ప్రయాణ సమస్యలకు ఆన్‌లైన్ సొల్యూషన్ రిడ్లర్

ప్రయాణ సమస్యలకు ఆన్‌లైన్ సొల్యూషన్ రిడ్లర్

Monday April 04, 2016,

3 min Read


ప్రపంచ వ్యాప్తంగా జనాభా రోజు రోజుకు పెరిగిపోతోంది. దేశ జనాభా 120 కోట్లు దాటింది. ఏ నగరంలో చూసినా విపరీతమైన జనం. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులాంటి నగరాల్లోనైతే ట్రాఫిక్‌ జామ్‌లు సర్వసాధారణమైపోయాయి. ఈ ట్రాఫిక్ బాధను తట్టుకోలేకే ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ ఆడ్-ఈవెన్ ఫార్మూలాను ప్రవేశపెట్టింది. ముంబైలాంటి నగరాల్లో కూడా ఈ ఫార్మూలా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి ముందు ఢిల్లీలో ఎదురవుతున్న సమస్యల నుంచి ముంబై పాఠాలు నేర్చుకోవాలి. ఢిల్లీలో అంటే ప్రజా రవాణా వ్యవస్థ బాగుంటుంది. అక్కడి ప్రయాణికులకు ఎలాంటి సమస్యా ఉండదు. అదే ముంబై విషయానికొస్తే బలహీనమైన ఆటో నెట్‌వర్క్, బస్సులు, పొడవాటి క్యూలు ఇవన్నీ పెద్ద సమస్యలు. వీటికి తోడు ఇప్పుడు మెట్రో కూడా మరో సమస్య అయి కూర్చుంది. ఈ సమస్యలన్నింటికీ రిడ్లర్ స్టార్టప్ పరిష్కారం చూపిస్తోంది. టికెట్ల రిజర్వేషన్ల వద్ద పొడవాటి క్యూ సమస్య లేకుండా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు కృషి చేస్తోంది.

రిడ్లర్ యాప్ సృష్టికర్తలు బ్రిజ్‌రాజ్ వఘాని, రవి<br>

రిడ్లర్ యాప్ సృష్టికర్తలు బ్రిజ్‌రాజ్ వఘాని, రవి


రియల్‌టైమ్ సమాచారం

ముంబైలో ట్రాఫిక్ వివరాలను ఎప్పటికప్పుడు అందించే యాప్ ట్రాఫ్‌లైన్ వ్యవస్థాపకుల మానసపుత్రికనే రిడ్లర్. ముంబైలో ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఉందో రియల్‌టైమ్ సమాచారాన్ని అందిస్తోంది ట్రాఫ్‌లైన్. బర్డ్స్ ఐ సిస్టమ్‌ ద్వారా విలువైన సమాచారాన్ని అందిస్తున్న ఈ స్టార్టప్ యాప్‌ను 20 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

‘‘ట్రాఫ్‌లైన్ యాప్ ద్వారా ప్రయాణ సమాచారాన్ని అందిస్తున్నాం. ప్రయాణ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న మరిన్ని సమస్యల పరిష్కారం కోసం రిడ్లర్‌ను సృష్టించాం. ప్రజలు ఎలాంటి డబ్బులు లేకుండానే ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించాం. టికెట్‌‌కు సరిపడ చిల్లర ఉంచుకోవడం, పొడవాటి క్యూలు, ఇతర సమస్యల నుంచి రిడ్లర్ పరిష్కారం చూపుతుంది. అంతేకాదు సౌకర్యవంతమైన అనుభవాన్ని కూడా అందిస్తుంది అంటారు రిడ్లర్, ట్రాఫ్‌లైన్ సీఈవో కమ్ ఫౌండర్ రవి ఖెమాని.

ప్రైవేట్‌-ప్రభుత్వ భాగస్వామ్య ప్రయోజనాలు..

విదేశాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న రవాణా వ్యవస్థలకు సంబంధించిన సేవలు చాలావరకు ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తుంటాయి. ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా ఇలాంటి ఒప్పందాలు జరుగుతున్నాయి. మెట్రో రైల్ విషయంలో ముంబైలో రిలయన్స్, హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీతో ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ కలను సాకారం చేసేందుకు రిడ్లర్ ముందుకొచ్చింది.

అంతా ఆన్‌లైన్‌లోనే..

రిడ్లర్‌లో టికెట్ బుకింగ్ ప్రాసెస్ మంచినీళ్ల తాగినంత సులువు. గమ్యాన్ని సెలెక్ట్ చేసుకుని, పే యూ మొబైల్ వ్యాలెట్ ద్వారా డబ్బు చెల్లించి ఈ-టికెట్ తీసుకోవాలి. బస్సు ఎక్కిన తర్వాత ఆ టికెట్‌ను కండక్టర్‌కు చూపించాలి.

మూడు వెర్షన్లతో ఈ స్టార్టప్‌ను లాంచ్ చేశారు. రవాణా సౌకర్యాల గురించి ప్రయాణీకులకు సమాచారాన్ని అందజేయడం, రెండు ప్రజా రవాణా, ట్రాఫిక్ జామ్‌ల గురించి రియల్ టైమ్ సమాచారాన్ని అందించడం, మూడు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్. ప్రస్తుతానికైతే రిడ్లర్ యాండ్రాయిడ్‌లో మాత్రమే లభిస్తోంది. త్వరలోనే ఐఓఎస్‌లో కూడా లాంచ్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ముంబై మెట్రోకు సంబంధించిన సేవలను కూడా రిడ్లర్ అందిస్తోంది. యాండ్రాయిడ్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది. 

క్యాష్‌లెస్ ట్రావెల్స్..

ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం క్యాష్‌లెస్ ట్రావెలింగ్. టార్గెట్ కూడా మధ్య తరగతి ప్రజలే. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రయాణికులే లక్ష్యంగా పనిచేస్తున్నారు. యాప్ ద్వారా వివిధ రకాల ప్రజా రవాణా సౌకర్యాలకు సంబంధించిన వివరాలను అందించడంతోపాటు ’బిలో ద లైన్ (బీటీఎల్)’ యాక్టివేషన్ బ్రాండింగ్ కూడా నిర్వహిస్తున్నారు. 

ముంబైలోని ఎన్‌ఎంఎంటీ బస్‌లో ప్రయాణీకులు

ముంబైలోని ఎన్‌ఎంఎంటీ బస్‌లో ప్రయాణీకులు


సవాళ్లు..

రవాణా సౌకర్యాన్ని పూర్తిగా ఆన్‌లైన్ చేయాలన్న సంకల్పంతో ఉన్నప్పటికీ రిడ్లర్‌కు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు సహకరించడం లేదు. డిజిటలైజేషన్ చేసేందుకు డబ్బు సమయం భారీగా ఖర్చవుతున్నాయి.

దేశవ్యాప్త సేవలు..

ఒక్క ముంబైలోనే కాదు దేశవ్యాప్తంగా తమ సేవలు అందించాలని రిడ్లర్ ప్రయత్నిస్తోంది. లోకల్ ట్రైన్స్, మెట్రో, బస్‌లకు సంబంధించిన సమస్త సమాచారం.. టైమ్ టేబుల్స్, న్యూస్, ఆలస్యం, ప్రకటనలు ఇలా అన్ని వివరాలను తమ యాప్‌లో అందిస్తోంది. దేశవ్యాప్తంగా ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, చండీగఢ్, జైపూర్, పుణె, అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, భావ్‌నగర్, ఇండోర్, బెల్లారీ, విజయవాడ, లుధియానా, వడోదర, నాగపూర్ నగరాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది.

వృద్ధి..

ముంబైలో నిత్యం ప్రయాణించే 11.5 మిలియన్ల ప్రయాణికులకు మంచి సౌకర్యాలు అందించాలన్నదే రిడ్లర్ ఉద్దేశం. ట్రాఫ్‌లైన్ యాప్‌ను ఇప్పటికే 15 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. రిడ్లర్ యాప్‌ను 10 లక్షల మంది ఉపయోగిస్తున్నారు. ట్రాన్సాక్షన్ల విషయంలో ప్రతి నెలా 200% వృద్ధి రేటు కనిపిస్తోంది. రిపీటెడ్ యూజర్లే ఎక్కువగా వస్తున్నారు.

నిధుల సమీకరణ..

ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు కూడా ముందుకు వస్తున్నారు. మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్, క్వాల్‌కామ్ వెంచర్స్ గత ఏడాది నవంబర్‌లో పెట్టుబడులు పెట్టాయి. సీఐఐఈ, ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్ (ఐఏఎన్) కూడా సీడ్ ఫండింగ్ పెట్టింది. 

ఢిల్లీలో ఉపయోగిస్తున్న ఆడ్-ఈవెన్ ఫార్మూలాపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజారవాణాలో నెలకొన్న సమస్యలకు క్యాష్‌లెస్ ట్రావెలింగ్, డిజిటలైజేషనే మంచి పరిష్కారాలు. ప్రభుత్వం ఇప్పటికే లోకల్ ట్రైన్స్‌ కోసం టికెటింగ్ యాప్ అన్‌రిజర్వడ్ టికెటింగ్ (యూటీఎస్)ను ప్రవేశపెట్టింది. అయితే దీని పరిధిలోకి బస్‌ నెట్‌వర్క్‌ను తీసుకురాలేదు. ఈ గ్యాప్‌ను రిడ్లర్ ఉపయోగించుకుంటోంది. ప్రజా రవాణా వ్యవస్థలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న రిడ్లర్ మరిన్ని విజయాలను అందుకోవాలని యువర్‌స్టోరీ ఆకాంక్షిస్తోంది.