బెంగళూరు ట్రాఫిక్ చిక్కులకు క్విక్ రైడ్ చెక్

బెంగళూరు ట్రాఫిక్ చిక్కులకు క్విక్ రైడ్ చెక్

Sunday February 07, 2016,

4 min Read

మహానగరాల్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. రోడ్డెక్కామంటే గమ్యానికి ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. ట్రాఫిక్ పద్మవ్యూహాలను ఛేదించాలంటే చుక్కలు కనిపిస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై... నగరమేదైనా ఇదే సమస్య. కొంతకాలం క్రితం చేసిన ఓ సర్వే ప్రకారం ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉన్న ప్రపంచనగరాల్లో ఆరోస్థానంలో నిలిచింది బెంగళూరు. ఏళ్లు గడిచినా అక్కడ పరిస్థితులేమీ మారలేదు. ఉన్నరోడ్లే సరిపోవట్లేదంటే వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో పార్కింగ్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ప్రధాన ఐటీ పార్క్స్, మాల్స్, ఇతర ప్రాంతాల్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ లు నిర్మించినా పార్కింగ్ సమస్యలు తీరలేదు. అడ్డదిడ్డంగా పార్క్ చేసిన వాహనాలు రోడ్లపైకి చొచ్చుకొస్తుంటాయి. సాధారణంగా ట్రాఫిక్ సమస్యలకు ఇదే ప్రధాన కారణం. నివాస ప్రాంతాల్లో కూడ ట్రాఫిక్ సమస్యలేమీ తీరలేదు. ఇటీవల చేసిన అధ్యయనం ప్రకారం 90 శాతం ఇళ్లకు పార్కింగ్ సదుపాయమే లేదు. దీంతో రోడ్లపై, ఫుట్ పాత్ లపై వాహనాలను పార్క్ చేయాల్సి వస్తోంది.

కార్ పూలింగ్ యాప్

బెంగళూరు ట్రాఫిక్ సమస్యలపై కెఎన్ఎం రావుకు ఎన్నో అనుభవాలున్నాయి. హువాయ్ టెక్నాలజీస్ లో మిడిల్ వేర్ ప్లాట్ ఫామ్ డెవలప్ మెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కంకణం కట్టుకున్నారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించాలనుకున్నారు. కార్ పూలింగ్ ద్వారా ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించవచ్చని భావించారు. నిజం చెప్పాలంటే ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా రైడ్ షేరింగ్ కోసం వచ్చిన ఎన్నో యాప్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. చివరికి అవన్నీ ఓ దశలో ఆగిపోయాయి. ఇవన్నీ ఆయనకు బాగా తెలుసు. అయినా ఇతరుల వైఫల్యాలతో నిరుత్సాహపడలేదు రావు. ఆ వైఫల్యాలే తన స్టార్టప్ కు పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. ఆ యాప్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయో తెలుసుకొని సరికొత్తగా యాప్ ను రూపొందించాలనుకున్నారు. రియల్ టైమ్ రైడ్ షేరింగ్ యాప్ ను తయారు చేయాలని రావు నిర్ణయించుకున్నారు.

రోడ్డెక్కిన క్విక్ రైడ్

అలా సెప్టెంబర్ 2015లో క్విక్ రైడ్ రోడ్డెక్కింది. రావు, సుభ్రో బి.చక్రవర్తి, శోభనా బీఎన్ లు కలిసి క్విక్ రైడ్ ను ప్రారంభించారు. బైక్, కార్ పూలింగ్ రైడ్ ప్లాట్ ఫామ్ ఇది. రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి రైడింగ్ వరకు అన్నీ పక్కాగా జరిగేలా యాప్ ను తీర్చిదిద్దారు. రైడ్ పార్ట్ నర్ తో సమన్వయపర్చుకోవడం, లావాదేవీలు, రేటింగ్ ఇవ్వడం లాంటి వాటితో యాప్ కు కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మీరు వెళ్లాలనుకుంటున్న మార్గంలో ఉండే వాహనదారులను రియల్ టైమ్ లో కనెక్ట్ చేస్తుందీ యాప్. అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా, లేదా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలనుకున్నా ఇందులో సాధ్యం. రియల్ టైమ్ లొకేషన్, రైడ్ స్టేటస్ లైవ్ మ్యాప్ పై కనిపిస్తుంది.

"అందుబాటులో ఉన్న వనరుల్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవడం, రోడ్డుపై వెళ్లే వాహనాల్లో ఖాళీ సీట్లను నింపేయడమే మా అంతిమ లక్ష్యం. ఒక్కరే కూర్చొని కారులో వెళ్లడమంటే వనరుల్ని దుర్వినియోగం చేయడమే. ట్రాఫిక్ జామ్స్, పార్కింగ్ సమస్యలు, కాలుష్యం, రోడ్లపై గంటలుగంటలు నిలబడటం ద్వారా తలెత్తే ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ఇలాంటి చర్యలన్నీ క్షమించరానివే" అంటారు 41 ఏళ్ల రావు.
image


ఈ స్టోరీ కూడా చదవండి

రెవెన్యూ మోడల్

0-8 కిలోమీటర్ల వరకు కిలోమీటర్ కు మూడు రూపాయల చొప్పున రైడర్స్ వసూలు చేసుకోవచ్చు. ప్రతీ లావాదేవీలో ఐదు శాతం సర్వీస్ ట్యాక్స్ రూపంలో మాకు చెల్లించాలి. మా టెక్నాలజీ అభివృద్ధి కోసం, పేమెంట్ గేట్ వే ఛార్జెస్ లాంటి వాటికోసం వాటిని ఉపయోగిస్తాం. నగదురహిత ట్రాన్సాక్షన్స్ అన్నీ యాప్ ద్వారానే చేసుకోవచ్చు. ఒకవేళ రైడర్ ఫ్రీ రైడ్ ని ఆఫర్ చేస్తే క్విక్ రైడ్ కు డబ్బులేమీ అందవు. గత నాలుగు నెలల్లో క్విక్ రైడ్ లో 4,400 మంది యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారు. సగటున రోజుకు 130 రైడ్లు జరుగుతున్నాయి. ఇప్పుడున్న ఖర్చులతో పోలిస్తే మరో ఏడాది వరకు నడిపించడానికి కావాల్సిన నిధులు తమ దగ్గరున్నాయి అంటారు స్టార్టప్ వర్గాలు.

మార్కెట్... పోటీ

భారతదేశంలో ఏడు కోట్ల వాహనాలున్నాయి. ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కార్ పూలింగ్ మార్కెట్ విలువ 15 వందల కోట్లు. 2025 నాటికి 30 వేల కోట్లు దాటుతుందని అంచనా. ఏడాదికి రోడ్లపైకే వచ్చే ప్రైవేట్ వాహనాల సంఖ్యను బట్టి మార్కెట్లో అవకాశాల్ని చూసుకుంటున్నానని వివరిస్తున్నారు రావు. MeBuddie, PoolCircle, Orahi, CarPoolAdda లాంటివి కార్ పూలింగ్ వ్యాపారంలో ఉన్నాయి. బ్రెజిల్ కు చెందిన Tripda, ఫ్రెంచ్ కు చెందిన BlaBlaCar ఈ రంగంలో పెద్ద కంపెనీలు. గతేడాది BlaBlaCar కు ఇన్ సైట్ వెంచర్ పార్ట్ నర్స్, లీడ్ ఎడ్జ్ క్యాపిటల్ నుంచి ఇరవై కోట్ల సిరీస్ డి ఫండింగ్ అందింది. ఈ నెల గుర్గావ్ కు చెందిన ఒరాహికి ఇండియన్ ఏంజిల్ నెట్ వర్క్ నుంచి మూడున్నర కోట్లు వచ్చాయి. ఎన్ని ఉన్నా టెక్నాలజీ, యూజర్ ఎక్స్ పీరియన్సే కాంపిటీషన్ లో తేడా చూపిస్తుంది అంటారు క్విక్ రైడ్ టెక్నీషియన్స్. ఇక కస్టమర్లను దగ్గర చేసుకునేందుకు ఈ ప్లాట్ ఫామ్ పలు మార్గాలను ఎంచుకుంది.

"కస్టమర్లను పొందేందుకు B2B భాగస్వామ్యమే మాకు ప్రధానం. పలు ఎంటర్ ప్రైజెస్, పెద్దపెద్ద సంస్థలతో మా చర్చలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు అతిపెద్ద రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లల్లో ఉండేవాళ్లతోనూ చర్చలు జరుపుతున్నాం. రోడ్ షోస్, ఈవెంట్స్ కూడా ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉంది. బెంగళూరులోని ప్రముఖ టెక్ పార్కులతో భాగస్వామ్యం చేసుకుంటున్నాం" అంటారు రావు.

భవిష్యత్ వృద్ధి

మరో ఆరు నెలల్లో భారతదేశం మొత్తంలో రోజుకు ఐదు వేల రైడ్స్ ను టార్గెట్ గా పెట్టుకుంది క్విక్ రైడ్. ఈ ఏడాది చివరికల్లా లక్ష మంది రిజిస్టర్డ్ యూజర్లు కావడం మరో టార్గెట్. మరో మూడు ప్రధాన నగరాల్లో కార్యకలాపాలు మొదలుపెట్టాలనుకుంటున్నారు. కార్పొరేట్ ఆఫీసులకు వెళ్లి క్విక్ రైడ్ ద్వారా కలిగే లాభాలను వివరిస్తోంది వీరి టీమ్. ఆర్థికంగానే కాదు... పర్యావరణపరంగా మేలు జరిగే ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలని ఉద్యోగుల్ని కోరుతున్నారు.

యువర్ స్టోరీ మాట

అన్ని రకాల ట్యాక్సీలు, కార్ పూలింగ్ ప్లాట్ ఫామ్స్, సొంతగా కార్లను నడిపే కంపెనీలు... కార్లు లేనివారికి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. వీటికి తోడు, ఢిల్లీలో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆడ్ ఈవెన్ నిబంధనలు కార్ పూలింగ్ ను ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకునే చొరవ ఇలాంటి ఆటో స్టార్టప్స్ కు ప్రోత్సాహకంగా నిలుస్తాయి. క్విక్ రైడ్ కూడా అదే దిశగా పనిచేస్తోంది. క్షీణిస్తున్న పర్యావరణ వ్యవస్థ, ట్రాఫిక్ పరిస్థితులను మెరుగుపర్చడమే లక్ష్యంగా క్విక్ రైడ్ ముందుకెళ్తోంది. వ్యాపారపరంగా ఆలోచిస్తే ఇలాంటి ఐడియాలు ఇప్పటికీ బాల్య దశలోనే ఉన్నాయని చెప్పాలి. ఏదేమయితేనేం... ఇది కచ్చితంగా విన్ విన్ సిచ్యువేషన్.

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి