హైడ్రోఫోనిక్స్ విధానంలో పశుగ్రాసం పెంచుతున్న ఆదర్శరైతు ప్రతాప్రెడ్డి  

0

పశువుల పెంపకం అనుకున్నంత తేలిక కాదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాది పొడవునా పశుగ్రాసం అంటే తలకుమించిన భారం. శారీరక శ్రమ, అనువైన పొలం, అవసరమైన మేర నీరు... ఇలా ఏ ఒక్కటి తక్కువైనా కష్టమే. రెండు మూడు గేదెలకు మేత పెట్టడం కనాకష్టమైన ఈ రోజుల్లో హైడ్రోఫోనిక్స్‌ విధానంలో షేడ్‌నెట్‌ కింద అవసరమైన పశుగ్రాసాన్ని పెంచుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు సంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు.

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి తన స్నేహితుడు రామారావు సలహాతో హైడ్రోఫోనిక్స్ విధానంలో పశుగ్రాసం పెంచడం ప్రారంభించారు. ఇరవై అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న స్థలం ఎంపిక చేసుకుని షేడ్ నెట్స్ ఏర్పాటు చేశారు. ట్రేలను నిలిపేందుకు స్టాండ్లను ఏర్పాటు చేసి స్పింకర్ల సాయంతో నీళ్లు చల్లుతున్నాడు. ప్రతి గంటకోసారి మొలకలపై వాటంతట అవే నీళ్లు పడేలా టైమర్‌తో అనుసంధానం చేశాడు. ఈ టెక్నిక్ తో గంటకోసారి 30 సెకన్ల పాటు మొక్కలపై జల్లు కురిసి ఆగిపోతుంది.

ప్రస్తుతానికి ప్రతాప్ రెడ్డి మొక్కజొన్న పంటతో పసుగ్రాసాన్ని తయారుచేస్తున్నాడు. మార్కెట్లో మొక్కజొన్నలు 15 రూపాయలకి కిలో దొరుకుతున్నాయి. వాటిని 24 గంటలపాటు నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత తీసి గోనెసంచిలో పోసి మరో 24 గంటలు ఉంచాలి. ఆ తర్వాత ఒక్కో ట్రేలో రెండున్నర కిలోల మొలకెత్తిన మొక్కజొన్న గింజలను పోసి షేడ్‌నెట్‌ కింద ఉంచాలి. ఎనిమిది రోజుల్లోగా మొలకలు 15 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయి. రెండున్నర కిలోల గింజల నుంచి 12 నుంచి 14 కిలోల గ్రాసం వస్తుంది. ఒక పశువుకు ఇది రెండు పూటలా సరిపోతుంది. దాంతోపాటు కొంత ఎండుగడ్డి, తక్కువ మొత్తంలో దాణా అందిస్తే గేదె కడుపునిండిపోతుంది. ఈ విధానం ద్వారా రోజుకు 150 నుంచి 180 కిలోల గ్రాసాన్ని తయారు చేస్తున్నాడు ప్రతాప్ రెడ్డి. ఎలాంటి మట్టి, ఎరువులు, ఇతరత్రా రసాయనాలేవీ లేకుండానే అవసరమైన పశుగ్రాసం వస్తోంది. దీనికోసం కేవలం వంద లీటర్ల నీరు మాత్రమే ఖర్చవుతోంది. ఇలా పెంచిన గడ్డి తినడం వల్ల గేదెల నుంచి పాల ఉత్పత్తి కూడా పెరిగిందని ప్రతాప్ రెడ్డి అంటున్నారు.

ఏ సీజన్ లోనూ పశు గ్రాసం కొరత లేకుండా చేస్తున్న ప్రతాప్ రెడ్డిని చుట్టుపక్కల రైతులు ఆదర్శంగా తీసుకున్నారు. మామూలుగా అయితే మొక్కజొన్న కోతకు రావాలంటే మూడు నెలల సమయం పడుతుంది. కానీ ఈ విధానంలో మాత్రం కేవలం పది రోజుల్లోనే గడ్డి అందుబాటులోకి వస్తుంది.ఉలవలు, జొన్నలు లాంటివీ వాటినీ పెంచవచ్చని ప్రతాప్ రెడ్డి అంటున్నారు. రోజూ ఒక అరగంట సమయం కేటాయిస్తే పశువులకు కావాల్సిన గ్రాసం సిద్ధమవుతుందని చెప్తున్నారు. ఈ మేతతో పాల ఉత్పత్తి కుడా పెరుగుతుందని అంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి విధానంపై రాయితీలు ఇస్తే రైతులకు పశుగ్రాసం కొరతను అధిగమించడానికి చక్కటి మార్గం అవుతుందని సలహా ఇస్తున్నారు. 

Related Stories

Stories by team ys telugu