలకు సిలబస్ లాంటిది. తరచుగా పలు కార్యక్రమాల్లో యువ పారిశ్రామికవేత్తలను మోటివేట్ చేస్తూ కనిపిస్తుంటారాయన. దశాబ్దం క్రితం తన జర్నీ మొదలుపెట్టాడు. మార్పు అంటే కేవలం పైకి కనిపించేదే కాదు... జీవించే విధానంలో కూడా మార్పు కనిపించాలని నమ్మేవాడు. అదే విషయాన్ని నేచురల్స్ బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్ ద్వారా చెప్పదలచుకున్నాడు. తాను ఎంచుకున్న దారి మహిమ అలాంటిది మరి. ఇప్పుడీ సంస్థ భారతదేశంలో హెయిర్ అండ్ బ్యూటీలో ప్రముఖ చెయిన్‌గా ఎదిగింది. వీరికి దేశంలో మూడు వందలకు పైగా సెలూన్లున్నాయి. మరో విశేషమేంటంటే... అన్ని స్టోర్లు మహిళా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉన్నవే.

నితిన్ కామత్

ఇండియాలో తొలి డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీ 'జిరోధా' వ్యవస్థాపకుడు. 17 ఏళ్ల వయస్సులో ట్రేడింగ్‌లో అడుగుపెట్టాడు. కాలేజీ రోజుల్లో చదువు కన్నా ఎక్కువ సమయాన్ని ట్రేడింగ్‌లో గడిపేవాడు. కానీ 2001లో మాంద్యం కారణంగా భారీగా నష్టపోవాల్సివచ్చింది. అయినా నితిన్ కృంగిపోలేదు. 'డిస్కౌంట్ బ్రోకింగ్'ను భారతదేశానికి పరిచయం చేసి సక్సెసయ్యాడు. రీటైల్ ట్రేడింగ్ కమ్యూనిటీ సాధికారత కోసం 2010లో Zerodhaని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ కంపెనీ రోజుకు రూ.4000 కోట్లకు పైగా బిజినెస్ ను హ్యాండిల్ చేస్తోంది. వారి దగ్గర వంద మంది ఉద్యోగులున్నారు. ఇండియన్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో వేగంగా ఎదుగుతున్న సంస్థ ఇది.

సౌమిల్ మజుందార్

గ్రౌండ్‌లో ఆటలాడుకోవాల్సిన వయస్సులో టీవీకి అతుక్కుపోయే చిన్నారుల కోసం ఎడ్యుస్పోర్ట్స్ ని ప్రారంభించిన ఘనత మజుందార్ ది. 2009లో ప్రారంభమైంది ఎడ్యుస్పోర్ట్స్. బెంగళూరుకు చెందిన ఎడ్యుస్పోర్ట్స్ దేశంలోని పలు స్కూళ్లతో కలిసి పనిచేస్తోంది. పిల్లలకు ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ప్రోగ్రామ్ అందిస్తోందీ సంస్థ. శారీరక శ్రమతో పాటు ఆటల ద్వారా ఆరోగ్యాన్ని, ఫిట్నెస్‌ను సంపాదించుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఐదేళ్లలో ఎడ్యు స్పోర్ట్స్ ఎనభైకి పైగా నగరాల్లో నాలుగువందల పాఠశాలల్లో రెండు లక్షల మంది పిల్లలను చేరుకుంది.

సీఏ ఆంజర్

బెంగళూరులో హెల్త్ కేర్ సంస్థ వ్యవస్థాపకుడు. మూలికలు, పోషకాలు, సౌందర్య సాధనాలను అందించే సంస్థ ఇది. ఆలీవ్ లైఫ్ సైన్సెస్ బిజినెస్ మోడల్‌ను ఫాలో అవుతోంది. నేరుగా రైతులను సంప్రదించడం, కావాల్సిన మూలికలు, సౌందర్యసాధనాల పెంపకంలో భాగస్వాములవడం, వాటిని ప్రాసెస్ చేసి ఆ తర్వాత మార్కెటింగ్ చేయడం ఈ సంస్థ పని. ఈ బయోఫార్మాసూటికల్స్ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనుమతులుండటం విశేషం. ఈ సంస్థకు జపాన్, అమెరికా, యూరప్ దేశాల్లో నెట్ వర్క్ తో పాటు సేల్స్ ఆఫీసులున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందీ కంపెనీ.

కరుణాకర్ రెడ్డి

ఈయన్ను పర్యావరణ పరిరక్షకుడిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన ఉత్పత్తుల ద్వారా పర్యావరణానికి మేలు చేస్తున్నారీయన. తన కంపెనీ స్మాట్ ఆక్వా ద్వారా గాలి, నీరు, ఇంధన నిర్వహణ వ్యవస్థకు రూపకల్పన చేశారు. వీరి ఉత్పత్తులు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా యూజర్ ఫ్రెండ్లీ, జీరో మెయింటెనెన్స్ కూడా. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండే ఈ రంగంలో తన కంపెనీని ఎవరూ ఊహించని విధంగా లాభాల బాట పట్టించడం ఆయన నాయకత్వానికి నిదర్శనం.

మహమ్మద్ కుంజు

క్రస్ట్ ఎన్ క్రంబ్ ఫుడ్ ఇండస్ట్రీ వ్యవస్థాపకుడు. కేకులు, పేస్ట్రీల్లో వాడే పదార్థాలను తయారు చేసే కంపెనీ ఇది. బేకింగ్ అండ్ కాన్‌ఫెక్షనరీ ఇండస్ట్రీలో ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది. బేకింగ్ సొల్యూషన్స్‌లో సృజనాత్మకతతో సరికొత్త ఆవిష్కరణలు చేయడం ద్వారా మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటలీకి చెందిన మిల్బో సహకారంతో ప్రపంచవ్యాప్తంగా పదార్థాలను ఎగుమతి చేస్తోంది. సరికొత్త ఆవిష్కరణలు, క్వాలిటీ, ధరల్లాంటి అంశాలు ఈ కాంపిటీటీవ్ బిజినెస్‌లో ఆయన్ను చాలా ముందు నిలిపాయి.

శ్రీనివాసన్

వంటకు ముందు బియ్యంలో రాళ్లు, మట్టి పెడ్డలు తీసెయ్యడం ఇళ్లల్లో మనం చూసే ఉంటాం. కానీ పెద్దగా పట్టించుకోలేదెప్పుడు. కానీ శ్రీనివాసన్ అలా చూసి వదిలెయ్యలేదు. ఏవేవో ఊహించుకున్నాడు. వాటిని నిజం చేశాడు. అలా ఆరెంజ్ సార్టింగ్ మెషీన్ ను కనుగొన్నాడు. ఇలాంటి సార్టింగ్ మెషీన్లను ప్రపంచానికి పరిచయం చేశారు శ్రీనివాసన్. మొదట్లో వందల్లో... ఆ తర్వాత వేలల్లో ఈ యంత్రాలను భారతదేశంతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో ఇన్‌స్టాల్ చేశారు.

ఇదీ వీళ్ల ఘనత. దేశంలో ఇంతమంది పారిశ్రామికవేత్తలున్నా... దక్షిణాది అష్టదిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ ఎనిమిది మంది. వీళ్లంతా భారతదేశం స్థూల జాతీయోత్పత్తిని పెంచడమే కాదు... మన జీవన నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తున్నారు.