మీరు స్టార్టప్ పెట్టండి.. ఉద్యోగుల సంగతి వీళ్లకు వదిలేయండి..

మీరు స్టార్టప్ పెట్టండి.. ఉద్యోగుల సంగతి వీళ్లకు వదిలేయండి..

Monday March 07, 2016,

3 min Read


సమర్థులైన ఉద్యోగులే సంస్థకు బలం. ఎంత బడా కంపెనీ అయినా, ఉద్యోగులు సరిగా పనిచేయకపోతే అంతే సంగతులు. ఎంప్లాయిస్ ని ఎంచుకోవడంలోనే సంస్థ విజయం దాగుంది. హడావుడిగా ఎవరో ఒకర్ని తీసుకుని, తర్వాత వారికి అంతసీన్ లేదని గ్రహిస్తే తీరా మిగిలేది బూడిదే. నష్టపోయేది కంపెనీయే. స్టార్టప్ లకు ఇదీ మరీ పెద్ద సమస్య . అయితే ఇక అలాంటి ప్రాబ్లం లేదంటోంది హైదరాబాదీ స్టార్టప్ స్టాక్ రూం. మీ సంస్థలో పనిచేయడానికి క్వాలిఫైడ్ ఉద్యోగులు కావాలా? డిగ్రీలుకాదు… చూడాల్సింది వారిలోని అసలు సిసలైన సత్తా … అలాంటి ట్యాలెంటెడ్ ఉద్యోగులను మేం సెలెక్ట్ చేస్తాం అంటోంది స్టాక్ రూం.

మ్యాన్ పవర్ సప్లై చేసే చాలా కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. రిక్రూట్ మెంట్ పోర్టల్స్ కు లెక్కలేదు. అయితే అవి డిగ్రీలున్న వారికోసమే తప్ప… టెక్నాలజీ కంపెనీల కోసం సరైన అభ్యర్థులను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. కంపెనీలకు ఎలాంటివారు అవసరమో అన్న విషయాన్ని కూడా తెలుసుకోలేక పోతున్నాయి. ఈ సమస్యను తీర్చడానికే నరేన్ క్రిష్ణన్, హరికృష్ణ , ఆసీస్ కుమార్ సాహూ కలిసి స్టాక్ రూం స్థాపించారు. ఒక టెకీని పట్టుకోవాలంటే ఎన్నో టెస్టులు పెట్టాలి.. ఎంతో పర్యవేక్షణ అవసరం అంటున్నారు 22 ఏళ్ల నరేన్.

టాలెంట్ గుర్తించడం ఎలా?

నరేన్ బిట్స్ పిలానీలో చదువుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే అమెరికాలోని కైరోస్ లోనూ సభ్యత్వం సంపాదించారు. స్టాక్ హోం సీటీఓగా ఉన్న ఆశీష్ భువనేశ్వర్ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చేశారు. అమెజాన్ కంపెనీలో రిక్రూట్ మెంట్ మేనేజర్ గా పనిచేశారు హరి కృష్ణ. ముగ్గురూ మంచి మిత్రులు. ఈ ముగ్గురూ చర్చల్లో భాగంగా రెజ్యూమెలు చూసి ట్యాలెంట్ ను గుర్తించలేమని…అంతకు మించి ఏదైనా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కంపెనీలకు ఇచ్చే కరికులమ్ విటేలో ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్ పీరియన్స్ మాత్రమే రాస్తున్నారు. స్కిల్స్ జోలికి ఎవరూ పోవడం లేదు. అందుకే ఆ స్కిల్స్ ను టెస్ట్ చేయాలనుకుందీ టీం. అందుకోసం పోర్ట్ ఫోలియా క్రియేషన్ టూల్ తయారు చేసింది.

వ్యక్తిలోని ట్యాలెంట్ ను వెలికి తీసేందుకు 48 గంటలపాటు నాన్ స్టాప్ గా పనిచేసే హ్యాకథాన్ ను సృష్టించాలనుకున్నాం. ఒక మోడల్ హ్యాకథాన్ ను ప్రారంభించాం. నాలుగు నెలల క్రితం మే ఒక ప్రోడక్ట్ ప్రారంభించాం. దాన్ని మార్కెట్ నిపుణులు టాప్ ప్రోడక్ట్ గా ఓటేశారు.” నరేన్

ఒక్కో కంపెనీ అవసరాలు ఒక్కోలా ఉంటాయి. ఉద్యోగుల ఎంపిక కూడా అలాగే చేయాలి. వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని … కంపెనీని యూనిట్ గా పరిగణించి … కంపెనీ టెక్నికల్ టీంతో చర్చించి… అవసరాలను పూర్తిగా తెలుసుకున్నాకే… ఉద్యోగులను ఎంపిక చేస్తున్నాం అంటున్నారు.

ప్రారంభంలోనే వడపోత

కంపెనీలకు వచ్చే అప్లికేషన్స్ లో చాలా వరకు పనికిరాని, సంబంధం లేని అప్లికేషన్సే వస్తుంటాయి. అందుకే ఉద్యోగుల ఎంపిక కంపెనీలకు ఒక ప్రహసనంలా మారింది. టైం, మనీ చాలావరకు వృథా అవుతున్నాయి. అందుకే హ్యాకథాన్ రూపంలో తక్కువ టైంలోనే సమర్థులైన ఉద్యోగులను రిక్రూట్ చేసి కంపెనీలకు అందిస్తోంది స్టాక్ రూం డాట్ ఐఓ.

ఏదైనా ఒక కంపెనీ ఉద్యోగులు కావాలని చెప్తే చాలు… వారి అవసరాలను తెలుసుకుని, సమర్థులైన ఉద్యోగులను సెలెక్ట్ చేస్తోంది. ఇందుకోసం ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం తయారుచేసింది. ముందుగా ఆన్ లైన్లో టెస్టులు పెట్టి, వడబోసి టాలెంట్ ను ఒడిసిపడుతోంది. ఎన్నో చిక్కుముళ్లు విప్పి ఆన్ లైన్ టెస్టుల్లో సెలెక్ట్ అయినవారికి హ్యాకథాన్ ఛాలెంజ్ నిర్వహిస్తోంది. అందులోనూ సత్తా చాటినవారిని ఎంపిక చేస్తోంది. దీనివల్ల కంపెనీలకు టైం అండ్ మనీ చాలా సేవ్ అవుతోంది.

“క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా హ్యాకథాన్ ల ద్వారా ఉద్యోగులను ఎంపిక చేస్తున్నాం. మెరిట్ కు పట్టం కడుతున్నాం. దీనివల్ల మా క్లైంట్స్ కు చాలా లాభం. వారి అవసరాలు తీర్చే అభ్యర్థులు దొరుకుతున్నారు”- నరేన్

స్టాక్ రూం హ్యాకథాన్ లో విజయం సాధించినవారిని అవసరమనుకుంటే సంబంధిత కంపెనీలు మరోసారి ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. దీనివల్ల సెలక్షన్స్ కోసం కంపెనీలు వెచ్చించే టైం చాలా తగ్గిపోతోంది. ఎవరైనా సరే స్టాక్ రూం వెబ్ సైట్ లో రిజిస్టరై తమను తాము పరీక్షించుకోవచ్చు. నిర్వహణ ఖర్చులను ఉద్యోగులు కావాలనుకున్న కంపెనీలు భరించాల్సి ఉంటుంది. చిన్నపాటి తేడాలతో స్టాక్ రూ ప్రైమ్ అనే సరికొత్త మోడల్ ను ఇటీవలే రూపొందించారు.

ఒక కంపెనీ రిక్వైర్ మెంట్స్ ఇస్తే చాలు… దానికి తగ్గ టెస్టులను స్టాక్ రూం టీం తయారు చేస్తుంది. పరీక్షలు పెడుతుంది. స్టాక్ రూంలో ఆరుగురు ఫుల్ టైం ఉద్యోగులున్నారు. పదివేల మందికి పైగా రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. ఇటీవలే ఒక వ్యక్తి ఈ కంపెనీలో 70వేల డాలర్లు.. అంటే దాదాపు 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. దీంతో టీంలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ప్రోడక్ట్ బేస్, టెక్నాలజీ అభివృద్ధికోసం ఈ నిధులను వెచ్చిస్తున్నారు. స్టాక్ రూంకి ప్రస్తుతం అర్బన్ క్లాప్, ట్రావెల్ ట్రయాంగిల్ లాంటి 16 కంపెనీలు క్లైంట్లుగా ఉన్నాయి.

నియామకాలు – సమస్యలు

ఇటీవల మ్యాన్ పవర్ గ్రూప్ చేసిన సర్వేను పరిశీలిస్తే… 58 శాతం కంపెనీలు సరైన ఉద్యోగులను నియమించుకోలేక ఇబ్బందులు పడుతున్నాయి. టెక్నాలజీ రంగంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. భారత్ లో ఈ నియామక ప్రక్రియ ఖర్చులు బాగా పెరిగాయని గతేడాది వాల్ స్ట్రీట్ జర్నల్ అధ్యయనంలో తేలింది. డిమాండ్ – సప్లై మధ్య గ్యాప్ కూడా ఎక్కవగానే ఉంది. టెక్నికల్ స్టాఫ్ రిక్రూట్ మెంట్ ఒక ఛాలెంజ్ . దీన్నో సవాల్ గా తీసుకుని సమర్థులైన ఉద్యోగులను ఎంపిక చేస్తోంది ఈ స్టాక్ రూం. మార్కెట్ లో స్కిల్ గ్యాప్ ను పూరిస్తోంది. ఇప్పటికే హైరింగ్ ప్రోసెస్ లో వండర్స్ క్రియేట్ చేస్తోంది. 

స్టాక్ హోం టీం

స్టాక్ హోం టీం